[dropcap]“అ[/dropcap]మ్మయ్య భలే, అమ్మయ్య బ్రతికిపోయాను, అమ్మయ్య ఓ పనయిపోయింది’’…. అమ్మయ్య జాతీయ పదము బరువు తగ్గిన సుఖసూచక పలుకుబడిగ తెలుగువారి సొంతము. అమ్మయ్య అనలేదని వాదించేవాడు కనిపిస్తే ఆశ్చర్యపడాలి. కాని ప్రపంచం నలు మూలల తెలుగు వారందరమూ అమ్మయ్య పదము ఊతపదముగా వాడుతూనే ఉన్నామంటే అతిశయోక్తి కాదు. అమ్మయ్య పదములో అమ్మ,అయ్యలు దాగి ఉన్నారు.
అమ్మ – అయ్య అంటే తల్లి తండ్రి అని అర్థము. తెలుగువారికి అమ్మ తీయనైన పదము. కష్టంలోను, సుఖంలోను అమ్మపదం హాయిగా మనసును గాలిలో తేలిస్తుంది. పాశ్చాత్య నాగరికత ఎంత ప్రభావితము చేసినా అమ్మ పదము సజీవము. మమ్మీ పిలుపుగ మారాము సహించని వారే ఎక్కువ. అమ్మ పదమంటేనే అమ్మభాష. అమ్మకు జోడి అయ్య. నాన్నగ తండ్రి అని అర్థము. నాన్నకు నేటి తెలుగు పలుకుబడిలో అయిష్టమయిన డాడి పిలుపు చేరడం జరుగుతోంది. నాన్నకు ఆత్మీయ పిలుపుగ తెలుగుప్రాంతములలో అన్ని ప్రదేశాలలో నేటికీ నాన్నగారుగ, కొంతమందికి అయ్యగ సర్వాంగీకార పదము. అమ్మ, అయ్య మనకు ప్రాణము.
అమ్మ, నాన్నలు అసలు సిసలు తెలుగుబడులు. అయ్యను అమ్మకు జోడించి తలచి పలికే సుఖసమయ, దుఃఖనివారణ సూచక నిట్టూర్పు జాతీయమీ అమ్మయ్య. తల్లిదండ్రులిద్దరినీ ఒకేసారి తలచునే అమ్మయ్య తెలుగువారి అదృష్టముగ పలుకుబడికి హృదయబరువు నివారణ ప్రత్యేకతగల ఊతపదము అంటే కాదనవద్దు.
పిలుపులో ‘ఓయ్’ చేర్చి పలకడం తెలుగు పిలుపులో ఓ ప్రత్యేకత, అమ్మోయ్, అయ్యోయ్, అమ్మ బాబోయ్, అయ్యబాబోయ్ అప్రయత్నముగ వచ్చేస్తాయి. అమ్మ, అయ్య పదములు రక్షణ పిలుపులుగా లాలన-పోషణకు జంటపదాలు కుటుంబపడికట్టు పదాలు. ‘అమ్మ, అయ్య’లు చేర్చిన అన్నయ్య, అక్కయ్య, అక్కమ్మ, చెల్లెమ్మ మన నరనరాన ఉత్తేజం కలిగించి లాలన పోషణ అనురాగ స్రవంతి రక్షణ ప్రాశస్త్యము అమ్మయ్య పదములో మిళితమై ఉన్నాయి.
అమ్మ అయ్యలు, అనురాగసూచక వాత్సల్యపదాలు. కనుకనే తెలుగువారు పేర్ల చివర అమ్మ అయ్య పదములు చేరుస్తారు. దేవతార్చనా మూర్తులలో అమ్మ అయ్యలు కనిపిస్తారు. సీతారాములు మనకు రామయ్య సీతమ్మ. పరమశివుడు శివయ్య. బ్రహ్మదేవుడు బ్రహ్మయ్య. కాళివంటి శక్తిదేవతలు గౌరమ్మ, దుర్గమ్మ. చదువులమ్మ మనకు పలుకులమ్మ. గ్రామదేవతలందరూ మనకు అమ్మవార్లుగ అమ్మలు. గంగమ్మ, గోదావరమ్మ్ఝ అంటూ నదులు, నిత్యపూజ లందుకునే కోటలో తులసి, తులసమ్మగ, ఇంకా దేవి, దేవతలలో అయ్య, అమ్మపదములు భక్తిప్రపత్తులుగ చివర కలిగి ఉన్నాయి.
