[dropcap]పి[/dropcap]ల్లంటే పిల్ల కాదు పెంకి పిల్ల
నా ఎంకి పిల్ల
ఒళ్ళసలు దాసుకోదు కొంటె పిల్ల
నా యింటి పిల్ల ॥పిల్లంటే॥
తొలిసుక్క పొడగానే నిద్రలేత్తది
కోనేటికి పోయి నీళ్ళు తెత్తది
వాకిలిని అద్దంలా తుడిసేత్తది
కల్లాపి సల్లి ముగ్గులెన్నో ఏత్తది ॥పిల్లంటే॥
ఎలుగుల దొర పనిలోకి రాగానే
తట్ట నెత్తిన బెట్టి పొలం పోతది
పచ్చగడ్డి దిట్టంగా కోసుకొత్తది
పాడావును తల్లిలా సూత్తుంటది ॥పిల్లంటే॥
కోపమొత్తె ముక్కు పుటాలెగరేత్తది
కోరికైతె కొంటె సూపు యిసిరేత్తది
తీరికుంటె కబురులెన్నా సెప్పేత్తది
తీయనైన మనసు నంత యిప్పేత్తది ॥పిల్లంటే॥