కలగంటినే చెలీ-5

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సూ[/dropcap]ర్యం రూము అంతా చూస్తూ “బాగుంది అన్నా రూము. పెళ్ళి చేసుకుంటే నీకు వదినకు సరిపోతుంది” అన్నాడు.

“అవును బ్రదర్‌.. ఆ ఊద్దేశంతోనే తీసుకున్నాను. నువ్వెలాగూ ఉండేది మూడు నెలలేగా… తర్వాత వెళ్ళిపోతావుగా.. ఏమీ పర్లేదులే..” అన్నాడు బ్రహ్మం. సంతోషపడ్డాడు సూర్యం. ఇంత విశాలమైన వైజాగ్‌ నగరంలో దొరికిన మొదటి మిత్రుడతను. ఇదంతా భగవంతుడి దయ అనుకున్నాడు.

సామానులన్నీ ఒక పక్కగా సర్దుకున్నాడు. వంట చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మెస్‌కి వెళ్ళకపోయినా పర్వాలేదు. బ్రహ్మంతో అదే అన్నాడు “అన్నా.. వంట సామాగ్రి ఎలాగూ ఉంది కదా.. ఏదో ఒకటి మనమే వండుకుందాం” అని.

“నాకు బద్ధకం బ్రదర్‌. అందుకే మెస్‌కి వస్తున్నాను. నువ్వు సాయం చేస్తానంటే అలాగే చేద్దాం” అన్నాడు బ్రహ్మం. ఆ సాయంత్రమే మార్కెట్‌కి వెళ్ళి బియ్యం.. కూరగాయలు కొనుక్కున్నారు.

చీకటి పడ్డాక అన్ని పోర్షన్స్ లోనూ లైట్లు వెలిగాయి. సంసారుల సందడి మొదలైంది. అలాంటి కుటుంబాల మధ్య బ్రహ్మచారులకి రూము ఇవ్వడం నిజంగా గ్రేటే!

వంట చేసుకోసాగారు ఇద్దరూ. సూర్యం కూరలు తరిగి పెట్టాడు. బియ్యం కడిగి స్టవ్‌ మీద పెట్టాడు. తర్వాత మిగతా వంట అంతా బ్రహ్మం చేసాడు. వంట పూర్తయ్యాక శుభ్రంగా కడుపు నిండా తిన్నారు. చాలా రోజుల తర్వాత సంతృప్తిగా భోంచేసిన ఫీలింగ్‌ కలిగింది సూర్యానికి. తిన్నాక అంట్లు సింక్‌లో పడేసి చాప మీద నడుము వాల్చారు. నిద్ర కళ్ళల్లోకి కూరుకు రాసాగింది సూర్యానికి. అలాగే వాలి నిద్రపోయాడు. అర్థరాత్రి దాటాక మెలకువ వచ్చి చూస్తే పక్కన బ్రహ్మం లేడు. ఏ బాత్రూముకో వెళ్ళుంటాడనుకుని పక్కకు తిరిగి నిద్రపోయాడు. అరగంట తర్వాత వచ్చిన బ్రహ్మం చాప మీద వాలి క్షణాల్లో గుర్రుపెట్టసాగాడు.

***

కోచింగ్‌ సెంటర్‌కి వెళ్ళడం.. శ్రద్ధగా పాఠాలు విని రావడం.. వంట చేసుకుని తినడం.. చదువుకోవడం… ఇదే దినచర్యగా మారిపోయింది సూర్యానికి. ఫుడ్డూ బెడ్డూ లాంటి బేసిక్‌ సమస్యలు తీరడం వల్ల చదువు మీద పూర్తిగా కాన్సంట్రేట్‌ చెయ్యగలుగుతున్నాడు. రెండు సంవత్సరాలు ఇంటర్‌ కాలేజీలో చదువుకున్నదానికి, ఇక్కడ కోచింగ్‌ సెంటర్‌లో చెబుతున్న దానికి చాలా తేడా కనిపించసాగింది. ఎంసెట్‌లో రేంక్‌ ఎలా తెచ్చుకోవాలి అన్న దిశ గానే ట్రైనింగ్‌ ఇవ్వబడుతోంది. ఏది ఏమైనా ఇదొక కొత్త అనుభవం సూర్యానికి.

