రంగుల హేల 41: చిత్రమైన హింసలు

15
3

[box type=’note’ fontsize=’16’] “ఏడుస్తూ నవ్వడంలోని వైరాగ్యం ఏ చిత్రకారుడూ చిత్రించలేడు. ఇలాంటి చిత్ర హింసల పరంపర అనంతం” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]హిం[/dropcap]స అనగానే వరకట్నహింస లాంటి గృహ హింసలు గుర్తొస్తాయి. వాటికి చట్టాలూ, శిక్షలూ ఉన్నాయి. హెల్ప్ లైన్ లున్నాయి. అలా హింస పెట్టేవాళ్ళని ఆధారాలుంటే, వలేసి పట్టుకుని లోపల వేసేయ్యొచ్చు. కానీ నేను చెప్పబోయే హింసలకి ఏ విధమైన శిక్షలూ లేవు గాక లేవు. అసలవి శిక్షలనీ, పీడనలనీ నిరూపించడం కూడా కష్టమే. ఎలాగో వివరిద్దామనే సదుద్దేశంతోనే ఈ దుఃఖ పరంపర మీ ముందు కొచ్చింది.

సమాజంలోనూ, కుటుంబాల్లోనూ మనుషులు తోటి మనుషుల్ని పైకి అవి హింసలని గుర్తు పట్టలేని విచిత్రమైన హింసల్ని పెడతారు. కొన్ని వినడానికి సిల్లీగా ఉంటాయి. పడేవాళ్ళకి నరకప్రాయంగా ఉంటాయి. ఎవరూ ఇందుకు అతీతులు కారేమో. మీకు కూడా ఇలాంటి అనుభవాలు బోలెడు ఉండి ఉండొచ్చు. చూద్దాం రండి.

కొందరు పెద్దవాళ్ళకి ప్రతి మాటకీ దానికి సంబంధించిన గతపు రీలు గిర్రున తిరుగుతుంది. ఆ రీలు తిప్పుతూ తిప్పుతూ ఆ సుడిగుండంలో పడిపోయి మునిగి తేలి ఎప్పటికో ఒడ్డుకొస్తారు. ఒంటరిగా వాళ్ళు ఆలోచించుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎదుట వాళ్ళని కూడా ఆ జ్ఞాపకాల పడవ ఎక్కించి తీసుకుపోదామనుకుంటేనే తంటా. ఒకోసారి, బోసినోటితో ఉన్న బామ్మ గారు ముద్దుగా ఉందని పలకరిస్తే ఆవిడ బారినుంచి మనల్ని ఎవరూ రక్షించలేరు, గిల గిల కొట్టుకోవాల్సిందే.

కొన్ని ఇళ్లలో, డెబ్భై ఎనభైల పెద్దవాళ్ళుంటారు. ఆ ఇంటి వాళ్లంతా వాళ్లతో, సమయానికి ‘తింటారా? పడుకుంటారా?’ లాంటి రెండే మాటలు మాట్లాడుతుంటారు. ‘పాపం కదా పెద్దవాళ్ళని ఇలా అలక్ష్యం చెయ్యొచ్చా?’ అని జాలిపడి, మనమేదో గౌరవంకొద్దీ నాలుగు పళ్ళు తీసుకెళ్లి వాళ్ళ పక్కన స్టూల్ వేసుకుని కూర్చుని “ఆరోగ్యం ఎలా ఉందీ?” అనడుగుతాం. అంతే. మన జేబులోంచి ఓ గంట జారిపోతుంది. బుర్రంతా గజిబిజిగా అయిపోతుంది. మొహమాటం కొద్దీ ఆ పెద్దవాళ్ళెక్కించిన పడవలోంచి దూకలేక అందులో ఉండలేక విలవిల్లాడిపోతాం. ఎవరో దయ తలిచి మనల్ని వాళ్ళ బారినుండి దూరంగా లాక్కుపోయేవరకూ మనకు విముక్తి దొరకదు. ఇలాంటి చిత్ర హింసలు దుర్భరం. కానీ అనివార్యం.

