జీవన రమణీయం-171

2
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]స[/dropcap]రే, ఆ రోజు రానే వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బోలెడు మంది కెమెరామెన్‌లు, కెమెరా కన్నుల విందు కాకుండా వాళ్ళ కళ్ళతో చూస్తూ కనుల విందుగా వున్నారు ఎయిర్‍పోర్ట్ నిండా. బోలెడు కన్‌ఫ్యూజన్ తర్వాత చంద్ర సిద్ధార్థా, నేనూ, వీరూ పోట్లా, హరి అనుమోలు, సమీర్ రెడ్డీ… ఇంకా చాలామంది ప్రముఖ సినీమాటోగ్రాఫర్స్ ఫ్లయిట్ ఎక్కారు.

సినెమాటోగ్రాఫర్లు హరి అనుమోలు, సమీర్ రెడ్డి గార్లతో రచయిత్రి

మలేషియాలో పెద్ద హోటల్ ఇచ్చారు బసకి. రూమ్స్ అలాట్‍మెంట్ దగ్గర నా కళ్ళు తిరిగిపోయేడంతమంది హిందీ సినిమా ఏక్టర్లూ, తెలుగు సినిమా ఏక్టర్లూ, తమిళ్‌లో రామన్, మనోబాలా, కుట్టి పద్మినీ, శ్రీప్రియా, నళినీ, ఇంకా చాలామంది. హిందీలో అప్పుడప్పుడే వస్తున్న ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్, జావేద్ జాఫ్రీ, సునీల్ గ్రోవర్… పాటలు పాడే గాయకులూ, కొరియోగ్రాఫర్స్… అస్సలు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఫొటో తీసుకోవాలో తెలియలేదు.

జావేద్ జాఫ్రీతో రచయిత్రి (వెనుక వరుసలో రాజ్ కుమార్ రావు, దివ్యదత్తలను చూడవచ్చు)

ముందు అందరం హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్ చేసాం. అప్పుడే నేను దోశ కోసం వెళ్తే, అప్పటికే ప్లేట్ పట్టుకుని వున్న అబ్బాయి పక్కకి జరిగి, “ఆప్ పహలే మేమ్” అన్నాడు. అతన్ని చూడగానే నేను ఆనందంగా ‘గుత్తీ!’ అని కేక పెట్టాను. అప్పట్లో కపిల్ షో లో సునీల్ గ్రోవర్ ‘గుత్తీ’గా ఆడవేషం వేసేవాడు. ఇప్పుడు కామెడీ విత్ కపిల్ లో డాక్టర్ గులాటీగా వేస్తున్నాడు. అతను నవ్వాడు. ఇద్దరం ఫొటో తీసుకున్నాం.

సునీల్ గ్రోవర్‌తో రచయిత్రి

నళినీ గారు గుర్తు పట్టి ఆప్యాయంగా మాట్లాడారు. ఆవిడ అందరినీ “లేదు నాన్నా, కాదురా” అనే మాట్లాడ్తారు. లేత మనసులులో కుట్టీ పద్మినీ, ఆమె భర్త, కూతురు కూడా వచ్చారు. ‘యువరాణి’ అని పిన్ని సీరియల్‍లో నటించినావిడా, ‘ఆలూమగలూ’ అనే టీవీ సీరియల్‍లో నటించిన, నాకు ఇష్టమైన కమేడియన్, అందరికీ ఇష్టమైన, రమణారెడ్డికి దగ్గర పోలికలతో వుండే మనోబాలా…. చాలామందితో మాట్లాడాను.

తర్వాత రూమ్స్ అలాట్ అయ్యాయి. మా రవికుమార్ అనే కన్‍ఫ్యూజన్ మాస్టర్ మాకు అందరికీ ప్రోగ్రాం చెప్పాడు. నేనూ చంద్రసిద్ధార్థా ఫోన్ చేయడానికి కాలింగ్ కార్డ్స్ కొనుక్కున్నాం. మగాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీ బాటిల్స్ కొనుక్కున్నారు కాబట్టి, రూమ్స్ లోకి వెళ్ళి బిజీ అయిపోయారు.

