మంత్రకత్తె ఆటకట్టు

1
3

[dropcap]”అ[/dropcap]రేయ్ కన్నా, మేము పొలానికి వెళ్ళి వస్తాము, నీవు బయటకు పోకుండా ఇంట్లోనే ఉండి నీ బుజ్జి తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో, వాడు ఏడిస్తే పాలు పట్టు” చెప్పారు గోపీతో వాడి అమ్మా నాన్న.

“అలాగే నాన్నా..” అన్నాడు గోపి.

గోపీ ఒక కథల పుస్తకం చదువుతూ బుజ్జి తమ్ముడు చింటూ పడుకున్న మంచం పక్కనే కూర్చున్పాడు. గోపీ అలా పుస్తకంలో మునిగి పోయాడు.

గోపీ వాళ్ళింటికి నాలుగు యోజనాల దూరంలో ఉన్న కొండల్లో ఈ మధ్యనే ఒక మంత్రగత్తె తన బానిస గ్రద్దలతో గుహలో కాపురం పెట్టింది! ఆ మంత్రకత్తె చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్ళ మనసులు మార్చి కొంచెం ఎదిగాక బానిసలుగా మార్చి తన పనులు చేయించుకోవడం, అడవిలో తనకున్న పొలం పనులు చేయించుకోవడం చేసేది. గ్రద్దలకి చిన్న పిల్లల్ని ఎత్తుకు వచ్చే శిక్షణ ఇచ్చింది.

అందుకే ఆ గ్రద్దలు ఆకాశంలో ఎగురుతూ కింద ఇళ్ళని, రహదారుల్ని గమనించేవి. అంత ఎత్తు నుండి భూమి మీద చిన్న జంతువుల్ని, చిన్న పిల్లలను గమనించి ఎత్తుకుపోయి మంత్రగత్తెకు ఇచ్చేవి! అవి అలా ఎగురుతూ గోపీ ఇంటి కిటికీలోంచి నిద్రపోతున్న బుజ్జిని గమనించాయి. మంచం పక్కన గోపీ పుస్తకం కింద పెట్టి నిద్ర పోతున్నాడు. అంతే ఓ గ్రద్ద కిటికీలోంచి లోపలికి ప్రవేశించి బుజ్జిని జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి మంత్రగత్తెకు అప్పగించింది.

బుజ్జి నిద్రలేచి ఏడవసాగాడు. మంత్రగత్తె కుండలోంచి తోడేలు పాలు తీసి పట్టి మంత్రించింది! బుజ్జి మళ్ళీ నిద్రపోయాడు.

అక్కడ ఇంట్లో గోపీకి మెలకువ వచ్చి, మంచం మీద చూస్తే బుజ్జిలేడు! గోపీలో భయం దుఃఖం ముంచుకొచ్చాయి. అంతే ఇంటి బయటకు పరుగెత్తాడు. కళ్ళలో నీళ్ళతో ఇటు అటు చూడసాగాడు. ఎక్కడా బుజ్జి జాడ లేదు.

ఒక కొమ్మమీద రామచిలుక ఏడుస్తున్న గోపీని చూసింది.

“ఏ కష్టం ముంచుకొచ్చింది బాబు” అడిగింది.

గోపీ చిలుక పలుకులు విని ఆశ్చర్యపోయి, “మా తమ్ముడు ఇంట్లో కనిపించడం లేదు, వాడు చాలా చిన్నవాడు” అని దీనంగా చెప్పాడు.

“అక్కడ కొండ గుహలో ఉన్న ఒక మంత్రకత్తె చిన్నపిల్లల్ని తన బానిస గ్రద్దలచేత తెప్పించుకుని పెంచి పెద్ద చేసి తన బానిసలుగా మార్చుకుంటుంది, ఆ బానిస గ్రద్దలు మీ తమ్ముడిని ఎత్తుక పోయి ఉంటాయి, అక్కడికి వెళ్ళు, కానీ జాగ్రత్త. నీకు సలహా కావాలంటే ఆ పెద్ద మర్రి చెట్టును అడుగు” దూరంగా కనబడే మర్రి చెట్టును చూపించింది.

