ఆచార్యదేవోభవ-31

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

హరికథా గాన వినోది:

[dropcap]యూ[/dropcap]నివర్శిటీల్లో పాఠాలు చెప్పే ఆచార్యులు బయటికి వెళ్ళి హరికథలు చెప్పడం ఒక నియమంగా పెట్టుకొన్నారంటే విచిత్రంగా కన్పిస్తుంది. తండ్రికిచ్చిన వాగ్దానం నెరవేర్చాలని హరికథలు జీవితాంతం చెప్పిన విద్వాంసుడు హెచ్. యస్. బ్రహ్మానంద. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో లెక్చరర్‍గా చేరి క్రమంగా పదోన్నతులు పొంది ఆచార్యులుగా రిటైరయ్యారు. 1950 సెప్టెంబరు 10న పుంగనూరులో జన్మించారు. స్కాలర్‌షిప్పులు, స్వార్జిత సంపాదనతో చదువు కొనసాగించారు.

తండ్రి హరికథలతో తిరుపతిలో జీవనం కొనసాగించారు. బ్రహ్మానంద తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అతని లేమిని గమనించి ఆచార్య జి.యన్.రెడ్డి ప్రోత్సహించి ఎం.ఏ.లో చేర్పించారు. అధ్యాపకురాలు తమ్మారెడ్డి నిర్మల ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. 1971-73 మధ్య బ్రహ్మానంద ఎం.ఏ. డిస్టింక్షన్‍లో పాసయ్యారు. ఉస్మానియాలో భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావుల శిష్యరికంలో ఎం.ఏ. లింగ్విస్టిక్స్ (1975) పూర్తి చేశారు. తిరుపతిలో తుమ్మపూడి కోటీశ్వరరావు పర్యవేక్షణలో పి.హెచ్.డి. (1979) సాధించారు. విషయం Theory of Suggestivity (వ్యంజన సూత్రం).

చక్కని గాయకుడు, వయొలనిస్టు, హరికథకుడు. అనంతపురం జిల్లాలోని సుగాలీ భాషపైన భారత దేశంలో Gor Boli పైన యుజిసి ప్రాజెక్టులు పూర్తి చేశారు.

హరికథా గానం చేస్తున్న శ్రీ హెచ్. యస్. బ్రహ్మానంద

ఉద్యోగ పర్వం:

‘ఉద్యోగికిని దూరభూమి లేదు’ అన్న సామెత ఆధారంగా ఉపాధి కోసం ఢిల్లీ లోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో (తిరుపతి దేవస్థానం వారిది) ఉపన్యాసకుడిగా 1975లో పని చేశారు. అనంతపురం విశ్వవిద్యాలయంలో లెక్చరర్‍గా 1976 సంవత్సరంలో చేరడంతో ఆయన ఉద్యోగ జీవితం మలుపు తిరిగింది. రీడర్‌గా, శాఖాధిపతిగా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొంది 2010లో పదవీ విరమణ చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో హరికథా గానం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆహ్వానంపై 1999 సంవత్సరంలో ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా ఐదేళ్ళు పని చేశారు. 2004 జూన్‍లో తిరిగి యూనివర్సిటీ ప్రొఫెసర్ బాధ్యతలు చేపట్టారు. పరిశోధన, అధ్యాపత్వాలను జోడు గుర్రాలుగా నడిపించారు. మృదుస్వభావము, సుమధుర గాత్ర సౌరభము ఆయన ప్రత్యేకతలు. 2015లో స్వల్ప అనారోగ్యంతో మృతి చెందారు.

వీరి పర్యవేక్షణలో 23 పి.హెచ్.డిలు, 24 యం.ఫిల్. పరిశోధనలు జరిగాయి. 35 పరిశోధనా గ్రంథాలు ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం 2011లో లభించింది.

గ్రంథ రచన:

బ్రహ్మానంద నిత్య పరిశోధకులు. 1982-83 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన గ్రంథ రచనా పోటీకి – తెలుగు సాహితికి నన్యయ ఒరవడి – అనే అంశంపై విమర్శ గ్రంథం వ్రాసి బహుమతి పొందారు. తమ యూనివర్శిటీలో అధ్యాపకులుగా పనిచేసి అకాలమరణం పొందిన కల్లూరి నాగభూషణ రావుకు ఆ గ్రంథం అంకితమిచ్చారు. వాగనుశాసనం – అని గ్రంథానికి నామకరణం చేసి ఆదికవి జీవుని వేదన, తిక్కనాది ప్రాచీన కవులపై నన్నయ ప్రభావాన్ని విశ్లేషించారు. గిడుగు వాక్ దర్శనం అనే ప్రకరణంలో వ్యావహారిక బాషా ప్రస్తావన తెచ్చారు. నన్నయ వాక్కు ఈనాటి భాష చక్కటి వివరణ.

