[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో ఫెమినిజంపై జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]
అటుతిరిగీ ఇటుతిరిగీ ఫెమినిజం లోకి
― సిరికోనీయులు: ఏసీపీ శాస్త్రి, ఘంటశాల నిర్మల, రాణీ సదాశివమూర్తి ప్రభృతులు
– కదంబం కూర్పరి: గంగిశెట్టి ల.నా.
[మా *సిరికోన* అంటేనే ఓ సాహిత్యపు ముచ్చట్ల విరికోన. ‘రలయో రభేదః’ సూత్రం పాటించి, సిలికాన్‌ను ‘సిరికోన’గా మార్చుకొని ప్రత్యేకం భాషా – సాహిత్య – సంస్కృతుల మీద తోచిన ముచ్చట్లు చెప్పుకొనేటందుకు, భూగోళంలో అటూ ఇటూ ఉన్న మిత్రులం కొందరం, వాట్సప్ మాధ్యమంగా కలుసుకొన్నాం, వాట్సప్‌ను కూడా ఆంధ్రీకరించి ‘వాక్స్థలి’ గా మార్చుకొని నడుపుకొస్తున్నాం. ముచ్చట్లను వృథాపోనీకుండా ఏడాది చివరికి ఓ పుస్తకంగా తీసుకొస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఎడిట్ చేసి మీతోనూ పంచుకొంటున్నాం…]
[dropcap]మా[/dropcap]ర్చి నెలాఖరులో జరిగిన ఓ ముచ్చటను ఇప్పుడు మీతో పంచుకొంటాను.
ఏదో మాటమీద వచ్చి, కోనలో పెద్దాయన, ఏసీపీ శాస్త్రి గారన బడే, 78 ఏళ్ళ అందుకూరి చినపున్నయ్య శాస్త్రిగారడిగారు కదా: “పెద్దల ఆశీర్వచనం తీసుకొనేటప్పుడు అక్షతలు చేతికిచ్చి వేయిస్తారు… ఏమిటి దీనర్థం?” అని!
ఆయనే సమాధానం కూడా ఇచ్చారు ఇలా:
“ప్రపంచంలో ఉన్న అగ్నులలో స్త్రీ ,పురుషుడు గూడా అగ్ని స్వరూపాలట. అగ్ని శిఖ పైనుంటుంది కాబట్టి శిఖ లో పురుషాగ్ని ఉంటుంది. అక్షింతలు (అక్షతలు) తల మీద వేసినపుడు అవి అందుకోవటానికి శిరస్సులో ఉన్న అగ్ని నాలుకలు పైకి చాచి ఆ అక్షతలలో ఉన్న హవిస్సును అందుకోటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనిషిలో తేజం పెరుగుతుంది…. అక్షతలు వేయటం అంటే ..ఒక రకంగా అది ‘తండుల హోమం’ అన్న మాట.
ఇక సువాసన గలిగిన అగ్ని ఆయుష్కారకమనీ, తద్వ్యతిరిక్తమైనది మృత్యు కారకమని చెబుతారు. అందుకని ముత్తైదువు ఎప్పుడూ పూలు పెట్టుకోవాలని చెబుతారు…. స్త్రీ కూడా అగ్నియే కనుక పూల వలన ఆ అగ్నికి సుగంధం వస్తుందికనుక .. దానిసమీపంలో ఉన్న భర్త ఆయుష్షు పెరుగుతుంది.”
అందుమీదట అత్తలూరి విజయలక్ష్మి గారి ప్రశ్న : “మరి భార్య ఆయువు పెరగాలంటే భర్త ఏమి చేయాలి శాస్త్రిగారూ?”
ఆపై ‘మధురకవి’ బులుసు వెంకటేశ్వర్లు గారు: ” భార్య ఆయువుని మార్పు చేసే భర్త ఈలోకంలోనే లేడమ్మా, వాడి బ్రతుకు ఆవిడ చేతుల్లోనే ఉంది. భవాని త్వత్ పాణి గ్రహణ పరిపాటీ ఫలమిదం.” అంటూ ఒక చిర్నవ్వు ఇమోజీ పడేశారు.
ఇక ఫెమినిస్టు కవయిత్రి ఘంటశాల నిర్మల గారు ఊరుకొంటారూ?.. “ఆవిడ ఆయువు అంతా అతగాడి ఆయువును పెంచటంలోనే సరిపోతుంది!” అంటూ ఓ మసాలా పోపు తగిలించారు, మాస్టారు మన్నించాలి! అని బ్రాకెట్లో పెట్టి!
కవిగారు మాత్రం తక్కువ తిన్నారా? ” అబద్దాలాడినా అతికి నట్టుండాలి..” అంటూ ఆవిడ ఒక నవ్వు ఇమోజీకి మూడు ఇమోజీలు బదులు చెల్లించారు.
“అబద్ధమేమీ కాదు – నేనన్నమాటకు నేను నిబద్ధనే!” అంటూ “అసలైనా – ఆడవారి ఆయువు పెరిగితే ఎంత…పెరగకపోతే ఎంత!!” అని మరో మారు నిర్మలగారు పెనంని కాస్త చుంయ్ మనిపించారు…
మళ్లీ ఏసీపీ గారందుకున్నారు.. ” బహుశ ఆరోజులలో భార్య వయసు భర్తవయసు కంటే బాగా తక్కువ ఉండి ఉంటుంది… అందుకని తను పోయిన తరువాత చాలా రోజులు ఉంటుందనుకుని ఉంటాడు. అందుకే కొడుకు రక్షణలో తల్లిని ఉంచాలనే సంప్రదాయం వచ్చిందేమో!”
