కలగంటినే చెలీ-6

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఏం[/dropcap]ట్రా విషయం.. నువ్వు తక్కువోడివి కాదురోయ్‌..” అంటున్నారు ఫ్రెండ్స్‌.

నవ్వాడు సూర్యం. “నా గురించి మొత్తం తెలిసిన మీరు కూడా అలా అంటే ఎలారా.. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నా చదువు సాగినట్టే ” అని సిగ్గు పడిపోయాడు

“అబ్బో… నీ సిగ్గు చిమడ… సరేలే.. ఆ అమ్మాయేదో ఊహించుకుని ఉంటుంది… ఆ విషయం మర్చిపోదాం” అనుకుని క్లాసుకి వెళ్ళిపోయారు.

క్లాసులవగానే రూముకొచ్చేసాడు సూర్యం. మాసిన బట్టలు చాలా అయిపోయాయి. ఉతుక్కోవాలి అనుకుని అవన్నీ ఒక బకెట్‌‌లో వేసుకుని కింద బావి దగ్గరకు వెళ్ళాడు. నీళ్ళు తోడుకుని బట్టలు తడిపి నెమ్మదిగా ఉతుక్కోసాగాడు. కాసేపటికి వచ్చిన వ్యక్తి ని చూసి కొంచెం కంగారు పడ్డాడు. వచ్చింది..రాధ!

“బ్రహ్మం రూములో ఉంటుంది మీరే కదా” అంది

“అవును.. నేనేనండీ..”

“చదువుకుంటున్నారా?”

“అవునండీ..”

“బ్రహ్మం నా గురించి ఎప్పుడూ చెప్పలేదా”

“లేదండీ..” అన్నాడు. చిన్నగా నిట్టూర్చింది. సూర్యం తొందరగా బట్టలు ఉతుక్కుని వెళ్ళిపోదామని చూస్తున్నాడు. కానీ ఆమె తన గురించి చెప్పుకోవాలని తాపత్రయపడుతోంది.

ఆమె చెప్పడం మొదలు పెట్టింది “నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మ నన్ను, అన్నయ్యను కష్టపడి పెంచి పెద్ద చేసింది. బోలెడంత కట్నం ఇచ్చి నాకు పెళ్ళిచేసారు. ఇక్కడికి దగ్గర్లోనే మా అత్తగారి ఊరు. వాళ్ళది కూడా చాలా సాధారణ కుటుంబం. నేనూ నా భర్తా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నా భర్తకు నేనంటే చాలా ప్రేమ. కానీ విధి నా మీద చిన్న చూపు చూసింది. నా భర్త ఒక ఏక్సిడెంట్‌‌లో చనిపోయాడు. ఆ తర్వాత అత్తగారి ఇంటిలో ఉండలేక వచ్చేసాను. మా అమ్మ కూడా నా పరిస్థితి చూసి దిగులుతో చనిపోయింది. అన్నయ్య నేను ఒంటరి వాళ్ళం అయిపోయాము.” వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏదో టీవీ సీరియల్‌ చూసిన ఫీలింగ్‌ కలిగింది సూర్యానికి. గుండె బరువెక్కిపోయింది. మూతి మీద మీసం కూడా ముదరని అతను ఆమెకు ఏమని చెప్పి ఓదార్చగలడు?

కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా అందుకే “పోనీ లెండి.. ఏం చేయగలం..” అన్నాడు. ఇంతలో రాధ అన్నయ్య బయటనుండి ఇంటికి రావడంతో ఆమె వెళ్ళిపోయింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు సూర్యం.

బట్టలు ఆరబెట్టి రూములోకొచ్చాక ఆలోచించసాగాడు. రాధ తనతో అవన్నీ ఎందుకు చెప్పింది. తనేం చెయ్యగలడు? ఏమో.. తన బతుక్కే దిక్కు లేదు. తిండికీ, షెల్టర్‌‌కీ బ్రహ్మం మీద ఆధారపడ్డాడు. బహుశా మనసులోని బాధను తగ్గించుకునే ఔట్లెట్‌ కోసం చెప్పి ఉంటుంది. ఏమిటో మనిషికో సమస్య… మనసుకో సమస్య!

పుస్తకాలు తీసి చదువుకోసాగాడు. కాసేపయ్యాక బ్రహ్మం వచ్చాడు. రాగానే అలసటగా చాప మీద వాలిపోయాడు.

