ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-8 – షహీద్

1
3

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దేశ స్వాతంత్ర పోరాటంలో యువ సైనికుడిగా దిలీప్ కుమార్ నటించిన ‘షహీద్’

[dropcap]భా[/dropcap]రతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో వచ్చిన సినిమా షహీద్. ఇది 1948లో రిలీజ్ అయిన సినిమా. ఒక పక్క అహింసా ఉద్యమం ఊపందుకున్నా కొందరు యువకులు ఉద్యమకారుల పట్ల ఆకర్షణ పెంచుకుని బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఆయుధాలతో ఎదుర్కొనే ప్రయత్నం చేసారు. దిలీప్ కుమార్ అటువంటి యువకుడిగా కనిపించిన సినిమా ఇది. దేశం పట్ల ప్రేమతో పాటు తన చిన్ననాటి స్నేహితురాలి పట్ల ప్రేమను అదే విధంగా గుండెల్లో నింపుకుని రెండు ప్రేమలకు న్యాయం చేయడానికి తనను తాను అర్పించుకున్న యువకుని కథ షహీద్. ఇందులో దిలీప్ కుమార్‌కు జోడీగా కామినీ కౌశల్ నటించారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో జీవించి ఉన్న పాత తరం నటీమణి ఈవిడ. దిలీప్ కుమార్ మొట్టమొదట ప్రేమలో పడింది ఈమెతోనే అంటారు.

కామినీ కౌశల్ తండ్రి ప్రొఫెసర్ శివ్‌రామ్ కశ్యప్‌కు భారత దేశపు వృక్షశాస్త్రపు జనకుడిగా గొప్ప పేరు ఉంది. బాటనీలో ఆయన చేసిన పరిశోధనలకు ప్రపంచ వృక్ష శాస్త్రం లోనే ఎంతో కీర్తి సంపాదించా రాయన. కామినీ కౌశల్ అప్పట్లో బి.ఏ. చేసిన మొదటి నటి. అంతటి గొప్ప నేపథ్యంలో నుండి వచ్చిన ఆమె వెనుక ఒక విషాదం కూడా ఉంది. ఆమె పెద్ద అక్క చనిపోతే ఆమె ఇద్దరు ఆడపిల్లలను చూసుకోవడానికి కామినీ కౌశల్ 1948లో తన బావగారినే పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. వివాహం తరువాత పరిచయం అయిన దిలీప్ కుమార్‌తో ఆమె ప్రేమలో పడింది. కాని ఆమె అన్న బలవంతం మీద దిలీప్‌ను ఆమె మర్చిపోవలసి వచ్చిందట. తరువాత కూడా కొన్ని మంచి సినిమాలలో కామినీ కౌశల్ నటించి గొప్ప పేరు తెచ్చుకుంది. మనోజ్ కుమార్ సినిమా షహీద్‌లో భగత్ సింగ్ తల్లిగా ఆమె నటన ఉత్తమ స్థాయిలో ఉంటుంది.

షహీద్ సినిమాలో శశికపూర్ కూడా బాలనటుడిగా కనిపిస్తాడు. రామ్, షీలా, వినోద్ చిన్నప్పటి నుండి స్నేహితులు. మొదటి నుండి రామ్, షీలా ఒక జట్టు. వినోద్ వీరితో కలవడు. రామ్ జవహర్లాల్ నెహ్రు భక్తుడు. అయితే రామ్ తండ్రి, వినోద్ తండ్రి ఇద్దరు కూడా బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లుగా పని చేస్తూ ఉంటారు. వారిద్దరూ బ్రిటీష్ ప్రభుత్వం పట్ల విధేయతతో ఉండడం వలన ఇంట్లో ఈ దేశభక్తి రామ్ తండ్రి రాయ్ బహదుర్ ద్వారకాదాస్‌కి అస్సలు నచ్చదు. ఈ కారణం తోనే చిన్నప్పటి నుండి తండ్రి కొడుకుల మద్య దూరం పెరుగుతుంది. ఈ ముగ్గురు పిల్లలు పెద్దవారయి ఎవరి మార్గాలు వారు ఎంచుకుంటారు. షీలా దూరదేశం వెళ్ళి డాక్టరయి తిరిగి వస్తుంది. చదువు మానేసి రామ్ ఉద్యమంలో తిరుగుతూ ఉంటాడు, వినోద్ తమ తండ్రుల బాటలో నడిచి పొలీస్ అవుతాడు.

