ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-6 – ముసాఫిర్

1
3

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ గాయకునిగా అలరించిన సినిమా ‘ముసాఫిర్’

[dropcap]ఒ[/dropcap]క సినిమాలో మూడు నాలుగు కథలు కలిపి తీయడం, ఒక అరడజను కథలను ఒకే కాన్సెప్ట్‌తో రూపొందించడం ఈ మధ్య చూస్తున్నాం. అదో కొత్త కాన్సెప్ట్ అనుకుంటున్నారు ప్రస్తుత తరం. కాని ఇదే ప్రక్రియను 1957లో ‘ముసాఫిర్’ అనే సినిమాతో ముందుకు తీసుకువచ్చారు హృషికేశ్ ముఖర్జీ. బిమల్ రాయ్ దగ్గర అసిస్టేంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన్ దిలీప్ కుమార్ ప్రోద్బలంతో ప్రొడ్యుసర్, డైరక్టర్‌గా మారి తీసిన మొదటి సినిమా ‘ముసాఫిర్’. మొదటి సినిమాతో నే   ప్రయోగంచేయడం హృషికేశ్ ముఖర్జీకి తనపై తనకున్న నమ్మకానికి సూచన. ఈ సినిమాలో వివాహం, జననం, మృత్యువు అనే మూడు విషయాలను అధారం చేసుకుని మూడు భిన్నమైన కథలను ఒక సినిమాగా తీసారు ఆయన. ఈ మూడు కథలను కలిపేది ఆ పాత్రలందరూ ఉండే అద్దె ఇల్లు.

బల్రాజ్ సాహని గొంతు సినిమాలో ప్రస్తావనగా ముందు విపిస్తుంది. ఒక అద్దె ఇల్లు, ఆ ఇంటి అద్దెకు వచ్చిన మూడు కుటుంబాలు. వారి కథ ముసాఫిర్. ఇంటి యజమాని డేవిడ్. ముందు ఆ ఇంటిని చూడడానికి అజయ్ అనే యువకుడు వస్తాడు. రెండు వారాల అద్దె ఇచ్చి ఇంటి తాళాలు తీసుకుంటాడు. మరుసటి రోజు పెళ్ళికూతురు దుస్తులలో ఒక అమ్మాయితో ఆ ఇంటికి వస్తాడు అజయ్. ఆమె శకుంతల. ఆమె తల్లి తండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. ఒక ముసలివానితో పెళ్ళి జరిపిస్తున్న బంధువుల నుండి తప్పించుకుని పారిపోయి తను ప్రేమించిన అజయ్‌తో ఆ ఇంటికి చేరుతుంది శకుంతల. తనను తన బంధువులు బలవంతగా తీసుకెళ్ళిపోతారేమో అని భయపడుతుంది. తన తల్లి తండ్రులు ఒప్పుకోరని అజయ్ శకుంతలను రిజిస్టర్ మారేజ్ చేసుకుంటాడు. ఆ ఇంటిని అందమైన గృహంగా మారుస్తుంది శకుంతల. కాని అత్త మామలు తమను ఆదరించాలి, తల్లి లేని తనకు అత్త రూపంలో తల్లి లభించాలని ఆమె కోరిక. అజయ్ తల్లి తండ్రులకు ఉత్తరం రాస్తాడు. కాని తండ్రి తమని స్వీకరిస్తాడని అతనికి ఆశ ఉండదు. ఆ సమయంలోనే శకుంతల ఒక పూల చెట్టు విత్తనం నాటుతుంది ఆ ఇంటి ఆవరణలో. అజయ్ తల్లి తండ్రి కోపంతో వారిని వెతుక్కుంటూ వస్తారు. కాని కోడలిని చూసి మామగారు చాలా సంతోషిస్తారు, ఆనందంగా తమ ఇంటికి తీసుకుని వెళతారు. ఇక మళ్ళీ డేవిడ్ ఆ ఇంటికి టూ లెట్ బోర్డు పెడతాడు.

