“బండాపు! బండాపు!! ఆపవయ్యా బండాపు” కొంపలు నిజంగా మునిగిపోయినా అంతలా అరవరెవ్వరూ. అలా అరిచేసరికి ఆయన రిక్షానే కాదు చుట్టుప్రక్కలవారి బళ్ళు కూడూ ఆగాయి. ఆశ్చర్యం, ఆనందం కలిపిన ఒక చిరునవ్వు మొహంమీద వేసుకుని రిక్షా దిగాడు విద్యార్థి .
“అయితే ఇదన్నమాట విజయనగరం కోట” కోట ముఖ ద్వారం చూస్తూ అడిగాడు.
“అవును బాబూ! అది అడగడానికా బాబూ అంత గట్టిగా అరిచారు? ముందు బండెక్కండి బాబూ ట్రాఫిక్ పెరిగిపోతోంది” చిరాకు పడ్డాడు బండివాడు. అదేమీ పట్టించుకోకుండా తన మెడలో వ్రేలాడుతున్న కెమెరాతో ఫోటోలు తియ్యడం మొదలుపెట్టాడు విద్యార్థి.
“అయితే ఇక్కడేనా ఆ సిరిమానుని మూడు సార్లు వంచుతారు?” ఫోటోలతోపాటు ఆరాలు తీయసాగాడు.
“అవును బాబూ! ఈ సారి అమ్మోరి పండక్కొచ్చి ఆ తతంగమంతా చూడండి. లోనికి రండి బాబూ ట్రాఫిక్ పెరిగిపోతోంది!” కంగారు పడ్డాడు. బండివాడు వెనకాలాగిన బళ్ళ వాళ్ళ హారన్ మోతకి విద్యార్థి భార్యకి కూడా చిరాకొచ్చింది. అతని చెయ్యి పట్టుకొని రిక్షాలోకి లాగి “విద్యా! చిన్నపిల్లవాడివా?! ఇంట్లో అంతా కంగారు పడుతుంటారు. బాబూ బండి ఇంటికి పోనియి. ఊరంతా చూస్తూ వెళ్ళొచ్చు, రిక్షామీద వెళ్దామంటే అనవసరంగా ఒప్పుకున్నాను” అంటూ తన పుట్టింటికి బండి తిప్పించింది.
“మా మంచి తల్లివమ్మా ఈపాలి ఎవురైనా యిజీనారం ఎంత పెద్దదంటే సమీంగ సెప్పగల్నమ్మ” వెలకరిస్తూ బండి పోనిచ్చాడు రిక్షావాడు.
“అవునూ అమ్మవారి పండగ ముందు తోలేళ్ళు అని చేస్తారే, దానికా పేరెలా వచ్చింది? ద్వారం వెంకటస్వామి నాయుడుగారు వాయించిన వైలిన్ ఇంకా సంగీత కళాశాలలోనే ఉందటకదా?! దానిని చూడనిస్తారా?! ఉగాదికి ఇక్కడ కవి సమ్మేళనాలు జరుగుతాయటకదా? పులివేషాలు ఇంకా ఆడుతున్నారా?!”
ఇలా ఒక దానికి ఒకటి సంబంధం లేని కొన్ని వందల ప్రశ్నల్ని రిక్షా వాడి మీదకి సంధించాడు విద్యార్థి. పాపం కొన్నింటికి సమాధానమిచ్చినా తరువాత తెలీదంటూ బుర్రూపాడు అతను. అలా దారి పొడుగునా తన ప్రశ్నలతో రిక్షావాడ్నీ, అత్యుత్సాహంతో తన భార్యనీ విసిగిస్తూ అత్తవారింటి వీధిలోకి ప్రవేశించాడు.