ఈలోగా పాలకుర్తి రామమూర్తి గారు కలిసి: “ఒకప్పుడు జుట్టు పెంచుకోవడం పూలు పెట్టు కోవడం ఆడ మగ ఇరువురు చేసే వారు. అక్షతలు వేయడం అంటే హవిస్సునివ్వడం కాబట్టి దంపతులకు సామాన్యమే… సుగంధం, ఆకర్షణకు ప్రతీక కాబట్టి ప్రక్కనున్న భర్త ఆయుస్సు పెరిగినట్లే భార్యా ఆయువు పెరుగుతుంది. శాస్త్రిగారి ప్రతిపాదనలో మొదటిది శాస్త్రీయం. రెండవది శాస్త్రిగారి ఆలోచన మాత్రమే అని అనుకుంటున్నా” నన్నారు.
“తప్పేమీ లేదండీ” అంటూ ఏసీపీ గారు కొనసాగించారు: “వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మ వారికోసం కాక పోతే, భూమిమీదికే వచ్చేవాడే కాదు. స్త్రీ పురుష ఆధిక్యాలు మానసిక రుగ్మత మానవులకే గాని సృష్టి కర్తలైన దేవతలకు లేదు.బ్రహ్మ విష్ణుమహేశ్వరులు అమ్మ వారిని పూజిస్తారని శంకరాచార్యుల వారు చెబుతారు. బహుశ దేముడిని స్త్రీ గా పూజించటం మన సంప్రదాయం ఒక్క దాంట్లోనే ఉందేమో”
ఈలోగా మా సిరికోనకు ప్రథమాచార్యులు, నడిరేయైనా, ఎవరికి ఏ అనుమానం వచ్చినా తీర్చేవారు, ఆచార్య రాణీ సదాశివమూర్తి గారు ప్రవేశించి, నిర్మల గారినుద్దేశించి అన్నారు కదా:
“షష్ఠి పూర్తి, సహస్రచంద్రదర్శనాదులలో ఉగ్రరథశాంతి, భీమరథశాంతి వంటివి జరిపినప్పుడు ఆయుష్యహోమాలు గృహిణి బాగుండాలనేనమ్మా.
గృహిణి బాగుంటే గృహం బాగుంటుంది అని. అందుకనే న గృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే అన్నారు,–ఇల్లంటే ఇల్లు కాదు. ఇల్లాలే ఇల్లని!
గృహిణీరహితం గృహం వ్యాఘ్ర యుఙ్మహాగుల్మమ్
అంటే ఇల్లాలు లేని ఇల్లు పులితో కూడిన పొదలాంటిదట.
అందుకే భర్తచేసే ప్రతిపుణ్యకార్యంలోనూ సగభాగం భార్యకు చెంది ఆమె దీర్ఘాయుష్మంతురాలవుతుందని ధర్మశాస్త్రం చెబుతోంది.
భార్యపుణ్యం నుంచి మాత్రం భర్తకు ఒక్క లవంకూడా రాదుట ఆవిడ కోరుకుంటే తప్ప. అందుకే సౌభాగ్యవ్రతాలు చేయమన్నారు.
వీటి వల్ల భార్యాభర్తలు ఇద్దరూ దీర్ఘ జీవనులు అవుతారు.”
ఆపై బులుసుగారూ వివరించారు: ” అమ్మా ఆడవారు జీవితాంతం సేవామూర్తులు.పురుషులు 70 లోకి వచ్చేటప్పటికి పరాధీనత ప్రారంభం అవుతుంది.సగటు ఆయుర్దాయం చూసినా పురుషులదే తక్కువ.స్త్రీ మనోనిబ్బరం,నియమ పాలనం..ఇవ్వన్నీ. ఆమె దీర్ఘాయువుకి కారణాలని పెద్దలంటున్నారు.మేమూ సంతోషిస్తున్నాం.”
ఏసీపీ గారు తన భావాల్ని పొడిగించారు: “తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు మత్స్వప్నః అని ఒక పుస్తకం రాశారు. అందులో భక్తుడు అమ్మవారు కనపడగానే నవ్వుతాడు ..ఎందుకురా నవ్వావు అంటుంది అమ్మవారు.. అప్పుడు ఆయన అడుగుతాడు. “నీకు పెళ్లి అయిన తరువాత మేం పుట్టామా లేక మేం పుట్టాక నీకు పెళ్లయిందా” అని!
“అంటే అసలు నాకు పెళ్లికానిదెప్పుడూ” అంటుంది అమ్మవారు…”
“హుమ్….” అని బలంగా నిట్టూర్చే కాబోలు, నిర్మల గారు: “రాణిగారు, బులుసుగారు యింత చెప్పాక, మర్యాద పాటించి మౌనం వహించక ఇంక ఏమంటాం!
అయినా ఒక్క సందేహం- ఆ షష్టిపూర్తి ఏదో మగానుభావులకేనా? ఆడవారి అరవయ్యవ ఏటిని గుర్తించే తతంగాలు/ ప్రక్రియలు/ సెలబ్రేషన్స్ ఏమీ లేవా అని!?” అని మరో ప్రశ్న సంధించారు…
“భర్తకు 50సంవత్సరాలు వచ్చేవరకూ దాంపత్య పూర్వార్థం. భర్త మాట భార్యవినాలట…భర్తకు 50 దాటాక దాంపత్య ఉత్తరార్థమట. అప్పటినుండి భార్య మాట భర్తవినాలిట…ఇదే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే” అంటూ కాస్త సమరసంగా సర్దుదామని ప్రయత్నం చేశారు రాణీ వారు…
నిర్మలగారు ఊరుకొంటారూ!? : “అప్పుడు ఏమైనా చెప్పాలన్న స్పిరిటూ భార్యకి మిగలదు, కాదనే శక్తి అతగాడికీ పెగలదు (తనకు వృద్ధాప్య, శక్తిహీనతఛాయలు పొడచూపుతూంటాయి కనుక!)”