నేనూ, హరి అనుమోలు గారు, సమీర్ రెడ్డి గారూ దగ్గర్లో ఉన్న షాపింగ్ మాల్‍కి వెళ్ళొచ్చి, లంచ్ చేసి, హోటల్ లో రూమ్‍కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం.

సాయంత్రం ప్రోగ్రాం టైంకి మేం తయ్యారు అయ్యాం. “నువ్వు లంచ్ చేసింది కదా, శ్రీగ్రం వచ్చింది సాయంత్రం…” అంటూ హడావిడిగా ఎవర్తోనో మాట్లాడ్తూ రవి కారిడార్‌లో కనిపించాడు. “మనోబాలా, ఆ ట్రూప్ వచ్చింది ఈ బస్‍ల…” అని ఇతను ఆర్గనైజ్ చేస్తుంటే, వాళ్ళు వెళ్ళిపోయారు బస్‌లో అనుకొని, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు.

సినెమాటోగ్రాఫర్ హరి అనుమోలు గారితో రచయిత్రి

ఒక కెమెరామాన్ వచ్చి “‘మార్నింగ్ నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసిందిగా… పో!’ అని నన్ను మధ్యాహ్నమే వెన్యూకి పంపేసాడు. అక్కడ గడ్డి కూడా దొరకలేదు. నేను వెనక్కొచ్చేసరికీ, ఇక్కడా లంచ్ లేదు” అని దిగాలుగా చెప్పాడు.

మరునాడు ఇంకా పెద్ద ప్రోబ్లమ్స్ క్రియేట్ చేసాడు.

“నిన్న నీది సన్మానం అయింది, రేపు నీది పేరు పిలిచారు” అంటే, వాళ్ళ సన్మానం అయిపోయింది అనుకుని కొంతమంది పేర్లు సన్మానింపబడ్డ వాళ్ళ లిస్ట్‌లో వేసేసారు. రెండు రోజులూ వాళ్ళకి సన్మానం జరగలేదు! కొంతమందిని రెండు రోజులూ పిలిచి సన్మానించారు… ఈ విధంగా ప్రెజెంటెన్స్‌ని పాస్టెన్స్‌గా, పాస్టెన్స్‌ని  ప్రెజెంటెన్స్‌గా మారుస్తూ, కాలచక్రంతో విష్ణుచక్రం ఆట ఆడ్తూ రవి బిజీగా తిరిగాడు.

ఆహ్వానితులను ఆడిటోరియంకి తీసుకువెళ్ళిన బస్సు

మా అవస్థలు మేం పడ్తూ వుండగా, ఇతను రాత్రి మా డైరక్టర్స్ మందు వేసుకుంటుండగా, ఓ లిమ్కా బాటిల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరకి ‘ఛీర్స్’ అంటూ విస్కీ బాటిల్‌కి కొడ్తే, అది భళ్ళున బద్దలయిందట!

ఇతన్ని పక్కన పెడ్తే అక్కడ ఆడిటోరియం చూడ్డానికి కళ్ళు సరిపోలేదు! అంత అందంగా అలంకరించారు. జ్యూరీ మెంబర్స్‌గా మమ్మల్ని చాలా గౌరవించారు. అతిరథ మహారథులొచ్చారు. కమల్‌హాసన్, సూర్యా, కార్తీ, మమ్ముట్టీ, దుల్కర్ సల్మాన్, అజిత్, సిమ్రాన్, తాప్సీ, జేసుదాస్, అతని కుమారుడు విజయ్, ఎస్.పి.బీ, చిత్ర… రెండో రోజు ముఖ్య అతిథిగా మన హీరో బాలకృష్ణ వస్తుంటే ఆడిటోరియం అంతా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది. అప్పుడు మాత్రం ఏంకరింగ్ చేస్తున్న మనోబాలని పక్కకి పెట్టి తెలుగులో నేను అవార్డీస్‌ని, మన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచాను. బాలకృష్ణ గారు నన్ను బాగానే గుర్తు పడ్తారు. నా ఫస్ట్ సినిమా ‘రేపల్లెలో రాధ’కి ప్రొడ్యూసర్.