కోచింగ్‌ సెంటర్‌ నుండి రాగానే.. కాళ్ళూ చేతులు కడుక్కుని టవల్‌తో మొహం తుడుచుకుంటూ రూము బయటకు వచ్చాడు సూర్యం. బ్రహ్మం ఆఫీసు నుండి ఇంకా రాలేదు. సాయంత్రం ఆరు దాటాక వస్తాడు. కింద బావి దగ్గర ఎవరో స్త్రీ నీళ్ళు తోడుకుంటోంది. చూడ్డానికి సామాన్యంగా ఉంది కానీ ఎత్తైన ఆమె వక్షస్థలం సూర్యం దృష్టిని దాటిపోలేదు. వయసు పాతికేళ్ళు ఉండొచ్చు. ముఖాన బొట్టు లేదు. సూర్యం తనని చూస్తున్నాడని ఆమె గమనించింది. కొంచెం సిగ్గు పడినట్టు తల ఇంకా దించుకుంది.

“రాధా.. టీ ఇవ్వమ్మా” అని ఎవరో పిలిచారు. “వస్తున్నా అన్నయ్యా..” అంటూ బిందె తీసుకుని గబ గబా వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళుతూ తిరిగి ఒక చూపు విసిరింది. చురుక్కున తగిలింది సూర్యానికి.

తలవిదిలించి లోనికొచ్చి పుస్తకాలు ముందేసుకుని చదవడం మొదలుపెట్టాడు. టీనేజ్‌లో ఉన్న సూర్యానికి ఇవి కొత్త సమస్యలు. ఎంత తప్పించుకుందామనుకున్నా వాటి ప్రభావం ఉండనే ఉంటోంది.

అన్నీ పక్కనపెట్టి తన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకుని చదవడం మీద ధ్యాస పెట్టాడు. ఇప్పుడు తను ఎంసెట్‌లో రేంక్‌ తెచ్చుకోకుండా పోతే తండ్రి చెప్పినదే నిజమవుతుంది. అప్పుడు జీవితాంతం తండ్రి చెప్పినట్టు విన్నాలి. ఆ ఊహే భయంకరంగా అనిపించింది సూర్యానికి. అలా అని తను ఎంచుకున్న గంయం అంత సులభమైనదేమీ కాదు. బోలెడంత పోటీ!

సాయంత్రం కావచ్చింది. తలుపు మీద ఎవరో కొడుతుండటంతో వెళ్ళి తీసాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి. ఆశ్చర్యపోయాడు సూర్యం. కొంచెం బిడియపడి

“ఎవరు కావాలండీ” అన్నాడు

“పక్క రూము సురేష్ గారు కావాలి” అని “ఆయన రూము లాక్‌ వేసి ఉంది. కీస్‌ మీకు ఇచ్చారేమో అని వచ్చాను” అంది

“లేదండీ.. నేను కూడా ఈ రూముకి కొత్తగా వచ్చాను. నాకు తెలీదు” అన్నాడు సూర్యం.

వెంటనే ఆమె సురేష్ మొబైల్‌కి కాల్‌ చేసింది. అటు నుండి ఏదో సమధానం వచ్చింది.

“ఇంకో పది నిముషాల్లో ఆయన వస్తారు. అప్పటి దాకా మీ రూములో కూర్చోవచ్చా!” అని అడిగింది. సూర్యం నీళ్ళు నమిలాడు.

సూర్యం సమాధానం చెప్పేలోపు లోపలికి వచ్చి కూర్చుంది. ఎందుకో కొంచెం భయంగా అనిపించింది సూర్యానికి. ఆమె నుండి ఒక మత్తైన పెర్ఫ్యూం వాసన వస్తోంది. చాలా సెక్సీగా ఉంది.

సూర్యం చదువుతున్న పుస్తకాలని గమనించి “ఎంసెట్‌ కి ప్రిపేర్‌ అవుతున్నారా” అని అడిగింది తియ్యగా

“అవునండీ..” అన్నాడు.

“బ్రహ్మం మీకు ఏమవుతాడు?”

“ఈ మధ్యనే పరిచయం అయ్యాడండీ.. అన్నలాంటోడు”

“ఆహా…గుడ్‌.. బాగా ప్రిపేర్‌ అవ్వండి” అంది.

