[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం ప్రొఫెసర్ కె. విజయ రేచల్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
[dropcap]‘డా[/dropcap]క్టర్ కాబోయి యాక్టర్ నయ్యాను’ అని చాలామంది సినీ ప్రముఖులు తమ పరిచయాల్లో చెబుతుంటారు. డాక్టర్ కావాలని చాలామంది అనుకుంటారు. కాలం కలిసిరాకపోతే అందరూ డాక్టర్లు కాలేరు. అభిరుచి ఉండాలేగాని అనుకున్నదానిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకునే వారికి ఏదీ అడ్డు రాదు. అనుకున్నది సాధించి జీవితంలో తృప్తిని అనుభవిస్తారు. అలాంటి మేధావి వర్గానికి చెందిన స్త్రీమూర్తి ప్రొఫెసర్ కె. విజయ రేచల్. విశాఖపట్నానికి చెందిన ప్రొఫెసర్ విజయ గారు మొదట తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైద్యురాలిగా స్థిరపడాలని అనుకున్నారు.
అన్ని సదుపాయాలూ అమరినా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధించలేకపోయారు. అలాగని ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, వైద్యసేవలకు సమానస్థాయిలో సేవలు అందించగల ‘జీవ రసాయన శాస్త్రం’ ప్రధానాంశంగా ఎన్నుకుని, అందులోనే డిగ్రీ, పి.జి. చేసి ఆ తర్వాత పరిశోధనలు చేసి పి.హెచ్.డి పట్టా పొందారు. వృత్తిపరంగా లెక్చరర్ స్థాయి నుండి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన డా. విజయ రేచల్ ప్రస్తుతం విశాఖపట్నం లోని ‘గీతం సైన్స్ ఇన్స్టిట్యూట్’లో ప్రొఫెసర్ హోదాలో విలువైన సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వారి జీవితకథనాలు లేత లేత విజ్ఞాన పరిశోధకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రొఫెసర్ విజయ గారి మాటల్లోనే వారి విజయ గాధలను చదువుదాం..
~~
♦ విజయగారూ నమస్కారమండీ.
♣ నమస్కారం సార్.
♦ ప్రొఫెసర్ విజయగారూ, మీ బాల్యం, కుటుంబ నేపథ్యం వివరిస్తారా?
♣ మా నాన్నగారు కీ.శే. కె.వి.వి. ప్రసాదరావు గారు, మా అమ్మ శ్రీమతి కె. జ్ఞాన రత్నం గార్ల రెండవ సంతానంగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాను. మా నాన్నగారు ఆడిట్ డిపార్ట్మెంట్‌లో వివిధ హోదాలలో పనిచేసి డిప్యూటీ డైరెక్టర్ గానూ, మా అమ్మ ఏలూరు మున్సిపల్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగానూ పదవీ విరమణ చేసారు. నాకు ఒక అక్క, తమ్ముడు వున్నారు. మమ్ములను మా తల్లిదండ్రులు ఎన్నో విలువలతో సామాజిక స్పృహ కలిగి, దైవభీతి తోనూ, క్రమశిక్షణతోను పెంచారు. ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యకారణం వారి పద్ధతి గల పెంపకమే!
♦ మీ విద్యాభ్యాసం ఎక్కడ, ఎలా జరిగిందీ చెప్పండి.
♣ నా విద్యాభ్యాసం కె.జి. నుండి ఇంటర్మీడియెట్ వరకూ స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాలలో జరిగింది. పాఠశాలలో చురుకుగా ఉంటూ నాయకత్వపు లక్షణాలతో తరగతి/పాఠశాల లీడర్‌గా అనేకమంది విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలిచానని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను!
పడవ తరగతిలో జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ అవార్డు పొందాను. నాన్నగారి ఉద్యోగ ఆధిక్యతను బట్టి స్కాలర్షిప్ డబ్బు ఇవ్వలేదుగాని విలువైన ప్రశంసాపత్రం మన భారత ప్రభుత్వం నుండి పొందాను. అలాగే, భారత్ గైడ్స్ ఉద్యమంలో పాల్గొని నాటి భారత రాష్ట్రపతి గౌ. జ్ఞాని జైల్ సింగ్ గారి నుండి ప్రశంసాపత్రం పొందాను.