అంతదాక ఆశ్చర్యంతో పెద్దవై ఉన్న విద్యార్థి కళ్ళు ఒక్కసారి చిన్నబోయాయి. వీధి చివర ఒక చెత్తకుండీ, చెత్తకుండీ అనే పరికరాన్ని మానవుడు కనిపెట్టినప్పటిది కావచ్చు. అది నిండిపోయి, విరిగిపోయి, అందులో చెత్తకుళ్ళిపోయి కొన్ని తరాలుగా ఒక పందుల కుటుంబానికి నెలవైపోయింది. గతకలుపడ్డ రోడ్లు, బీటలు బారిన గోడలు, నిండిపోయిన కాలువలు, వీటన్నిటికంటే పద్ధతి లేని మనుషులు విద్యార్థికి మహాకోపాన్ని తెప్పించాయి. రోడ్డుమీద ఉమ్మేసేవాడొకడు, నిండిన కాలువలో ఉచ్చలు పోసేవాడింకొకడు, కల్లాపి జల్లిన ప్రక్కనే చెత్తపోసేదొకామె, తమింటి వాటిని దానిపై జల్లేది మరొకామె.. ఇలాంటి అశుద్ధమైన అవరోధాల్ని దాటుకుంటూ అత్తవారింటికి చేరాడు. అప్పటిదాక లొడలొడ వాగినోడు ఒక్కసారి నోరు మూస్సేండంటే అత్తగారంటే భయమేసుంటాది అనుకున్నాడు రిక్షావాడు. వాడిని తిప్పించినందుకు వంద రూపాయలెక్కువిచ్చి రిక్షా నుండి సామాను దింపుకున్నాడు విద్యార్థి.
“బండి కట్టాలంటే సెప్పండి బాబూ, యీది సివర్నే నా స్టాండు” ఆ వందకోముద్దిచ్చి జేబులో పెట్టి రిక్షా తిప్పుకున్నాడు.
కీచుమని గేటు శబ్థం వింటూనే విద్యార్థి అత్తగారు బయటకొచ్చారు. కూతురు చేతిలో సామాను తీసుకుని, “ఎప్పుడో రావల్సినవాళ్ళు ఇంత ఆలస్యం ఎందుకు చేసారు? అంతా ఎంత కంగారు పడ్డామో!” అంటూ అక్షింతలతో ఆమెని ఇంట్లోకి తీసుకెళ్ళారు. విద్యార్థి మామగారు అలసిపోయిన ఇద్దరినీ చిరునవ్వుతో పలకరించి, ఇంటి బయటే ఏదో ఆలోచనలో పడ్డ విద్యార్థిని లోపలికి రమ్మన్నారు. మొహమాటపు చిరునవ్వు నవ్వి ఇంట్లోకి నడుస్తున్నా, తన మనసు మాత్రం వీధి చివర చెత్తకుండీ దగ్గరే ఉండిపోయింది. కొన్ని కుశల ప్రశ్నల తరువాత, అప్పటికే అలస్యమైందని, స్నానం చేస్తే భోజనం చెయ్యొచ్చని చెప్పి విద్యార్థి మామగారు తన వాలు కుర్చీలో కూర్చుని టీవీలో పడ్డారు. విద్యార్థి భార్య గదివైపు నడిచాడు. లోపల నుంచి తల్లీకూతుళ్ళ సంభాషణ స్సష్టంగానే వినబడుతోంది.
“అప్పుడేదో గొడవన్నావు?! ఇప్పుడంతా సర్దుకుందామ్మా?!” సూటుకేసు నుండి బట్టలు తీసి సర్దుతూ కూతురుతో అంది విద్యార్థి అత్తగారు. మౌనమే సమాధానం కావడంతో సఖ్యత లేదని గ్రహించింది.
“అయినా బుద్ధిలేకపోతే సరి, అంత మంచి ఉద్యోగం వదిలి నవల్లు రాస్తానంటాడేంటమ్మా?” వారిద్దరి మధ్య గొడవకి మూలకారణం గుర్తుచేసింది.
“అదైనా పరవాలేదమ్మా ఇప్పుడు విజయనగరం వస్తానంటున్నాడు. ఇక్కడ ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారట, వారి చరిత్ర తెలుసుకుంటే నవలలకి స్ఫూర్తి కలుగుతుందట” ఇంకా ముగించేలోపే విద్యార్థి అత్తగారికి మహా కోపం వచ్చింది.
