[dropcap]నా[/dropcap]కూ నడవాలనుంది….
పచ్చ పచ్చని పచ్చికపై…
మంచు బిందువులు పాదాలకు
చక్కిలిగింతలు పెడుతుంటే…
నులివెచ్చని మయూఖలకు అభిముఖంగా…
నాలుగడుగులు వేయాలనుంది.
గాలిపెదవులకు సిగ్గిల్లి
నేల వాలిన పారిజాతపు చెట్టు చూపుల పూలను చూస్తూ…
ఒడలంతా తడిమే…
శీతగాలికి పులకితమై పోతూ…
పదడుగులు వేయాలనుంది.
తీవెల మోవిపై విరిసిన..
పూల సోయగాలు చూస్తూ…
కొమ్మల దాగి కూసే..
ఏకాకి కోయిల స్వరానికి
మైమరచిపోతూ…
అందమైన
ఊహలకు ఊపిరిపోసుకుంటూ…
ఉత్సాహంగా నడవాలనుంది.
ఓ కాఫీ ..ఇవ్వవోయ్.. శ్రీవారి పిలుపు…
నా టై ఎక్కడా… పిల్లాడి నర్తన..
నన్ను చూడనే వంటిల్లు…
నాతో పోటీపడి పరుగెత్తే..
గోడమీది మూడుకాళ్ళ ముసలి..
కాళ్ళు నిలపలేని పరుగు..పరుగు
బతుకువేటైపోయిన
బండచాకిరీ బ్రతుకులో…
ఉదయాస్తమయాల జాడ తెలీని
సగటు ఉద్యోగిని వెత నాది!