బస్‍లో మేం ఆడిటోరియంకి వెళ్తుంటే మా పక్కన ‘బీరువా’ హీరోయిన్ పిల్ల సురభీ, వాళ్ళమ్మా కూర్చున్నారు. హరి అనుమోలు గారు “అమ్మా నీ పళ్ళు ఎల్లోగా వున్నాయి… ఎందుకంటే నువ్వు చాలా ఫెయిర్ కాబట్టి, అలా కనిపిస్తున్నాయి… కెమెరాలో కవర్ చెయ్యలేము, జాగ్రత్త తీసుకో” అని చెప్పారు. జూ.ఎన్.టి.ఆర్, ప్రభాస్… ఇలాగ కొన్న పేర్లు చెప్పారు, ఫస్ట్ పిక్చర్‌కి తనని కెమెరామాన్‍గా పెట్టుకొంటే, పైకి వస్తారని సెంటిమెంట్ వుందని ఇండస్ట్రీలో.

SICA ట్యాగుతో రెండవ రోజు కార్యక్రమంలో రచయిత్రి

నళినీగారు ఈ వయసులో ‘సూపర్ మచ్చా’ డాన్స్ చేసారు. ఆశ్చర్యపోయాను, అంత బాగా చేసారు. ఒకప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ కదా ఆవిడ! ఏసుదాస్ గారి అబ్బాయి విజయ్ ఏసుదాస్ చూడ్డానికి అందంగానే కాదు, అద్భుతంగా పాడాడు. చాలామంది తమిళ్ టీవీ ప్రముఖులు డాన్స్ చేసారు.

నా పక్కన కూర్చుని జోక్స్ వేస్తూ, విజిల్స్ వేస్తున్న అతను ‘సముద్రఖని’ అని పిలవగానే స్టేజ్ మీదకి వెళ్తుంటే ఆశ్చర్యపోయా. తిరిగి వచ్చాకా చెప్పా, “మీ మర్మదేశం టీవీ సీరియల్ నాకు చాలా ఇష్టం” అని. అప్పుడు అతను దర్శకుడు. తర్వాత తమిళ, తెలుగు సినిమాలలో పెద్ద నటుడయ్యాడు. ‘శంభో శివ శంభో’, ఈ మధ్య వచ్చిన ‘అల వైకుంఠపురం’లో విలన్‌గా, చూసే వుంటారు.

భోజనాలు అక్కడ చెయ్యకుండా మేము బయటకొచ్చి హోటల్‍లో చేసాం. మలేషియాలో మన ఫుడ్‍కి ప్రోబ్లమ్ వుండదు. బోలెడన్ని తమిళ్ హోటల్స్, నార్త్ ఇండియన్ కుయిజిన్స్ వుంటాయి. ఇంకోటి, రోజూ ఫుడ్ ఇన్‍స్పెక్షన్ అవుతుంది. ఒక సింగిల్ కంప్లయింట్ వెళ్ళినా, పర్మనెంట్‍గా అతని లైసెన్స్ కేన్సిల్ అవుతుంది. సరదాగా ట్రెయిన్ ఎక్కి మా హోటల్‌కి వెళ్ళాం. అద్భుతంగా వుంటాయి ట్రెయిన్స్.

మలేషియాలో సైకా (SICA) అవార్డ్స్‌కి నేను వెళ్ళడం, ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటాను నేను.

అసలే కన్‍ఫ్యూజ్ చేసే మా మేనేజర్ రవికి, నేను మరింత బ్రెయిన్ టీజర్స్ ఇస్తుంటాను. ఇండోనేషియాలో మా బాబాయ్ కూతురు లావణ్య వుంటుంది. నేను ఇండియా లోంచే “నీ దగ్గరకి ఫలానా రోజు, ఫలానా ఫ్లయిట్‌లో మలేషియా నుండి జకార్తా వస్తాను” అని చెప్పాను. ఆ టికెట్ మా ట్రావెల్ ఏజంట్ గణేష్ బుక్ చేసాడు. కాబట్టి రవికి ఏం ప్రోబ్లమ్ లేదు. కానీ ఇండోనేషియా జకార్తా నుండి ఇండియాకి సంక్రాంతి పండుగ అయ్యాకా, 13, 14, 15, 16 అక్కడ వుండి 17thకి బుక్ చెయ్యమన్నాను కదా! అతనికి బ్రెయిన్ వూడి పడిపోయినంత పనయిపోయింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here