మా బాల కథలు-7

0
3

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

అమ్మ నైవేద్యం

బాలకి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్కూల్ డ్రస్ ఉండదు.

తనకిష్టమైన పట్టు లంగా కట్టుకోవచ్చు. చిన్నపాటి గొలుసు కూడా వేసుకోవచ్చు. వేరే స్కూల్స్‌లా కాక బాల చదివే స్కూల్ వాళ్ళు రోజూ డ్రస్ అయినా, శుక్రవారం మాత్రం పిల్లల, వాళ్ళ తల్లి తండ్రల ఇష్ట౦కి వదిలేస్తారు. ఎందుకంటే పిల్లలకి వారి సంప్రదాయం, సంస్కృతి తెలియాలని, ఇంకా పిల్లలని నచ్చినట్లు తయారు చేసుకుని వాళ్ళ ముచ్చట కూడా తీర్చుకునే అవకాశం తల్లి తండ్రులకి ఇవ్వాలని ఈ పధ్ధతి పెట్టింది.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే బాల తల్లి ఆ రోజు లక్ష్మి దేవి పూజ చేసి, నైవేద్యం కోసం స్వీట్ చేస్తుంది. బాలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే శుక్రవారం అన్నా ఇష్టం.

అందులో మొన్న అమ్మ ‘అమ్మవారికి’ లడ్లు నైవేద్యం పెట్టి చాలా రోజులు అయ్యిందని మామ్మతో అంది. శనగ పిండి మర పట్టించింది. జీడిపప్పులు, కిస్‌మిస్, అద్దటానికి చార పప్పు, మిస్త్రీ కూడా తెప్పించింది. ఇంక చెప్పాలా ఈ శుక్రవారం బాల ఆనందం..

అసలే అమ్మ వంటలు, పిండి వంటలు భలే చేస్తుంది.. అసలు కావలసిన సరుకులే అన్నీ లేకున్నా, ఉన్న వాటి తోనే ఏంతో రుచిగా చెయ్యటం అమ్మ ప్రత్యేకత. ఇంక అన్నీ ఉంటే చెప్పాలా! బాల శుక్రవారం కోసం ఎదురు చూడసాగింది.

శుక్రవారం వచ్చింది. అమ్మ ఎప్పటి లాగే చద్దన్నం పెరుగుతో పెట్టింది.

స్కూల్ అయ్యాక వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక వంటలు స్వీట్‌తో భోజనం ఉంటుంది.

ఆ రోజు బాల మనస్సు లడ్డూల మీదే ఉంది. స్వీట్స్‌లో లడ్డూలు అంటే బాలకి ఇంకా ఇష్టం. బ్రేక్ టైములో బాల స్నేహితురాలు అందరికీ చిన్న, చిన్న, చిక్కిముక్కలు ఇచ్చింది.

“నాకు వద్దులే వేరే వాళ్ళకిచ్చేయ్. ఈ రోజు మా అమ్మ లడ్డూలు చేస్తుంది” అంది గొప్పగా.

“ఎందుకు” అడిగింది స్నేహితురాలు.

“పుట్టిన రోజా?”

“కాదు. ఎందుకేమిటి శుక్రవారం కదా” అంది.

“శుక్రవారం ఎప్పుడూ వస్తుందిగా” అంది.

“మా అమ్మ ఎప్పుడూ చేస్తుంది” అంది గొప్పగా.

“నిజమా?” అడిగారు అందరూ అనుమానంగా చూస్తూ.

“నిజమే. కావాలంటే మీరూ రండి ఈరోజు. మీరూ తినచ్చు” అంది కొంచెం ఉక్రోషముగా, గొప్పగా.

“నిజ౦గా వచ్చేస్తాం మరి?” బెదిరించింది బాల ఎనిమీ మంగ.

“రండి, వచ్చి చూడండి” అంది రోషంగా.

“మీ అమ్మ ఏమీ అనదా? మరి మాకిస్తే మీకు ఉంటాయా” అడిగారు అపనమ్మకముతో, అయినా ఆశగా వేరే వాళ్ళు.