“అంతా విదేశాలు వెళ్తుంటే ఇతగాడేంటే విజయనగరం వస్తానంటున్నాడు. అసలీ కాలంలో తెలుగులో నవల్లెక్కడున్నాయనీ, అంతా వద్దంటున్నా ఈ సంబంధం చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగింది” ఆశ్చర్యం, ఆవేశం, ఆవేదన అన్నీ వెళ్ళగక్కింది.
తలుపుచాటునే ఇది వింటున్న విద్యార్థి తన భార్య మాటలకోసం ఎదురుచూస్తున్నాడు.
“అబ్బా నీకేం తెలీదే అమ్మా! వెంటనే చెప్తే వినడు. గోలచేస్తాడు. మెల్లిగా చెప్తాన్లే! అయినా చదివే వాళ్ళుండాలిగా ఈయన రాస్తే మాత్రం” అన్న భార్య మాటలు చేదుగా వినిపించాయి విద్యార్థికి.
ఆ మధ్యాహ్నం అతనికి పెద్దగా ఆకలి లేదు. ఒకవైపు తన భార్యతో సహా ఎవ్వరికి తనపై నమ్మకం లేదన్న ఆవేదన, మరోవైపు తనకి ఉత్సాహాన్నిస్తుందని నమ్మివచ్చిన ఊరు నీరుగార్చిందన్న ఆందోళన. అసలు తను ఎప్పటికైనా సాధించాలనుకున్నది సాధిస్తాడా అన్నభయం, బెంగ. ఇవన్నీ కలిపి విద్యార్థి భుజాల్ని వంచి నీరసింపజేసాయి. అదే సమయానికి విద్యార్థి మామాగారు తన మేనల్లుడు, ఆ వార్డు మెంబరు, కాబోయే మున్సిపల్ ఛైర్మన్ అయిన గిరీశ్ తమందరిని కలెక్టరు బంగళాలో ఆగుష్టు 15 పార్టీకీ పిలిచాడని సాయంత్రం తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పాడు. వార్డు మెంబరూ, మున్సిపాలిటీ అనగానే చెత్తకుండీ, పందులే గుర్తొచ్చాయి విద్యార్థికి. “నేను రాను” అని గట్టిగా అరవాలనిపించినా, అనువుగాని చోటని అరవకుండ గదిలోకి వెళ్ళిపోయాడు.
సాయంత్రమైంది. అంతా తయారై గిరీశ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థి చెప్పినా చెల్లకపోవడంతో స్నానం చేస్తానని చెప్పి స్నానాల గదిలో దాక్కున్నాడు. అంతలోగా గిరీశ్‌గారు పంపారని, తమందరిని తీసుకురమ్మన్నారని గేటు దగ్గరకొచ్చాడు కారు డ్రైవరు. అంతే స్నానాల గది తలుపులు పగలగొట్టేంత పని చేసారంతా. తనకొక స్పేర్ తాళం ఇచ్చి వెళ్ళమని, పది నిమిషాల్లో బయలుదేరుతానని మాటిచ్చాడు విద్యార్థి. సరే అంటూ అందరూ పార్టీకి బయలుదేరి వెళ్ళారు.
కాసేపటికి ఇంటికి తాళం వేసి బయటికొచ్చాడు విద్యార్థి. కొన్ని వందల మిస్డ్ కాల్స్ ఉన్న తన ఫోనుని ఇంట్లోనే వదిలేసాడు. ఎటుపోవాలో ఏం పాలుపోక నడుస్తుంటే వీధి చివర రిక్షా స్టాండొచ్చింది. ఒక్కటే బండి, అదే బండివాడు, విద్యార్థిని చూసి గుర్తుపట్టాడు.
“ఏటి బాబూ తోచక తిరుగుతున్నారా? తప్పడిపోయి ఇల్లెతుక్కుంటున్నారా?” అనడిగాడు.