డిగ్రీ స్థాయిలో కళాశాలలో ప్రధమ స్థానంలో నిలిచి, బోటనీలో ‘శాంతి స్వరూప్ మెమోరియల్ వెండి పతకం’ పొందాను. తరువాత ఆంద్ర విశ్వవిద్యాలయంలో జీవ రసాయన శాస్త్రంలో ఎం.ఎస్.సి. పట్టా పొందాను. గేట్ ఫెలోషిప్‌ను సాధించినప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు నా పరిశోధనను వాయిదా వేసుకుని 1995లో శ్రీ కె.టి. రవికుమార్ గారిని వివాహం చేసుకున్నాను.
♦ చాలా మంది మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చదువు వెంట పడుతున్న నేపథ్యంలో దానికి భిన్నంగా మీరు విజ్ఞాన శాస్త్రం ఎందుకు ఎన్నుకున్నారు?
♣ కొన్ని కారణాల వల్ల వైద్య విద్యను అభ్యసించలేకపోయినా వైద్య విద్యార్థులకు బోధించు శాస్త్రాన్ని చదవాలని ఒక గురువు గారిచే ప్రోత్సహించబడి జీవ రసాయన శాస్త్రాన్ని (బయో కెమిస్ట్రీ) ఎంచుకున్నాను. స్వతహాగా బోధించే సామర్థ్యం నేను కలిగి వున్నానని గ్రహించి, వృత్తిగా టీచింగ్‌నే ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఇంకా పదవ తరగతి, ఇంటర్ చదువుతున్న రోజులలో నా ఖాళీ సమయాల్లో కొందరికి వారి కోరిక మేరకు ఉచితంగా ట్యూషన్ చెప్పేదాన్ని. ఫెయిల్ కావడం వల్ల నా దగ్గరకు వచ్చిన ఆయా విద్యార్థులు పాస్ కావడం నాకు మరింత స్ఫూర్తిని ఆనందాన్ని కలిగించాయి. రెండవదిగా తల్లిదండ్రుల తర్వాత సమాజాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం ఒక్క ‘గురువు’కు మాత్రమే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. అందుచేత ఈ వృత్తిని ఎంచుకున్నాను. దీనిద్వారా లభించే తృప్తి వేరే వృత్తులకన్నా చాలా భిన్నమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
♦ జీవరసాయన శాస్త్రం ముఖ్య అంశంగా ఎన్నుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏమిటీ?
♣ జీవ రసాయన శాస్త్రం చాలా బలమైన, స్థిరమైన అంశం. ఎందువలన అంటే ఈ వైజ్ఞానిక అంశాల అధ్యయనం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న పేదరిక ఆరోగ్య సమస్యలు, ఆకలి వంటి సమస్యలకు సకాలములో జవాబులను అందిస్తుంది. జీవరాసులలోని జీవక్రియలను అధ్యయనం చేయడం ద్వారా అధిక దిగుబడులు అలాగే మేలుజాతి వంగడాలను కనుగొనడం, ఆరోగ్య సమస్యలకు మూలాలు కనుగోని పరిష్కార మార్గాలు సమాజానికి అందించడానికి, సూక్ష్మ జీవులలోని జీవరసాయన ప్రక్రియలను ఉపయోగించి మేలైన మందులను ఆహారపదార్థాలను అందించగల పరిజ్ఞానాన్ని ఇక్కడ పొందే అవకాశం వుంది. అందుచేతనే ఈ బయోకెమిస్ట్రీని నా వృత్తికి, నా అభిరుచికి సరిపడ అంశముగా నేను ఎంచుకున్నాను.
♦ నిత్యజీవితంలో ఈ జీవ రసాయన శాస్త్రం మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది?