“ఏంటన్నా.. బాగా అలసిపోయినట్టున్నావు?” అభిమానంగా అన్నాడు సూర్యం

“అవును రా… వర్క్‌ లోడ్‌ ఎక్కువయింది ఈ రోజు. కాసేపు పడుకుంటాను” అన్నాడు బ్రహ్మం. అతన్ని డిస్టర్బ్‌ చెయ్యకుండా నిశ్శబ్దంగా చదువుకోసాగాడు. రెండు గంటల సేపు పడుకుని లేచాడు బ్రహ్మం. ఈ లోగా కూరలు తరిగి పెట్టాడు సూర్యం. వెంటనే వంట చేసుకున్నారు. తృప్తిగా తిన్నారు.

కాసేపు చదువుకున్నాక నిద్ర ముంచుకొచ్చింది సూర్యానికి. “అన్నా.. నేను పడుకుంటాను” అని ముసుగు తన్నేసాడు. బ్రహ్మంకి నిద్ర రాకపోవడంతో పుస్తకం తీసి చదువుకోసాగాడు. అది సెక్స్‌ నవల. ఒక రచయిత్రి వ్రాసినది. నిజానికి ఇలాంటి పుస్తకాలు మగాళ్ళే వ్రాస్తారు. కానీ చదివే పాఠకుడి నరాల మీద ఆడుకోవడానికి ఆడవాళ్ళ పేరు వేస్తారు. స్త్రీ పురుషుల మధ్య అతి సహజంగా జరిగే సృష్టి కార్యాన్ని వర్ణించి వర్ణించి వ్రాసి అదేదో గొప్ప విషయం అన్నట్టు ఊహ కల్పిస్తారు. బ్రహ్మం లాంటి సామాన్యులు అవి చదివి వేడెక్కిపోతుంటారు. తప్పు దోవ పడతారు.

టైము అర్ధరాత్రి దాటింది. కాంపౌండ్‌‌లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. బ్రహ్మం లేచి నిశ్శబ్దంగా రూము బయటకు వచ్చాడు. మెట్లు దిగి బావి దగ్గరకు వచ్చాడు. అప్పటికే అక్కడ బావి వెనక చీకట్లో వెయిట్‌ చేస్తోంది రాధ. నెమ్మదిగా ఆమెను కౌగలించుకున్నాడు బ్రహ్మం. గువ్వలా ఒదిగిపోయింది. పెదాలు కలుసుకున్నాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్ద యుద్ధం మొదలైంది…శారీరక అవసరం తీరుతోంది…

సూర్యానికి మెలకువ వచ్చింది. పక్కన బ్రహ్మం లేడు. ‘టాయిలెట్‌’కి వెళ్ళాడేమో అనుకోలేదు సూర్యం. ఏదో సందేహం… లేచి రూము బయటకు వచ్చాడు. కింద బావి దగ్గర కదులుతున్న నీడలు. చురుగ్గా చూసాడు. ఆనవాలు పట్టాడు. బ్రహ్మం.. రాధ.. ఏదో మాట్లాడుకుంటున్నారు… నిశ్శబ్దంగా రూములోకి వచ్చేసాడు. దిండు కింద నుండి కనబడుతున్న బూతు పుస్తకం. చాప మీద పడుకొని ఆలోచించసాగాడు.

‘బ్రహ్మం అనే వ్యక్తి తనకు తాత్కాలిక స్నేహితుడు. ఎంసెట్‌ పరీక్ష అయ్యాక తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తనెవరో.. అతనెవరో.. అంత మాత్రం దానికి అతని జీవితంలోకి తొంగి చూడటం ఎంతవరకు అవసరం? అతడు తనకు చేసిన సహాయానికి తప్పకుండా ఋణం తీర్చుకుంటాడు.. అది వేరే విషయం. కానీ ఇప్పుడు చూసిన విషయం.. అతని వ్యక్తిగతం. అది తనకు అనవసరం. అందుకే తెలియనట్టు ఉండాలి. అయినా తన చదువు.. తన గమ్యం..ఇదే ఇప్పుడు ముఖ్యం. దట్సాల్‌.’

కాసేపటికి బ్రహ్మం వచ్చాడు. బూతు పుస్తకాన్ని తీసి లోపల దాచాడు. దుప్పటి కప్పుకుని నిశ్చింతగా నిద్ర పోయాడు. డిస్టర్బ్‌ అవడంతో సూర్యానికి నిద్ర పట్టడంలేదు. ఆలోచిస్తున్నాడు. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ ప్రపంచంలో పైకి కనబడని అలజడులు. ఇన్ఫేక్చుయేషన్‌.. ఎడాలసెన్స్…ప్రేమ…లస్ట్‌…ఒక వైపు!… ఆకలి… గమ్యం… బ్రతకడం.. ఒక వైపు! సూర్యం చిన్ని జ్ఞానంలో నుండి కనబడుతున్న పెద్ద ప్రపంచం. అతని ఊహకు అందని మాయా ప్రపంచం!

