నా జీవన గమనంలో…!-31

47
3

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

57

[dropcap]ఆ[/dropcap] రోజే ఫంక్షన్. రాత్రికి మా నాటిక ప్రదర్శన. ఆఫీసుకు శలవు పెట్టి ఉదయాన్నే తెనాలి వచ్చాను. వేదిక పైకి కావలసిన వస్తువులను, నటీనటుల దుస్తులు, ఇతర అలంకరణ సామాగ్రిని సమకూర్చుకున్నాము. మేకప్ ఆర్టిస్ట్‌కి పాత్రోచితంగా మేకప్ వేయడంలో సూచనలిచ్చాను. తయారైన స్టేజిపైన, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ ఆర్కెష్ట్రాతో సహా, మధ్యాహ్నం రెండు గంటలకు ఫైనల్ రిహార్సల్స్ చేశాము.

ఫంక్షన్ సాయంత్రం ఆరు గంటలకు. మా నాటిక రాత్రి 8 గంటల 45 నిమిషాలకి. ప్రార్థనా గీతంతో ప్రారంభమయింది. రాత్రి గం. 9.30 ని. కి పూర్తయింది. నెమ్మదిగా తెరపడింది. అంతే…!

ఒక్కసారిగా చప్పట్లు మిన్నుముట్టాయి. ఛైర్మన్ శరత్‌బాబు గారు స్టేజి పైకి వచ్చి నటీనటులందర్నీ అభినందించారు. నా దగ్గరకొచ్చి, పట్టరాని ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నారు. నా కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు జాలువారాయి.

తరువాత చాలామంది నా దగ్గరికొచ్చి, నన్ను అభినందనలతో ముంచెత్తారు. ఆ అభినందనల వెల్లువలో, నేను పడ్డ శ్రమ, కష్టం అన్నీ కొట్టుకుపోయాయి. అప్పుడు నేను అనుభవించిన సంతోషాన్ని, సంతృప్తిని మాటలతో వర్ణించలేను.

చివరిగా, ముఖ్య అతిథిగా హాజరయిన ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ శ్రీ శివశంకరం గారి చేతుల మీదుగా నటీనటులకు, నాకు మెమెంటోలను బహుకరించారు.

నాటికలో నటులతో రచయిత. ఎడమ నుండి కుడికి 1) శ్రీ కృష్ణారావు గారు 2) శ్రీ నాగేంద్ర రావు గారు 3) శ్రీ ప్రసాద్ గారు 4)రచయిత 5) శ్రీ ఉమామహేశ్వరరావు గారు 6) శ్రీ వెంకటేశ్వర్లు గారు
రచయితకు మెమెంటోను బహుకరిస్తున్న ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ శ్రీ శివ శంకరం గారు
ఎడమ నుండి కుడికి 1. ఆంధ్రా బ్యాంకు ఎ.జి.యమ్. శ్రీ రామబ్రహ్మం గారు 2. రచయిత 3, 4, 5, 6, 7- నాటికలో నటించిన నటులు 8. ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ శ్రీ శివ శంకరం గారు 9. ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీ వీరభద్రరావు గారు 10. చైతన్య గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ శ్రీ శరత్‌బాబు గారు

ముగింపుగా నటీనటులందరితో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాను. వాళ్ళంతా నా అంచనాలకి మించి, పాత్రలలో లీనమై నటించారు. వాళ్ళందరికీ మనసారా అభినందనలు తెలిపాను. అందరి దగ్గర శలవు తీసుకుని నిడుబ్రోలు బయలుదేరాను.

58

పాత బకాయిల వసూళ్ళకై మేము అనుకున్న స్ట్రాటజీని యథాతథంగా అమలు చేశాము. తత్ఫలితంగా ఈ రికవరీ సీజన్‍లో అనూహ్యమైన ఫలితాలు సాధించగలిగాము.

జనవరి ఫిబ్రవరి నెలల్లో వసూళ్ళు 1.60 లక్షల రూపాయలు; ఫిబ్రవరి మార్చి నెలల్లో వసూళ్ళు 6.90 లక్షల రూపాయలు; ఏప్రిల్ మే నెలల్లో వసూళ్ళు 10.20 లక్షల రూపాయలు; జూన్ నెలలో వసూళ్ళు 15.88 లక్షల రూపాయలు. మొత్తం 34.58 లక్షల రూపాయలు.

ఏమైతేనేం, పాత బకాయిలను గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి తీసుకురాగలిగాము.

వసూళ్ళు చేయగా మిగలిన పాత బకాయిలను బ్యాంకు ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ఇన్‌వోక్డ్ అక్కౌంట్స్ ఖాతాకి బదలాయించాము.

మా రికవరీ స్ట్రాటజీ విజయవంతమై ఆశించిన ఫలితాలు సాధించినందుకు గాను, మా బ్యాంకు ప్రధాన కార్యాలయం నన్నూ, మా బ్రాంచి సిబ్బందిని అభినందిస్తూ ఒక పత్రం పంపింది. దాని సారాంశం… క్లుప్తంగా…

“బకాయిల వసూళ్ళలో మీ బ్రాంచి సాధించిన మంచి ఫలితాలను చూశాము.

