ఈ తరం అమ్మాయి

0
4

[dropcap]లి[/dropcap]ఖిత శ్రీ.. ఈ తరానికి ప్రతీక.. ఆధునిక భావాలకు అద్దం పట్టినట్లు ఉంటుంది. ఐతే మంచి తెలివి తేటలతో అటు ఇటు తరాలకు పెట్టింది పేరుగా ఆటు నానమ్మ తాతయ్యలను మెప్పిస్తు వేషం వేస్తుంది.. ఆధునికతను అంటే ఇష్టం.. ఎప్పటి కప్పుడు.. నూతన సౌరభాలు కావాలంటుంది. తల్లి తండ్రి గారంగా పెంచారు. పెళ్లి అయిన 9 సంవత్సరాలు తర్వాత పుట్టింది. ఇంట్లో అందరికీ గారాబం. అలా అని ఏమి మార్పులేదు. అన్ని తెల్సుకోవాలి నేర్చుకోవాలి.. లిఖితకు కూడా అన్ని ఇష్టమే. సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటుంది. అన్ని రావాలి, అన్ని కావాలి. వంట వార్పు అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటుంది.. అమ్మకి వంకలు పెడుతుంది. నాన్న చేత ముందుగా అన్ని చెప్పించుకుని చేస్తుంది. నాన్నకి గారాల పట్టి.

“తొమ్మిది నెలలు మోసి కన్నాను, నేనంటే వీసం ఎత్తు విలువ లేదు. తండ్రి కూతురు నన్ను ఆట పట్టడమే.. ఒకరోజు వంటిల్లు మీకు అప్ప చెపుతాను. ఏమి తింటారో చూస్తా” అని సవాలు చేస్తుంది తల్లి.

“రత్తమ్మ సవాలా, శపథాలా” అని నానమ్మ నవ్వుతుంది.

“వాళ్ళకేనేమిటే. మనం తినాలిగా.. వాళ్ళు హోటళ్ళు వెంట వెడతారు లేకపోతే బిర్యాని వండుకుంటారు. ఎటొచ్చీ నాకే ఉండదు. నువ్వు వాళ్ళతో బిర్యాని సరిపెట్టుకుంటావు. నాకే నోట్లో మట్టి కొడతారు. నువ్వు వాళ్ళతో గొడవ పడకు. మనం నెగ్గలేము. వాళ్లకు నచ్చినట్లు వండుకుంటారు. నువ్వు పప్పు అన్ని పడెయ్యి. ఆనక తినేటప్పుడు మిరపకాయలు, వడియాలు వేయించి కొంచెం మజ్జిగ పోపువేయ్యి.. తడి బట్టలతో ఊరగాయ నేను తీస్తాను. మళ్లీ మీ మామగారు ఒప్పుకోరు. శ్రావణికులు వస్తే మనింటి టెంక మెంతి కాయ, బెల్లం ఆవకాయ వారికి పంచ భక్ష్య పరమానాలు.. కాస్త శుచి శుభ్రం పెంచుకోండి. ఆచారాలు ముందు పిల్లకి నేర్పు. రేపు పెళ్లి అయ్యాక ఎవరు వస్తారో. ఆ డ్రస్సులు మాని పరికిణీలు వేయించి పని నేర్పు.. పని ముద్దు కానీ పిల్ల ముద్దు నాకు గాని వాళ్ళకి కాదు” అత్తగారు అవకాశం వచ్చింది కదాని క్లాస్ తీసుకున్నారు.