షీలా రామ్ ఇద్దరు కొన్ని సంవత్సరాలు కలుసుకోరు. డాక్టర్ అయి ఇంటికి వస్తున్న షీలా ట్రైన్‌లో పోలీసులకు దొరకకుండా తన బోగీలోకి దూసుకువచ్చిన ఉద్యమకారుడిని చూస్తుంది. అతనే రామ్ అని అతనింటికి వెళ్ళాక ఆమె తెలుసుకుంటుంది. షీలా అన్న గాంధేయవాది. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పని చేస్తూ ఉంటాడు. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. కాని తన మార్గం కాకుండా ఉద్యమ బాట పట్టిన రామ్‌తో అతనికి సిద్ధాంతపరంగా వైరం ఉంటుంది కాని ఇద్దరి ధ్యేయం ఒకటే కాబట్టి ఒకరిపై ఒకరికి గౌరవాభిమానాలుంటాయి.

రామ్ ఉద్యమంలోకి పూర్తిగా వెళ్ళిపోయే ముందు షీలాతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ కలుగుతుంది. వినోద్‌తో షీలా వివాహం నిశ్చయించాలని పెద్దలు అనుకుంటున్నా షీలా రామ్‌నే కోరుకుంటుంది. ఆమె తనకోసం ఎదురు చూస్తుందని వాగ్దానం తీసుకుని ఉద్యమం కోసం రామ్ కొన్ని రోజులు అండర్ గ్రౌండ్‌లోకి వెళతాడు. అప్పుడే వినోద్ షీలా అన్నను అరెస్టు చేస్తాడు. అతనిపై తప్పుడు కేసులు బనాయించి దూర ప్రాంతపు జైళ్ళకు పంపి పెద్ద శిక్ష వేయించే ప్రయత్నంలో ఉంటాడు. షీలా తనని వివాహం చేసుకుంటే ఆమె అన్నను జైలు నుండి విడుదల చేయిస్తానని ఒక షరతు విధిస్తాడు వినోద్. అన్న ప్రాణాల కోసం షీలా అతన్ని వివాహం చేసుకుంటుంది కాని అతని భార్యగా లొంగిపోవడానికి ఇష్టపడదు.

ఉద్యమం నుండి కొన్ని రోజుల కోసం బైటకి వచ్చిన రామ్ షీలా వినోద్‌ను వివాహం చేసుకుందని తెలిసి కోపం తెచ్చుకుంటాడు. ఆమె తనను మోసం చేసిందని అనుకుంటాడు. కాని షీలా ఆరోగ్యం క్షీణీంచడం, ఆమె ఏ పరిస్థితులలో వివాహం చేసుకుందో తెలుసుకోవడంతో ఆమెకు సహాయం చేస్తూ ఉండిపోతాడు. ఆమె ఆరోగ్యం బాగవుతుందనుకునే సమయంలో ఉద్యమం ఊపందుకుని విస్తృతంగా పని చేయవలసి వస్తుంది. ప్రతిసారి ఉద్యమకారులను పట్టుకోవడానికి వినోద్ కుట్రలు పన్నుతూ ఉంటాడు. మరోసారి ఆమె అన్న ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకోవాలని వినోద్ అనుకున్నప్పుడు ఆమెను అతని నుండి రక్షించాలని రామ్ అనుకుంటాడు. కాని ఆమె ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఆమెకు దగ్గర ఉండి సేవలు చేస్తాడు రామ్. అదే సమయంలో ప్రభుత్వం తరుపున వినోద్ రామ్‌ను అరెస్ట్ చేస్తాడు. అప్పటి దాకా రామ్ తండ్రి రామ్‌కు దూరంగానే ఉంటాడు. కాని దేశ పరిస్థితులు ఉద్యమకారుల త్యాగం, ఇవన్నీ ఆయనలో మార్పు తీసుకువస్తాయి. కోర్టులో కొడుకుని రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు రామ్ తండ్రి. కాని ప్రభుత్వం అతనికి ఉరి శిక్ష విధిస్తుంది. రామ్‌కు ఉరి శిక్ష పడిన తరువాత అతని శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు గుండె పగిలి షీలా కూడా చనిపోతుంది. ఇద్దరి అంతక్రియలు ఒకే చోట జరుగుతాయి. ఇది షహీద్ కథ.