ఒకసారి ఒక ధనికురాలైన మామ్మగారిని చూడడానికి నేనూ, నా మిత్రురాలూ వెళ్ళాం. ఆవిడకి ఒక వంట మనిషి ఉన్నాడు. వాడు మమ్మల్ని చూస్తూనే లోపలి వెళ్లి రెండే రెండు నిమిషాల్లో టీ తెచ్చిపెట్టాడు. ఆ టీ నీళ్లు నీళ్లుగా, సరిగా మరగకుండా కలర్ కూడా లేకుండా భయంకరంగా ఉంది. ఆ వంటవాడు “తాగండి, తాగండి” అని మేం తప్పించుకోవడానికి ఛాన్స్ ఇవ్వకుండా పారబోసే అవకాశం కూడా లేకుండా మా పక్కనే నిలబడి మా మీద కసి తీర్చుకున్నాడు. చిత్రహింసకి ఇది శాంపిల్ మాత్రమే. ఆవిడ భోంచేసి వెళ్ళమంది. “ఉండండమ్మా! వంట చేసేస్తాను మీక్కూడా” అన్నాడు వంటవాడు నవ్వు దాచుకుంటూ. తర్వాత ఆవిడ పోయేవరకూ ఆ ఇంటికి పోలేదు మేమిద్దరమూ.

ఓ రోజు లిఫ్ట్‌లో కనబడ్డప్పుడు, మా ఫ్లాట్స్‌లో ఉండే ఒకమ్మాయి చేతుల్లోంచి “మీ బేబీ ముద్దుగా బావుంది” అని ముచ్చటపడి అడిగి ఓ సెకను ఎత్తుకున్నాను. ఆ పిల్ల అర్జెంటుగా నన్ను ప్రేమించేసి, నా చేతుల్లోంచి దిగనంటుంది. తల్లి దగ్గరికి పోనంటుంది. వదిలించుకునేసరికి నా నూట యాభై రూపాయల డ్రైవాష్ చీర తుక్కుతుక్కయింది. పైగా ఓ అరగంట పోయింది. ఆ తర్వాత ఆ పిల్ల కనబడగానే నేను దాక్కునేదాన్ని. రాకాసి పిల్ల. పెద్దయ్యాక ఇంకెంతమందిని హింసిస్తుందో!

మన చిన్న పిల్లల్ని తీసుకుని బంధువులింటికెళితే ఒక రకం చిత్రహింస. వీళ్ళు తినరని చెప్పిన మనల్ని ఫూల్స్ చేస్తూ ఇంట్లో ఎప్పుడూ తిననివన్నీ అక్కడ తింటామంటారు. వాళ్ళ ఇల్లంతా తోటలో కోతుల్లా తొక్కి తొక్కి పడేసి మనల్ని ఇబ్బంది పెడతారు. పెద్దల్లో ఎన్ని రకాల శాడిస్టులుంటారో పిల్లల్లో కూడా అంతకంటే ఎక్కువే ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళతో ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటూ అంతు చిక్కకుండా ఏడిపిస్తుంటారు. వాళ్ళని కంట్రోల్లో పెట్టే విషయంలో మనం అన్నిరకాలుగానూ ఓడిపోతాం. మనం వాళ్ళకి బానిసల్లా పడి ఉంటే వాళ్ళకి గొప్ప సంతోషంగా ఉంటుంది.