“వాళ్ళ కేమి ఎలక్ట్రిక్ కుక్కర్‌లో నీళ్ళు బిర్యాని రైస్ పాకెట్ విప్పి పోస్తారు. అరగంటలో బిర్యాని రెడీ. తండ్రి కూతురు ఉల్లి, టమోటా మిర్చి ముక్కలు తరిగి ఉప్పు జీలకర్ర మిరయాల పొడి చేర్చి పెరుగు పోసి పచ్చడి చేస్తారు. ఇంకేమి అద్భుతమైన వంటకం రెడీ. ఇంట్లో బంగళా దుంప చిప్స్.. డబ్బాలో ఉంటాయి. ఇది మామిడి పళ్ళ సిజన్ ఫ్రిజ్ నిండా పళ్ళు స్వాగతం చెపుతాయి వాళ్ళకి లోటేమిటి? తండ్రి కూతురు అదేదో సినిమాలో మాదిరి హాయిగా తింటారు. నాకే భోజనం ఉండదు. నువ్వు మామూలు కుక్కర్‍లో బియ్యం, పప్పు పెట్టు” అని తొందర చేసింది.

“సరే” అంటూ పట్టు చీర కాస పోసి కట్టి వంటకు రెడీ అయ్యింది.

లిఖిత అయితే “నానమ్మా పాటియాలా పంజాబీ డ్రస్సు పట్టువి అమ్మకి కుట్టించు, అచ్చు ఇలాగే ఉంటుంది” అని ఆటపట్టిస్తుంది.

లిఖితకి మోడలింగ్ ఇష్టం. అలాగే పాటలకు, యూట్యూబ్‌లో పాటలకు నటించడం ఇష్టం. పిల్ల ఇష్టాలు వద్దనకుండా తల్లి వీడియోలో తీసి పెడుతూ ఉంటుంది. ఐతే ఇవేమీ అత్తగారికి ఇష్టం లేదు. లిఖిత తల్లి రూప రెండు తరాల మధ్య నలిగి పోతోంది.

ఈలోగా లిఖిత మెడిసిన్ చదవాలని పట్టు పట్టింది. సరేనని కోచింగ్‍కి పంపారు.

నానమ్మకి ఇష్టం లేదు. “ఊళ్ళో ఉంది. గుప్పెడు మెతుకులు తిని చదువుకుంటుంది” అన్నారు తల్లి రూప, తండ్రి అనంతు.

అత్త గారికి నచ్చ చెప్పింది రూప, నాన్నకి చెపుతాను అన్నాడు అనంతు.

“ఆయనకి ఏమి తెల్సు, పొలంలో వ్యవసాయం తప్ప వేదం చదవడం తప్ప” అంది.

“సరే సీటు వచ్చి నప్పుడు కదా, ఇప్పటి నుంచి గొడవ ఎందుకు.. ఇప్పటికే అది మగరాయుడు వేషాలను…” అంటూ ఆపింది అత్తగారు.

తల్లి మాటలు విన్న అనంత్ అలోచనలో పడ్డాడు.

ఇన్నాళ్ళకి తనకు పిల్ల పుట్టింది. ముగ్గురు అక్కల పెళ్లిళ్లు, ఉమ్మడి కుటుంబం. నిజానికి రూప ఏది తనను కొనమని అడిగేది కాదు. అందరితో పాటు కలిసి  ఆడపడచుల పెత్తనం, అత్తగారి పెత్తనం మధ్య నలిగిపోయింది. ఎన్నో సార్లు పుట్టింటికి వెళ్ళిపోతు ఉండేది. అనంతుకి తన కుటుంబ పరిస్థితి తెల్సు. తన అక్కల సన్నాయి నొక్కుల పెంకితనం తెల్సు, కనుక ఉరుకునేవాడు. ఆ ఉమ్మడి పెత్తనములో తనకి పిల్ల ఉన్నా సుఖపడదు అందుకే.. తన అక్కల పెళ్లిళ్లు అయ్యాక పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు.

ముగ్గురు అక్కలు ఎం.ఏ.లు చదివి లెక్చరర్స్‌గా స్థిరపడ్డారు. అనంతు కూడా లెక్చరర్‌గా స్థిరపడ్డాడు. విశాఖ ప్రక్క పల్లెటూరు వాళ్ళది. తల్లి తండ్రి పల్లెలో ఉంటారు. తల్లే అప్పుడప్పుడు కోడల్ని మనమరాలిని అదుపులో పెట్టడానికి వస్తుంది.

