[dropcap]రా[/dropcap]త్రంతా గుండెల్లో సన్నని సలుపు
మనసులో మెదులుతోంది నీపై వలపు
అందుకే బాధ కూడా అంత సమ్మగా…
అరెరే.. తెల్లవారుఝాము కలలు నిజమౌతాయంటారే
కలలో నీ కౌగిలింత
కలత నిదురలో సుస్పష్టంగా నీ స్పర్శ…
అప్పటి పాణిగ్రహణంలా నా చేయి నీ చేతిలో
నీ అడుగుల్లో అడుగులేస్తూ నీ వెనుకే నేను
మేఘాల్లో తేలిపోతూ
సుందర సుదూర తీరాలకు…
ఇప్పుడే నొప్పీ లేదింక
గుండె అంతా ఖాళీ.. తేలికగా వుంది
డెబ్బై కేజీల బరువు ఏమయ్యిందో
గాలిలో తేలిపోతున్నాను తూనీగలా…
అరే అదేమిటి నేనక్కడున్నాను నేలపైన
చిన్నీ, కటికనేల పైన పెట్టారేమిట్రా నన్ను
ఆర్త్రైటీస్ ఆలోచనైనా లేకుండా…
కాలి బొటన వేళ్ళు ఏమిటలా కట్టి పడేసారు
కాస్త పింక్ పాలిష్ పెట్టొచ్చుగా
మరీ మగపాదాల్లా లేవూ….
చిన్నీ, మొన్న తలకి డై వేసి మంచి పనే చేసావు
చాన్నాళ్ళ తరువాత చూడ్డం కదా మీ డాడీ నన్ను..
మైకం కమ్మే మల్లెల అత్తరు చల్లండి
మత్తైన ఆయన చూపులే మెదులుతున్నాయి నా మదిలో
షష్టి పూర్తి సశేషంగా వదిలి అంతర్ధానమైన మనిషి..
థ్యాంక్ గాడ్ నిన్ననే కనుబొమలు చేయించావు
ఈ హరివిల్లు విసిరే ప్రేమబాణాల గురి తప్పించుకోలేడులే ఇక మరి…
పెదవులు ఎండిపోయినట్లున్నాయిరా
కొంచం మాశ్చరైజింగ్ లిప్‌స్టిక్ అద్దండి ఎవరైనా
ఎరుపైతే కొంచం హాట్‌గా కనిపిస్తానేమో ఆలోచించండి…
మొహం మీదే మట్టి వేస్తే నాకు చెడ్డ చిరాకు
మతాల అంతరాలు పక్కన పెట్టండి
అలంకరించిన అందమైన కాస్కెట్‌లో పెట్టి పాతండి…
కర్మలు తద్దినాల పట్టింపులేమీ లేవు నాకు
మీకు తెలిసిందేగా…
మీ డాడీ తద్దినాలు మటుకు క్రమం తప్పకండి
ఆయన పూజప్పుడు పక్కనే నన్నూ వుంచండి
ఇద్దరికీ కలిపి ఒకే దండ వేయండి….
పంచుకోవలసినవెన్నో తప్పించుకు పోయినా
పూల పరిమళమైనా కలిసి ఆస్వాదిస్తాం
ఏ లోకాల నుండైనా మనసారా కలిసి ఆశీర్వదిస్తాం…!