మనింటికి హఠాత్తుగా గెస్ట్ లొచ్చినప్పుడు, అందరికీ తగినన్ని స్వీట్స్ లేనపుడు మన ఇంటిలోని మగాళ్ళనీ, పిల్లల్నీ ఆగమని సైగ చేసినా మనవంక చూడరు. “మీరూ తీసుకోండి” అని వాళ్లనగానే వాళ్ళకంటే ముందే అక్కడున్న అరడజను స్వీట్లూ వీళ్ళే తినేస్తుంటారు. ఇంకా కొన్ని తెమ్మని భర్తగారు ఆర్డర్ కూడా వేసి అందరిముందూ ఇంక లేవని మన నోటితో అనిపిస్తారు. ఇది హింస కాదా? భోజనాలు బంధువులకి వడ్డించి తర్వాత మనం తిందామనుకుంటే వాళ్ళకంటే మన పతి దేవుడూ, పిల్లలే ముందుగా టేబుల్ ముందు చక్కగా కూర్చుంటారు. మనం ఏది ఎవరికి పెడుతున్నామో తెలీని కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాం. వచ్చిన గెస్ట్‌లకి చక్కగా అన్నీ పెట్టి తర్వాత మిగిలినవి సర్దుకుందామంటే చచ్చినా కుదరదు. అప్పుడు మనం మొహం ఎలా పెట్టుకోవాలో తెలీక సతమతమవుతాం. బహుశా అక్కడ మన మొహం సకల దుఃఖ భావాల కలయికతో భయంకరంగా ఉండి ఉండొచ్చు. ఇంటి ఇల్లాళ్లు పడే హింసల్లో ఇదో రకం.

అప్పుడప్పుడూ ఇక్కడే ఉండే మా పిన్ని, ఏదో ప్రత్యేక పూజ చేశానని చెప్పి భోజనానికి పిలుస్తుంది. అంతా తప్పించుకుని నన్ను పంపుతారు. ఆవిడని మనింటికి పిలిస్తే రాదు. మనం మడిగా జాగ్రత్తగా వండమని ఆవిడ ప్రగాఢ విశ్వాసం. అంచేత ఆవిడ వంట మనం తినాలి కానీ మనది ఆవిడ తినదు. పెద్దావిడ బాధపడుతుంది కదా అని వెళితే టేబుల్ మీద నాలుగు కూరలు, పులుసు, వేపుడు, పులిహోర, పచ్చడి ఇంకా ఏవేవో ఉంటాయి. “అమ్మ బాబోయ్ ఇన్ని తినాలా?” అంటే “కష్టపడి చేశాను. తినడానికీ బాధేనా?” అని నిష్ఠూరమాడుతుంది. ఏదోలా తిందామని బ్రేక్‌ఫాస్ట్ కూడా మానేసి వెళతా. నేను పెట్టుకుంటా అంటే కోపం. అన్నీ వేసి ప్లేట్ నింపేస్తుంది. “పిన్నీ నేనేమన్నా చిన్నపిల్లననుకుంటున్నావా? ఇంత తినలేను” అంటే “నువ్వు నాకెప్పుడూ చిన్నపిల్లవే” అంటూ నవ్వుతుంది. ఎలాగో పట్టించి తింటుంటే ప్రసాదం అంటూ పళ్లెంలో పెద్ద గరిటెడు క్షీరాన్నం వేస్తుంది. తర్వాత తింటానంటే తర్వాత తినడానికి వేరే ఉన్నాయంటుంది. ఏడుపొస్తుంది తినలేక. ఆవిడ కళ్ళలో ఆనందం చూడడం కోసం అన్నీ తిని ఆయాసపడుతూ ఇంటికి రావడం ఆ రాత్రి తిన్నది అరక్క నిద్ర పట్టకపోవడం, డైజీన్ సిరప్పూ, టాబ్లెట్స్‌తో రాత్రి గడపటం జరుగుతుంది.ఇది హింస కాదా?

మా పెద్దమ్మ మనవడు “నేనూ నీలాగే కథలు రాస్తున్నా అత్తా చూడవా?” అంటూ ఒకో రోజు వచ్చి వాడు గీకి, రాసిన చెక్కలు ముక్కలు ఇచ్చి కూర్చుంటాడు. అవి చదవడం ఎంత హింసో పడ్డ వాళ్ళకి గానీ తెలీదు. నేనెందుకు ఖర్మ కాలి రచయితనయ్యానో అని దుఃఖించేట్టు చేసి పోతాడు. వీడి తమ్ముడు ఏకంగా సినిమాకే కథ తెచ్చా అంటూ ఒకోసారి వీడి వెనకే, వాడు చూసిన సినిమాల్లో ఉన్న కథలన్నీ కలిపి వండిన ఓ కిచిడీ కథ పట్టుకుని ‘ఆవ్‌సమ్ థీమ్’ అంటూ వస్తాడు. వాడితో సినిమా కథల చర్చలు చెయ్యాలి. అదో రకం యాతన.