రోజులు గడుస్తున్నాయి. లిఖితకు మెడిసిన్ సీటు వచ్చింది. ఇంట్లో పెద్ద యుద్ధం. వద్దని కొందరు, చదివించాలని రూప పట్టుబట్టారు. ఆ రోజుల్లో రూపకు సీటు వస్తే మా ఇంట్లో ఆడపిల్ల అన్నేళ్లు చదివిస్తే పెళ్లి ఎప్పుడు అని తన బామ్మ అడ్డం చెప్పి పెళ్లి చేసేసింది. ఆవిడ ఉండగా పెళ్లి జరగాలని పట్టు పట్టింది. రూప బి.ఏ. ప్రైవేట్‌గా చదివింది. అప్పటికే తన ఆడపడుచులు ఎమ్.ఏ.లు చదివారు. పెళ్లి లోగా ఉద్యోగాలు, ఆ తరువాత కూడా జీతాలకు అలవాటు పడ్డవారు.. ఉద్యోగం మానలేదు.. ఎవరి అదృష్టం వారిది. అందుకే తన పిల్లని మెడిసిన్ చదివించాలని కోరిక. ఒక్క పిల్ల. ఏదైనా దానికే. ఇలా రూప అనంతు ఆలోచించి లిఖితని మెడిసిన్‌లో చేర్పించారు.

***

కాల గమనంలో 4 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు డాక్టర్ లిఖిత శ్రీ. హమ్మయ్య, ఇక్కడికి ఒక యజ్ఞం పూర్తి అయ్యింది… ఈలోగా అత్తగారు ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చింది.

“అత్తలకి పిల్లలు పెద్దవాళ్ళు. బయటి సంబంధాలు చూడాలి.. మీరు దాని చేత ప్రాక్టీస్ పెట్టించి నలిపెయ్యకండి. డబ్బున్న జమీందారీ సంబంధం చేసి సుఖపడనివ్వండి” అంది.

లిఖిత పరిస్థితి అడకత్తెరలో పొక చెక్కలా మారింది. అమ్మానాన్నలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెద్ద కుటుంబంలో చేస్తే పిల్ల సుఖపడుతుంది అనుకుంటున్నారు.

ఎంత చదివినా పెళ్లి, వంట, పిల్లలు, అత్తింటి సమస్యలు తప్పవు. మనం ఎంత తెలివైన వారమైనా, అవతలివాళ్ళు సహకరించాలి. చదవుకోవడానికి సొంత తెలివి చాలు, కానీ అత్తింటికి ఈ తెలివి చాలదు.. వారి ఇష్ట ప్రకారం నడిచితేనే వాళ్ళు మనల్నినుండ నిస్తారు. అందుకుగాను వారు ఎన్నో రకాల అడ్డంకులు పెడతారు.

రూప అన్ని అనుభవించింది. అందుకే పిల్ల పెళ్లి విషయంలో ఆలోచనలో పడింది. పైకి ఏమి మాట్లాడడానికి వీలు లేదు.

సంబంధాలు వస్తున్నాయి. కొన్ని వాళ్ళకి నచ్చక, కొన్ని వీళ్ళకి నచ్చక సంబంధాలు వెళ్లిపోతున్నాయి..

“ఎం.ఎస్.చదువుతాను” అంది లిఖిత. తండ్రి వప్పుకోలేదు..

ఈలోగా పల్లెకు వెళ్ళింది. నానమ్మతో తంటా అయినా సరే, పల్లె పంటలు వాతావరణం నచ్చాయి.. ఆ ఊరిలో ప్రాక్టీస్ పెడితే సరి అని ఆలోచించి, నానమ్మతో అంటే “చూద్దాము, ముందు మన పాలేళ్లకు వాళ్ళకి కళ్ళు పరీక్ష చెయ్యి” అన్నది.