‘జీవితంలో తప్పిడి పోయాను’ అని అనాలనిపించింది విద్యార్థికి. కాని వాడి వెటకారానికి ఓ నవ్వు నవ్వి
“పదవోయి. అలా ఊరు చూద్దాం” అంటూ బండెక్కాడు. ఈసారి రిక్షావాడు ఏమాత్రం విసుక్కోకుండా ఊరంతా తిప్పాడు. రైతు బజారు నుండా గంటస్తంభం దాకా, అంబటి సత్రం నుండి బొంకులదిబ్బదాకా, అమ్మవారి గుడి, అయ్యకోనేరు ఇలా అన్నీ చూపించాడు. కాని ఎటు చూసినా విద్యార్థికి అపరిశుభ్రతే కనిపించింది. కనీసం కోనేరునైనా శుభ్రంగా ఉంచుకోలేరా? అనుకున్నాడు. అలా తిరుగుతూ కోటకి కాస్త ముందు బండాపి బీడీ కొనుక్కోడానికి దిగాడు రిక్షావాడు. అప్పటికే ఆలస్యమైంది. అటూ ఇటూ చూస్తూన్న విద్యార్థికి ఒక పెంకుటిల్లు కనిపించింది. ఆ ఇంటిమీదున్న బోర్డు తన పెదాలమీదకి చిరునవ్వుని తిరిగి తీసుకొచ్చింది. “శ్రీ గురజాడ అప్పారావు గారి నివాసం” అనుందా బోర్డుమీద. రిక్షా వాడి చేతులో రెండువందల రూపాయలు పెట్టి నువ్వింకెళ్ళిపోవోయ్ అంటూ ఇంటి ముందుకు కదిలాడు విద్యార్థి. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. అప్పటికే అర్థరాత్రి కావొస్తోంది మరి. కాని విద్యార్థి మనసుండబట్టలేదు. తను ఈ సాయంత్రం ఆడిన అబద్ధం వలన ఈ ఊరునే వదిలి వెళ్ళాల్సిరావొచ్చు. ఆ క్షణంలో ఆ ఇంటిని చూడకపోతే మరే క్షణంలోను చూడలేననుకున్నాడు విద్యార్థి. అంతే ప్రక్కనున్న పిట్టగోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు.
ఒక్కసారి ఇంటిపై వెన్నెల వెలుగు. ఆ వెలుగులో ఇంటి వరండా కూడా వెలిగింది. ఆ ఇంటిని బాగా మార్చి గ్రంథాలయం చేసారని, కాని ఇంకా చాలా పాతకాలం ఇల్లులానే ఉందనుకున్నాడు విద్యార్థి. ఎవరూ ఉండరని తెలిసినా గోడ దూకాక దొంగ నడక దానంతటదే వస్తుంది. అలా నడుస్తూ వరండా దాటాడు. ఇంటి తలుపులకు తాళం లేకపోవడం ఆశ్చర్యం కలిగించినా, గ్రంథాలయంగా మారిన పాత కాలం ఇంటిని ఎవడు పట్టించుకుంటాడులే అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
మొదటి గదిలో కరెంటు లేక చీకటిగా ఉంది. గదిలో ఒక గోడలో అల్మారాలో కొన్ని పుస్తకాలున్నట్లు ఆ కాస్త వెన్నెల వెలుగులోనే అనిపించింది. సరే ఇక్కడింకేమీ లేదు అనుకొని ఇంటికెళ్ళిపోదామనుకున్నాడు.
అంతలో మరో గది నుండి ‘ఇలా రావోయ్ ! అప్పుడే వెళ్తావేం?’ అని వినబడింది.
ఒక్కసారి తుళ్ళిపడ్డాడు విద్యార్థి. తలుపులు తెరిచుండడంతో ఎవరెవరో వచ్చేస్తున్నారు. వెంటనే వెళ్ళి పోవాలిక్కడనుండి అనుకుంటూ గుమ్మం వరకు వెళ్ళాడు.
“నిన్నేనోయ్ విద్యార్థి? అలా వెళ్ళిపోతావేం? రా కాసేపు మాట్లాడుకుందాం!” అని వినబడింది.