ఆపై కొందరం చర్చని కాస్త తేలిక పరుద్దామనుకొన్నా, ఏసీపీ శాస్త్రిగారు ఆపలేదు. వైదికసంప్రదాయం పట్ల ఆయన అనురక్తి అలాటిది…: “ఇంకొక విషయం వేదంలో ఏముందో తెలియక వేదం స్త్రీని చిన్నచూపు చూసిందనుకుంటారు…
“వేదం యజమాన పత్నిని ఈశా అంటుంది .భర్త పూచిక పుల్ల సంపాదించినా దానికి భార్యయే అధిపతిట .ఆఖరికి సోమయాగంలో సోమలతను అభిషవణం చేయాలన్నా భార్య అనుమతి అవసరమట.
అందుకే సోమలతకు ఆతిథ్యేష్టి సోమలత బండిలో ఉండగా భార్యయే చేయాలిట”
మళ్లీ మధురకవి గారు: “భగవంతుడు గొప్ప పారిశుధ్య కార్మికుడు.వ్యర్ధాలను వుండనీయడు.. దయామయుడు ” అంటూ దేవుడికి ఓ పది నమస్కారం ఇమోజీలు పెట్టి ” చర్చ కొనసాగించండి నిర్మలమ్మగారూ” అని కోరుకొన్నారు!
రాణీ సదాశివమూర్తి గారు “ఏతతంగమైనా, ఏ ప్రక్రియలైనా జపము, తపము ఆయాసాలన్నీ మగానుభావులకున్నూ, అలంకారాలు, ఆభరణాలూ ఆడువారికే కదమ్మా….. మా షష్ఠి పూర్తి (దాంపత్యంలోనే షష్ఠి పూర్తి అంటే. ఒక్కడుగా ఉంటే కాదు) కి నేను 360 సూర్యనమస్కారాలు, రోజంతా అగ్నిహోత్రహోమమూ చేశాను. మా ఆవిడ సంకల్పంలో ‘మమ’ అనుకున్నది. అదే అందం…” అంటూంటే,
ఏసీపీ గారు మధ్యలో ఆగిన సంభాషణను మళ్లీ కొనసాగించారు:
“కేనోపనిషత్తు ప్రకారము అసలు బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు అమ్మవారేట.
“సాబ్రహ్మేతిహోవాచ”…..ఎందుకంటే భర్తను గురించి భార్య కంటే ఎక్కువ తెలిసిన వారెవరు? శంకరాచార్యుల వారు అందుకే సౌందర్యలహరి వ్రాశారు…
శివుడిని గురించి తెలుసుకోవాలంటే పార్వతిని అడగాల్సిందే
అగ్నిని గురించి తెలుసుకోవాలంటే నీటిని అడగాల్సిందే!” వారిది ఒక్కోసారి అచ్చపు కవితాత్మక ధోరణి!
“ఏమి కొనసాగిస్తాం సర్!” అంటూ అప్పుడు పునఃప్రవేశించారు ఫెమినిస్టు నిర్మల గారు.
”మా అలంకారాలూ మేము సంపాదించుకుంటాం… మా పుణ్యమూ మేము సాధించుకుంటాం..’ అంటారు నేటి అమ్మాయిలు! నా ఓటు సూటిగా వారికే!”
“రాణివారు చెప్పినట్లుగా ‘మమ’ అనుకోవటం అంత తేలిక కాదండీ. హాయిగా (పోనీ, ఏకాగ్రంగా) పురుషులు క్రతువులూ, సూర్యనమస్కారాలూ చేసుకోగలగటం వెనుక, తమతమ శారీరిక, మానసిక సమస్యలను పక్కకు నెట్టి ‘భార్యలు’ ఎన్నెన్ని ఏర్పాట్లు, అమరికలు చేసి హూనమవుతారో, అధునాతనచింతననూ స్వాగతించే రాణివారు, మీవంటి విజ్ఞులెరగనిదా!?!?” అంటూ సూటిగా ప్రశ్నించారు…
“ఏ వెర్షన్ కైనా వైస్ వెర్సా ఉంటుంది. అటుదిటూ ఇటుదటూ మార్చుకోవడమే లైఫ్. ….”లై”ఫుకి లింగభేదం లేదోచ్” అంటూ మేము జొ.శ్రీ. అని పిలుచుకొనే జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి ఉవాచ!
“మనుషులు దేవతల స్థాయికి ఎట్లా వెళతారండీ” అంటూ శాస్త్రిగారిఆవేశం!
“నేను మళ్లీ చెబుతున్నాను…. Spencer Tracy ..Catherine Hepburn ది ఒక సినిమాఉంది, పేరు జ్ఞాపకం రావటంలేదు, అందులో చివరి డైలాగు “God Made us different ..and hats off to the difference..” భగవంతుడు స్త్రీ పురుషులను ఎందుకు భేదంగా సృష్టించాడో తెలుసుకోవటం మనతరమా..
“మహాఋషులే “నోనవేదేతివేదచ”. ‘మాలో తెలియదన్న వాడికే తెలుసు’ అన్నారుట. ఎందుకంటే అది తెలుసుకునే వస్తువు కాదట!
“పోతే, అమ్మవారిని అడగటంలో ఉద్దేశం అయ్య వారిని గూర్చి తెలుసుకోవటానికే! ఎందుకంటే ఆవిడకి బాగా తెలుసుకనుక! ‘వీళ్లంతా ఆయనను గూర్చి తెలుసుకోవటంకోసం నన్ను గురువుగా సేవిస్తున్నారు’ అని ఆవిడకూ తెలుసు!