1988-89 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉత్తమ గ్రంథ రచన పోటీలో తన పరిశోధనా గ్రంథానికి ప్రథమ బహుమతి పొందారు. విషయం – శిష్ట సాహిత్యంలో జానపద ధోరణులు. 1989లో అక్షర ప్రసార ప్రచురణగా వెలువరించారు. ఈ గ్రంథాన్ని పూజ్య పితరులు ఆదిలక్ష్మి సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రిగార్లకు, గురువులు, సునీత, జి.యన్.రెడ్డి గార్లకు అంకితం చేశారు. జానపద సాహిత్యంపై ఇది మౌలిక రచన.

నా అనుబంధం:

బ్రహ్మానంద నాకు చక్కని మిత్రులు. 1990-93 మధ్య నేను అనంతపురం ఆకాశవాణి డైరక్టరుగా వున్నప్పుడు సన్నిహిత పరిచయం. 2005లో వీరి పర్యవేక్షణలో నా సమగ్ర రచనలపై పి. పోతులయ్య అనే విద్యార్థి మూడేళ్ళు పి.హెచ్.డి. కోసం పోరాడాడు. విషయమంతా సిద్ధమైంది. అతనికి టీచరు ఉద్యోగం ధర్మవరంలో వచ్చింది. పరిశోధన గంగలో కలిసింది.

అనంతలక్ష్మీకాంత సాహితీ పీఠం పేర మా నాన్నగారి స్మారకంగా ఏటా ఇచ్చే సాహితీ పురస్కారాన్ని 2005 ఆగస్టులో బ్రహ్మానందకి మా స్వస్థలమైన శ్రీకొలనులో ప్రదానం చేశాం. ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత సభాకార్యక్రమంలో ఆయన హరికథ చెప్పి గ్రామస్థులను మెప్పించటం హైలైట్.

ఐదేళ్ళ పాటు తిరుపతి దేవస్థానం వారి ధర్మప్రచార కార్యక్రమాలు బ్రహ్మానంద విస్తృతంగా నిర్వహించగలిగారు. వీరి రచన – బహుదూరపు బాటసారి – ఘంటసాలకు కానుక.

1984లో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి కె. భాస్కరన్ నుంచి స్వర్ణపతకం స్వీకరిస్తున్న రచయిత

అభినవ భారతి:

అభినవ భారతి బిరుదనామం గల తుమ్మపూడి కోటీశ్వరరావు విశ్వనాథ సాహిత్యారాధకులు. ప్రాచీన సాహిత్యంపై పట్టు గల అధ్యాపకులు. తొలి రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసి క్రమంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అధ్యాపకులయ్యారు. అనంతపురంలో పి.జి.సెంటర్ ఏర్పడినప్పుడు రీడర్‍గా ప్రవేశించి ఆచార్యులుగా అధ్యాపనాలు కొనసాగించి రిటైరయ్యారు.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఈమని గ్రామంలో 1934 ఫిబ్రవరి 10 న కోటీశ్వరరావు జన్మించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని పర్యవేక్షణలో ఆముక్తమాల్యద సౌందర్యంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి 1967లో పి.హెచ్.డి. పొందారు. తెలుగు పరిశోధన (ఉస్మానియా) అనే వ్యాసంలో దివాకర్ల ఈ గ్రంథాన్ని ఇలా ‘మహతి’ (యువభారతి ప్రచురణ -1972)లో ప్రశంసించారు:

“ఆముక్తమాల్యద యందలి ప్రధాన రసము వీరమని వారు నిరుపించిన తీరు వారి ప్రతిభాపాండిత్యములను వ్యక్తము చేయుచున్నది. ప్రౌఢమైన ఆ ప్రబంధమును క్షుణ్ణముగా పఠించి, అందలి రహస్యములను స్వాయత్తము చేసికొని సామాన్యులకు కూడా సుబోధమగునట్లు వారు వెల్లడించిన విధము ప్రశంసింపదగి యున్నది.”

కోటీశ్వరరావు 1966లో ‘కుమార భారతి’ పద్యకావ్యం వ్రాశారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ ‘కథోద్ఘాతం’ అనే పేరుతో ముందుమాట వ్రాశారు.

“ఇదొక పరమాశ్చర్యకరమైన రచన. కావ్య శైలి ప్రౌఢం. ఇందులో చండప్రచండులైన నాచన సోమన, శ్రీ కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, విశ్వనాథ సత్యనారాయణ – ఇలాంటి వాళ్ళు కన్పిస్తారు” అని కితాబు నిచ్చారు.