అంతే విద్యార్థికి కాళ్ళూ చేతులు ఆడలేదు. ఈ ఊళ్ళో అతనెవ్వరికి తెలీదు. పోనీ ఆట పట్టించడానికా స్నేహితులు కూడా లేరు. అలాంటిది పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఎవరో దొంగలు తనని వెంబడించి ఉండాలి అనుకుంటూ బయటకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. తలుపులు తటాలున మూసుకున్నాయి.
“నీ పేరు నాకెలా తెలుసు అని ఆశ్చర్యపోకు. ఆత్మలకి పేర్లు తెలుసుకునే శక్తులుంటాయిలే!” అంటూ నవ్విందా గొంతు.
వెనక్కి తిరిగి చూసిన విద్యార్థికి తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయనిపించింది. దర్జాగా కనిపించే తలపాగా, తెల్లటి పెద్ద పెద్ద మీసాలు, కాలిదాకా ఉన్న ధోవతి. అతన్ని బాగా దగ్గరగా చూసిన జ్ఞాపకం. ఒక్క క్షణంలో తట్టింది విద్యార్థికి. ఇంటి బయట బోర్డు మీదున్న వ్యక్తే.
“మీరు… మీరూ…” విద్యార్థికి మాట తడబడింది.
“చిత్రమోయ్ చిత్రం. నా ఇంటికొచ్చి నేనవరంటున్నావ్? సరే అప్పారావు పేరు గురజాడ ఇంటి పేరు. బతికున్నప్పుడు తెలుగు రచయితని. ఇప్పుడు దేశ దిమ్మరిలాగా లోక దిమ్మరిననుకో. ఎందుకో భూలోకం వైపు వెళ్తుంటే నువ్వు ఇంటి గోడ దూకడం చూసాను. ఇక్కడేముందిరా దొంగతనానికి అనుకొని చూడడానికొచ్చాను” అంటూ ఆయన చెప్తుంటేనే విద్యార్థి ఇదంతా బోగస్ అనుకున్నాడు.
“ఇలాంటి కబుర్లన్ని చెప్పి చివరికి ఎ.టి.ఎం కార్డు పిన్ను కావాలంటావ్ అంతేకదా. నువ్వింకా నయం గురజాడవి. పది రూపాయల కోసం మిట్ట మధ్యాహ్నం రోడ్డుమీద రోజుకో గాంధీ కనిసిస్తాడీ దేశంలో” అంటూ బయటకి వెళ్ళేప్రయత్నంచేసాడు.
“నవలకి కావల్సినంత స్ఫూర్తి దొరికిందా!”
అదిరి పడ్డాడు విద్యార్థి, తన మనసులోని మాట వీడికెలా తెలుసు… అంటే నిజంగానే వీడూ… ఈయన గురజాడా? అనుకుంటూ వెనక్కి తిరుగుతూంటేనే.
“ఇంకా నవలకి కావల్సినంత స్ఫూర్తి దొరకలేదటోయ్!” ఒక్కసారి ఒళ్ళు మండుకొచ్చింది విద్యార్థికి. కంట్లోని కోపం చెయ్యిదాకా వచ్చింది. తిరిగి అప్పారావుగారిపైపే దూసుకొచ్చాడు.
“నేనెప్పుడైనా ప్రేమ కథో, కవితో రాయాల్సొస్తే ఇలాంటి వెన్నెల సాయంతోనే అలా అయ్యకోనేరు దాకా వెళ్తుండేవాడిని”.
ఆ మాట విన్న విద్యార్థి తిట్టకపోగా గట్టిగా నవ్వాడు.
“ఏదీ ఆ మురిక్కాలవ దగ్గరకా? అసలదే కాదు ఈ ఊరిలో స్ఫూర్తినిచ్చేవి ఏమైనా మిగిలున్నాయా? మీ కోట, మీ నూరేళ్ళ కాలేజీ, ఆ కోనేరు, ప్రతి చోట ఉచ్చలు, ఉమ్ములు, పేడలు, పిడకలు తప్ప జనాల్లో కాస్తంతైనా ఇంగిత జ్ఞానం ఉందా?” తన చిరాకుని కక్కడం మొదలుపెట్టాడు విద్యార్థి.