మా పక్క ఫ్లాట్ ఓనర్ గారిది బొంగురు గొంతు. రిటైర్డ్ లెక్చరర్. ఎవరెవరితోనో రోజంతా అదే గొంతుతో కారిడార్‌లో గంటలు, గంటలు మాట్లాడుతూ ఉంటాడు. అటు వెళ్లాలంటే చెవిలో పోటొస్తుంది. అదొక వేదన. మనం ఎప్పుడైనా ఫోన్ పట్టుకుని సరదాగా అటు వెళదామంటే కుదరదు. ఆయన ఊరికి వెళతాడంటే నాకు ఆనందమే ఆనందం. పనమ్మాయి ఎందుకు డుమ్మా కొడుతుందో? అడిగితే ఆ కష్టాలన్నీ వినాలి. పక్కనే ఉండే ఊరికి నెలకి రెండు సార్లు వెళుతుంది. ఎందుకంటే ఎన్ని వినాలో? అడగక, వినక తప్పని చిత్ర హింస మామూలు వ్యథ కాదు. భరించక తప్పదు.

“ఎప్పుడూ ఇడ్లీలూ, దోశలేనా?” అని ఇంట్లో అందరూ గొణుగుతున్నారని, మనం యు ట్యూబ్‌లో వెదికి ఓ కొత్త బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ అవుతాం. అది సక్సెస్ అయ్యి బాగా కుదిరిందంటే “నీకుందా?” అని కూడా ఎవరూ అడగకుండా లాగించేసి బైటికి పోవడానికి పరిగెడతారు. అది గనక ఫెయిల్ అయితే ‘యాక్, బాక్’ అంటూ అంతా కిచెన్ లోంచి పారిపోయి ఫ్రిజ్‌ల్లో దూరి బ్రెడ్ల కోసం వేట మొదలుపెడతారు. బిస్కట్ ప్యాకెట్‌లు సర్రున తెగుతాయి. అందరి కళ్ళలో నిష్ఠూరం, నిరాశ తప్ప సానుభూతి ఉండదు. “ఏమైనా ఈ నెట్ వంటకాలు డేంజరే. హాయిగా మన అమ్మమ్మ, నానమ్మ చేసిన వంటలే హాయి” ఇంటిపెద్ద సన్నాయి నొక్కులు. పిల్లలు కాస్త సోఫిస్టికేటెడ్ కాబట్టి “సారీ మా!” అంటూ నంగి నంగి వేషాలు. నెయ్యీ, కాజూలూ, బాదాంలూ వేసి చేసిన ఆ కుదిరీ కుదరని వంటకం పారెయ్యలేక తినలేక మన శోకం ఎవరికి చెప్పాలి? ఇది చిత్ర హింసాత్మక మనోవేదన కాదా? మీరే చెప్పండి.

మా బంధువు ఒకావిడ వరసకి ఆడపడుచు అవుతుంది. పెద్దామె. కాస్త పలకరిద్దామని ఫోన్ చేస్తే వెయ్యి వివరాల డుగుతుంది. “ఏం వండావు? అది మా తమ్ముడు తినడు కదా? ఇప్పుడు తింటున్నాడా? ఏం చేస్తాడులే? పిల్లలకి పండక్కి పిండి వంటలేం చేసావు? మీ అత్తా, మావయ్యా ఎలా ఉన్నారట? ఎప్పుడొస్తారట? పండక్కి చీరలు కొనుక్కున్నావా? ఎన్ని? ఎలాంటివి? ఏ రేటు? మీ తమ్ముడు, మరదలూ ఎలా ఉన్నారు? వాళ్ళ పిల్లలేం చేస్తున్నారు? వాళ్ళింటికి నువ్వెళ్ళవా ఎప్పుడూ? అసలు పిలుస్తారా నిన్నూ?” లాంటి ప్రశ్నల పరంపర సాగుతూనే ఉంటుంది. ఆ యా సంగతుల గురించి నాకే సరైన జ్ఞాపకం, అవగాహన ఉండవు. అందుకే గబుక్కున జవాబు చెప్పలేను. కూడబలుక్కుని చెప్పాలి. అంచేత ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎవరో నా బ్రెయిన్‌లో సూది గుచ్చినంత బాధగా, నొప్పిగా ఉంటుంది.