ఇది కేవలం పక్కా ప్రణాళికతో, నిరంతరంగా బకాయిదారులకు నచ్చచెప్పడం వల్లే సాధ్యమయ్యుంటుంది. వీటికి తోడు మీ సిబ్బంది అందించిన సంపూర్ణ సహాయ సహకారాలు, మీ ప్రయత్నాలకు బలం చేకూర్చి వుంటాయి.

ఈ రికవరీ సీజన్ మొదలైనప్పటి నుండి, మీ బ్రాంచి మేనేజర్, మిగతా సిబ్బంది, బకాయిల వసూళ్ళలో చూపించిన శ్రద్ధాసక్తులకు, సఫల యత్నాలకు గాను, మిమ్మల్నందరినీ మిక్కిలిగా అభినందిస్తున్నాము.

భవిష్యత్తులో కూడా బకాయిల వసూళ్ళలో ఇదే ఉరవడిని, ఉత్సాహాన్ని కొనసాగించవలసినదిగా మీకు సలహా ఇస్తున్నాము.”

మా రికవరీ స్ట్రాటజీ విజయవంతమై, మా అందరి కృషి వల్ల మంచి ఫలితాలను సాధించామన్న సంతోషం కన్నా…, మా ప్రధాన కార్యాలయం మా శ్రమను గుర్తించి, మమ్మల్నందర్నీ, ఎంతగానో అభినందించినందుకు, ఎంతో తృప్తిగా అనిపించింది. తదనుగుణంగా రెట్టింపైన ఉత్సాహంతో, భవిష్యత్ కార్యాచరణకు కార్యోన్ముఖులయ్యాము.

59

ఈ సంవత్సరం జరిగిన ఇంటర్నల్ ఆడి‌ట్‌లో మా బ్రాంచి మంచి గ్రేడ్ సాధించింది. తదుపరి మా బ్రాంచి రెవెన్యూ ఆడిట్ చేసేందుకు, కారుమంచి అసోసియేట్స్, ఛార్టర్డ్ అకౌంటెంట్స్‌కి కేటాయించారు. ఆడిటర్స్ ఆడిట్ పూర్తి చేసి, తమ నివేదికను మా ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. ఆ నివేదికని పరిశీలించిన మీదట, మా బ్రాంచిలో ఏ పద్దుల క్రిందా రెవెన్యూ లీకేజ్ లేనేలేదని, తేటతెల్లమైంది. అందులకు గాను, మా ప్రధాన కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయం, నన్ను, మా సిబ్బందిని ప్రశంసిస్తూ లేఖలు పంపాయి.

రెవెన్యూ లీకేజ్ గురించి చెప్పాలంటే… ప్రతీ బ్రాంచిలో అకౌంట్స్ లెక్కలు కట్టేటప్పుడు అక్కడక్కడా కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. ఉదాహరణకు:

  • డిపాజిట్ల ఖాతాలపై వడ్డీ రేట్లను అనుసరించి వడ్డీ లెక్క కట్టేటప్పుడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం.
  • అప్పు ఖాతాలపై వడ్డీ రేట్లను అనుసరించి వడ్డీ లెక్క కట్టేటప్పుడు, తీసుకోవాల్సిన దానికంటే తక్కువగా తీసుకోవడం.
  • డ్రాఫ్టులు, పే ఆర్డర్‌లపై తీసుకోవాల్సిన ఛార్జీల కంటే తక్కువ తీసుకోవడం.
  • ఇతర పట్టణాల్లోని బ్యాంకుల ఖాతాదారుల చెక్కులు తాలూకు డబ్బును, మన బ్యాంకు ఖాతాదారుల కోసం వసూలు చేసి పెట్టేందుకు నిర్ధారిత ఛార్జీల కంటే తక్కువ తీసుకోవడం.
  • ఖాతాదారులకు లాకర్ల సౌకర్యం కల్పించినప్పుడు, లాకర్ల సైజును బట్టి, వసూలు చేయాల్సిన సంవత్సర ఛార్జీలను వసూలు చేయాల్సిన దానికంటే తక్కువగా చేయడం.
  • ఖాతాదారులకు అందించే ఇతర సేవలపై వసూలు చేయవలసిన ఛార్జీలకంటే తక్కువగా చేయడం.

సిబ్బంది ఎవరూ, బ్యాంకుకు రావలసిన రాబడిని తక్కువ చేయాలని కోరుకోరు. కాని పని భారం వల్లో, పని ఒత్తిడి వల్లో అక్కడక్కడా పొరపాట్లు చేయడం మానవ సహజం కదా!

వాస్తవానికి ఒక బ్రాంచిలో అలా రెవెన్యూ ఆడిట్ ద్వారా కనుగొనబడే రాబడి, మొత్తం రాబడితో పోల్చి చూస్తే, చాలా తక్కువగానే వుంటుంది.

ఆకాశం నుండి కిందకి రాలి పడే చిన్న చిన్న నీటి బిందువులు కలిస్తేనే వర్షపు నీరుగా తయారవుతుంది. ఆ నీరే ఏరులై పారుతుంది. ఆ నీరే నదులై పరిగెడుతుంది.