“మాటలు… వట్టి మాటలు!!” అప్పారావు విద్యార్థి ప్రసంగాన్ని ఆపాడు.
“మీ కాలం వాళ్ళలాగే నీవీ వట్టి మాటలేనోయి!” ఆరోపించాడు.
“అంటే నేవెళ్ళి ఆ చెత్తకుండీని శుభ్రం చేయాలా?” అని ప్రశ్నించాడు విద్యార్థి.
“తప్పేముందీ? వెయ్యి మాటలు తేలేని మార్పు ఒక్క పని తెస్తుంది అందుకే అన్నాను. ‘వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టిమేల్ తలపెట్టవోయి’ అని. స్వాతంత్ర్యంతో పుట్టావ్ కదా నీకా విషయం అర్థం కాదు”. అని ఒక్క చిటిక వేశారు అప్పారావుగారు.
వెనక్కి తిరిగి చూస్తే విద్యార్థి కోనేటి గట్టుమీదున్నాడు. వెన్నెల వాలి కోనేరు వెండి అద్దంలా మెరుస్తోంది. ఒకటా? వెయ్యి ప్రేమ కథలు రాయొచ్చు అనుకున్నాడు విద్యార్థి.
“ఇది వందేళ్ళ కిందటి కోనేరు విద్యార్థి. దీన్ని వందేళ్ళ తరువాత కనీసం శుభ్రంగా ఉంచుకోలేని మీకేందుకయ్యా కోట్ల మంది కలలుకన్న స్వాతంత్ర్యం?” దూషించారు అప్పారావుగారు.
“స్వాతంత్ర్యం మీకు కల, కలలెప్పుడు తియ్యగానే ఉంటాయి. స్వాతంత్ర్యం మాకు నిజం. నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయి.” ఇంకా తన వంతు సమర్థన ఇస్తూనే ఉన్నాడు విద్యార్థి.
“వట్టి మాటలు కట్టిపెట్టవోయ్!” మళ్ళీ అవే మాటలు వినపడ్డాయి.
“మీరు పూర్తిగా అర్ధం చేసుకోలేదు” అంటూ ఇంకా ఏదో చెప్పడానికి వెనక్కి తిరిగేసరికి ఎవ్వరూలేరు. తిరిగి చూస్తే కోనేరు లేదు. ఎవరో భుజంమీద తట్టినట్లు అనిపించింది.
“లేవయ్యా! లే!!” ఉలిక్కిపడి లేచాడు విద్యార్థి.
“చూస్తే చదువుకున్న వాడిలా ఉన్నావ్? తాగి గ్రంధాలయం ముందు పడుకుంటావా? పో ఇంటికి పో తెల్లారింది ” ప్రొదున్న వాకింగ్ కి వెళ్తున్న పెద్దాయన విద్యార్థిని లేపాడు.
విద్యార్థికి ఏమీ అర్ధం కాలేదు. అంటే నిన్న జరిగిందంతా కలా?! కాని నిజంలాగ ఉందే? తను గ్రంధాలయం ముందెలా ఉన్నాడు? పోనీ దొంగతనం కూడా జరగలేదు. రిక్షా ఎక్కింది నిజం. ఇక్కడ గోడ దూకింది నిజం. అలా ఆలోచిస్తుండగా వాళ్ళ వీదొచ్చింది. చెత్తకుండీ కనిపించింది. వీధివాళ్ళు తమ రోజూవారీ చెత్తను దాని మీదకి విసురుతున్నారు.
ఇంట్లోకి వెళ్తూనే అతని భార్య, అత్తగారు, మామగారు, పక్కింటివాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. కోపంతో ఊగిపోతున్నారొక్కొక్కరూ. అంతటి గందరగోళంలో కూడా విద్యార్థికి వినిపించిన మాటలు ‘వట్టి మాటలు కట్టిపెట్టవోయి’ అనే.
ఇంటి పెరడులో ఉన్న బాల్టీలో చీపురు, ఫినాయిల్ వేసి, ఒక చెత్తబుట్ట పట్టుకొని వీధి చివర చెత్తకుండీ దగ్గరకు వెళ్ళాడు. మాట్లాడుతూంటే వెళ్ళిపోతాడేంటి అని మరింత తిట్టారు మిగతావాళ్ళు.
