కమలా నెహ్రూ

11
3

[dropcap]01[/dropcap]-08-2021వ తేదీ శ్రీమతి కమలా నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె ఒక ప్రధాని అమ్మమ్మ, ఒక ప్రధాని తల్లి, ఒక ప్రధాని భార్య అయినా వారిని ప్రధానిగా చూడలేదు. అసలు స్వతంత్ర భారతాన్నే చూడలేదు. స్వాతంత్ర్య పోరాటం కోసం కుటుంబం మొత్తం పోరాటంలో పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈమె కూడా అరెస్టయి జైలుకి వెళ్ళారు. స్త్రీ విద్యకు, స్త్రీ ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు. తమ ఇంటినే హాస్పటల్‍గా మార్చారు. అనారోగ్యాన్ని లెక్క చేయలేదు. ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఆమే కమలా నెహ్రూ.

ఈమె 1899 ఆగష్టు 1వ తేదీన పాత ఢిల్లీలో జన్మించారు. వీరిది కాశ్మీరీ బ్రాహ్మణ పండిట్ కుటుంబం. తల్లిదండ్రులు రాజాపతి, జవహర్‌లాల్ కౌల్. సనాతన సాంప్రదాయ కుటుంబం కావడంతో పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు. ఇంటి దగ్గరే పండిట్, మౌల్వీల దగ్గర సాధారణ విద్యను అభ్యసించారు. ఆంగ్లం చదవనే లేదు. అద్భుతమైన సౌందర్యవతి.

1916లో అలహాబాదు చెందిన ప్రముఖ న్యాయవాది మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూతో ఈమె వివాహం జరిగింది. అత్తవారిల్లు పాశ్చాత్య సంస్కృతికి నెలవు. ఆమె సరిగా ఇమడలేకపోయింది. నెమ్మదిగా అలవాటు పడింది. 1917 నవంబర్ 19న కుమార్తె జన్మించింది. ఆమే స్వర్గీయ భారత మహిళా ప్రధాని ఇందిరాగాంధి. 1924లో ఒక బాబు పుట్టాడు కాని ప్రీమెచ్యూర్డ్ బేబీ కావడంతో వారంలోగా చనిపోయాడు.

జవహర్‌లాల్ బాపూజీ అనుచరునిగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కాని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు ఆయనకి పూర్తి మద్దతు ఇచ్చి జాతీయోద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించారు. అంతేకాదు గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం స్వదేశీ సాంప్రదాయ పద్ధతులలో జీవించమని, పాశ్చాత్య పద్ధతులను విడనాడమని సలహా ఇచ్చారు. కాలక్రమంలో భార్య చెప్పిన విషయాలను అవగాహన చేసుకుని మారారు జవహర్ లాల్.

దేశమంతా అట్టుడుకుతున్న స్వాతంత్ర్య పోరాటం. వేలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు పిలుపునిచ్చిన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు ప్రజలు. ఆయన పిలుపునందుకుని స్త్రీ పురుష, కులమత, ప్రాంతీయ బేధాలు లేకుండా ఉద్యమించారు.

1921లో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో కమల కూడా పాల్గొన్నారు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. ఆమెను చాలామంది మహిళలు అనుసరించారు. విదేశీ దుస్తులమ్మే షాపులకి వెళ్ళి వాటిని వీథిలో పడేసి భోగిమంటలు వేసి కేరింతలు కొట్టేవారు. మద్యం షాపుల ముందు పికెటింగ్ చేసేవారు. ఈ కార్యక్రమాలన్నింటినీ అలహాబాద్ కేంద్రంగానే నడిపించారు.

‘దేశసేవికా సంఘాలను’ ఏర్పాటు చేశారీమె. ఈ సంఘాల ద్వారా మహిళలందరినీ కలిపి ఉద్యమ కార్యకలాపాలను నిర్వహించారు.

జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ప్రసంగంలో పాల్గొనడానికి బయలుదేరినపుడు ఆయనను అరెస్టు చేశారు. అయితే కమల ఆయన బదులుగా వెళ్ళి ప్రసంగించారు. ఆమె ప్రసంగం ప్రజలను ఉత్సాహపరిచింది. కమల ప్రసంగానికి లభించిన ప్రతిస్పందనను గమనించిన బ్రిటీష్ అధికారులు ఆమెతో ప్రమాదమని అర్థం చేసుకున్నారు.

ఆమెని అరెస్టు చేశారు, 2 నెలలు జైలు శిక్ష విధించారు. అయితే మోతీలాల్ నెహ్రూ అనారోగ్యం కారణంగా 26 రోజుల తరువాత విడుదల చేశారు.