మన తెలుగు నామవాచకములలో స్త్రీపురుషులిద్దరికి… సీతమ్మ-సీతయ్య, గంగయ్య-గంగమ్మ, వెంకయ్య- వెంకమ్మ పేర్లున్నాయి. అమ్మ అయ్యలుపేరు చివరచేర్చి పిలవబడుతున్నారు. చిన్నయ్య, పెద్దయ్య తెలుగు పలుకుబడికి వింత అందము తెస్తారు. ఇది మనకు జానపద కవిత్వములో అందాన్నితెచ్చింది. రావూరి వెంకటసుబ్బయ్య అనే జానపదకవి తెప్పోత్సవ వోడ పాటలో రచించినది బిరుదురాజు రామరాజుగారి జానపద గేయ ఉదాహరణ గచ్చిన ఈ పలకరింపులు చూడండి….
బాలయ్య, కోటయ్య బాగవున్నారా.. చాలగనందరు సక్కగున్నారు.
సుఖమె మనవారెల్ల సూరయ్యగారు… ఆదెమ్మ మీరాక ఆశ్చర్యమిపుడు
పిన్నమ్మ మీ కోడలెన్నేండ్లదమ్మా… బిడ్డలెందరోయి పేరయ్య నీకు
పెదపాప చినపాప పెద్దక్కలిమ్ము కదలి వచ్చిరి–
అమ్మ పదము చివరతో మనసు పులకించిపోతుంది. అమ్మ గొప్పది. కడుపులో పడగానే రక్తాన్నిపంచి ఆకారమిస్తుంది. భూమిపైకి రాగానే రక్తాన్ని తీయని పాలుగా అందించి ఊపిరిపోసిన తీర్చలేని ఋణాన్ని గుర్తుచేస్తుంది. తప్పటడుగులు దిద్ది, ఎదిగి కీర్తిగాంచాలన్న ఆశీస్సుల క్రమశిక్షణ అమ్మది.
కొందరి విషయాంలో ఒకవేళ అమ్మే తండ్రి బాధ్యత కూడ స్వీకరించ వలసి వచ్చినా అమ్మయ్య అని తల్లిని తండ్రిని కూడ తలపించుకుంది. ఆంగ్లేయుల కాలంలో అధికారము చెలాయించిన రాణివాసపు స్త్రీ అమ్మయ్యగారిగ లేదా రాణమ్మయ్యగారిగా గౌరవించ బడింది. అయ్య పెత్తనము గల రాచరిక పదములు అమ్మయ్య, రాణమ్మయ్య. అయ్య అంటే నాన్న. నాన్నని కూడ కూడ పరిచయం చేసేది అమ్మే అన్నారు వాసా ప్రభావతి అనే కవయిత్రి. అమ్మ నిజం. నాన్న నమ్మకం అన్నది నానుడే అయినా చేదు నిజం. అమ్మ=అయ్య అమ్మయ్యగ అమ్మానాన్నలుగ అభేదము.