అధ్యాపకులుగా తుమ్మపూడి ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హరివంశ వ్యాఖ్యాన ప్రాజెక్టులో కొన్ని సంవత్సరాలు పని చేశారు. వీరి రచనలు – బండారు తమ్మయ్య (కేంద్ర సాహిత్య అకాడమీ), శ్రీమద్రామయణ కల్పవృక్షము – శాంత రసము, శివసూత్రాలు, ఆముక్తమాల్యదకు సౌందర్యలహరీ వ్యాఖ్యానం (2001), సాయిలీలా సమాధి, అరవిందుని గ్రంథాలు ఈశావాస్యము, కేనోపనిషత్తులకు భాష్యారవిందము (వ్యాఖ్యలు).

2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని ‘కళారత్న’ పురస్కారంతో సన్మానించింది. వీరు ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డారు.

ఆర్ట్స్‌కో అనంతపురం వారిచే రచయితకు సన్మానం

జ్ఞానాంజన శలాక:

శలాక రఘునాథశర్మ సంస్కృతాంధ్ర భాషా నిష్ణాతులు. ఆచార్యులుగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో మూడు దశాబ్దాలు పని చేసి శిష్య వాత్సల్యం ప్రకటించారు. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయంకృషితో చదువుకుని పండితులతో శభాష్ అనిపించుకొన్నారు. కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని గొల్లపల్లి వీరి జన్మస్థలం. సరిగ్గా 80 ఏళ్ళ క్రితం 1941, జూలై 23వ తేదీన దుర్గమ్మ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిరిపల్లిలో ఒకరి యింట చదువుకొన్నారు. 1960లో తెలుగు, సంస్కృత భాషలలో భాషా ప్రవీణను మొదటి ర్యాంకులలో పాసయ్యారు.

1967లో తెలుగు భాషా సాహిత్యాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. డిస్టింక్షన్ సాధించారు (స్వర్ణపతకం). 1975లో భారతంలో ధ్వని దర్శనం అనే అంశంపై పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం వెలువరించారు (కోరాడ మహాదేవశాస్త్రి పర్యవేక్షకులు).

డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో రేడియో ఇంటర్వ్యూ

అధ్యాపకుడిగా తొలి అడుగులు:

భాషా ప్రవీణ పూర్తి కాగానే 1960-65 మధ్యకాలంలో ఉన్నత పాఠశాలల్లో విశాఖ, శ్రీశైలం, ఏలూరులలో తెలుగు పండితుడిగా పనిచేశారు. ఐదేళ్ళు అక్కడ పనిచేసి హైదరాబాదులోని ఆంధ్ర ప్రాచ్యకళాశాలలో ఉపన్యాసకులయ్యారు. అనంతపురంలో పి.జి. సెంటర్ ప్రారంభించినప్పుడు 1968 జూలైలో తెలుగు శాఖలో లెక్చరర్‌గా చేరి, రీడర్‌గా, ప్రొఫెసర్‌, డీన్‌ పదవులధిష్ఠించారు. 16 సంవత్సరాలు ఆచార్య పదవి నధిష్ఠించి  24 మంది డాక్టరేట్లు, 23 మంది ఎం.ఫిల్. పట్టాలు పొందడానికి పర్యవేక్షకులయ్యారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణాంతరం రాజమండ్రిలో స్థిరపడ్డా, తరచూ ఉపస్యాసాలకు వివిధ ప్రాంతాలు సంచరిస్తూ అశీతి వర్షప్రాయులయ్యారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి మహామహోపాధ్యాయ బిరుదు అందుకొన్నారు.

శ్రీ శలాక రఘునాథశర్మ పదవీవిరమణ కార్యక్రమం

రచనా ధురంధరులు:

హైదరాబాదు లోని హైకోర్టు న్యాయమూర్తి పి.కోదండరామయ్య పూనికపై వ్యాసభారత పర్వాలకు విపుల వ్యాఖ్య తాత్పర్యసహితంగా రచించారు. ఇతర రచనలలో – కవిత్రయ భారత జ్యోత్స్న, ఆర్షభావనా వీచికలు, శ్రీ షట్పదీ కనకధారలు, సనత్సు జాతీయ సౌరభం, శివానందలహరి హంస, భాగవత నవనీతము, విదురనీతి, యక్షప్రశ్నలు, పాణినీయ వ్యాకరణానువాదము, సహృదయ భావలహరి, సూక్తి చంద్రిక, వరాహ పురాణం, మహాభారత వ్యాఖ్యానం, గురుగీత ప్రముఖాలు.

2011లో అప్పాజోశ్యుల విశిష్ట సత్కారం, కంచి, శృంగేరీ పురస్కారాలు, రాష్ట్రపతి పండిత పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, గుప్తా ఫౌండేషన్ అవార్డు ఆయన ప్రతిభకు గుర్తింపులు. దివాకర్ల వెంకటావధానిచే గురువును మించిన శిష్యుడని ప్రశంసించబడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here