ఈమె అత్తగారు స్వరూపరాణి నెహ్రూ, శ్రీమతి కస్తూర్బా గాంధి, శ్రీమతి సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ, దుర్గాబాయి దేశ్ ముఖ్ వంటి విభిన్న ప్రాంతాల జాతీయ పోరాట నాయకురాళ్ళతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. కొంతకాలం కస్తూర్బాతో కలిసి గాంధీ ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమ జీవితంలో లోక నాయక్ జయప్రకాష్ నారాయణ్ సతీమణి శ్రీమతి ప్రభావతీదేవికి సన్నిహితులయ్యారు.

జవహర్‌లాల్ నెహ్రూ జైలులో ఉండగా అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయం తెలిసిన కమల తట్టుకోలేకపోయారు. ఈమె కూడా అనారోగ్యం పాలయ్యారు. భర్త జైలులో ఉన్నారు. ఒక్కగానొక్క కూతురు ఇందిర ‘శాంతినికేతన్’లో చదువుకుంటుంది. అందువల్ల ఒంటరితనం ఈమెను క్రుంగదీసింది.

1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మహిళా బృందాలను ఏర్పాటు చేశారు. నిషేధించిన ఉప్పును బ్రిటీష్ వారి చట్టాలకి వ్యతిరేకంగా అమ్మిన తొలి మహిళాదళ నాయకురాలు ఈమే!

1931 నాటికి ఆమె అనారోగ్యం పాలయ్యారు. అయినా జాతీయ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు. ఊరేగింపులకు నాయకత్వం వహించారు. ఒకసారి ఇటువంటి సమావేశంలోనే స్పృహ తప్పి పడిపోయారు. దగ్గరలోనున్న ఫిరోజ్ స్నేహితులతో ఆమెకి సపర్యలు చేశారు.

ఆమెకి క్షయ వ్యాధి అని నిర్ధారించారు. అల్మోరా సమీపంలోని భావాలిలోని క్షయ ఆసుపత్రిలో చేర్చారు. 2 నెలల తరువాత ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. అయినా యూరప్ తీసుకుని వెళితే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. కొంతకాలం రామకృష్ణా మిషన్‌లో గడిపారు. శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మా ఆనందమయి వంటి ఆధ్యాత్మికవేత్తల బోధనలు ఆమెకి సాంత్వన చేకూర్చేవి.

1934 నాటికి క్షయవ్యాధి బాగా ముదిరిపోయింది. 1935లో యూరప్ బయలుదేరారు. ముందుగా జర్మనీకి, ఆ తరువాత స్విట్జర్లాండకు తీసుకుని వెళ్ళారు. యూరప్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూరప్‌లో కమలా నెహ్రూకి స్వంత సోదరునిలా అన్ని సౌకర్యాలను కల్పించే ఏర్పాట్లు చేశారు. స్విట్జర్లాండ్ లోని ‘లాసేన్’ శానిటోరియంలో చేర్చారు.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది. భారతదేశంలో నేతాజీకి గాంధేయులకు సిద్ధాంత వైరుధ్యముంది. అయినప్పటికీ అవన్నీ మరచిపోయి నేతాజీ కమలా నెహ్రూకి భరోసా ఇచ్చారు. ఈనాటి నాయకులు ఈ విషయాన్ని గమనించి సామరస్యం అంటే ఏమిటో అవగాహన చేసుకోవలసి ఉంటుంది.

కొన్ని వారాలపాటు మంచి వైద్యం లభించింది. అయినా ఫలించలేదు. 1936 ఫిబ్రవరి 28వ తేదీన ఆమె మరణించారు. కుమార్తె ఇందిర, అత్తగారు స్వరూపరాణి, భర్తలకు తోడు బోస్ కూడా పక్కనే ఉన్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు కూడా బోస్ స్వయంగా చూసుకున్నారు.

కమల స్వాతంత్ర్య పోరాట యోధురాలే కాదు. సంఘసేవకురాలు కూడా! ఆమె అసలు సిసలు స్త్రీవాది. ముఖ్యంగా ఉత్తరభారతంలో ఎక్కువగా అనుసరించే మహిళల పర్దా పద్దతిని వ్యతిరేకించింది. పరదా ముసుగులో నుంచి బయటపడి జనజీవన స్రవంతిలోకి రమ్మని ప్రోత్సహించారు.

మహిళలకు ఆర్థిక స్వేచ్చ కావాలని పరితపించారు. అయితే ఆర్థిక స్వేచ్చ కావాలంటే వారు చదువుకోవాలని నొక్కి వక్కాణించారు.

మహిళల విముక్తి ఉద్యమాలకు ప్రోత్సాహాన్ని అందించారు. వారి హక్కుల కోసం పరితపించారు, పోరాటం మొదలు పెట్టారు.