***

శనివారం సాయంత్రం..

కోచింగ్‌ సెంటర్‌ నుండి వచ్చి కూర్చున్నాడు సూర్యం. బ్రహ్మం కూడా ఆఫీసు నుండి తొందరగా వచ్చేసాడు. మర్నాడు ఆదివారం క్లాసులు లేవు సూర్యనికి. బ్రహ్మంకు ఎలాగూ సెలవు.

“ఏరా.. అలా బీచ్‌కు వెళదామా.. నీక్కూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది” అన్నాడు బ్రహ్మం.

సూర్యానికి కూడా వెళ్ళాలి అనిపించింది. “అలాగే అన్నా..” హుషారుగా అన్నాడు. ఇద్దరూ ఫ్రెష్‌గా రడీ అయి ఆర్‌.కె బీచ్‌కి వెళ్ళారు. బీచ్‌ పొడుగునా జనం. పిల్లలు… పెద్దలు.. వృద్ధులు.. తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు…

బీచ్‌కి రావడం ఇదే మొదటిసారి సూర్యంకి. బాగా సంతోషపడిపోయాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు… దూరంగా సముద్ర ఉపరితలం మీద ఆగి ఉన్న పెద్ద పెద్ద మర్చెంట్‌ షిప్‌లు.. సర్ఫింగ్ చేస్తున్న బోట్‌లు.. సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఎత్తైన కొండలు.. ఎంత అద్భుత వాతావరణం! అందుకే దేశంలోని ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తుంటారు టూరిస్టులు.

“ఏరా.. పల్లీలు తింటావా” అంటూ పది రూపాయలవి కొని ఇచ్చాడు బ్రహ్మం. అవి తింటూ వచ్చీ పోయే జనాలని చూస్తున్నాడు సూర్యం. ఇంతలో ఒక జంట కనిపించారు. వాళ్ళని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. గబ గబా వెళ్ళి “మావయ్యా..” అని పిలిచాడు. ఆ జంట ఆగి వెనక్కి తిరిగి చూసి “ఒరేయ్‌ సూరీడు.. బాగున్నావా.. ఇక్కడున్నావేంటి” అని పలకరించారు.

“బాగున్నాను మావయ్యా…ఇక్కడే ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాను” అన్నాడు “వెరీ గుడ్‌ రా.. బాగా చదువుకో మరి”

“అలాగే మావయ్యా….తప్పకుండా” అన్నాడు సూర్యం. అతని మావయ్య పక్కనే ఉన్న ఐస్‌ క్రీం బండి దగ్గరకు వెళ్ళి ఒక కోన్‌ ఐస్‌ క్రీం తెచ్చి “తిను సూర్యం” అని ప్రేమగా ఇచ్చాడు. ఇష్టంగా తినసాగాడు సూర్యం.

“ప్రస్తుతం ఎక్కడుంటున్నావు రా” అని అడిగాడు.

సూర్యం బ్రహ్మాన్ని చూపిస్తూ “ఇతను నా ఫ్రెండ్‌ మావయ్యా… మేమిద్దరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెనకాల ఉన్న కోలనీలో ఉంటున్నాము.” అని చెప్పాడు.

“మంచిదేరా.. మీ నాన్న లాంటి మొండోడిని ఒప్పించి బాగానే వచ్చావు ఇక్కడికి. శుభ్రంగా చదువుకో.. మంచి రేంక్‌ రావాలి” అన్నాడు. మనసంతా అదోలా అయింది సూర్యానికి. తల్లిదండ్రులు గుర్తొచ్చారు. “సరేరా.. ఎప్పుడైనా మా ఇంటికి రా..” అని ఎడ్రస్‌ చెప్పాడు. వెళ్తూ వెళ్తూ ఒక అయిదు వందల నోటు సూర్యం చేతిలో పెట్టాడు. ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూర్యానికి.

అప్పటి దాకా మౌనంగా గమనిస్తున్న బ్రహ్మం “ఎవరు సూర్యం వాళ్ళు” అని అడిగాడు.

“మా ఊరి వాళ్ళు. మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు. ఇక్కడ పోర్ట్‌లో జాబ్‌ చేస్తున్నాడు ఆయన. చిన్నప్పటి నుండీ మావయ్య అని పిలుస్తుండేవాడిని. అప్పుడప్పుడు మా ఊరు వస్తుంటారు. ఆ రోజు పండగే. అందరూ వాళ్ళని హీరో హీరోయిన్‌లా చూస్తుంటారు. పట్నం విషయాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు.”