♣ నిత్య జీవితంలో ఈ బయో కెమిస్ట్రీ ఎలా వుపయోగ పడనుండో అవగాహన కోసం ఒక ఉదాహరణ వివరిస్తాను. ఈ కోర్సులో ఒక విద్యార్థిని కన్నీరు పెట్టుకుని కనిపించింది ఒక రోజు. దానికి కారణం అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, ఆమెకు కొత్తగా పెళ్లయింది, భర్తకు కామెర్ల వ్యాధి రావడం వల్ల, అనేక మందులు వాడుతున్నారు, కానీ వాటివల్ల ఏమీ ప్రయోజనం కనబడడం లేదని చెప్పింది. నేను ఆ విద్యార్థిని దగ్గర వున్న రిపోర్టులు చూసినప్పుడు కామెర్లకు కారణమైన అంశాలను వదలి వేరొక కారణానికి మందులు వాడుతున్నట్లు కనుగొన్నాను. వెంటనే వైద్యుని సంప్రదించమని చెప్పాను. ఆమె తక్షణం నా సలహాను పాటించడంవల్ల డాక్టరు పరీక్షించి సంబంధిత ఔషదాలు వాడడం వల్ల సమస్యకు సరైన పరిష్కారము దొరికి యావత్ కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా గడపగలుగుతున్నారు.
ఇలా జీవ రసాయన శాస్త్రం వ్యాధి నిర్ధారణ, సమతుల్యమైన ఆహారం తీసుకోవలసిన అవసరత జీవక్రియల యొక్క అవగాహన కల్పిస్తూ క్వాలిటీ లైఫ్‌ని అందించే అవకాశాలు కల్పించడం ద్వారా నిత్యజీవితాల్లో ఈ బయో కెమిస్ర్తీ యావత్ సమాజానికీ ఎంతగానో ఉపయోగ పడుతున్నది.
♦ మీ విద్యార్హతలతో ఇంకా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం వున్నా టీచింగ్‌ను మీ ప్రధాన వృత్తిగా ఎందుకు ఎంచుకున్నారు?
♣ నా భర్త ఆయన వృత్తి రీత్యా అనేక ప్రాంతాలలో పనిచేసినప్పుడు ఆయా ప్రాంతాలలోని డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేసేదాన్ని. తరువాత కాలగమనంలో నాకు ఇద్దరు పాపలను దేవుడు వరంగా ప్రసాదించిన తర్వాత వారి విద్యావకాశాలు నిమిత్తమై విశాఖపట్నంలో స్థిరపడం జరిగింది. అప్పుడు నాకు మళ్ళీ పరిశోధన చేయడానికి అవకాశం లభించింది. నేను పార్ట్ టైంలో ఎం.ఫిల్. చేసి 2006లో గీతం విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా చేరి, ఆ తర్వాత పదోన్నతి పొంది, ఇప్పుడు ప్రొఫెసర్‌గా జీవరసాయన శాస్త్ర విభాగంలో పని చేస్తున్నాను. ఒక పక్క టీచింగ్ లో ఉంటూనే,నా భర్త ఇస్తున్న సహకారంతో పి. హెచ్. డి,పూర్తి చేసాను. (నా పరిశోధనాంశము studies on trypsin Inhibitor sapindus trifoliatus and its antiderm athletic activity) ఈ పరిశోధన ద్వారా మంచి విషయాలు కనుగొన్నాము. చర్మ సంబంధ వ్యాధులకు కుంకుడుకాయ లోని ఒక రసాయనం మంచి ఉపశమనాన్ని ఇస్తుందని, దీనిని ఒక ఆయుర్వేద వైద్యుడు తన రోగులపై ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడాన్ని కనుగొన్నాము. దీనినుంచి ఎక్కువ స్థాయిలో మందును తయారుచేసి ‘ఏంటి బయోటిక్ రెసిస్టెన్స్’ చూస్తున్న ఈ రోజుల్లో రోగులు ఎందరికో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అందించాలన్నదే మా ప్రయత్నం.