“మా అమ్మ ఏమీ అనదు. చాలా మంచిది. పైగా అన్నీ బోలేడేసి చేస్తుంది. పనివాళ్ళకు కూడా పెడుతుంది.” అంది తల్లి గురించి గొప్పగా.

“సరే అయితే” అన్నారు ఉత్సాహముగా వాళ్ళు కూడా లడ్డూల మీద ఆశతో.

అందరూ బాల ఇంటికి వచ్చారు. అమ్మ అప్పుడే గంట కొడుతోంది. బాల వాళ్ళను హాలులో కూర్చోబెట్టి౦ది. హారతి తీసుకోవటానికి లోనికి వెళ్ళింది. హారతి తీసుకుంటూ ఓరకంటితో చూసింది బాల. లడ్డూల గిన్నె ఏది?

అమ్మ నైవేద్యం అయ్యాక చీమలు పడతాయని లోపలపెట్టింది కాబోలు అనుకుంది.

“ఇంద. ప్రసాదం తీసుకో” అంటూ నాలుగు పటికబెల్లం ముక్కలు చేతిలో పెట్టింది.

“లడ్డూలు ఏవి” అడిగి౦ది.

“లడ్డూలు ఏమిటి” అడిగింది అమ్మ ఆశ్చర్యముగా.

బాల గుర్తు చేసింది. “అదే అమ్మవారికి లడ్డూలు నైవేద్యం పెట్టి చాలా రోజులు అయ్యింది అన్నావు. జీడిపప్పు కూడా తెచ్చాడు రాముడు” గుర్తు చేసింది.

“అదా. సచ్చు మామ్మ మొక్కుకుందిట. ‘కానీ ఓపిక లేదమ్మా, ఇంకా పెట్టలేదని భయముగా ఉంది.’ అంటే చేసి ఇచ్చాను. మొక్కు లేకపోయినా, మనం అప్పుడప్పుడు ఏదైనా ఇస్తాము కదా. మనం ఇచ్చి కూడా చాలా రోజులయ్యింది, అదే అన్నాను నాన్నమ్మతో.. ” అంది.

“కొన్ని మనకు ఉంచలేకపోయావా?”

“అమ్మవారికి నైవేద్యం అవకుండా, అందులోను వేరే వాళ్ళవి మనమెలా తీసుకుంటా౦. తప్పు కదా” అంది కోప్పడుతూ.

“పోనీ మనకీ చెయ్యచ్చుగా” అంది కొద్దిగా ఏడుపు గొంతుతో.

“ఆ పని తెమిలేసరికే చాలా టైం పట్టిందమ్మా.. మళ్ళీ మనకి చెయ్యాలంటే ఓపిక లేకపోయింది. అందుకే ఈ రోజు పాలు, పటిక బెల్లమే పెట్టాను. ఇంకోసారి చూద్దాములే” అంది బాల అమ్మ ఒదారుస్తున్నట్లు.

ఇంతలో నాన్నమ్మ వచ్చింది. “ఏమిటే మీ రామదండు వచ్చింది.” అంది

బాల భయపడింది. అమ్మో నాన్నమ్మకి తెలిస్తే ఏమన్నా ఉందా? నాన్నమ్మ హారతి తీసుకుని వచ్చేలోగా వాళ్ళని ఏదోలా పంపెయ్యాలి.

కానీ ఇప్పుడు స్నేహితుల మొహం ఎలా చూడాలి? అందులో తన ఎనిమీ మ౦గ ఇందాకే నమ్మనట్లు వేలాకోళముగా చూసింది.

ఏమిటో అమ్మ, ఎప్పుడు బాదుషాలు, మైసూర్ పాక్‌లు చేస్తుంది. ఇప్పుడే ఇలా – ఉక్రోషముగా అనుకుంటూ, ఏడుపు దాచుకుంటూ, తప్పని సరిగా హాలు లోకి నడిచింది పటిక బెల్లం డబ్బాతో బాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here