“అలాగే శౌనకాది ఋషులు సూతుడి దగ్గర ఎందుకు కూచున్నారు హరిని గురించి వారికి తెలియదా… హరి అనంతుడు అన్న విషయం ఆయన అనంతావతార వైభవం తెలిసిన సూతుడు చెబుతుంటే ఆ అనుభవం వేరు” అంటూ తన భావనా పారవశ్యాన్ని వెలిబుచ్చారు శాస్త్రిగారు.
“సీత నెఱుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా.. అన్నారు విశ్వనాథ” అంటూ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు ఓ మాట కలిపితే, ”మమ్మల్ని’ సమర్ధించే ఉటంకింపు ఏమైనా పెట్టవచ్చుగా – మగానుభావుల్నే కీర్తించకపోతే!” అని నిర్మలగారి చెణుకు!
ఆచార్య సదాశివమూర్తి గారు “నా వివరణలను మరొక్కసారి ఆగ్రహించకుండా చదవమని మా తోబుట్టువులకు ప్రార్థన. నేను పురుష సమర్థన కోసం వ్రాయలేదు. కానీ ఈ ఆయుష్యహోమప్రక్రియలలో పురుషులకు ఉండే కష్టము గురించి స్పృశించానంతే.” అని మళ్ళీ సర్దుబాటు చేయడానికి యత్నించారు.
మరుసటిరోజు చర్చకు ముక్తాయింపునిద్దామని, గంగిశెట్టి లక్ష్మీనారాయణ (విశ్రాంత ఆచార్యుడు) అనబడే భవదీయుడు ‘మంగళమహాశ్రీ’ అని ఓ కవిత రాసి పెడితే, నిర్మల గారు వదిలారూ!? వదిలితే పూర్వ ఫెమినిస్టు గుర్తింపు ఎలా నిలుపుకొంటారు???
‘ఉదాత్తమైన భావలాహిరి, ప్రతిభావంతమైన వ్యక్తీకరణ’ అని మెచ్చుకొంటూనే “కవిత్వం వరకు అభ్యంతరమేమీ లేదు. కానీ నిన్న ఉదయం జరిగిన – ‘రసవత్తర’ మైనదో కానిదో – చర్చకు యీ తెలివైన కవనం ఒక వంపు. ఎందువల్లనంటే అక్కడ రేగిన ప్రశ్నలు, ఆవేదనాక్రందనలు అలాగే వున్నాయి. పైగా ఒకరకంగా ఆ స్థితినే ఉద్ఘాటించాయి కూడా. ఉదా: ‘భవ్యత నేను- దివ్యత ఆమె…రెంటి నడుమ నావ ‘నా’ ప్రాణశ్వాస….’నా’జీవచైతన్యధార!’
“మరి ఆమె ప్రాణశ్వాస నిస్త్రాణమయిందా? ఆమె జీవచైతన్యధార ఎట ఇంకినట్లు!? నిన్నవుదయంనాటి సంవాదాన్ని సా….గదీయటం సముచితం కానప్పటికీ ఆ రెండు మాటలూ చెప్పక తప్పలేదు” అంటూ నిలదీశారు…
ఇక అప్పుడు రాణీ సదాశివ మూర్తిగారు: “అమ్మా! ప్రాచీన భారతీయ దాంపత్య జీవనవిధానంలో దీనిగురించి చెప్పవలసింది ఎంతైనా ఉంది.
ఒకటి రెండు స్పృశించి విడిచి పెడతాను.
“1. “క్రీతస్తపోభిః. అద్య ప్రభృతి తవాస్మి దాసః” … పరమశివుడు పార్వతి తపస్సు కు ప్రత్యక్షమై .. “నీతపస్సు కు అమ్ముడు పోయాను. ఈ రోజు నుండి నీ దాసుడను” అని చెప్పాడు. ఒక కవి ఆమె తాను సగమై నిలిచాడు. కారణం హృదయం, జీవం ఆమెవే అని చెప్పారు.
“2. “త్వం దైవతం. త్వమసి మే హృదయం ద్వితీయం.
“ప్రాణోऽసి. కాంతిరసి. పుణ్యఫలం పురాణమ్.”
అని రామచంద్రుడు, సీతతో…”నీవు నా దైవానివి. నా రెండవ హృదయానివి. నాప్రాణానివి. నాజీవితంలో కాంతివి. నా పూర్వపుణ్యానివి” అని నివేదించాడు.
“వీటి విషయంలో చెప్పుకోవాల్సినది చాలా ఉంది. మరల సమయం ఉన్నప్పుడు ప్రస్తావన కొనసాగిస్తాను…పై వాక్యాలపై వెంటనే తీర్పులు ఇచ్చెయ్యవద్దని మనవి” అంటూ గమనికను కూడా పెట్టి, ఒక సమావేశంలో పాల్గొనటానికి వెళ్లారు.
అప్పుడు ఏసీపీ గారు ప్రవేశించి “అసలు సమాజం ఎప్పుడూ బ్యాలెన్స్‌లో చాలాకాలం ఉన్నట్టుగాలేదు. మనువుతో రాచరికం మొదలయింది. అగ్ని వర్ణుడి పాలనతో కాళీదాసు రఘువంశం ఆపేశాడు
రాచరికం ఉన్న ఇంగ్లండ్‌లో ప్రజాప్రభుత్వం మొదలయింది. రాణిగారి పేరుపెట్టుకొని ఆ ప్రజాప్రభుత్వం ప్రపంచం అంతాపాలించింది. రష్యాలో డైరెక్టుగా రాచరికపుపాలన నుంచి కమ్యూనిజం వచ్చింది… గోర్బచేవ్ దానిని మార్చి పెరిస్త్రోయికా తెచ్చి….కోకాకోలాను రష్యాకు తీసుకొని వెళ్లాడు…
ప్రజలకు రాచరికం నచ్చలేదు/ప్రజాస్వామ్యం నచ్చలేదు/కమ్యూనిజం నచ్చలేదు ……
ప్రజలకు ప్రజాస్వామ్యం మంచిదా/రాచరికం మంచిదా/కమ్యూనిజం మంచిదా” అంటూ మరో అన్వేషణలో పడ్డారు.