మరో కుటుంబం వచ్చి చేరుతుంది. ఈ సారి ఆ ఇంటి పెద్ద తన చిన్న కొడుకు, వితంతువయిన పెద్ద కోడలితో దిగుతాడు. అనుకోకుండా పెద్ద కొడుకు చనిపోవడం, కోడలు గర్భవతి అవడం, చిన్న కొడుకు భాను చదువు ఆఖరుకి రావడం ఇవన్నీ ఆ కుటుంబ సమస్యలు. ఆ ఇంటికి వచ్చాక భాను డిగ్రీ పాస్ అవుతాడు. అతనే వదినను చూసుకుంటూ ఉంటాడు. ఆర్థిక పరిస్థితి పెద్దగా బావుండదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భాను. కాని ఉద్యోగం దొరకదు. బస్సు ఖర్చులకు, ఇంటర్వ్యూలకు వదిన దాచిపెట్టుకున్న డబ్బు కూడా అయిపోతుంది. తండ్రి కోపంతో తిట్టాడని అతను ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. కాని ఆ తాగిన విషం కూడా కల్తీది అవడం వలన చనిపోడు. చివరకు భానుకి ఉద్యోగం రావడం, వదినకు కొడుకు పుట్టడం జరుగుతుంది. భాను ఉద్యోగ రీత్యా మరో చోటుకు వెళ్ళవలసి రావడంతో వారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. శకుంతల నాటిన విత్తనం, చెట్టుగా ఎదుగుతుంది.

మూడవ కుటుంబంలో భర్త చనిపోయిన ఉమ, ఆమె కుంటి కొడుకు రాజా, ఉమ అన్న సురేష్‌తో ఆ ఇంట చేరతారు. రాజా ఏడు సంవత్సరాలు చిన్న పిల్లవాడు. అతన్ని డాక్టర్‌కు చూపిస్తారు ఆ అన్నా చెల్లెలు. డాక్టర్ దగ్గర నుండి వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటుంది ఉమ. డాక్టర్ రాజాకు కాళ్ళు వచ్చే ఆశ లేదని రాస్తాడు. అది చదివి ఆమె కుప్పకూలిపోతుంది. సినిమా మొదటి నుండి ఈ మూడు కుటుంబాలు రాత్రిళ్ళు వయిలిన్ నాదం వింటూ ఉంటారు. పక్కన ఉన్న టీ కొట్టు అబ్బాయిని ఆ వయొలెన్ ఎవరు వాయిస్తున్నారో కనుక్కుంటారు. శకుంతల, భాను ఇద్దరికి కూడా, ఆ యింటి పక్కన ఒక వ్యక్తి ఉంటున్నాడని, తనకు తోచినప్పుడు వయోలిన్ వాయిస్తాడని అందరు అతన్ని పిచ్చివాడిగా చూస్తారని, మనిషి మంచివాడు కాని ఎవరితో కలవడని ఆ టీ కొట్టూ అబ్బాయి చెబుతాడు. ఆ ఇంట అద్దెకున్న వారికి ఈ రాత్రి కచేరి అలవాటు అవుతుంది. ఉమ కొడుకు రాజా కూడా ఆ వెయొలిన్ విని టీ అబ్బాయితో తనకు అతన్ని కలవాలని ఉందని చెబుతాడు. ఒక నడవలేని చిన్న పిల్లవాడు వయోలిన్ వినాలని ఆశపడుతునాడని తెలిసి ఆ వ్యక్తి వారి ఇంటి గుమ్మం ముందు కూర్చుని వయొలిన్ వాయించడం మొదలెడతాడు. అతన్ని చూసి ఉమ తన ప్రేమికుడు రాజాగా గుర్తుపడుతుంది. తనను ప్రేమించి వివాహం ప్రస్తావన వచ్చేసరికి ఎవరికీ కనిపించకుండా పారిపోయిన అతన్ని ఆమె మర్చిపోదు. బిడ్డకు కూడా రాజా అన్న పేరే పెట్టుకుంటుంది.