నానమ్మ పగలు నైటీలు వేసుకోనిచ్చేది కాదు. బీరువాలో మోడరన్ బట్టలన్నీ ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. ఉన్న పది రోజుల్లో ఎన్నో ఆచారాలు, పద్దతులు తెల్సుకుని.. ఆలోచించింది.

ఆ ఊళ్ళో ఒక ఆంటీ పరిచయమయ్యింది. ఆవిడ ఇల్లు పల్లెలో అయినా ఎంతో అందంగా పట్నం ఇల్లు తలదన్నేలా ఉంది. ఆవిడ మాటల్లో ఆయన దుబాయ్‌లో ఉన్నారని, పిల్లలు హాస్టల్లో ఉన్నారని చెప్పింది.

మరి మీరు ఇక్కడ ఎందుకు అంటే, నవ్వి “మన పెద్దల ఆస్తి ఉంది. అది చూసుకుంటూ నేను జూట్ బ్యాగ్‌ల తయారీ బిజినెస్ చేస్తున్నాను” అని చెప్పింది.

“ఆహా, అలాగా, ఈ పల్లెలో మీరు ఒక్కరు ఉన్నారా..?”

ఆవిడ చిన్నగా నవ్వి “అంకుల్, పిల్లలు బాధ్యతలు చూసి వెళ్లారు. ఎంత? ఆఫీస్ వాళ్ళు పంపారు కదా, వారు వచ్చాక ఇద్దరం చూసుకుంటాము” అన్నది.

“ఈ ప్రపంచంలో రకరకాల జీవితాలు. ఎవరి జీవితం వారిది. వారికి నచ్చినట్లు నడచుకోవాలి. ఒకరితో ఇంకొకరికి పోలిక వద్దు” అని చెప్పింది

“నువ్వు డాక్టర్ చదువు చదివావు. డాక్టర్ ఐతే మంచిది కాదు, వేరే ప్రొఫెషన్ అనుకుంటే మీ వాళ్ళ నిర్ణయంతో ఏకీభవించాలి” అన్నది.

లిఖిత ఆలోచనలో పడింది. ‘నేను ఎవర్ని ప్రేమించలేదు. అమ్మ నాన్న చెప్పిన వాళ్ళనే చేసుకుంటే మంచిది.. మనకు జీవితం ఇచ్చారు. వాళ్ళే మంచి చేస్తారు. నమ్మకం పెట్టుకోవాలి. ఎవరో నువ్వు అందంగా వున్నావు మోడలింగ్ చెయ్యి, అంటారు నమ్మడమేనా’ అనుకుంది.

***

నానమ్మ కోరికతో లిఖితకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.. పెళ్ళివారు బాగా డబ్బున్న వారు. గ్యాస్ డీలర్స్. అదీగాక పొలం ఉంది. పెళ్లి చూపులకి అత్తగారు, ఆడపడుచు, భర్త, పెళ్లి కాని మరిది వచ్చారు. టిఫిన్స్, డ్రింక్స్  అయ్యాయి. ఏదీ ముట్టం అంటూనే అన్నీ తిన్నారు… పిల్లని చూపించండి అన్నారు.

పిల్ల వచ్చింది.

“తెల్లగా బాగానే ఉంది, చూడరా శ్యామ్” అని అత్తగారు అన్నది.

ఇబ్బందిగా ఉన్నారంతా.

“పిల్ల పాడుతుందా?”

“ఆ పాడుతుంది. హిందీ పాటలు”

“పిల్ల ఆడుతుందా?”

“ఆ. మోడరన్ డాన్స్.” తల్లే సమాధానం చెప్పింది

“వంట చేస్తుందా..”

“ఆ చేస్తుంది. బిర్యానీ లాంటివి.”

“ఇల్లు సర్దడం వచ్చా?”