♦ మీరు టీచింగ్‌లో ఉంటూనే జీవరసాయన శాస్త్రంలో పరిశోధన చేశారు. ఇక్కడ మీ పరిశోధనాంశం, మీ ఉద్యోగ పర్వంలో, భవిష్యత్ విద్యార్థులకు యెంత వరకూ ఉపయోగం? వృత్తిపరంగా సంసార బాధ్యతల పరంగా మీ పై పని ఒత్తిడి ప్రభావం చాలా ఉంటుంది కదా! ఈ నేపథ్యంలో కుటుంబపరంగా మీకెలాంటి సహకారం లభించింది? మీ పిల్లల చదువుపై మీ వృత్తి ప్రభావం ఎలా వుంది?
♣ మంచి ప్రశ్న. విద్యావంతురాలైన ప్రతి మహిళా ఉద్యోగిని ఎదుర్కొనే ముఖ్య విషయం ఇది. ఇది ఆయా కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి, వృత్తిని, కుటుంబాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడం అనేది కొంత కష్టమైన పనే! అయినప్పటికీ తల్లిదండ్రులు, అక్క, భర్త, పిల్లల ప్రోత్సాహ సహకారం వల్ల నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను పిల్లల విషయానికొస్తే పెద్దపాప ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పరీక్షలు రాసింది. చిన్నపాప సి.ఎం.సి. వెల్లూరులో మూడవ సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తున్నది. వాళ్ళు టెన్త్ లోనూ, ఇంటర్లోనూ స్కూల్/నేషనల్/స్టేట్ స్థాయిలో రేంకులు పొందిన వాళ్ళు. మేము ఎప్పుడూ వాళ్ళని కూర్చోబెట్టి చదివించలేదు గానీ మా వృత్తులలో మేము ఎలా అయితే ‘ఎక్సెల్’ అవుతున్నామో, ఆమాదిరి గానే వాళ్ళుకూడా నడుచుకున్నారు. వాళ్లకి ఇవ్వవలసిన సమయాన్ని ఎప్పుడు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరం ఉద్యోగస్తులమైనప్పటికీ ప్రతి సంవత్సరం ఒక వారం రోజులపాటు వాళ్ళని విహారయాత్రలకు తీసుకువెళ్లడం, కలసి కూరంభంగా ప్రార్ధనలో పాల్గొనడం, కలసి భోజనం చేయడం వంటివి చేస్తుంటాము. మా వృత్తులకంటే మా పిల్లలు ముఖ్యమని నమ్మించే సన్నివేశాలు సహజంగా కలిగి ఉండడం వల్ల, వాళ్ళు మమ్మలని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్‌లో ఎప్పుడూ లేరు. ఇది మా అందరి అదృష్టం. మా వారు తూనికలు – కొలతలు విభాగంలో ‘డిప్యూటీ కంట్రోలర్’గా బిజీగా వున్నా మా కోసం ఆయన సమయం కేటాయించడం మా అదృష్టమే!
♦ మీరు చదువుకున్న కాలానికీ, ఇప్పుడు విద్యార్థుల చదువుకీ ఏమైనా తేడా కనిపిస్తున్నదా మీకు? ఉంటే ఎలా?
♣ అవును, మేము చదువుకున్నప్పటికీ ఇప్పటి విద్యార్థులకు చాలా తేడా కనిపిస్తోంది. ఇందులో మంచి -చెడూ, రెండూ వున్నాయ్. అప్పుడు వనరులు చాలా తక్కువ. ఇప్పుడు కంప్యూటర్ బటన్ నొక్కితే చాలు మన అవసరానికి మించి పుంఖానుపుంఖాలుగా విజ్ఞాన సంపద మన కళ్ళముందు ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు చాలా కష్టపడి చదువుకునే వాళ్ళం.. ఇప్పుడు అందరికీ స్మార్ట్ వర్క్ దగ్గరైంది. అప్పుడు గురువును చాలా ఉన్నతంగా ఎంచుకునేవారు. ఇప్పుడు అది కొంత కొరవడింది. ‘గాడ్జెట్స్’ వల్ల ఎక్కువమంది తప్పుదోవలో వెళుతున్నారు. తల్లిదండ్రుల అతి గారాభం విలువలను, అంటే సంస్కృతీ సాంప్రదాయాలను పిల్లలకు అందించలేక పోవడం వల్ల విద్యావ్యవస్థలో అనేక లోపాలు చొచ్చుకుని మరీ వస్తున్నాయి. అయితే కొంతమంది ఇంకా ఈ విలువలు నరనరాన జీర్ణించుకుని ఉండడంవల్ల ప్రపంచం ఇంకా మానవ మనుగడను సుఖవంతంగా సురక్షితంగా ఉంచగలుగు తున్నది.