చర్చ పక్కదారి పట్టటం నిర్మల గారికి నచ్చలేదు. నేను మధ్యలో చర్చాతీవ్రతను తగ్గించడానికి అన్న మాటల్ని పట్టుకొని
“1. మగతవీడని మాస్టారికోసం టీకప్పులు, టిపినీ ప్లేట్లు సెగలుకక్కుతూ వేచివుంటాయండి. భాగ్యశాలురు!
2.అవి పంచ్‌ల గుర్తులు కావు ఆచార్యా – ‘మేమంతా ఒక్కటే’ అని అరవిందగారు, గౌరి, అ. వి. ల ప్రభృతమిత్రులతో సంఘీభావప్రకటన.
3.’ఆడవాదులు’ వంటి హేళనాత్మక/డెరొగేటరీ పదాన్ని మీబోంట్లు వాడటం ఊహించనిది + అభ్యంతరకరం! ” అని ఆ మధ్యలోని నా మాటల మీద మృదువుగా మంగళాక్షతలు ‘వేశారు’….
ఇక నా (గ.ల.నా.) వంతు… ” ఐ యాక్సెప్ట్ యువర్ ఆనర్…” అంటూ మొదలు పెట్టాను…
“స్త్రీ అనే సంస్కృత శబ్దానికి బదులు, ‘ఒక్క’ తెలుగు మాటను (రెండోదానికి తెలుగు దొరక్క) వేసుకొనేసరికే, మీకు డెరొగేటరీ అర్థం ధ్వనించేసింది చూశారా?
“ఈ ఒక్క మాటను సంకేతంగా తీసుకొని ఇంకొంత లోనికి వెళ్లి చూడండి… మన సంస్కృతి ఎటునుంచి ఎటు పయనిస్తూ వచ్చిందో… సంస్కృతాన్ని ఆపోశన పట్టి, ఉభయకవిమిత్రుడనిపించుకొన్న తిక్కన్న కాలానికి ‘తిక్క’ కు డెరొగేటరీ అర్థం లేదనుకొన్నారా? అయినా ఆ పదాన్ని సగౌరవంగా దాని సాంస్కృతిక అర్థంలోనే పెద్దలు పెట్టిన తన పేరును అలాగే తీసుకున్నాడు. దేశీయత విలువను పెంచాడు. అది నాటి ఫినామినా…
“సంస్కృతి లో కీలకాంశం ‘దేశీయత’. ప్రతి సంస్కృతికి అర్థం చెప్పేది అదే! అది ఆయా దేశ కాల జాతి అనుభవాలకు లోనై రూపు దిద్దుకొనేది… ఎంత బలమైనదంటే (నాకు సాహిత్యం మాత్రమే కించిత్తు వచ్చు, ప్రాపంచిక సామాజికత పెద్ద రాదు కనుక, ఆ పరిధిలో చెబుతున్నా),– తంజాపురంలో తెలుగు ఏలికలు దిగిపోయినా, అది మరాఠీల వశమైనా, వారు కూడా తెలుగే నేర్చుకొని, తెలుగుమాధ్యమం లో పాలన చేయటం కాదు, తెలుగులో కొత్త పదసాహిత్యం సృష్టించే స్థితికి వెళ్లారు… అదీ, అంత బలంగా నిలిచి, సంస్కృతికి చుక్కాని పట్టేది ‘దేశీయత’. అరువు తెచ్చుకొనేది కాదు, పరమార్గంలోకి, అరువు మార్గంలోకి నడిపించేది కాదు… అందులో బలహీనతలూ కాలక్రమంలో రూపొంది ఉండవచ్చు; బలాలు దురదృష్టం కొద్దీ వాటి ముందు మసక బారి ఉండవచ్చు. మసక బారిందని అద్దాన్ని పారవేసుకోము కదా, తుడిచి యథా స్థానంలో సప్రియంగా అలంకరిస్తాం కదా!