చిన్న రాజా వయొలిన్ వింటానని మొండితనం చేస్తే ఆ పిల్లవాని కోసం రాజా వయోలిన్ వాయిస్తాడు. మెల్లిగా ఆ ఇంట్లో ఒక సభ్యుడు అవుతాడు. పిల్లవానితో మంచి అనుబంధం పెంచుకుంటాడు. అతను నడవగలడని, మంచి రోజు వస్తుందని ఆ అబ్బాయిలో ఆశను నింపుతాడు. ఉమ రాజాని దూరం ఉంచాలన్నా కొడుకు అతన్ని ఇష్టపడుతున్నాడని మౌనంగా ఉంటుంది. ఊరు నుండి వచ్చిన ఆమె అన్న రాజాను అక్కడ చూసి కోపంతో రగిలిపోతాడు. అతనో మోసగాడని, అతని కారణంగానే ఉమ జీవితం ఇలా అయిందని, అతనా యింట్లో ఉంటే తానుండనని చెబుతాడు. ఇంటి నుండి వెళ్తూ రాజా ఉమను తానెందుకు వదిలేయవలసి వచ్చిందో చెప్తాడు. రాజాకు కాన్సర్ అని తెలిసిన తరువాత తనతో జీవితం పంచుకుంటే ఉమకి భవిష్యత్తు ఉండదని తానామెకు దూరం అయ్యాడని, ఈ ఎనిమిదేళ్ళూ ఒంటరిగా ఉమ జ్ఞాపకాలతో బ్రతికాడని, ప్రస్తుతం కాన్సర్ ఆఖర్ స్టేజీకి వచ్చిందని తాను కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడని ఉమకి ఆమె అన్నకు అర్థం అవుతుంది. రాజా ఉమ కొడుకుకి జీవితంపై ఆశ కలిగిస్తూ ఇంటి ముందున్న మొక్క పూలు పూసే సమయానికి తాను నడవగలననే ఆశ కల్పిస్తాడు. ఆ మొక్క శకుంతల నాటినదే. అది పెరిగి పూలు పూసే స్థితికి వస్తుంది. చివరకి ఆ చెట్టు వద్ద పూల మధ్య రాజా మరణిస్తాడు. కాని పూలను కిటికీ లో నుండి చూసిన చిన్న రాజా నడిచి తల్లికి ఆశ్చర్యం కలిగిస్తాడు.

ముసాఫిర్ అంటే బాటసారి. జీవితం అనే రంగస్థలంపై మనం అందరం మన పాత్రలు నటించి నిష్క్రమిస్తాం. అందరమూ బాటసారులమే. అద్దె ఇంటికి వచ్చే వారందరూ కూడా బాటసారులే. ఎవరి అనుభవాలు వారివి. స్టేజీ ఒకటే కాని అనుభవాలు భిన్నం. ఈ అర్థం వచ్చేటట్లు కొన్ని షాట్లు ఉంటాయి. బాల్కనీలో ఒకే చోట నుంచుని శకుంతల అత్తగారింటి నుంచి వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తుంది. తరువాత అదే చోట వదిన భాను ఉద్యోగం గురించి సమాచారం కోసం వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే చోట ఉమ డాక్టర్ దగ్గర నుండి కొడుకు ఆరోగ్యం గురించి వచ్చే కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శకుంతలగా సుచిత్ర సేన్, భానుగా కిషోర్ కుమార్,  వదినగా నిరూపారాయ్, రాజాగా దిలీప్ కుమార్, ఉమగా ఉషా కిరణ్ చిన్న రాజాగా డైజీ ఇరాని నటించారు. ఆ రోజుల్లో ఈ మూడు కథల కాన్సెప్ట్ జనానికి ఎక్కలేదు. నటన పరంగా అందరూ బాగా చేసారనే స్పందన వచ్చినా ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఒకే ఇంట్లో వివాహం, జననం, మరణం సంభవించడం, ఇల్లు ఒకటే అయినా జీవితం లోని అనుభవాలు వ్యక్తిగతం అవడం, ప్రపంచానికి ప్రతీక అయిన ఆ ఇంట వచ్చే వాళ్ళందరూ యాత్రికులే అన్న తాత్వికత సినిమా అంతా కనిపిస్తూ ఉంటుంది.

సినిమాకు సంగీతం సలీల్ చౌదరీ అందించారు. ఈ సినిమాలోని విశేషం మొదటి సారి దిలీప్ కుమార్, లతా మంగేష్కర్‌తో కలిసి ఒక పాట పాడారు. “లాగీ నహీ చూటే రామా” అన్న పాటలో దిలీప్ గొంతు చాలా హృద్యంగా పలుకుతుంది. జాతీయ స్థాయిలో మూడవ ఉత్తమ చిత్రంగా 1957కి గాను ఈ చిత్రం ఎంపికయ్యింది. దిలీప్ ఆ రోజులలోనే మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఇష్టపడేవారు. తనతో పోటీగా ఉద్దండులు ఉండడం ఆయన ప్రతిభను ఇంకా పదును పెట్టుకోవడానికి ఉపయోగపడింది. అప్పటి తరంలోని అందరు నటులతో ఆయన నటించారు. ఒక్క సురయ్యాతో ఏవో విభేదాలు వచ్చాయి. ఆమెతో ఆయన ఎప్పుడు నటించలేదు. పురుషులలో రాజ్ కపూర్, రాజ్ కుమార్, ధర్మేంద్ర నుండి అనీల్ కపుర్ దాకా అందరితో ఆయన దాదాపుగా నటించారు. ఎన్నో ప్రయోగాలు సినిమాలలో చేసారు. ఇంతా చేసి ఆయన నటించింది కేవలం 60 సినిమాలే. తన కథలలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా తీయడానికి హృషికేశ్ ముఖర్జీని ప్రోత్సహించింది దిలీప్ కుమార్. కానీ సినిమా ఆడలేదు. మంచి ఉద్దేశంతో ఉన్నత స్థాయిలో తీసిన సినిమా ఎవరికి చేరాలో వారికి చేరి తీరుతుంది. అలా ఈ సినిమా చూసిన రాజ్ కపూర్, ఇందులోని దర్శకత్వపు ప్రతిభను, కొత్తదనాన్ని గుర్తించి అనారి చిత్రానికి దర్శకత్వం వహించమని హృషికేశ్ ముఖర్జీని కోరడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం, ఇక ఆ తరువాత ఆయనకి హిందీ సినీ జగత్తులో తనదైన స్థానం లభించడం అందరికీ తెలిసిన సంగతే.