మూతికి ఒక రుమాలు కట్టుకుని ఒక్క ముక్కైనా మాట్లాడకుండా చెత్తని శుభ్రపరచడం మొదటు పెట్టాడు విధ్యార్ధి. చెత్త పోస్తున్న వీధివాళ్ళు “నీకెందుకుబాబూ ఇవన్నీ” అంటూనే చెత్తపోసినా తిరిగి ఏ సమాధానం ఇవ్వకుండా శుభ్ర పరుస్తూనే ఉన్నాడు.
“మీ ఆయనకి వెర్రి ముదిరి పిచ్చైందే. వెళ్లి తీసుకొనిరా. పరువుపోతోంది” అంది అత్తగారు.
అలాగే అన్నప్పటికీ విద్యార్థి కష్టం అతని భార్యని ఆ పని చెయ్యనివ్వలేదు. వీధి చివర వరకూ వెళ్ళి అతనికి సాయం చెయ్యడం మొదలు పెట్టింది, కాసేపటికి వీధివాళ్ళు చెత్తవెయ్యడం ఆపి వాళ్ళిద్దరినీ చూడటం మొదలుపెట్టారు. మరికాసేపటికి ఒక్కొక్కరూ ఒక్కొక్క పరికరంతో రంగంలోకి దిగారు. కాలవకి పడ్డ అడ్డం తీసేవారొకరు. రోడ్డుమీద చెత్తతీసే వారు మరొకరు. అలసిన వాళ్ళకి నీళ్ళందించేది ఒకరు, మున్సిపాల్టి వాళ్ళకి కబురిచ్చి బండి తెప్పించేవారొకరు. ఇలా ఆ సాయంత్రానికి ఆ వీధి పరిశుభ్రమైంది.
అంతా స్నానం చేసి విద్యార్థి అత్తగారింట్లో కలిసారు. విద్యార్థి తనని తాను శుభ్రం చేసుకుని బయటకొచ్చేసరికి అంతా టీ, కాఫీతో మాట్లాడుకుంటున్నారు.
“అంత తెలివైనవాడు, మంచివాడు, సమర్ధుడు కనుకే ఈ సంబంధం ఏరి కోరి చేసుకున్నాం” అత్తగారు పక్కింటి వాళ్ళతో చెప్తున్నారు. మొహమాటంగా ఒక నవ్వు నవ్వి నమస్కరించి ముందుకి వెళ్ళాడు విద్యార్థి.
“అదరగొట్టావయ్యా. ఎప్పుడో జరగాల్సింది. ఏదైతేనేం నీవల్ల ఈ రోజు శుభ్రమైంది వీధంతా” మరొకాయన మెచ్చుకున్నారు. నమస్కారమే విద్యార్థి సమాధానం.
“చూసి నేర్చుకోవయ్యా వార్డు మెంబరూ” గిరీష్ కి కూడా అక్షింతలు పడ్డాయి.
విద్యార్థి అందరి ఆనందాన్ని గమనిస్తూ ఓ గోడకి ఆనుకుని కుర్చున్నాడు. అతని భార్య కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంది.
“కాఫీ ఎలా ఉంది?” అన్న ప్రశ్నకి ఒక చిరునవ్వు నవ్వి
“బాగుంది” అన్నాడు.
“అయితే నవలెప్పుడు మొదలు పెడుతున్నావ్?” అతని నిర్ణయాన్ని సమర్థిస్తూ అడిగింది.
ఏదో చెప్పబోయిన విద్యార్థికి మరోసారి అప్పారావుగారి మాటలు వినపడ్డాయి.
“వట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయి” అని.
“విద్యా ఎప్పుడు రాస్తున్నావ్ నవల?” మళ్ళీ అడిగింది ఆమె.
తన చేతిని దగ్గరికి తీపుకొని చిరునవ్వుతో “ఇప్పుడే” అన్నాడు విద్యార్థి.