“నేను చెప్పదలచుకొన్న భావం మీనుంచి నన్ను నేను కాపాడుకోటానికి ఎంత చుట్టు తిరిగిచెప్పినా, స్పష్టమైందను కొంటాను…
“ఫెమినిజం ఒక ఉద్యమంగా గత శతాబ్దం ఉత్తరార్ధంలో ఎలా ఉవ్వెత్తున లేచిందో, దానికి నేపథ్య కారణాలేమిటో నాకంటే కూడా మీకే బాగా తెలుసు.. రెండున్నర దశాబ్దాల ఆలస్యంగా మన వారు అందుకొంటేనేం, బలంగా సొంత గొంతు వినిపించారు; భారతావనిలో తమ గొంతుకు ప్రత్యేకత సిద్ధించేలా వినిపించారు… ఆ చరిత్రలోకి నేను వెళ్ళటం లేదు…
“కానీ ఒక మౌలిక ప్రశ్న మాత్రం వెంటాడుతోంది… గత శతాబ్ది ఉత్తరార్థంలో, అమెరికా/ఫ్రాన్స్ దేశాల్లో పెరిగిన స్త్రీ స్వాతంత్ర్యోద్యమ కార్యక్రమాలేనా ‘స్త్రీ వాద స్వరూప’మంటే? లేదా ఏబీఎన్ ఎడిటర్‌గా కేటాయించిన కమ్మటి చోటులో అంతకంటే కమ్మటి భాషలో చేరాలాటి వారు ‘గుప్తనిర్మాణం'(ఆయనకిష్టమైన పరిభాష)తో వ్యాప్తం చేసిన కమ్మ్యూనిస్టు భావజాల సమన్వితమైనదేనా స్త్రీవాదమంటే? ఆ రోజుల్లో ‘ప్రజాస్వామిక ఫెమినిజం’, ‘ సామ్యవాద ఫెమినిజం’, ‘మార్క్సిస్టు ఫెమినిజం’ అంటూ ప్రత్యేక విభజనలను కూడా కొందరు చేసేవారు.. ఆ విధంగా ఒక సెమినార్‌లో విడదీసి విశ్లేషిస్తున్న ఒక పరిశోధక ‘విద్వాంసు’రాలిని, అరసం మల్లిక్ గారు గట్టిగా సభాముఖంగానే నిలదీశారు… అసలు వీటన్నిటి తాత్త్విక స్వరూపాన్ని, సాంస్కృతిక పరిణామాలను ఏమాత్రం సరిగ్గా గ్రహించేపాటి శక్తి, ఓపిక, సామర్థ్యం లేకుండా, వెల్చేరు పుణ్యమా అని, విస్కాన్సిన్ చేరి, ఇక్కడి ఫెమినిజంను అరకొరగా ఒంటబట్టించుకొన్న ప్ర(తి)భా మూర్తులు తెలుగులో వెలయించి, వెలిగించిన దాన్నే ఫెమినిజం అని భావించి గుడ్డిగా ఆ తోవలో రాసి స్త్రీవాదాన్ని అపారంగా పెంపొందింప చేసిన అచ్చపు పదహారణాల తెలుగు స్త్రీవాదుల సాహిత్యంలో సాక్షాత్కరించే తత్త్వమేనా స్త్రీ వాదమంటే? కేవలం ఊకదంపు పేరా- పొలిటికల్, పేరా- సోషలాజికల్, పేరా- లిటరరీ తత్త్వమా? ఈ విషయం నాకు నిజంగా అర్థం కావడం లేదు, నిజాయితీగా చెబుతున్నా…
అదే అమెరికా/ఫ్రాన్సుల్లో స్త్రీవాదం రెండో దశ, మూడో దశలంటూ పొంది, వాటిల్లో ఎందుకు తాను మొదలైన ధోరణికే అంత విభిన్నమైన పరివర్తన తీసుకొంది??? 20 శతాబ్ది ముగింపు దశకంలో వచ్చిన సూసన్ ఫాలుది ‘బ్యాక్ లాశ్’ (Back Lash) పుస్తకం గుర్తుంది కదా! ‘ఫెమినిస్ట్ ప్రామిస్ బ్రోకెన్’ అనే నినాదానికి ఆమె ఆ పుస్తకరూపంలో ఇచ్చిన సమాధానం, నిగ్గదీసి అడిగిన ప్రశ్నలు గుర్తున్నాయి కదా!
ఈ ప్రశ్నల్ని మన రొటీన్ స్త్రీ వాద ప్రాశ్నికోత్తమినులు ఏలా ప్రశ్నించుకోరు?
అంతకంటే ముఖ్యమైంది, ప్రతి నాగరక జాతిలోనూ , తనదైన నాగరకతకు అనుకూలంగా , తన దేశీయమైన ఒక స్త్రీవాద దృక్పథం ఒకటి రూపుదిద్దుకొని వేళ్ళూని నిలిచి ఉంటుందని, ఆ దేశ చారిత్రక- సాంస్కృతిక అనుభవాలు ఆ వేర్లను బలంగా పెంచి నిలిపి ఉంటాయని ఎందుకు భావించరు?
ఇండియన్ ఫెమినిజం – వివిధ ఆముఖాలు (డైమెన్షన్స్) అనే దానిపట్ల నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. 97లో తెలుగు వివి లో, చలం శతజయంతిని పురస్కరించుకొని, జాతీయ స్థాయిలో, వివిధ భాషల ప్రముఖులను పిలిచి, సుమారు 250 మంది (రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వచ్చిన) ప్రతినిధులతో పెద్ద సెమినారును నిర్వహించాను. సాక్ష్యం కావాలంటే, ఆ సెమినార్ నిర్వహణకు నాకు సహాయకురాలిగా ఉన్న డా.మృణాళినిగారిని అడగండి. లేదా ప్రముఖ స్త్రీవాద తాత్త్వికురాలు కాత్యాయనిని అడగండి.. ఆ సదస్సులోనే కాదు, తర్వాత కూడా ‘ఇండియన్ ఫెమినిజం’ అనే మాటకు సరైన తాత్త్విక రూపావిష్కరణ జరగలేదు. ఒకసరైన తాత్త్విక సిద్ధాంతగ్రంథం (పీహెచ్చుఢీ పట్టా గ్రంథాలు కాదు) రాలేదు…
నా పరిధిలో నేను ‘ భారతీయ స్త్రీ వాద(తాత్త్విక) రూపానికి నేనిచ్చే సృజనాత్మక అభివ్యక్తి నా ‘సఖీగీతం’. దానిలో ముగింపు గీతి ‘మంగళ మహా శ్రీ’..