గోవ్యాఘ్ర సంవాదములో అనంతామాత్యకవి “చులుకన జలరుహతంతువు, చులుకన తృణకణము, దూది చులుకన, యిలనెగయుధూళి చులుకన.. చులుకనమరి తల్లిలేని సుతుడు కుమార” అని ఆవుతో దూడకు చెప్పించాడు. ఆకలి అమ్మను గుర్తుకు తెస్తుంది. తల్లి మాట వినకుండా చెడు తిరుగుళ్ళు తిరిగిన గుణనిధి కథ శ్రీనాథుడు కాశీఖండములో చెప్పాడు. గుణనిధి తల్లి ఉపేక్ష కారణంగ తండ్రి అదుపాజ్ఞలకు దూరమయ్యాడు. చెడు నడత కారణంగా తండ్రికి, ఇంటికి దూరమై ఆకలితో అలమటించిన అతనికి కడుపు చూసి అన్నం పెట్టిన తల్లి మాత్రమే గుర్తుకొచ్చింది. “హరహర ఎవ్వరింక కడుపారసి పెట్టెదరీప్సితాన్నముల్’’ అన్నమాటలు అమ్మ గొప్పతనాన్ని చాటాయి. అమ్మ ప్రేమ గొప్పది. శివుడు కూడ ఆ ప్రేమను గుర్తించాడు. గుణనిధికి ఆ అమ్మ తలపు శ్రీరామరక్షయింది.
కాశీఖండములో తండ్రి అదుపాజ్ఞలేని తల్లిది గుడ్డిప్రేమగ కూడ ప్రమాదకరమని హెచ్చరికను శివుడు శివయ్య, గౌరమ్మలుగా గుణనిధి కథ ద్వారా అందించాడనిపిస్తుంది. ప్రసాదము దొంగిలించినా శివరాత్రి నాడు నిహతుడయ్యాడు అని మరుజన్మలో రాజును చేశాడు. అందుచేత గుణనిధి మహారాజు జన్మలోకూడ తపస్సు చేసి ఉన్నతస్థితిని కోరాడు. అప్పుడు శివుడు పార్వతితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. కాని పార్వతీ అమ్మవారిలో అమ్మను చూడలేక పోయాడు. గౌరమ్మ సౌందర్యాన్ని మోహపడినాడు. శిక్షగా ఒకకన్ను లేకుండా చేసింది జగజ్జనని. శివుడు కుబేరుడిని చేసినా ఇప్పటికీ ఒక కన్ను కుబేరుడికి లేదు. అమ్మ-అయ్య అనుకోవడము అమ్మయ్య క్రమశిక్షణావశ్యకతగల రక్షణ పదము తల్లిదండ్రులకు కనువిప్పుగా శ్రీనాథకవి రచన.
పిల్లలలకు ఆదర్శవర్తనము నేర్పేవారెవరెవరైనా సరే అమ్మ, అయ్యలు అవుతారు. అందుచేత భగవత్స్వరూపులుగ తల్లిదండ్రులను అమ్మ, అయ్యలుగా భావిస్తారు. రాములవారు మనకు రామయ్య. సీతాదేవి మనకు సీతమ్మ. అగ్నిపునీత సీత అమ్మగా కూడ అరణ్యవాసము అనుభవించింది. లవకుశులకు జన్మనిచ్చి తను వాళ్ళమ్మ భూదేవివద్దకే వెళ్ళింది. పిల్లలకు తండ్రి ఆవశ్యకత లభించేవరకు లవకుశులను సాకి అమ్మ ఆవశ్యకత చాటి రాములవారికి అప్పచెప్పిందన్నది ఉత్తరరామాయణము.
అమ్మవారు, అయ్యవారుగ మాతాపితలు పూజనీయులు. అమ్మలేని ఇంటిలో లేనిది ఏది అన్నాడు గంధర్వ గాయకుడు. చిన్నప్పుడు తనకు ఆడవేషము వేసి ఆనందపడిన ముచ్చట బాలు బాల్యము మనకూ ఉంది. ఆలీతో ముచ్చటగా పంచుకున్నాడు.
మాపాప మామల్లు మత్స్యావతారం… కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరహావతారం… నట్టింటనాయత్త నరసింహావతారం.,,,,
వాసిగల బొట్టెల్లు వామనావతారం… పరమగురుదేవ పరశురామావతారం..