అలాగే ప్రతి బ్రాంచిలో రెవెన్యూ ఆడిట్ ద్వారా కనుగొనబడే చిన్న మొత్తాలే, బ్యాంకు మొత్తంగా చూస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది.

ఆ కోణంలోనే బ్యాంకింగ్ వ్యవస్థలో ‘రెవెన్యూ ఆడిట్’ అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

60

1988 సంవత్సరం.

ఆంధ్రా బ్యాంకు మొట్టమొదటిసారిగా ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ ప్రవేశపెట్టింది. ఆ కార్డు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఉదాహరణకు – రామయ్య అనే రైతుకు పంట పెట్టుబడి కోసం, స్వల్పకాలిక ఋణం, అంటే క్రాప్ లోన్ ₹ 20,000/- ఒక బ్రాంచి మంజూరు చేసింది… అనుకుందాం. అందులో ₹ 5,000/- డబ్బు రూపేణా, వ్యవసాయ ఖర్చుల నిమిత్తం ఇస్తారు. మిగతా ₹ 15,000/- లకు సరిపడా ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ ఇస్తారు. రామయ్య ఆ కార్డుతో ఎరువుల దుకాణాలు, క్రిమి సంహారక మందుల దుకాణాలు, మరియు విత్తనాలను విక్రయించే దుకాణాల దగ్గరకు – ఎరువులను, క్రిమి సంహారక మందులను, విత్తనాలను కొనుగోలు చేయడానికి వెళ్తాడు. తన కవసరమైన మేరకు వాటిని కొనుగోలు చేస్తాడు. ₹ 15,000/- లకు ఒకేసారి కొనుక్కోవలసిన అవసరం లేదు. ఏ రోజుకెంత అవసరమో అంత కొనుగోలు చేయవచ్చు. రెండు మూడుసార్లుగా కూడా కొనుక్కోవచ్చు. కార్డు తాలూకూ పాస్‍బుక్‍లో ఏ రోజు ఎంత డబ్బు వాడుకున్నాడో, దుకాణాదారుడు వ్రాస్తూ పోతాడు. అలా ₹ 15,000/- వరకు ఇస్తూ పోతాడు. దుకాణాదారుడు ఇచ్చిన వివరాలతో ఏ రోజు కా రోజు రైతు రామయ్య క్రాప్ లోన్ ఖాతాలో ఖర్చు వ్రాసి, దుకాణాదారుడి ఖాతాలో జమ చేస్తారు బ్యాంకు వాళ్ళు. రైతు రామయ్య క్రాప్ లోన్ ఖాతాలో ఖర్చు వ్రాసిన రోజు నుండే, అంతే డబ్బుకు వడ్డీ లెక్క కడతారు బ్యాంకు వాళ్ళు.

రైతును రాజుగా చూడాలనుకునే మనం రైతుల కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన ఒక ‘క్రెడిట్ కార్డు’ ద్వారా సమాజంలో ఆ రైతు స్థాయిని పెంచగలుగుతాము కొంతవరకైనా.

గుంటూరు జోన్‌లో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ను నిడుబ్రోలు బ్రాంచి నుండి ప్రారంభించడానికి నిర్ణయించారు. బ్రాంచి ముందే ఏర్పాటు చేసిన సభాకార్యక్రమంలో, గుంటూరు రీజినల్ మేనేజర్ శ్రీ. బి. టి. కాంతారావు గారు, జోనల్ మేనేజర్ శ్రీ. కె. వెంకటాద్రి గారు పాల్గొన్నారు. రైతులు కూడా అధిక సంఖ్యలోనే హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి సబ్ కలెక్టర్ చిత్రా రామచంద్రన్ గారి చేతుల మీదుగా ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ ఆవిష్కరించబడింది. రైతుల సౌకర్యార్థం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రా బ్యాంకును సబ్ కలెక్టర్ చిత్రా రామచంద్రన్ గారు కొనియాడారు. ఆ సభలోనే కొంతమంది రైతులకు, సబ్ కలెక్టర్ గారు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశారు.

ఆంధ్రా బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రారంభోత్సవ సభలో స్వాగతోపన్యాసం చేస్తున్న రచయిత
సభకు విచ్చేసిన అతిథులు మరియు రైతు సోదరులు
ఆంధ్రా బ్యాంకు కిసాన్ క్రెడిట్ కార్డును ప్రారంభిస్తున్న తెనాలి సబ్ కలెక్టర్ చిత్రా రామచంద్రన్ గారు, ఐఎయస్. వేదికపై ఎడమ నుండి కుడికి 1. ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీ కాంతారావు గారు 2. ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ శ్రీ వెంకటాద్రి గారు 3. తెనాలి సబ్ కలెక్టర్ చిత్రా రామచంద్రన్ గారు, ఐఎయస్.

కార్యక్రమం పూర్తయిన తర్వాత సబ్ కలెక్టర్ గారికి, రీజినల్ మేనేజర్ గారికి, జోనల్ మేనేజర్ గారికి, నేనూ మా సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here