ఇక అక్కడ టిపినీ ప్లేట్ల మ్రోతలు, గొణుగుళ్లు, కారాలు, మిరియాలు, తమలపాకు సున్నాధిక్యతలూ ఉండవండీ! ‘ఇంతకాలపు మీ ఆధిపత్యాలు చాలు, ఇక మా ఆధిపత్యాలు వినండి’ అనే పాప్ మ్యూజిక్కులూ ఉండవండీ.. కేవలం మంగళ గీతాలు, మహాభ్యుదయాలు, శ్రీ పదాలు మాత్రముంటాయి… ఇప్పుడది మగ స్వాప్నిక కాల్పనికతే కావచ్చు.. కాల్పనికత ఎప్పుడూ కవితకు ప్రథమ ద్రవ్యమే కదా! కాల్పనికత- క్లాసిసిజం మధ్య పడుగు- పేకే కదా కావ్యనిర్మాణం!!
దాన్నటుంచితే ―
ప్రతి దేశంలో కూడా ఫెమినిజం ఒక చారిత్రక అవసరం. ఆయా దేశ, కాల, సామాజిక, పరిణామ శీలతకు తగ్గ అవసరం.
అదే కాదు, అన్ని ఇజాలు అంతే…
ఎటు తిరిగీ అరువు తెచ్చుకొని, అరిగించుకోలేని ఇజాల తోటే పేచీ…” అంటూ ఒక స్థాయిలో ముగించడానికి నిజాయితీగా యత్నించాను…
“ఆచార్యులు (కనుక) అలా అలవోకగా, అద్భుతంగా తరగతి నడిపారు. మనకి అంత నేర్పూ, ఓరిమీ లేవాయె!” అంటూ నిర్మలగారు మరో ఛలోక్తి విసురుతూ – “ఇక, తిక్కనతో మొదలుపెట్టారు: తనపేరును మార్చుకొనే ప్రయత్నం చెయ్యలేదని కాబోలు అన్నారు. సంతోషం. ‘పిచ్చయ్య’ అనే సామాన్యవ్యక్తి సైతం డెరొగేటరీ అర్థం తీసుకోకుండా, పెద్దలు పెట్టారనో, ‘సాంస్కృతికత, తత్పరిరక్షణ’ అనే బృహత్తర బాధ్యత తెలియకున్నా,దాన్ని అలాగే ధరిస్తాడు. తిక్కనవంటి మహానుభావుల సంగతి చెప్పాలా!?
“దేశీయతకు మాస్టారు ఎక్కడ లేని ప్రాధాన్యతా కట్టబెట్టటం అభినందనీయం. కాకుంటే, మన దేశీయతకు, స్థానికతకు ఫెమినిజం సరిపడదని వారు ఉద్ఘాటించారని నా మృణ్మయమస్తిష్కానికి బోధపడింది. దానిని అంగీకరించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను – కాని, పొలిటికల్ ఫె(మినిజం), మార్క్సిస్ట్ ఫె. వంటివాటి జోలికి పోకుండా కేవలం – కేవలాతి కేవలం- ‘ప్రాక్టికల్ ఫెమినిజం’ గురించి మాత్రమే ఆశపడుతున్నాను. ఇండియన్ ఫెమినిజం గురించి గలనాగారు సెమినార్ నిర్వహించీ సరైన తాత్త్వికభూమిక ఏర్పడనేలేదని బాధపడటం సమంజసమే కానీ – మావంటి స్థూలబుద్ధులు, అపండితులు, నాన్-రొటీన్ స్త్రీవాదులు కోరుకునేది అవతలివారిపై ఆధిపత్యం కాదు! మరేమిటి??
అయ్యా! మా అవకాశాలు మమ్మల్ని వెతుక్కోనివ్వండి,
మాఆశలు మమ్మల్ని పోల్చు/ పెంచు/ నెరవేర్చుకోనివ్వండి!
మీ/ మన భద్ర సామాజికవ్యవస్థకి ఎటువంటి భంగమూ వాటిల్లనివ్వకనే, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతుకనివ్వండి! మా మరణాలు మమ్మల్ని మరణించనివ్వండి – అని మాత్రమే.
మీ సులోచనాలు అరువు యివ్వనవసరంలేదు, మా కళ్ళజోళ్ళు మేము పరీక్షింపించి, ధరించి, మా ‘చూపు’ మేము చూడదలచాము అని చెప్పటం. నిజంగానే, ‘దృష్టి’ సరిగ్గా వుండాలంటే, ఎవరి ‘సులోచనాలు’ వారివే, వారికే కదా!
కొందరు పెద్దల పరిభాషలో – స్వస్తి” అని ముక్తాయింపు నిచ్చారు.
అంతదాకా ఒకటీ అరా ఉపరి చారిక వాక్కుల్ని పలికిన సర్వమంగళగౌరి గారు : “నేను నిర్మల గారి భావాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను…. మాకంటూ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి….. ఆ మార్గంలో ముందుకు వెళ్ళటానికి అందరికీ ఉన్నట్టే మాకు స్వేచ్ఛ ఉండాలి…. ఇంకా చంటి పిల్లల్లాగా ఎవరో ఒకరి వేలు పట్టుకొని నడవాలి మీకు మార్గం మేము చూపిస్తాము అంటే ఎలా? ” అంటూ సుపరిచిత నినాదాలు వినిపించారు!
సమన్వయశీలయైన వారి మిత్రురాలు డా. రాయదుర్గం విజయలక్ష్మి గారు: ” తరగతుల మాట వచ్చింది కాబట్టి, దిగువ తరగతి, శ్రామిక తరగతులలో కష్టపడటంలో స్త్రీపురుష భేదం లేక పోవచ్చు, గాని అక్కడా, హెచ్చుతగ్గుల దృష్టి పీడ ఉండనే ఉంది. అక్కడా స్త్రీ, అనుమానాలకు, అవమానాలకు గురి అవుతూనే ఉంది.