రక్షించు మామయ్య రామావతారం… బంటైన బంధువులు బలభద్రావతారం
చిట్టి నాకన్నోడ శ్రీకృష్ణవతారం… బుద్ధితో మాచిట్టి బుద్ధావతారం
కలివిడితో మాయన్న కలికావతారం… వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
అంటూ దశావతారాలలో చూసుకుని మురిసిపోతు పాపాయి పలుకులు పంచదార చిల్కల్లు—పాపాయి చిన్నెల్లు బాలకృష్ణు వన్నెల్లు… అని దానందక్కచ్చి, అన్నం బెట్టి, అప్పబెట్టి, చందమామ రావె అని పాటలు పాడే అమ్మ ట్వింకుల్, ట్వింకుల్ లిటిలు స్టారు నేర్పమంటున్నా సీనియర్ సిటిజన్సుగ అమ్మయ్యల వారసత్వము మరిచిపోలేక గుర్తుచేయడం మానలేము.
అమ్మగారు, అయ్యగారు పదాలు గౌరవార్థకాలు. తల్లిదండ్రులుగా భావించినా లేక లాలన పోషణ చేసిన వారిని కూడ జన్మనివ్వక పోయినా కృతజ్ఞతతో అలాగే పిలవడం తెలుగువారి సంప్రదాయమైంది. మహారాజ దంపతులు కావచ్చు లేదా జమిందారు దంపతులు కావచ్చు. రాజుగాను, రాణిగాను గౌరవింపబడినా కృతజ్ఞత పిలుపులో మాత్రం అమ్మయ్యలే!
సంజయ రాయబార సమయాన ధర్మరాజు పెదతండ్రి దృతరాష్ట్రుని అయ్యగానే భావించాడు, స్వర్ణయుగ పాలన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీని అయ్యగానే భావించాడు. అన్నయ్య, తమ్మయ్య, అక్కమ్మ, చెల్లెమ్మ బాబయ్య, తాతమ్మ, తాతయ్య అనడం అమ్మయ్య ప్రేమలే.
సంతానం ఎదిగి గొప్పవారు కావాలన్న నాన్నది కూడ ప్రేమాస్పద కీర్తికాంక్షే! అయినా అమ్మది మాత్రం నిస్వార్ధ ప్రేమాశయ అశీస్సుల క్రమశిక్షణ మరపురాని బాటగా నాన్న ఆశయానికి వేసిన పునాదిగ మరపురానిది. జీవితం అమ్మయ్య అనేలా సాగాలంటే అమ్మా నాన్నల క్రమశిక్షణ అవసరము. భారతము అరణ్యపర్వములో ధర్మవ్యాధుని కథ ఉంది. అతడు మహాజ్ఞాని. ఉదర పోషణార్థము చదువుకుని విద్యావంతు డవడానికి కౌశికుడనే బ్రాహ్మణ కుమారుడిలా కాశీ వెళ్ళలేదు. తల్లిదండ్రులను సేవించినంత మాత్రాననే తపనగల కృషితో విజ్ఞానవంతుడయ్యాడు. కేవలము ఉదర పోషణార్థము, జ్ఞాన సముపార్జనకు బాధ్యతలు విస్మరించి దేశాలు పట్టిపోవద్దన్న నీతికథది.
వృద్ధాప్యములో తల్లిదండ్రులను గాలికి వదిలేయలేక ఉదరపోషణార్థము విద్యావంతుడైన ధర్మవ్యాధుడు కులవృత్తిని కాదనుకోలేదు. కౌశికుని ప్రబోధించాడు. తల్లిదండ్రుల వద్దకు పంపాడు. మన దారి మనదిగా విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులకు సుఖజీవన ఏర్పాట్లు చేసి అమ్మయ్య అనుకోవడము ప్రశంసనీయము కాకూడదు. ఆమోదయోగ్యముగ అమ్మ, అయ్యలను సంతోషపరిచి గౌరవించడము ముఖ్యమని చెప్పడము ఈ అమ్మయ్య వ్యాసోద్దేశము.