సత్యాన్వేషణ-52

0
3

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

శం నో దేవః సవితా త్రాయమాణః శం నో భవన్తూషసో విభాతీః।
శం నః పర్జన్యో భవతు ప్రజాభ్యః శం నః క్షేత్రస్య పతిర్ అస్తు శమ్భుః॥
ఋగ్వేదం (7-35-10)

[dropcap]ఓ[/dropcap] సర్వవ్యాపక సర్వేశ్వరా! నీ కరుణా కటాక్షాల వల్ల అంధకారాన్ని, రోగకారక క్రిములను పోగొట్టు సూర్యుడు ప్రతి దినం ఉదయించి మాకు సుఖశాంతులను కలిగించును గాక. ప్రభాత ఉషస్సులు మాకు విశేష కాంతిని, స్పూర్తిని, ప్రేరణను కలిగించును గాక!!

దేవీదాసుగారి పరిచయము

ఆ వేసవి నేను మా అట్లాంటాలో గడిపాను. చాలా వరకూ నా సాధన మీదనే కేంద్రీకరించినా, లోలోపల నాకు బెరుకుగా వుండేది…. ఎన్ని రోజులిలా…. అని.

కాని పతంజలి యోగశాస్త్రములో

“చిరానుష్ఠాన గౌరవాత్ ఆత్మేక వ్యక్త మాయాతి” చెప్పినట్లుగా చిరుఅనుష్ఠానము వుండాలి.

అంటే బహుకాల అభ్యాసము.

చెయ్యగా చెయ్యగా చేసేవారికి ఫలితము కనపడుతుంది. పరమాత్మను గురించిన ఎరుకకు అభ్యాసము, లోకము పట్ల వైరాగ్యమును సాధన చెయ్యటమే ‘అభ్యాస వైరాగ్య’తో పరమాత్మను తెలుసుకోవచ్చని గీతలో చెబుతాడు భగవానుడు.

మాకు అట్లాంటాలో సాహిత్యపు సమూహములో తెలుగు పద్య సౌరభాలతో వికసించి, కుసుమ సుగంధముతో విస్తరిస్తూ వుండేది. ఆ గ్రూపులో ఒక పెద్దాయన మాకు సమస్యాపూరణ చెయ్యమని సమస్యలు ఇచ్చేవారు. నాకు తెలియదు వారు ఎవరో. మాకు అట్లాంటాలో వున్న అవధాని గారు పద్యము రాయటము నేర్పించేవారు. అలా నేను కందం మీద కొద్దిగా అభ్యాసము చెయ్యగలిగాను. ఈ పెద్దవారు నాకు వీలుగా వుండేందుకు కందం పద్య సమస్యలు కూడా ఇచ్చేవారు. ఆయనది మా వూరు కాదు. వారి కుమార్తె వుంటారిక్కడ. నేను ఆయనను చూడలేదు.

అటువంటి సమయములో ఒక అవధానము జరిగింది.  నేను అందులో  అప్రస్తుత ప్రసంగము చెయ్యాలి. ఆ అవధానానికి వెళ్ళాను. అక్కడ, అందులో మాకు సమస్యలనిచ్చి పద్యము పూరించమని చెప్పే ఆ పెద్దాయన్ని చూశాను మొదటిసారి. అగ్ని కణపులాంటి ఎర్రని బొట్టుతో, చాలా ప్రకాశవంతమైన ముఖముతో వెలుగుతున్నారు ఆయన. నాకదే మొదటిసారి వారిని కలవటము. ఆ క్షణమెలాంటిదో తెలియదు కాని వారు నాకు పరమ పూజ్యలైనారు. తరువాత తెలిసింది వారు అమ్మవారి ఉపాసకులని. అమ్మవారి ఉపాసకులకు ప్రపంచమంతా కూడా తమ పిల్లలే అన్న మాతృభావముంటుంది. ప్రజలందరి మీద కరుణ వుంటుంది. మన అజ్ఞానము చూసి నవ్వుకోక మనకు జ్ఞానబోధ చేసే ఓపిక వుంటుంది. వీరిలో ఆ లక్షణాలన్ని పూర్తిగా వున్నవి.

వారి పేరు దేవీదాసు గారు.

“తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥”

వారి పెద్దలకు వీరు జగదంబను ఉపాసకులవుతారని ముందే తెలిసి వుంటుంది. అందుకే ఇటువంటి పేరు పెట్టారు.

వీరు వేదవేదాంగాలు చదివి, ఉపనిషత్తులను, ఉత్తర మీమాంసను అవపోసన పట్టారు. తెలుగు సాహిత్యాన్ని ఒక చేత, వేదమాతను మరో చేత ధరించి సాహిత్యసృష్టి చేస్తున్నారు. వారి గురించి గ్రహించి వచ్చిన శిష్యులను ఆత్మోన్నతికి మార్గము చూపుతున్నారు. ఆత్మకూరు నివాసి. ప్రిన్స్‌పాల్‌గా పనిచేసి రిటైర్  అయ్యారు. సాధనా మార్గములో ఎంతో ఉన్నతముగా వున్న వారు ఉత్తరకాశిలో కొంత సమయము వుండి సాధన చేసి వచ్చారు. అవసరమయిన వారికి ఆపన్న హస్తమందిస్తూ, సనాతన ధర్మంపై గౌరవాన్ని నేర్పుతూ వుంటారు.