♦ మీకు ఉపాధి కల్పించిన ప్రస్తుత విద్యా సంస్థపై మీ అభిప్రాయం చెప్పండి.
♣ నేను పని చేస్తున్న మా ‘ గీతం విశ్వవిద్యాలయం’ నాకు సముచితమైన ప్రోత్సాహం అందిస్తున్నది. నేను -టీచింగ్ లోనూ, పరిశోధనలోనూ సమానమైన ప్రతిభ కనబర్చడానికి సరియైన అవకాశాలు వనరులు, సహకారం అందిస్తున్నారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. డిబిటి/డి.ఎస్.టి/యుజిసి వంటి సంస్థల ద్వారా ఆమోదం చేయబడిన ప్రాజెక్టులు ఇక్కడినుండి ప్రధాన పరిశోధకురాలిగా చేయగలిగాను. 35కు పైగా సెమినార్లు, కాన్ఫరెన్స్‌లలో పరిశోధనా పత్రాలు సమర్పించి నా పరిశోధనాంశాల ఫలితాలను తెలియ పరచగలిగాను. 40కి పైగా పరిశోధనా పత్రాలను పేరెన్నికగన్న అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురింప బడ్డాయి. కొన్ని అంతర్జాతీయ పత్రికలకు ఎడిటోరియల్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నాను. నా పర్యవేక్షణలో ఒక ఎం.ఫిల్, రెండు పి.హెచ్.డిలు పరిశోధన విద్యార్థులు తీసుకున్నారు. ఆరుగురు విద్యార్థులు తమ పరిశోధనల ముగింపు స్థాయిలో ఉన్నారు. ఇదంతా గీతం సంస్థ సహాయ సహకారాల వల్లనే జరుగుతున్నది, తద్వారా నాకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తున్నది. ఈ సంస్థకు నేను ఎప్పటికీ రుణపడి వుంటాను.
♦ చివరగా బయోకెమిస్ట్రీ చదవాలనుకునే నేటి యువతీయువకులకు మీరిచ్చే సలహా?
♣ జీవశాస్త్రం మీద మక్కువవున్నవారు ఎవరైనా సరే వారి భవిష్యత్తుకు చాలా మంచి సబ్జెక్ట్. ఇది చదవడం వల్ల పరిశోధనతో పాటు, అనేక మార్గాల ద్వారా ఉపాధి పొందే అవకాశం వుంది. ఇది రోజు రోజుకు అభివృద్ధి చెందే అంశం. ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దీనికి తిరుగులేదు. అన్ని జీవసంబంధమైన శాస్త్రాలకు బయోకెమిస్ట్రీ తల్లి లాంటిది. ఇది చదవడం ద్వారా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, అగ్రికల్చర్ టాక్సికాలజీ, న్యూట్రిషన్ వంటి విభాగాలలో ఉపాధి పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అందుచేత ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చక్కగా చదువుకోవచ్చు.
బయోకెమిస్ట్రీ గురించి ఎవరికైనా సందేహాలుంటే ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను సంప్రదించవచ్చు.
♦ ప్రొఫెసర్ విజయగారు, మీ అమూల్యమైన సమయాన్ని మా ‘సంచిక’ పాఠకుల కోసం వెచ్చించి చక్కని సమాచారం అందించారు. స్ఫూర్తిదాయకమైన వివరాలు అందించినందుకు ధన్యవాదాలండీ.
♣ చక్కని ప్రశ్నలతో, నన్ను నేను ఒకసారి నా జీవితాన్ని సింహావలోకనం చేసుకునే అవకాశం ఇచ్చిన, మీకు, ‘సంచిక’ సంపాదక వర్గానికీ ధన్యవాదాలండి.