ఆమె మాటలు కిక్‌ ఇచ్చాయి సూర్యానికి. అందమైన అమ్మాయి మాటలు అంత ప్రభావం చూపిస్తాయని తొలిసారి తెలిసింది అతనికి. తర్వాత ఆమె నిశ్శబ్దంగా తన మొబైల్‌లో ఏదో చూసుకోసాగింది. ఇంతలో సురేష్ వచ్చాడు.

“ఓకే అండీ నేను వెళతాను.. ఆల్‌ ద బెస్ట్‌” అని తియ్యగా చెప్పి వెళ్ళిపోయిందామె. మలయ మారుత వీచిక ఒకటి తనని తాకి నెమ్మదిగా నిష్క్రమించినట్టు ఫీల్‌ అయ్యాడు. ఆమె ఇంకాసేపు ఉంటే బాగుండునేమో అనుకున్నాడు. తొందరగా వచ్చిన సురేష్ మీద మనసు లోనే తిట్టుకున్నాడు.

కాసేపట్లో బ్రహ్మం వచ్చాడు.

“కళ్యాణి వచ్చినట్టుంది” అన్నాడు.

“అవును అన్నా.. నీకెలా తెలిసింది”

“పెర్ఫ్యూం వాసన.. అవన్నీ అలానే తెలుస్తాయి.. నువ్వు చదువుకో”

“సరే అన్నా” అని “టీ తాగుతావా” అని అడిగాడు.

“తాగుతాను గానీ.. నీ పని చూసుకో” అని విసుక్కున్నాడు. సూర్యం సైలెంట్‌గా చదువుకోసాగాడు. బ్రహ్మం ఫ్రెష్ అయి సురేష్ రూముకివెళ్ళాడు. అక్కడ వాళ్ళు ముగ్గురూ సరదాగా నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఈవెనింగ్‌ టైముని ఎంజాయ్‌ చేస్తున్నారు. డిస్టర్బెన్స్‌గా అనిపించి రూము బయటకు వచ్చాడు. కింద బావి దగ్గర రాధ బట్టలు ఉతుకుతోంది. ‘ఈమెకు బావి కేరాఫ్‌ ఎడ్రస్‌ ఏమో’ అనుకున్నాడు సూర్యం. అసలు ఈ సురేష్ ఎవరు? అతని కోసం ఈ కళ్యాణి అనే అమ్మాయి రావడం ఏమిటి? లాంటి సందేహాలు అతనికి కలిగాయి. పల్లెటూళ్ళో పుట్టి పెరిగి… ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న అతనికి ఇవన్నీ కొత్తగా.. వింతగా ఉన్నాయి.

***

సురేష్ సొంత ఊరు శ్రీకాకుళం దగ్గర. ఇక్కడ వైజాగ్‌లో ఒక ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. మనిషి తెల్లగా అందంగా ఉంటాడు. మృదుభాషి. కళ్యాణి అతని కొలీగ్‌. ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమో, ప్రేమో అన్న క్లారిటీ లేదు. అతనితో బాగా క్లోజ్‌గా మూవ్‌ అవుతుంది. ఆ మాటకొస్తే అందరితోనూ అలాగే ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా సురేష్ రూముకి వస్తుంది.

డిగ్రీ దాకా చదివిన సురేష్ జాబ్‌ కోసం వైజాగ్‌ వచ్చాడు. ఈ రూములోనే ఉంటూ ప్రయత్నాలు చేసాడు. లక్కీగా జాబ్‌ తగిలింది. అతని తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. అలా ఒకసారి వచ్చినప్పుడు కళ్యాణి సంగతి వాళ్ళ చెవినపడింది. అదిరిపోయి కొడుకుని నిలదీసారు.

“ఏరా.. ఇది మంచి పద్ధతేనా.. ఆ అమ్మాయి నీ రూముకి రావడం ఏమిటి.. ఉండటం ఏమిటి.. ఇది సంసారులు ఉండే లోగిలేనా?” అని బాధపడ్డారు

“మీరేమీ భయపడకండి. అందరూ అనుకునేంత సీన్‌ లేదు మా మధ్య. జస్ట్‌ స్నేహం. తను కొంచెం ఓపెన్‌ కాబట్టి ఇలా వస్తోంది. అంతే! అయినా ఫ్రీగా ఉండే అమ్మాయిలందరూ చెడిపోయిన వాళ్ళేనా?” ఎదురు తిరిగాడు సురేష్.