“నేను ఆమెని దాదాపు పట్టించుకోలేదు” అని జవహర్ లాల్ నెహ్రూ తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. అయితే కమల భర్త పట్ల చాలా బాధ్యతగా ఉండి స్ఫూర్తినిచ్చారు. దానికి ఈ రెండు నిదర్శనం. జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ తన ‘ఆనందం యొక్క పరిధి: ఒక వ్యక్తిగత జ్ఞాపకం’ పుస్తకంలో “ఆత్మబలిదానం కోసం గాంధీ పిలుపును తీవ్రంగా పరిగణించారు. జవహర్‌ను తన రాడికలిజంలో ప్రోత్సహించారు. మరియు అతని జీవన విధానాన్ని మార్చమని కోరారు కమల” అని వ్రాశారు.

జవహర్ మరో చెల్లెలు కృష్ణహతీసింగ్ ‘ప్రియమైన వారికి ఇదిగో: ఇందిరాగాంధి యొక్క ఆత్మీయ చిత్రం’లో “కమలా జవహర్‌కి ఓదార్పునిచ్చింది. మరియు ఆమె ఎంత అనారోగ్యానికి గురయిందో అతనికి ఎప్పటికీ తెలియజేయలేదు. అతనిపట్ల ఎప్పుడూ ఆశాజనకంగా ఉండేది. మరియు ఆమె జవహర్ దగ్గర ఉన్నప్పుడల్లా అతనిని ఓదార్చింది. అతనికి ఆందోళన కలిగిన క్షణంలో కొత్త ధైర్యాన్ని కలిగించింది” అని వ్రాశారు.

ఆమె అచ్చమైన భారతీయ గృహిణికి ప్రతీకగా ఈ రెండు విషయాలు మనకి తెలియజెపుతాయి.

1932 జనవరి 1వ తేదీన కమలా నెహ్రూని అరెస్టు చేశారు. “నా భర్త అడుగుజాడలలో నడవగలిగినందుకు గర్వంగా భావిస్తున్నాను. ప్రజలు కూడా ఉద్యమానికి స్ఫూర్తినివ్వాలి” అని చెప్పారామె.

అలహాబాద్‌లోని వారి నివాసం ‘ఆనందభవన్’లో కొన్ని గదులను పాక్షికంగా హాస్పటల్‌కు కేటాయించే ఏర్పాట్లు చేయించారు. ఈ హాస్పటల్‌లో స్వాతంత్ర పోరాటంలో గాయపడిన వారికి, స్వాతంత్ర పోరాటయోధుల కుటుంబ సభ్యులకి, అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలను అందించేవారు. వారందరి బాగోగులను స్వయంగా పర్యవేక్షించేవారు. తరువాత ఇది ‘కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పటల్’గా మారింది.

అనేకమంది పేదలకు సాయం చేసేవారు. స్వాతంత్ర సమరయోధులు మరణించినపుడు వారికి తన పనివారితో, తన డబ్బుతో అంత్యక్రియలు చేయించేవారు.

ఈ విధంగా సనాతన కాశ్మీరీ పండితుల కుటుంబంలో పుట్టి, పాశ్చాత్య సంస్కృతికి నిలయమైన ధనికుల ఇంట మెట్టి, ఆ ఇంటి సభ్యులను బాపూజీ సిద్ధాంతాల ప్రకారం జీవించేటట్లు మార్చి, సంఘ సేవకురాలిగా, స్వాతంత్ర పోరాట యోధురాలిగా జీవించి, క్షయవ్యాధికి లోనై, స్విట్జర్లాండ్ దేశానికి వైద్యం నిమిత్తం వెళ్ళి, అక్కడి మట్టిలో కలిసిపోయిన అద్భుత వజ్రం కమలా నెహ్రూ.

పుట్టినిల్లు-మెట్టినిల్లు ఆగర్భ శ్రీమంతులే! డబ్బుకి లోటులేదు. కాని మానసిక అశాంతి, కుమారుడు పుట్టి చనిపోయిన అనారోగ్యం, ఓంటరితనం ఆమెను మానసికంగా క్రుంగతీశాయి. డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యాన్ని కాపాడుకోలేము. మనశ్శాంతి లేకుండా ప్రాణాలు నిలుపుకోలేము. వీటన్నింటికీ ఉత్తమోత్తమ సోదాహరణ కమలా నెహ్రూ జీవితం.

ఈమె 1974 ఆగష్టు 1వ తేదీన 25 పైసల విలువతో ఒక స్టాంపును ముద్రించింది తపాలాశాఖ. వజ్రాకారంలోని స్టాంపు మీద ‘ఢిల్లీకే అందం’ అని పేరొందిన కమల మేలి ముసుగులో ముగ్ధమనోహరంగా దర్శనమిస్తుంది.

ఈమె జయంతి ఆగష్టు 1వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here