ఆయుధం

0
3

[dropcap]”నే[/dropcap]ను రేపటి నుండి బడికెళ్ళనమ్మా.. నువ్ కూడా వెళ్ళమని చెప్పొద్దు….” సంచిని గుడిసెలో ఒక మూల పెడుతూ బాధగా, కోపంతో అంటున్నాడు రవి..

సరోజకు రవి ఒక్కడే సంతానం.. ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నాడు.. వయసు పదేళ్లు.. ఈ మధ్య కాలంలో భర్త ఆరోగ్యం బాగోలేక మంచాన పడి, వున్న ఒక్క ఎకరం కుడా ఖర్చులకే వూడ్చుకుపోయాడు.. ఐనా మనిషి బ్రతకలేదు.. వాళ్ళిద్దర్నీ వాళ్ల బాధలకు వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు..

“ఏమైంది నాన్నా….!! ఎందుకలా అంటున్నావ్…” సరోజ రవిని దగ్గరగా తీసుకొని ప్రేమగా అడిగింది..

“నీకు నా క్లాస్మేట్ రాజు తెలుసుకదా..! నువ్ వాళ్ల చేలోకి పనికి వెళ్తున్నావటగా…. కూలిదాని కొడుకు నా ప్రక్కన కూర్చుంటాడాయని ఒకటే విసిగిస్తున్నాడు.. గేలి చేస్తున్నాడు.. అందరూ నవ్వుతున్నారు… అందుకే బడికి వెళ్ళనమ్మా….” బాధగా విషయం చెప్పేశాడు రవి..

“సరేలే.. స్నానం చేసి, అన్నం తిని బజ్జో…” అని రవిని బుజ్జగించింది సరోజ..

మరుసటి రోజు రవి తీసుకొని మండల రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్ళింది సరోజ.. చనిపోయిన వ్యక్తి తాలూకా కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ‘రైతుబంధు పథకం’కు ఎప్పుడో అప్లై చేసుకుంది. సాంక్షన్ అయిన డబ్బులు ఇవ్వాళ చెక్కు రూపంలో ఇస్తున్నారు.. రెవెన్యూ ఆఫీసర్ గారు చాలా బిజీగా వుండటం వలన రవి, సరోజలు ఇద్దరూ అక్కడే ప్రక్కగా నిల్చున్నారు.

వచ్చిపోయే వాళ్ళతో ఆఫీస్ హడావుడిగా వుంది.. పెద్దపెద్ద వాళ్ళు కూడా రెవెన్యూ ఆఫీసర్ గారికి వంగివంగి దండాలు పెట్టడం సరోజ రవికి చూపిస్తుంది.. ఇంతలో రాజు తండ్రి కూడా ఆఫీస్‌కి పని మీద వచ్చి, రెవెన్యూ ఆఫీసర్ గారికి నమస్కారం పెట్టి నుంచొని మాట్లాడటం కూడా సరోజ రవికి చూపించింది..

సాయంత్రానికి గవర్నమెంట్ వారిచ్చిన చెక్కు తీసుకొని, కొడుకుతో మెల్లగా ఇంటి దారి పట్టింది సరోజ..

“చూసావా రవి… డబ్బులు, భూములున్నాయని విర్రవీగే రాజు వాళ్ళ తండ్రి కూడా రెవెన్యూ ఆఫీసర్ ముందు చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడుతున్నారు.. డబ్బుకన్నా చదువు విలువ గొప్పది నాన్నా.. నువ్ కూడా చదువుకుంటే అంత పెద్ద ఆఫీసర్ కావచ్చు.. మనకీ కష్టాలు, ఈ అగచాట్లు లేకుండా బ్రతకవచ్చు.. మనలాంటి పదిమంది పేదవాళ్ళకు నీవు సహాయం కూడా చేయవచ్చు… ఆలోచించుకో.. ఆపైన నీ ఇష్టం….బడికి వెళ్ళమని నేను బలవంతం పెట్టను…”

తల్లి మాటలతో ఆలోచనలో పడ్డాడు రవి.. అమ్మ చెప్పిందే అక్షరాలా నిజం.. చదువును మించిన శక్తి దేనికి లేదు… అందుకే, జీవితంలో ఉన్నతమైన చదువు చదివి అలా ఒక ఆఫీసర్ అయ్యి, తన తల్లికీ, తమలాంటి కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకొని పొద్దున్నే పుస్తకాల సంచి భుజాన వేసుకొని, అమ్మ చెప్పకుండానే, తనకు తానే బడికి బయలు దేరాడు రవి..

శివాజీని తీర్చిదిద్దిన అతని తల్లి జిజియా బాయి కథ సరోజకు తెలియకపోవచ్చు.. కానీ, ప్రపంచంలో బాధలుపడే ప్రతి తల్లీ, కొడుకును గొప్పవాణ్ణి చేయడంలో జిజియా బాయికి తక్కువేం కాదు.. చదువుకున్న ప్రతి పేద విద్యార్థీ కలెక్టర్ కాకపోవచ్చు, కానీ, తనను మలచగలిగిన తన తల్లి చేతిలో తప్పకుండా అయధమై మెరవగలడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here