ఈ సినిమాలో దిలీప్ తండ్రిగా నటించింది అప్పటి ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్. గ్రే రంగు కళ్ళతో వింత ఆకర్షణతో ఎన్నో గొప్ప సినిమాలు చేసారాయన. ఇది చంద్రమోహన్ ఆఖరుగా నటించిన సినిమా. రిలీజ్ అయ్యిన వరుసలో ముందుగా షహీద్ విడుదలయి తరువాత మరో సినిమా రాంబాన్ రిలీజ్ అయింది. 42 సంవత్సరాలకే చేతిలో చిల్లిగవ్వ లేకుండా మరణించారీయన. హిందీ సినిమాలలో విలన్ పాత్రలలో ఈయన పేరు ముందు ప్రస్తావిస్తారు. ముఘల్-ఎ-ఆజమ్ సినిమాకు కే. ఆసిఫ్ ముందుగా ఈయననే తీసుకున్నారు. పది రీళ్ళు షూట్ చెసాక వీరు మరణించడంతో ఆ పాత్ర పృథ్వీరాజ్ కపూర్‌కి దక్కింది అని చెప్తారు. షహీద్ సినిమాలో అతని గంభీరమైన ఆకృతి, గొంతు ఆకట్టుకుంటాయి. దిలీప్ తల్లిగా లీలా చిట్నిస్ నటించారు. ఈ సినిమాతో తల్లి పాత్రలకు ఆమె ట్రేడ్ మార్క్‌గా మారిపోయారు, తరువాత చాలా సినిమాలలో తల్లిగా గొప్ప పెర్‌ఫార్మెన్స్ చూపించారు. ఆవారాలో ఆవిడ పాత్ర మర్చిపోలేం. ఇందులో కూడా కొడుకుని ఉరి తీసారని తెలిసి చివరిసారిగా అతన్ని కలిసే సీన్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి ఆమె. ఎమ్.ఎన్. రాయ్‌తో పాటు కలిసి పని చేసారామె. 93 ఏళ్ళు జీవించి 2003లో యు.ఎస్.‌లో మరణించారు.

షహీద్ సినిమాకు రమేష్ సైగల్ దర్శకత్వం వహించారు. గులాం హైదర్ సంగీతాన్ని అందిచ్చారు. సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయి. చాలా పాపులర్ అయిన దేశభక్తి గీతం ‘వతన్ కీ రాహ్ మె’ ఇప్పటీకీ దేశభక్తి గీతాలలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినం రోజున వినిపిస్తూనే ఉంటుంది. గీతా దత్, సురీందర్ కౌర్లు మిగతా పాటలు పాడారు. “ఆజా బేదర్దీ బాలమా” అనే గీతాదత్ గీతం, “బద్నామ్ న హో జాయే ముహబ్బత్ కా ఫసానా” అనె సురీందర్ కౌర్ పాటలు రేడియోలో ఇంకా వినిపిస్తూ ఉంటాయి.