మన మిత్ర రత్నాలెవరో పిలిచారని సాహిత్య మీటింగ్‌కి వెళితే దానికి ముందు సాంస్కృతిక కాలక్షేపం పేర పిల్లలు నాట్యం, పాటలు అంటూ ఓ గంట చేస్తారు. ఆవిష్కరణ ప్రముఖులంతా వచ్చేవరకూ ఆ ప్రోగ్రాం ఆగదు. మనకు విసుగెత్తిన తర్వాత మొదలైన అసలు కార్యక్రమంలో ఒక్కొక్క వక్తా స్వీయ విజ్ఞాన ప్రదర్శన చేస్తూ అతిగా మాట్లాడి బోర్ కొట్టిస్తారు. ఒక్క గంటే కదా అని వెళితే మొత్తం నాలుగు గంటలు బలి అవ్వాలి. ఇంతా చేస్తే “చాలా థాంక్స్ అండీ” అన్న ఒక్క లాభపు ముక్క దొరుకుతుందంతే. మనకి మెడ నొప్పీ, నడుము నొప్పీ రిటర్న్ గిఫ్ట్‌లుగా మిగులుతాయి. మనం పడ్డ హింసకి ఎవరు జవాబుదారీ?

మా నానమ్మ చిట్టి చెల్లెలు దగ్గర దగ్గరగా తొంభై ఏళ్ళవయసు. ఒక వృద్ధాశ్రమంలో ఉంటారు. ఆమెను దగ్గరుంచుకుని భరించలేక కొడుకులూ, కూతుళ్ళూ, మనవలూ అంతా ఆమెనక్కడ పెట్టి నెలకొకళ్ళు వెళ్లి చూసి వస్తూ ఉంటారు. ఆవిడ చక్కగా ఆ ఆశ్రమంలో పరపతి సంపాదించి స్వయంగా వండుకునే ఏర్పాటు చేసుకుంది. మనం తింటే చచ్చిపోయేంత పులుపు ఉండేలా చింతకాయలూ, మావిడికాయలూ, నిమ్మకాయలతోనే ఆవిడ వంటలుంటాయి. ఆవిడకెప్పుడైనా నా వంతుగా ఫోన్ చెయ్యాల్సి వచ్చి చేస్తా. “ఒక పదినిమిషాలు ఫోన్ చెయ్యడానికి ఖాళీ లేదేంటి నీకు?” అని ఓ మొట్టికాయతో మొదలుపెట్టి ఆవిడ కష్టాలన్నీ రికార్డు వేస్తుంది. పెట్టెయ్యడానికి లేదు ఫోన్. ఎప్పటికో ఆవిడకి జాలేసి “సర్లే పనులున్నాయేమో చూసుకో. మళ్ళీ ఎప్పుడు చేస్తావ్?” అని మన చేత ప్రామిస్ కూడా తీసుకుని వదుల్తుంది. అప్పుడు పులి నోట్లోంచి బైటపడినంత సంతోషం కలుగుతుంది. మళ్ళీ నెలవరకూ హాయి అనుకుంటాను.