“నువ్వు పంపించే డబ్బుల మీద ఆధారపడ్డవాళ్ళం.. నీకేం చెబుతాం.. నీ ఇష్టం.. మాకు తలవంపులు తెచ్చే పని మాత్రం చెయ్యకు” అని చెప్పారు.

“అలాగే..” అని సర్ది చెప్పాడు సురేష్.

తల్లిదండ్రుల నోరు మూయించాడు కానీ అతని మనసులో కూడా చాలా సందిగ్ధత ఉంది. కళ్యాణికి తన మీద ఉన్న ఫీలింగ్‌ ఏమిటో తెలియడం లేదు. ఆమె అంటే ఇష్టమే.. కానీ ఆమె బయటపడనప్పుడు తానెలా ప్రొసీడ్‌ అవుతాడు? ఈ విషయంలో బ్రహ్మం సహాయం తీసుకోవాలి అనుకున్నాడు.

***

కోచింగ్‌ సెంటర్‌లో క్లాసుల మధ్య బ్రేక్‌ టైము…

క్లాసు బయటకు వచ్చి అందరూ చిట్‌ చాట్‌ చేస్తున్నారు. సూర్యం కూడా తన ఫ్రెండ్స్‌తో సబ్జెక్ట్‌ గురించి డిస్కస్‌ చేస్తున్నాడు. ఒకమ్మాయి అతని దగ్గరకు వచ్చి

“హాయ్‌ సూర్యం..” అంది. ఆమెను పోల్చుకున్నాడు. మొదట్లో చూపులతో గుచ్చిన అమ్మాయి.

“హాయ్‌.. చెప్పండి” అన్నాడు

చాలా ఆరాధనగా చూడసాగింది ఆ అమ్మాయి. విశాలమైన ఆమె కళ్ళు మనోహరంగా ఉన్నాయి. ఎర్రని పెదవులు వణుకుతున్నాయి. పచ్చటి ఆమె మేని రంగు ఆమెకు మరింత అందాన్ని ఇస్తోంది. అమాయకత్వం.. అందం కలగలిసిన రూపం ఆమెది.

“చెప్పండి” అన్నాడు మళ్ళీ.

“మీతో మాట్లాడాలి. కొంచెం పక్కకి వస్తారా..” అంది.

ఫ్రెండ్స్‌ నుండి దూరంగా జరిగి “చెప్పండి” అన్నాడు

“మీ తెలివి తేటలు.. చదువు పట్ల మీ శ్రద్ధ నాకు చాలా నచ్చాయి. మీతో స్నేహం చెయ్యాలని నాకనిపిస్తోంది. ప్లీజ్‌..” అంది.

ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూసాడు సూర్యం. నిజ జీవితంలో జరుగుతాయని అతనెప్పుడూ ఊహించలేదు. అందుకే ఎలా రియాక్ట్‌ అవ్వాలా అని ఆలోచించసాగాడు. ఆమె ఇన్‌ఫాక్చుయేషన్ స్టేజ్‌లో ఉంది. అంత పెద్ద పదం సూర్యంకి తెలీదు కానీ ఏదో భ్రమలో ఉందని మాత్రం అర్థమయింది. అందుకే నెమ్మదిగా చెప్పాలని అనుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ “చూడండి… నేను పక్కా పల్లెటూరి వాడిని. పేద వాడిని. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల చదువు అబ్బింది. ఇంట్లో గొడవపడి మరీ ఈ కోచింగ్‌కి వచ్చాను. నా ఫ్రెండ్స్‌ దయ వల్ల చదువుకుంటున్నాను. ఎంసెట్‌లో రేంక్‌ రాకపోతే నా బ్రతుకుకి అర్థం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా దాని మీదే. నేను మీకు ఫ్రెండ్‌ కాలేను. ఎందుకంటే ఒక ఫ్రెండ్‌ మీకిచ్చే ఆనందాన్ని నేను ఇవ్వలేను. నాకు అంత సీన్‌ కూడా లేదు. దయచేసి మీ పని చూసుకోండి” అన్నాడు. బాగా నిరాశ పడినట్టు ఆమె కళ్ళు చెప్పాయి. చివ్వున వెనుతిరిగి వెళ్ళిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here