కాజాల్లాంటి బాజాలు-82: టైమేదీ?

0
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ పొద్దున్నే వదినకి ఫోన్ చేసేను.. మా మధ్య సంభాషణ ఇదిగో ఇలా నడిచింది..

వదిన – హలో స్వర్ణా.. ఏంటింత పొద్దున్నే కాల్ చేసేవ్?

నేను – షాపింగ్‌కి వెళ్ళాలొదినా, కలిసివెడదాం వస్తావా.. అని అడుగుదామని..

వదిన – ఎన్ని గంటలకి…

నేను – పిల్లలని స్కూల్‌కి పంపి బయల్దేరితే కాస్త తీరిగ్గా అన్ని పన్లూ చూసుకుని వచ్చెయ్యొచ్చు. తొమ్మిదిన్నరకి బయల్దేరదామా?

వదిన – తొమ్మిదిన్నరకా.. అ టైమ్‌లో “ఆ” టీవీలో “నిన్ను పొడుస్తా” సీరియల్ వస్తుంది. నిన్ననే కోడలు మార్కెట్ నుంచి మంచి పదునైన కత్తి కొని తెచ్చింది. ఇవాళ అత్త వెడుతుందిట మార్కెట్‌కి. ఏం తెస్తుందో చూడాలి..

నేను – సరే.. అలాగైతే పదింటికి వెడదాం..

వదిన – అయ్యో.. పదింటికి అసలు కుదర్దు. “హా” టివీలో “నన్నే చూడు” లో ఇవాళ కొత్తరకంగా బ్లౌజ్ కుట్టించుకొస్తానని అందులో యాక్ట్ చేసే అమ్మాయి నిన్న చెప్పింది. అదేమిటో చూడొద్దూ!

నేను – సరే.. పోనీ.. పదకొండింటికి వెడదామా?

వదిన – పదకొండింటి కయితే “ఛ్ఛా..” చానల్లో “ఇంటింటి పుకారు..” వస్తుంది. ఒక్కొక్కింటి పుకార్లూ బలే బాగుంటాయిలే.. గోరంత విషయాన్ని కొండంత చేసి భలే చూపిస్తారు..అప్పుడసలు కుదర్దు..

నేను – హూ.. పోనీ పన్నెండింటికి వెడదామా?

వదిన – ఇంకా నయమే.. పన్నెండింటికి “థూ” లో “వజ్రాలవేట” వస్తుంది. దానికి మనం ఎస్.ఎమ్.ఎస్ చేస్తే వజ్రాలు వస్తాయి తెల్సా? మంచిదానివే.. ఆ టైమ్‌లో రమ్మంటావా..

నేను – అయితే ఓ పని చేద్దాం. ఒంటిగంటకి ఠంచనుగా బయల్దేరదాం.

వదిన – ఇంకా నయవే.. ఆ టైమ్‌లో “మస్త్ ఖుషీ” వస్తుంది. అందులో యాంకర్లిద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు. ఎవరి మీద ఎవరు పడతారా అని భలే సస్పెన్స్‌లో పెడతారు. అప్పుడయితే అస్సలు రాను.

నేను – అమ్మా, తల్లీ.. పోనీ రెండింటికి వెడదామా? కనీసం అప్పుడైనా వెడితే పిల్లలు ఇంటికి వచ్చే టైమ్‌కి రాగలం..

వదిన – అదేంటి సరళా.. అలా తెలీనట్టు మాట్లాడతావూ.. అసలు ఆడవాళ్ల ప్రోగ్రాములన్నీ వచ్చేవి అప్పట్నించే కదా.. ఎవరెవరు వంట చేస్తున్నప్పుడు ఎటువంటి మెహెందీ పెట్టుకున్నారో, వాళ్ళు వంటకి వాడే వస్తువులు ఉప్పూ, చింతపండూలాంటివి వెండిగిన్నెల్లో పెట్టేరో..లేక ఏకంగా బంగారం గిన్నెల్లోనే పెట్టేరో.. వాళ్ళు కట్టుకున్న చీర యెన్నివేలు చేస్తుందో, బ్లౌజ్ డిజైన్ బాక్ లెస్సో కాదో.. ఇలాంటివన్నీ చూసేది అప్పుడే కదా.. ఆ టైమ్‌లో బైట కెడితే యెన్ని మిస్సయిపోతాం..

నేను – మహాతల్లీ, నువ్వు రావద్దులే.. నేనే వెడతాను. నువ్వా టీవీలో మునిగితేలుతూండు.. జన్మ తరిస్తుంది..

వదిన – హ హ హ.. స్వర్ణా .. భలే చెప్పేనుకదా టీవీలతో గోల. ఆ ప్రోగ్రాములు చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది.. ఎవరికైనా చెప్పుకుందామంటే రిమోట్ నీ చేతిలోనే వుంది కదా, ఆపేసుకో అంటారు. టీవీ ఆపేసుకుంటే ఆగేట్లుగా లేదు నా కడుపులో బాధ. అందుకే నిన్ను బలి చేసేసేను.

స్వర్ణా, ఓ సంగతి చెప్పనా.. అసలు నేను టీవి ఆన్ చెయ్యడం యెప్పుడో మానేసేను. ప్రాణానికి సుఖంగా వుందనుకో.. అలాగే తొమ్మిదిన్నరకే బయల్దేరివెళ్ళి, అన్ని పనులూ చేసుకునొద్దాం. సరేనా!

నేను – నీ మాటలతో హడలెత్తించేసేవ్ వదినా!

వదిన – లేపోతే.. నేనేం అల్లాటప్పా వదిన్ననుకున్నావా..

నేను – హబ్బే.. వదినా…మజాకానా అనుకున్నానులే..

అంటూ ఫోన్ పెట్టేసి నిజంగానే వదినా మజాకానా అనుకున్నాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here