గోపీ పరుగున మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు.

“మర్రీ, మర్రీ నా తమ్ముడు మంత్రగత్తె వద్ద ఉన్నాడట, వాడిని తెచ్చుకునే ఉపాయం చెప్పవూ?” అడిగాడు.

“నీవేం భయపడకు, ఇలా పడమరవైపు వెళ్ళు, అక్కడ జామ చెట్టు కనబడుతుంది, దాని సహాయం తీసుకో” అని చెప్పింది.

గోపీ జామ చెట్టు వద్దకు వెళ్ళి “నా తమ్ముడు మంత్రగత్తె వద్ద ఉన్నాడట, వాడిని తెచ్చుకునే ఉపాయం చెప్పవూ?” అడిగాడు.

“అలసిపోయి ఉన్నావు, నా జామ పండ్లు తిను, శక్తిని ఇస్తాయి” అని పండ్లు ఇచ్చింది.

వాడు తియ్యని జామ పండ్లు తిన్నాడు. వాడిలో నూతన ఉత్సాహం వచ్చినట్టయింది.

“ఆ మంత్రకత్తె దగ్గరకు వెళ్ళాలంటే శక్తి యుక్తులు అవసరం, అందుకే నా పండ్లు కొన్ని నీ నడుముకున్న గుడ్డలో కట్టుకొని, అటే కొంత దూరం వెళ్ళు. దానిమ్మ చెట్టు కనబడుతుంది, దాని సలహా తీసుకో” అని చెప్పింది.

గోపీ దానిమ్మ చెట్టు వద్దకు వెళ్ళాడు. చెట్టు ఎర్రని దానిమ్మ పండ్లతో ఎంతో అందంగా కనబడింది.

“దానిమ్మా, దానిమ్మా నా బుజ్జి తమ్ముడిని మంత్రగత్తె ఎత్తుక పోయిందట, వాడిని తెచ్చుకునే ఉపాయం చెప్పవూ?” అడిగాడు.

“ముందు నా దానిమ్మ గింజలు తిను, నీకు నీ గుండెకు బలం వస్తుంది, కొండల వద్దకు వెళ్ళగలవు” అని ధైర్యాన్ని ఇచ్చి”అదిగో ఆ వేప చెట్టును అడుగు, మంత్రగత్తెను గురించి చెబుతుంది” చెప్పింది.

గోపీ మరలా పరుగున వేప చెట్టు వద్దకు వెళ్ళాడు.

“వేపా వేపా, నా తమ్ముణ్ణి మంత్రకత్తె ఎత్తుకెళ్ళింది, వాడిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?” అడిగాడు గోపీ.

“భయపడకు బాబు, నీవే ఆ మంత్రకత్తె ఆట కట్టేట్టు చేస్తాను. నా ఆకులు, కొమ్మలు, ఆఖరికి నా చిగురు ఎంతో శక్తిగలవి. అందుకే ఉగాది పచ్చడిలో కూడా వేప పూత కలుపుతారు. నా ఆకులు కొమ్మలనుండి వచ్చే నూనె అంటే పురుగులకు కూడా భయం. అందుకే నా నూనెను కలిపిన నీళ్ళని పొలాల మీద చల్లి చీడల్ని నిర్మూలిస్తారు. ఇంత మేలు చేసే నా ముందు ఆ మంత్రకత్తె ఎంత?… నా చెట్టు కొమ్మ ఒకటి తీసుకో, కొన్ని నా వేప ఆకుల్ని నీవు జేబులో వేసుకుని, అక్కడ రాయి మీద ఉన్న హంస దగ్గరకు వెళ్ళి మంత్రకత్తె సంగతి చెప్పు. ఆ హంస నిన్ను మంత్రకత్తె ఉన్న గుహ వద్దకు తీసుక వెళుతుంది. గుహ వద్దకు వెళ్ళి ఆ గుహ ముందు వేపాకులు చల్లు, నా ఆకుల మహిమ వలన అక్కడి దుష్ట శక్తులు, మంత్రకత్తె జిత్తులు నశించి పోతాయి. తరువాత ఒడుపుగా నా వేప కొమ్మ మంత్రకత్తె తలకు తాకించు, అంతే అది పెద్ద అరుపులతో పడి పోతుంది. దాని దగ్గర ఉన్న బానిస పిల్లలకు, గ్రద్దలకు స్వేచ్ఛ లభిస్తుంది. అంతటితో దాని పీడ విరగడ అవుతుంది” చెప్పింది వేప చెట్టు.