దిలీప్ కుమార్‌తో పాటు ఈ సినిమాలో నటించిన వారందరూ చక్కగా చేసారు. దిలీప్ ఉషా కిరణ్‌లు పోటీ పడి నటించారు. ముసాఫిర్ సినిమాలో దిలీప్ కుమార్ కనిపించేదీ అరగంట సేపే. పగ్లా బాబూగా ఆ అరగంటలో మరపురాని రీతిలో నటనను ప్రదర్శిస్తాడు దిలీప్ కుమార్. ఒక దృశ్యం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సివుంటుంది. అనారోగ్యంతో వున్న పిల్లవాడికి, పూలు, తుమ్మెదల గురించి చెప్తాడు. ఆ దృశ్యంలో కేవలం సంభాషణలు పలకటంలోనే కాదు, అతని కళ్ళు, చేతులు, వదనం.. మొత్తం శరీరం నటిస్తుంది. అయితే, ఈ దృశ్యంలో ప్రధానంగా గమనించాల్సిందేమిటంటే, పిల్లవాడికోసం అన్నీ ఆనందంగా చెప్తూన్నా, అతని కళ్ళల్లో మాత్రం విషాదం కనిపిస్తూంటుంది. అత్యద్భుతమయిన నటన. ఈ ఒక్క దృశ్యంలో అసలెలా నటించాడో, ఒకేసారి ఎన్ని విభిన్నమయిన భావాలను ఎలా ప్రదర్శించాడో ఎంతో ఆలోచించినా అర్థం కాదు. సినిమా అయిపోయిన తరువాత కూడా ఈ దృశ్యంలో అతని వదనం వెంటాడుతుంది. శరీరంలో అణువణువు నవ్వుతూంటుంది. కళ్ళు మాత్రం విఫలప్రేమను తలచుకుంటూ వర్షపు  మేఘాల్లా వుంటాయి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదీ దృశ్యం.

ఆఖరి సీన్ ఓ హెన్రీ లాస్ట్ లీఫ్ కథను పోలి ఉంటుంది. ఇక మర్చిపోకూడని విషయం ఈ సినిమాకు కథ అందించింది రిత్విక్  ఘటక్. ఆ రోజుల్లో ఆడకపోయినా ఇప్పుడు మనకు నచ్చుతుంది ఈ సినిమా. హృషికేశ్ ముఖర్జీ సినిమాలన్నీ సామాన్య మానవుని ఇతివృత్తంతో నడుస్తాయి. ఈ సినిమాతో ఆయన శైలి మొదలయింది. దిలీప్ కుమార్ గాత్రం అందించిన మొదటి చిత్రం కూడా ఇదే. పాట క్లాసికల్ బాణీలో ఉంటుంది. అది దిలీప్ టాలెంట్. తరువాత కిషోర్ కుమార్‌తో సగినా అనే సినిమాలో, కర్మ అనే మరో సినిమాలో కూడా ఆయన గొంతు కలుపుతారు. కాని పూర్తి క్లాసికల్ స్టైల్‌లో ఉన్న ఈ పాటలో దిలీప్ టాలెంట్ కట్టిపడేస్తుంది. ముసాఫిర్ సినిమాకు శైలేంద్ర పాటలు రాస్తే సినిమాకు మాటలు రాజేందర్ సింగ్ బేడి రాసారు. ఇంత మంది మహామహులు కలిసి తీసిన సినిమా అప్పుడు ఆర్థికంగా సక్సెస్ కాలేకపోయినా ఎందరో పెద్దల ప్రశంసలు పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here