“ఆహా.. సరే.. పద సబ్‌మెరైన్‌ చూద్దాం” అన్నాడు బ్రహ్మం. ఇద్దరూ నడుచుకుంటూ సబ్‌మెరైన్‌ దగ్గరకు వెళ్ళారు. అది ఒక పాత సబ్‌మెరైన్‌. సందర్శకుల కోసం దాన్ని అక్కడ పెట్టి ఉంచారు నేవీ వాళ్ళు. ఘాజీ సినిమా దర్శకుడికి ఆ సబ్జెక్ట్‌ మీద్‌ సినిమా తియ్యడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది అదే సబ్‌మెరైన్‌. చూడ్డానికి నల్లగా పొడుగ్గా ఉంది. కానీ వెడల్పు తక్కువ.

కౌంటర్‌లో టికెట్‌ తీసుకుని లైన్‌లో నిలబడ్డారు. కాసేపటికి లోనికి పంపించాడు అక్కడి గార్డ్‌. అద్భుతంగా ఉంది లోపల. పొడుగ్గా ఉన్న సబ్‌మెరైన్‌ లోపల చాలా నేరో కారిడార్‌ ఉంది. దానికిరువైపులా అందులోనే ఎన్నో కంపార్ట్మెంట్‌లు. క్రూ ఉండటానికి అవసరమైన చిన్న చిన్న కేబిన్‌లు. కిచెన్‌.. టాయిలెట్‌.. లాంటివి. సబ్‌మెరైన్‌ని నడిపించే ఎలెక్ట్రానిక్‌ సర్క్యూటరీ…ఇంజన్‌..అన్నీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ప్లేస్‌ ఆప్టిమైజేషన్‌ టెక్నిక్‌తో అన్నీ చక్కగా డిజైన్‌ చెయ్యబడ్డాయి. ఇంకా సబ్‌మెరైన్‌ కింది భాగాన అమర్చిన ‘టోర్పెడో’లు. శతృవుల షిప్‌లని ధ్వంసం చెయ్యడానికి ఏర్పాటు చేసుకున్న రక్షణ ఆయుధం అది. నిజంగా ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్‌కి లోనయ్యాడు సూర్యం. అదంతా ఒక ఇంజనీరింగ్‌ వండర్‌ అని అర్థమైంది. ఎంసెట్‌లో మంచి రేంక్‌ తెచ్చుకుని ఇంజనీరింగ్‌ లోకి ప్రవేశించాలి అన్న కోరిక మరింత బలపడింది. మనం పోజిటివ్‌గా ఉంటే ఇన్స్పిరేషన్‌ ఏ దిశ నుండైనా వస్తుంది అన్న దానికి నిదర్శనం అది.

“చాలా థేంక్స్‌ అన్నా” బయటకు వస్తూ బ్రహ్మంతో అన్నాడు సూర్యం.

“సరే గానీ.. ఆకలేస్తోంది ఏదైనా తిందామా”

“తిందామన్నా.. పద” అన్నాడు సూర్యం జేబు లోని అయిదు వందల నోటు తడుముకుంటూ. బీచ్‌ రోడ్డుకి అటు వైపు ఉన్న ఓపెన్‌ రెస్టారెంట్‌ లోకి వెళ్ళారు. స్టైల్‌గా కూర్చుని “రెండు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌” ఆర్డరిచ్చాడు బ్రహ్మం.

కాసేపట్లో సర్వర్‌ ఫ్రైడ్‌ రైస్‌ తీసుకొచ్చాడు. ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసుకుంటూ తినసాగారు. వింత అనుభూతికి లోనయ్యాడు సూర్యం. ఇటువంటి లైఫ్‌ స్టైల్‌ సూర్యానికి కొత్త. పొద్దున్న లేచి చద్దన్నం తిని కాలేజీకి వెళ్ళి వచ్చి ఇంట్లో వండిన అన్నం కూర తినడం.. ఇదే అతనికి తెలిసినది. పార్క్‌లకు.. రెస్టారెంట్లకు వెళ్ళడం.. ఎంజాయ్‌ చెయ్యడం అన్నవి అతనికి అందుబాటులో లేని విషయాలు.