గోపీ వేప చెట్టుకు నమస్కరించి ఆకులు, కొమ్మ తీసుకుని హంస వద్దకు వెళ్ళి తన తమ్ముడిని గురించి చెప్పాడు.

హంస అంతా విని “బాబూ నీవేం భయపడకు, నిన్ను ఆ మంత్రకత్తె వద్దకు చేర్చే బాధ్యత నాది” అంటూ రాయి మీద నుండి నేల మీదకు దిగి “నా మీద జాగ్రత్తగా కూర్చో”అన్నది.

గోపి హంస వీపు మీద కూర్చున్నాడు. హంస జాగ్రత్తగా ఎగరసాగింది. కింద కొండలు పచ్చని చెట్లు ఎంతో అందంగా కనబడ్డాయి. హంస అతి వేగంగా మంత్రకత్తె గుహ వద్దకు చేర్చింది.

“బాబు, వేపచెట్టు చెప్పినట్టు చేసి తమ్ముడిని తీసుకురా, ఇద్దరినీ ఇంటివద్ద వదలి పెడతాను” చెప్పి ఓ చెట్టు చాటుకు వెళ్ళింది.

గోపి గుహ వద్దకు వెళ్ళి వేప ఆకులు చల్లాడు. వేప ఆకుల్లోంచి వచ్చిన చేదు వాసనకు మంత్రకత్తె భయపడిపోయి గట్టిగా అరచింది! గోపి ధైర్యంగా గుహలోకి వెళ్ళాడు. అక్కడ అమాయకంగా నలుగురు బానిస పిల్లలు కూర్చుని ఉన్నారు. ఒక పక్క గోపి తమ్ముడు బుజ్జి ఒక చింకి గుడ్డ మీద పడుకుని ఉన్నాడు.

గోపీని చూసిన మంత్రకత్తె లేవ బోయింది, అంతే గోపి వేగంగా వెళ్ళి మంత్రకత్తె తలకు వేప కొమ్మ తగిలించాడు.

మంత్రకత్తె శక్తులు అన్నీ పోయాయి. అది కీచుమని అరుస్తూ వెనక్కి పడిపోయింది! బానిస బాలలు మంత్రకత్తె చెరలోంచి బయటకు వచ్చారు. గ్రద్దలు స్వేచ్ఛగా ఎగురుతూ గోపీకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి పోయాయి.

గోపీ హంసను పిలిచాడు. గోపీ, తమ్ముడు హంస వీపు మీదకు ఎక్కారు.

“హంసా హంసా ఆ పిల్లలను కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర వదలి పెట్టవూ” అడిగాడు గోపీ.

“తప్పకుండా వాళ్ళని కూడా రక్షించే బాధ్యత నాది” చెప్పింది హంస గోపీ మంచి మనసుకు సంతోషిస్తూ.

అలా హాయిగా గోపీ, బుజ్జి హంస సహాయంతో ఇంటికి చేరుకున్నారు.

అప్పడే గోపీ అమ్మ,నాన్న వచ్చారు. జరిగినదంతా గోపి తల్లిదండ్రులకు వివరించాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. మంత్రకత్తె నుండి ఊరి పిల్లల్ని రక్షించినందుకు గోపీని అతని సాహసాన్ని మెచ్చుకున్నారు. ఈ లోపల మిగతా పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకు చేర్చడానికి హంస వెళ్ళింది.

ఊళ్ళో అందరూ జామ, దానిమ్మ, వేప చెట్లను పెంచి ఊరిని మరింత అందంగా తీర్చి దిద్ది, చిలుకల్ని, హంసల్ని కూడా పెంచసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here