వీరి ఇంటి దేవత రేణుకాదేవి. వీరి సాధన గురించి చెప్పే అనుమతి నాకు లేదు. కాబట్టి ఆ విషయము వదిలేసినా, వారు నాకు చూపిన మార్గము, నన్ను నా తరువాత దశకు సిద్ధము చేసిన విధానము వివరిస్తాను. అది ఆలోచిస్తే అత్యంత ఆశ్చర్యకరము.

వారి గురించి తెలిసిన వెంటనే వెళ్ళి వారి పాదాలాశ్రయించాను. అది నిజంగా చాలా మంచి కాలము.

ఆ వేసవిలో, మహోన్నతమైన ఆ ఓకు వృక్ష ఛాయలో మా గురుశిష్య సంబంధము వెల్లవిరిసింది. వారి సమక్షములో నాకు తెలిసినది శూన్యమని, తెలియవలసినది చాలా వుందన్న జ్ఞానము కలిగింది. వారి కృపన నేను నా నిజ గురువును తెలుకోగలిగాను.

ఆయన నన్ను చూసిన రోజున  “చెప్పమ్మా!” అన్నారు మొదట ఉపోద్ఘాతముగా…

“సత్యము కోసము వెతుకుతున్నాను” చెప్పాను తెలివిగా చెప్పాననుకొని.

“ఆ సత్యము రూపేమి, రుచి, వాసనా రంగు వున్నవా? వస్తువా? విషయమా? మాటనా? చేష్ఠయా?” అడిగారు.

నేను తెల్లబోయాను. నాకు అయోమయంగా అనిపించినది. అంత వరకూ జగదంబను నమ్మినడుస్తున్నా మనసులో అహంకారమున్నదని అర్థమయ్యింది. ఆ అహంకారము అణిగినది. “తెలియదు”… అన్నా గొంతు పెగల్చుకొని.

తెలియదని తెలుసుకోవటము, మన అహంకారాన్ని వదలటములో మొదటి మెట్టు.

“ప్రమాణములతో ఋజువై హృదయానికి దగ్గరైనది సత్యం” చెప్పారు ఆయన చిరునవ్వుతో.

మనకు వెంటనే సందేహమొస్తుంది. ఏ ప్రమాణాలు? ఆ ప్రమాణానికి ప్రమాణమేమి? అది ఎవ్వరు ఏర్పరుచారు అని. నా మనస్సు చదివినట్లుగా చెప్పారు వారు…

“ప్రమాణమన్న జ్ఞానము. జ్ఞానము కానిది సర్వమూ అజ్ఞానము. అజ్ఞానమే భ్రమ. భ్రమను మాయ అని కూడా అనవచ్చు” అని ప్రమాణము గురించి నాకర్థమవలేదని గ్రహించి “వేదాలు ప్రమాణమమ్మా!” అన్నారు.

“మనము అన్నింటికీ వేదమే ప్రమాణముగా తీసుకోవాలి. వేదాలు ఎందుకు తీసుకోవాలి అంటే అవి స్వయంగా ఋషులకు తపస్సులో గ్రహించినవి కాబట్టి” అన్నారు.

అవును. వేదాలు అపౌరుషేయాలు. మానవులు రాయనివి. పరమాత్మ నుంచి  ఋషులకు స్వయంగా  వచ్చినవి.

“మరి ఇప్పుడు సత్యం మంటే ఏమి అర్థము చెప్పుకోవాలి” నేను మొదలెట్టిన చోటును వదలనుగా….

“ప్రమాణము ద్వారా ఋజువై హృదయ సమ్మతమైనది సత్యం అంటారు” అన్నారాయన.

“శబ్ద ప్రమాణము, ఉపమా ప్రమాణము, అనుమాన ప్రమాణము ఇత్యాదివి వున్నాయి వాడుకగా… తల్లి పిల్లవాడికి తండ్రిని పరిచయము చేస్తుంది. తల్లి సత్యం. తల్లి ద్వారా తండ్రి పరిచయము కాబట్టి తండ్రి శబ్ద ప్రమాణము. ఒకదానితో ఒకటి పోల్చటము ఉపమానము. పొగను చూచి నిప్పు వున్నదనుకోవటము అనుమాన ప్రమాణము. అది ప్రమాణము ఎలా నిర్ణయించుతారంటే” అన్నారాయన కొద్దిగా వివరముగా.

మా ఇంటికి వచ్చే దారిలోని ఆ ఓకు చెట్ల రాజసము చూచి మహా సంతోషపడేవారు. మా ప్రాంగణములోని వృక్ష సంపద ఆయనకు చాలా నచ్చేది.  మేము ఆరు బయట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము.  కాదు…… కాదు… ఆయన చెప్పేవారు… నేను వినేదాన్ని.

ఆయన చెప్పే విజ్ఞానము రాసుకు దాచుకునే దాన్ని. పదే పదే చదివి ఆలోచించి జీవితములో అన్వయించుకోవాలని ప్రయత్నించేదానిని.

… “ఎందుకు నీకీ అన్వేషణ” అని అడిగారు…

నాకు ఏం చెప్పాలో తెలియలేదు….

“ఆధ్యాత్మికముగా వుండాలని” అని నాన్చాను.

“ఆధ్యాత్మికత అంటే”

“స్పిరిచ్యువల్”…. నేను ఒక వెర్రి నవ్వు నవ్వాను.

“ఆంగ్లములో కాదమ్మా.. అర్థము చెప్పు”

నా నసుగుడు బేరము చూచి ఆయనే వివరించారు…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here