ఆహా నా ఇల్లంతా మా పిల్లే సర్ది అలంకరిస్తోంది”

“అయితే మీ పిల్లకి అన్నీ వచ్చు. అలాగని మా ఇంట్లో పాటలు, ఆటలు అన్నీ కుదరవు. వచ్చినవన్ని అప్పగింతల నాడే మార్చుకోవాలి. మర్చిపోవడం మంచిది. నేను డాక్టర్ చదివాను, నాకు ఏమి రావు అంటారనూకున్నాను అన్ని వచ్చు అని మీ అమ్మాయి అనొచ్చు కాని మాకు కావాల్సింది గడప దాటని కోడలు. అయితే డాక్టర్ చదివి అన్ని వచ్చి ఉండాలి. కాని ఏది తన స్వాతంత్య్రానికి వాడకూడదు.. పాట కావాలి అంటేనే పాడాలి. డాన్స్ అవసరం లేదు. వంట మనిషి రాకపోతే ఇంట్లో పదిమందికి వండాలి. విసుగు విరామం ఉండకూడదు..”

ఇలా చెప్పి “ఇవన్నీ నచ్చితే మాకు కట్నం వద్దు. గ్రాండ్ గా పెళ్ళిచెయ్యలి. అయినా మీకు ఒక్క పిల్ల. అన్ని బాగానే పెడతారు” అంటూ నవ్వింది. అక్కడంతా అత్తగారిదే పెత్తనం. “మేము వెళ్ళి వస్తాము” అంటూ లేచారు.

“ఉండండి” అంటూ రూప అత్తగారు సెగ చేశారు

వెంటనే రూప లోపలికి వెళ్ళి ట్రేలో మామిడి పళ్ళు. టస్సర్ సిల్కు చీరలు తెచ్చి, “బొట్టు పెట్టు” అని లిఖితకు చెప్పి ఇప్పించింది.

‘ఓహ్. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ నిండా పళ్ళు, బట్టలు వస్తాయి’ అంటూ మగవాళ్ళు నవ్వుకున్నారు.

అందర్నీ సాగనంపారు.

***

లిఖిత నాయనమ్మ మాత్రం “ఈ సంబంధం ఐతే పిల్ల సుఖపడుతుంది, డాక్టర్ చదివి ఎంత మందికి సేవ చేసిన ఇంత సొమ్ము సంపాదించాలి అంటే కష్టమే” అంది.

‘ఓహ్. తల్లి ఉద్దేశ్యం తెలిసింది. ఇంకా పిల్ల నడగాలి’ అనుకున్నాడు అనంతు. “లిఖితా నువ్వు ఏమంటావు?” అన్నాడు.

“అమ్మా మీరు ఏది బాగు అంటే అది చెయ్యండి” అంది.

“సరే” అని వాళ్ళకి ఫోన్ చేసి కబురు చేసుకుని రూప, అనంతు, అతని అక్కలు కల్సి వెళ్లారు.

వాళ్ళది పెద్ద ఇల్లు. అంతా మోడరన్‌గా ఉంది. ‘లిఖితకు నచ్చుతుంది’ అనుకున్నారు.

అంతా కల్సి.. పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తిన్నారు.

“కట్నాలు వద్దు. పిల్లకి నగలు పెట్టండి. మా పిల్లలకు ఈ నగలు ఉన్నాయి. మీరు చేయించి పెట్టండి. చీరలు నేను సెలెక్ట్ చేసి పంపుతాను, మీరు బిల్ పే చెయ్యండి..” అంటూ కాబోయే అత్తగారు ఘరానా ధోరణిలో మాట్లాడింది

రూపకు నచ్చలేదు.. కాని వాళ్ళ శాఖలో దొరకడం కష్టం. అందుకే, తప్పనిసరి అయి ఒప్పుకుంది.

పెళ్ళి 5 స్టార్ హోటల్‌లో చేయాలన్నారు. అన్ని బాగున్నప్పుడు, ‘ఇంకా పెళ్లి ఖర్చు అవుతుంది అనుకోకూడదు’ అంటూ అనంతు అక్కలు వత్తాసు పలికారు.