ఒకసారి మా ఊరికి వెళ్ళినపుడు నా పుస్తకాలు అందరికీ ఇస్తూ మా బంధువొకాయనకి కూడా ఇచ్చాను. తిరిగి వచ్చిన వెంటనే “చదివానమ్మా బావున్నాయి” అని ఆయన్నుంచి ఫోన్ వచ్చింది. ఎంతో మురిసిపోయాను. ఆయన్ని పొగిడేసాను “ఇంత త్వరగా చదివావా మావయ్యా?” అని. ఆ రోజు సరిగ్గా గంటన్నర మాట్లాడాడు. వారం తిరగ్గానే మళ్ళీ ఫోన్. తాను కూడా రాద్దామనుకుని రాయని సబ్జక్టుల గురించి చెప్పాడు. ఆ రోజు గంట, మళ్ళీ వారం మరో గంట. ప్రత్యక్ష నరకం చవి చూసాను. ఇంకెప్పుడూ నా పుస్తకాలు ఎవరికీ ఇవ్వనని చెంపలు వేసుకున్నా. ఆ తర్వాత ఆయన ఫోన్ ఎత్తడం మానేసాను. నేను ఫోన్ ఎందుకు ఎత్తడం లేదో చెప్పమని మరో బంధువు చేత ఫోన్చేయించాడు. “అయ్యో! నేను చూసుకోలేదేమో! ఇప్పుడే చేస్తా” అని అబద్ధం ఆడి తప్పించుకోవాల్సి వచ్చింది. దీన్నేమంటారో మీరే చెప్పండి.

మానవ జన్మ పూర్తయ్యి పైకి వెళ్ళాక చిత్రగుప్తుడు మన చేసిన పాపాలను బట్టి శిక్షలు వేస్తాట్ట. నూనె మూకుడులో వేయించడం, కొరడాలతో కొట్టించడం లాంటివి. భూమ్మీద మనం పడే హింసల తాలుకు బాధలు కూడా అందుకు తక్కువేమీ కాదు. కాస్త అటూ ఇటూగా అంతటి క్షోభ మనమూ పడుతుంటాం రకరకాల సందర్భాల్లో.

ఊర్నుంచి ఎవరైనా చుట్టాలు మనింటికి వచ్చి ఓ వారం రోజులు ఉన్నప్పుడు మనకి ఘోర నరకం ప్రత్యక్షంగా కనబడుతుంది. వాళ్ళకి మంచి వంటలు వండడానికీ, నవ్వుతూ కబుర్లు చెప్పడానికీ, అక్కడికీ ఇక్కడికీ తిప్పడానికి కలగని బాధ వాళ్ళు లేచిన దగ్గరినుంచీ పెట్టి చూస్తున్న టీ.వీ. వల్ల కలుగుతుంది. పెద్ద సౌండ్ పెట్టి నాన్‌స్టాప్‌గా సీరియల్స్ ఎన్నోస్తే అన్నీ యాడ్‌లతో సహా చేటలంత మొహాలు పెట్టుకుని చూసే వారి ఓపిక్కి చేతులెత్తి మొక్కాల్సిందే. మనకి మాత్రం జుట్టు పీక్కోవాలనిపించేంత దుఃఖం కలిగి పిచ్చెక్కుతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేం. చెప్పుకుంటే నిష్ఠూరాలొస్తాయి. పైగా ఇన్నేళ్లు కాపురం చేసిన జీవితభాగస్వాములు సైతం అపరిచితులుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మరంచేత నోరు మూసుకుని ఈ హింస భరించాల్సిందే. మార్గాంతరం లేదు.

వంటింట్లో నీళ్లు రాకపోవడం, సింక్ లీక్ అయిపోవడం, గ్యాస్ బర్నర్ సన్నగా మండటం లాంటి పీత కష్టాలొచ్చినప్పుడు ఇంటిల్లిపాదీ ఈ సమస్య నీది, మాది కాదన్నట్టుగా మౌనంగా ఎవరిపని వారు చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి మనసులో ఎంత వ్యథ కలుగుతుందో పడ్డ వారికి కానీ తెలీదు. టైలర్, చాలా ఖరీదైన చీర మీద బ్లౌజ్‌ని నాయనమ్మ జాకెట్‌లా కుట్టి సర్వనాశనం చేసి “బానే ఉంది మేడం” అని ఓదారుస్తుంటే, ఏడుస్తూ నవ్వడంలోని వైరాగ్యం ఏ చిత్రకారుడూ చిత్రించలేడు. ఇలాంటి చిత్ర హింసల పరంపర అనంతం. అవునంటారా ? కాదంటారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here