“అయితే, శ్రామిక వర్గం లో మహిళల కున్న తెగింపు, నాగరికత ముసుగులో నున్న మహిళకులేదు.
“ఏ తరగతి అయినా అందరమూ మనుష్యులమే, అందరికీ మానవ హక్కులు సమానమే అన్న దృక్పథం ఆచరణలో రానంత వరకు స్త్రీవాద హక్కులు అంటూ వెదుక్కుంటూ ఉండటమే…..
“స్త్రీ పురుషులిద్దరూ,ప్రకృతిలో సమానమే నన్న ఆలోచన,త్రికరణ శీలతతో అమలు కానంత వరకు,…. మనిషిలో పరిణతి రానంత వరకు, ఎవరో వచ్చి ఎవరినో ఉద్ధరిస్తారు అనుకోవడం, పొల్లు మాటే!…
“ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది అన్నది ప్రకృతి నియమం. ఆ పరిష్కారాన్ని వెదుక్కోవడమే మన ముందున్న కర్తవ్యం..” అంటూ తన దారిలో సమన్వయించటానికి ప్రయత్నించారు…
నిర్మలగారి ఘాటు ప్రశ్నలకు బదులు చెప్పే బాధ్యత నా (అంటే గ.ల.నా.) వంతు మిగిలే ఉంది. కానీ ఏం చెప్పగలను? పునశ్చరణ చేయటం తప్ప!
“*ఫెమినిజం* అంటే ఏమిటో తెలుసుకోవాలనీ, స్త్రీ వాద మూల తత్త్వాలను గ్రహించాలనీ, అది *దేశ-కాల- సామాజికతలకు అనుగుణంగా* పరిణామశీలమైన తత్త్వమనీ, *ప్రతి పరిణామశీలమైన నాగరికతలో అది అనివార్య చారిత్రక అవసరమనీ* అంత స్పష్టంగా , నాకు చేతనైనంత స్పష్టంగా, చెప్పినదంతా― హతోస్మి― ఒక్క పెట్టుకు ఎగిరిపోయె కదా! ఔరా పాత్రికేయ వాద కుశలత!… వాద కుశలత , విషయ నిబద్ధత/ నిమగ్నతపైకి దృష్టి వెళ్లనీయదు కదా!
“ఎవరి సులోచనముల వారు దాల్చిననే కదా చూపు తిన్నగా ఆనునది?….
పాపం, తిక్కన! అట్టి తల్లితండ్రులకు పుట్టినాడు.. తిక్కనను దైవనామముగా భావించిన వారై, పిచ్చయ్య అని పేరు పెట్టనేర్వని తల్లి తండ్రులకు!!
‘సంస్కృతికి దిక్సూచి- దేశీయత’ అనే వాక్యం నాది కావచ్చేమో కానీ, అది ఆ రంగమందు కృషి చేసిన పెద్దలందరి భావన! వారి భావనను నా మాటలలో చెప్పుటే , ‘ఎక్కడ లేని ప్రాధాన్యతా కట్టబెట్టటమా’? అయ్యో, విద్యాత్మిక ప్రపంచ కూలీల్లారా, మీరెందుకు కష్టపడుట, కష్టించి పరిశోధించుట, శాస్త్రముల నిర్వహించుట ! మీరట్టి పాపము చేయకున్నచో, మేము ఈ ‘తరగతుల’ పాలబడెడి వారము కాము; ‘తరగతి నడిపె’డి వారమూ కామే!!
…….
నిజమే, స్వేచ్ఛను హరించు జ్ఞాన మీమాంస జ్ఞానమీమాంసయేనా? ఒట్టి ‘తరగతి’ విన్యాసము కాని!!” అని గ్రాంథికంగా వాపోయాను. వారు గ్రాంథికంలో అడిగారు కాబట్టి , నేనూ నా ప్రతిస్పందన గ్రాంథికంలో ఇవ్వక తప్పలేదు…
“సర్వేభ్యో మహాజనేభ్యో నమః” అంటూ డాలస్ వాసి ఉపద్రష్ట సత్యం గారు రంగప్రవేశం చేసి, “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ౹ యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః” (మను ధర్మ శాస్త్రము 3 -56 ౼ ‘ఎక్కడైతే మహిళలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు ప్రీతిపాత్రులై, దయతో ఉంటారు. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం లభించడంలేదో, అక్కడ జరపబడే క్రియలన్నీ నిష్ఫలాలే!’)
“శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులం
న శోచంతి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా” (మనుధర్మ శాస్త్రము 3 – 57 ― ‘ఎక్కడ స్త్రీలు దుఃఖిస్తారో అక్కడ వారికి దుఃఖ కారణమైన వారి వంశమంతా శీఘ్రంగా నశిస్తుంది. మహిళలు ఎక్కడ దుఃఖ రహితంగా, సంతోషంగా ఉంటే ఆ గృహము, వంశము సతతం వృద్ధి చెందుతూ ఉంటుంది’)
“సంతుష్టో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ
యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవమ్” (మను ధర్మ శాస్త్రము 3 -60 ―’ఎక్కడైతే భర్తచేత భార్య, భార్యచేత భర్త – పరస్పరం సంతోషంతో ఉంటారో, అక్కడ సంపద సతతం తాండవం చేస్తూంటుంది.’ అంటూ మంగళాచరణం చేసేశారు…
అయినా వదులుతామూ, ఆ తర్వాతా, చర్చను కొనసాగించాము. ఎలా కొనసాగించి ఉంటామో, మీరు సులభంగానే ఊహించుకోవచ్చు…
ఇది ఓనాటి మా సిరికోన ముచ్చట!