తినడం అయ్యాక ఇద్దరూ బీచ్‌ రోడ్‌లో నడవసాగారు. జనసాంద్రత నెమ్మదిగా తగ్గసాగింది. రోడ్డు పైన వాహనాలు రివ్వురివ్వున సాగిపోతున్నాయి. సాగరుడు చేస్తున్న శబ్దం మరింత స్పష్టంగా వినపడుతోంది. సముద్రం లోపల ఎక్కడో ఆగి ఉన్న షిప్‌లో లైట్లు డిమ్‌గా కనబడుతున్నాయి. “సినిమాకి వెళ్దామా” అన్నాడు బ్రహ్మం.

“వద్దన్నా.. పద రూముకి వెళ్ళిపోదాం” అన్నాడు సూర్యం.

“పర్లేదు లేరా..రేపు ఎలాగూ సెలవే కదా..”

“లేదన్నా చదువుకునేది ఉంది..” నసిగాడు సూర్యం. కానీ మనసులో సినిమాకి వెళ్ళాలనే ఉంది. “ఏం కాదు లేరా..” అని రోడ్డుపైన వెళ్తున్న ఆటోని ఆపి “..రంభ థియేటర్‌కి పోనీ” అన్నాడు బ్రహ్మం. ఆటోఅతను అదోలా చూసి “ఎక్కండి” అన్నాడు. పది నిముషాల్లో థియేటర్‌ ముందు ఆగింది ఆటో. ఇద్దరూ దిగారు. బయట ఉన్న వాల్‌ పోస్టర్‌ చూసి అదిరిపోయాడు సూర్యం. ‘సీక్రెట్‌ ఎఫైర్స్‌’ అన్న డబుల్‌ ఎక్స్‌ ఇంగ్లీస్‌ సినిమా ఆడుతోంది అందులో. బ్రహ్మంకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. మొబైల్‌లో బూతు సినిమాలు చూస్తాడు కానీ ఇలా పెద్ద స్క్రీన్‌ మీద చూడటం అదో థ్రిల్‌ అతనికి. “నేను రాను అన్నా.. ” భయంగా అన్నాడు సూర్యం. “ఇలాంటి సినిమాలు నాకు ఇష్టం లేదు.”

“అబ్బ.. ఒక్కసారి చూస్తే ఏమీ కాదులేరా…రా..” అంటూ బలవంతంగా లాక్కెళ్ళాడు. అనుసరించడం తప్పలేదు. నిజానికి సూర్యం మనసులో కూడా ఆ సినిమా చూస్తే బాగుండును అని ఉంది. కానీ ఏదో భయం. చూస్తే పాడయి పోతానేమో అన్న భయం… కానీ.. చూడకపోతే ఆనందాన్ని మిస్‌ అవుతానేమో అన్న సందిగ్ధత.

సినిమా స్టార్ట్‌ అయింది. ‘వయసులో ఉన్న ఒక గృహిణి. భర్త ఎక్కడో వేరే ఊళ్ళో జాబ్‌ చేస్తూ ఉంటాడు. వారానికి ఒకసారి ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆమెకు సెక్స్‌ కోరికలు ఎక్కువ. భర్త ఊళ్ళో లేని సమయంలో స్నేహితుల సహాయంతో వేరే మగాళ్ళతో సుఖం పొందుతూ ఉంటుంది.’ ఇదే కథ. మొదటి సీన్‌ నుండీ ఆమెను నగ్నంగా చూపించారు. సినిమా నిండా బోలెడంత నగ్నత్వం. చూస్తున్న సూర్యానికి నరాల్లో సంచలనం కలుగుతోంది. శరీరంలో వస్తున్న మార్పు.. ఇబ్బంది.. తెలుస్తోంది. కానీ ఆ అనుభూతి తియ్యగా ఉంది. శరీరం తేలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏదో కావాలి అనిపిస్తోంది. అలా ఊహల్లో ఉండగానే సినిమా అయిపోయింది. లైట్లు వెలిగాయి. సిగ్గుపడి బ్రహ్మం వైపు చూడలేకపోయాడు. ఆటో ఎక్కి రూముకి వచ్చేసారు.

చదువుకుందామనుకున్నాడు కానీ దృష్టి కుదరలేదు. బ్రహ్మం నిద్రకుపక్రమించాడు. సూర్యం కూడా చాప మీద వాలిపోయాడు. నిద్ర రావడం లేదు. బ్రహ్మం పెడుతున్న గురక సన్నగా వినపడుతోంది. ఏదో అసహనం.. ఏదో అలజడి… బయటపడాలి. అప్రయత్నంగా అతడి చేతులు కదిలాయి. తొలిసారిగా అతను మస్టర్‍బేషన్ చేసుకున్నాడు. తర్వాత ప్రశాతంగా నిద్రపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here