లిఖిత అత్తవారు కోరుకున్నట్లే పెళ్లి ఘనంగా జరిగింది. మినిస్టర్‌లు, సినిమా వాళ్ళు అంతా వచ్చారు.

‘తన జీవితం ఇంతవరకు తల్లి తండ్రి చేతిలో ఉంది.. మిగిలిన జీవితం అత్త ఇంట్లో ఉంటుంది’ అనుకుంది లిఖిత.

***

అంతా బాగుంది.. అయితే వారితో కలసి వారి పద్ధతిలో ఇమిడినా సరే వంకలు పెట్టి విమర్శించి, చేసిన ప్రతి పని ఇలా కాదు అలా చెయ్యి అంటూ వంటవాళ్ళ దగ్గర, పని వాళ్ళ దగ్గర విమర్శిస్తూ అత్త పెత్తనం చేస్తుంది. అయితే లిఖిత భర్త శ్యామ్ మంచివాడు. తల్లి, అక్కల మనస్తత్వం తెలిసినవాడు కనుక లిఖితను బాధ పడవద్దని చెప్పేవాడు.

పిల్లని చూడడానికి వచ్చిన రూప అనంతు పిల్ల డల్‌గా ఉండటం చూసి బాధ పడ్డారు.

చిన్నతనంలో పెళ్లి అనుకుని, అత్తగారు దగ్గర “పిల్లని తీసుకెళ్ళి ఓ వారం పెట్టుకుంటాము” అన్నారు

ఆవిడ ఒప్పుకోలేదు. “నా కోడలు నా దగ్గరే ఉండాలి” అని అంది. మామగారు మాత్రం అలాగే పంపుతామని అన్నారు

“ఇంకెంత రెండో పిల్లాడి పెళ్లి చేస్తాము. అప్పుడు మీ పిల్లని పంపుతాను” అన్నది.

సరేననక తప్పలేదు. కారు, హోదా, దర్పం అన్ని ఉన్న సంబంధం. కావాలని చేశారు మరి.

***

కాలం మన కోసం ఆగదు. మరిది పెళ్లితో కొంత మార్పు వచ్చింది. తోటి కోడలు అతి ఆధునికం, అత్తగారికి లొంగలేదు. చెయ్యగల్గింది లేక వేరే ఇల్లు తీసుకుని వాళ్ళని వేరే పెట్టారు. పెద్ద కోడలు ఉత్తమురాలు అని నిర్ణయం చేసుకున్నారు. లిఖిత అత్తింటిలో మంచి పేరు తెచ్చుకున్నది. దానికి నానమ్మ ఎంతో సంతోష పడింది.

***

పుస్తకాలు చదివి డిగ్రీలు తెచ్చుకోవడం వేరు, జీవితాలు చదవడం వేరు. ఇది వాళ్ళ ఒక్క తెలివి మీద ఆధారపడదు. ఇంటిల్లిపాది మీద ఆధారపడి ఉంది. నానాటి బ్రతుకు నాటకము అని అన్నమయ్య శ్రీ వేంకటేశ అమృత కీర్తనలు జీవిత సత్యాన్ని తెల్పుతు ఎమ్మెస్ గళం నుంచి శ్రావ్యముగా వినిపిస్తున్నాయి.

లిఖిత గార్డెన్‌లో మొక్కలకి నీళ్ళు పెడుతూ, మల్లె మొగ్గలు కోస్తూ ఆనందంగా ఉంది. లిఖిత జీవితం బాగుండాలి అని మనమందరం కోరుకుందామా. ఎందరో ఈ తరం ఆడపిల్లలు తమ చదువు, వృత్తి అన్నీ కూడా కుటుంబవృద్ధి కోసం ధారపోసి, మంచి కుటుంబాలుగా తీర్చిదిద్దడం కోసం తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు.

చదువు చదువే. అత్తింటి భావాలు అత్తింటివారివే. మన భారతీయ మహిళ అన్ని దేశాల మహిళలకు ఆదరము అదర్శము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here