దేశ స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే యువతలో జాతీయ భావం నింపడానికి తీసిన చిత్రం ఇది. అయితే దీన్ని ప్రేమ కథను కూడా జోడించి సినిమాను జనరంజకంగా మార్చే ప్రయత్నం చేసారు దర్శకులు. గాంధీ మరణించిన రెండు నెలలకు వచ్చిన సినిమా ఇది. అహింసా సిద్దాంతం పట్ల అప్పట్లోనే యువతకు ఆకర్షణ తగ్గిన రోజులవి. ఈ సినిమాలో రెండు రకాల భావజాలంతో ఉన్న యువకులను చూపిస్తారు దర్శకులు. షీలా అన్న అహింసా మార్గాన్ని నమ్ముకున్న గాంధేయవాది అయితే వారితో ఏకీభవిస్తూనే కొంత దూకుడును ప్రదర్శించే యువ సైనికుడిగా కనిపిస్తాడు దిలీప్ ఈ సినిమాలో. షీలా డాక్టర్ అయి ఇంటికి తిరిగి వస్తున్న ట్రైన్‌లో ఉద్యమకారులు దోపిడికి దిగుతారు. అందులో రామ్ ఒకడు. సినిమా ప్రారంభం అంతా గాంధీ గారిని స్తుతిస్తూ జరిగినా హీరో పాత్ర జవహర్ లాల్‌ను పూజిస్తూ చిన్నతనంలో కనిపించినా, పెద్దయిన తరువాత భగత్ సింగ్, ఆజాద్‌లను పోలిన కార్యకలాపాలలో పాలు పంచుకుంటూ కనిపిస్తాడు రామ్. అప్పట్లోని ఈ రెండు భావాలను కలగలపి చూపిన చిత్రం ఇది. షీలా అన్న సినిమా మొత్తం గాంధీ టోపితో కనిపిస్తాడు. రామ్ దీనికి విరుద్ధంగా కొంత ఆధునిక వేషధారణలో కనిపిస్తాడు. అహింసా మార్గం కన్నా అప్పటి యువతలో ఉద్యమకారుల పట్ల ఆరాధన ఉంది అనడానికి ఈ సినిమాలో కనిపించే వాతావరణం దోహదం చేస్తుంది. కాంగ్రెస్ జెండా క్రింద నుంచుని కత్తికి కత్తి బదులు రక్తానికి రక్తం బదులు అని రామ్ పాత్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, సినిమాలో ఎక్కడా రామ్ గాంధీ టోపీతో కనిపించకపోవడం గమనించవలసిన విషయాలు. అయితే సినిమా పోస్టర్లపై మాత్రం దిలీప్ గాంధీ టోపీతో కనిపిస్తారు. అప్పటి పరిస్థితులలో యువత లోని భావ సంఘర్షణ, ఈ సినిమాలో కనిపిస్తుంది. గాంధీ మార్గంపై ప్రేమ, గౌరవం ఉన్నా, ఉద్యమ విధానాల పట్ల ఆకర్షణ ఉన్న యువత ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా రెంటినీ బాలెన్స్ చేసుకుంటూ సినిమాను నడిపించారు దర్శకులు.

భగత్ సింగ్ పాత్రతో రామ్ పాత్ర పోలి ఉంటుంది. అయితే ప్రేమ కథను కూడా కలిపి నడిపించినందు వలన రెండు రకమైన భావాలను ప్రదర్శించడాన్ని దిలీప్ ఒక సవాలుగానే తీసుకుని నటించారని చెప్పవచ్చు. సున్నితమైన ప్రేమికుడు ఒక చోట, మరో పక్క దేశం కోసం ఎంత కఠినంగానైనా ఉండగలిగిన ఉద్యమకారుడు. ఈ రెండు షేడ్స్‌ను వెంటవెంటనే చూపింఛగలగడం ఈ సినిమాలో దిలీప్ ఒప్పుకున్న చాలెంజ్. దానికి పూర్తి న్యాయం చేసారనే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here