[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]మా[/dropcap] నాయన గారి జీవిత కాలంలో, అమ్మ జీవితంలో మా బావగారు ‘థార్న్ ఇన్ ది ఫ్లెష్’ అయ్యారు. అతని పిసినారితనం ఎంతటే నిత్యం వంటకు అవసరమైన సామాన్లు కొలిచి భార్యకు ఇచ్చి మిగతా వస్తువులు పెట్టెలో పెట్టి తాళం వేసుకునేవాడు. ఇటువంటి మనుషులను చూసే తెలుగు సినిమాలలో రమణారెడ్డి, వెంకట సుబ్బయ్య వంటి వారికి పాత్రలు తయారు చేసి ఉంటారు.
నిరుపేదలు పంచెలకు, ధోవతులకు, చొక్కాలకు వేరే గుడ్డతో మాచికలు వేసుకొనేవారు ఆ రోజుల్లో. తను హైస్కూలు టీచరు అయి వుండీ అట్లా మాచికలు వేసుకొన్న ఉడుపులు కట్టుకొని తరగతులకు వెళ్ళడం 1950-60 దశకంలో ఎంత విడ్డూరంగా వుండి వుంటుందో ఎవరికైనా తట్టకపోదు. రాజీలు, బెదిరింపులు, ట్రాన్స్‌ఫర్ చేస్తారనే భయాలతో అక్కను తీసుకొని వెళ్ళేవాడు. ఆమె గర్భవతి కావడంతో నెల్లూరు పంపించేది. అట్లా ముగ్గురు మగపిల్లలయ్యారు. పిల్లల మీద మమకారం లేని మనిషి వుంటారా? వడ్డీ వ్యాపారం, అదీ పాఠశాలలో ప్యూన్లకూ, టీచర్లకూ అధిక వడ్డీకి ఇచ్చేవాడట! 1972లో చచ్చిపోయినపుడు లక్షల రూపాయల ప్రోనోట్లు అతని ఇంట్లో ఉన్నాయట! బాకీదారులెవరూ బాకీ చెల్లించలేదు. తన కడుపుకు తినక, భార్యాబిడ్దలకు పెట్టక లోకుల ఎదాన కొట్టి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథగా, మారుపేరుతో చచ్చిపోయాడు. చచ్చే ముందు పి.ఎఫ్. మొత్తం అకౌంట్ లోంచి తీసేశాడు. ఆ రోజుల్లో జిల్లా బోర్డు అధ్యాపకులకు పెన్షన్ లేదు. తర్వాత, కొన్నేళ్ళకు అలా రిటైరయ్యి, అకాలంగా మరణించిన వారి భార్యలకు ప్రభుత్వం కారుణ్య పెన్షన్ లాంటి సౌకర్యం కల్పించింది. ఆయన పేరు ఆస్పత్రిలో తప్పుగా రాశారు కనుక మా అక్కకు భర్త మరణ సర్టిఫికెట్ లభ్యం కాలేదు.
మా పెద్దక్క కుమారులు (నా మేనల్లుళ్ళు) ముగ్గురు అప్పటికే ఉద్యోగాల్లో చేరారు. “ఈ గొడవ మేము పడలేము, మాకు అవసరం లేదు” అని తేల్చి చెప్పారు. మా అక్క మాత్రం పట్టు వదలలేదు. తన తిప్పలేవో పడింది. ఆఫీసుల చుట్టూ తిరిగింది. డెత్ సర్టిఫికెట్‍లో పొరపాటుగా నమోదు చేశారు. జిల్లా పరిషత్ ఆఫీసు వాళ్ళు ఆయన సర్వీసు రిజిస్టర్ లేదన్నారు. చివరి ప్రయత్నంగా ఆమె లోక్ అదాలత్ వంటి కోర్టు తలుపు తట్టింది. ఒక ఏడాది లోపు (డిసెంబరు 31 లోపల) ఆమె కేసు పరిష్కరించమని జిల్లా పరిషత్ ఆఫీసును తీవ్రంగా హెచ్చరిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఫైళ్ళ దుమ్ము దులిపి, నాలుగేళ్ళు ఆలస్యంగా నైనా ఆమెకు నెలకు ₹ 1500/- పెన్షను మంజూరు చేశారు. ఆమె 97 సంవత్సరాలు జీవించి, చివరి నాలుగేళ్ళు తిరుపతి మెడికల్ కాలేజీలో జనరల్ సర్జన్, ఫ్రొఫెసరుగా చేసి పదవీ విరమణ చేసిన చిన్న కుమారుడు పేరుభొట్ల హరిహరశాస్త్రి వద్ద ప్రశాంతంగా గడిపింది. మా మేనల్లుడు డాక్టర్ శాస్త్రి ఇద్దరు నర్సులను తల్లిగారి సేవలకు రాత్రి పగలు నియోగించి ఆమెను అపురూపంగా చూచుకొన్నాడు. 2020 ఫిబ్రవరిలో ఆమె కాలం చేశారు.
మా పెద్దక్క సుబ్బమ్మ బడికి పోలేదు. ఆమె అసాధారణ ప్రజ్ఞావంతురాలు. మా నాయనగారు విద్యార్థులకు పాఠం చెబుతూ వుంటే విన్నవే ఎన్నో శ్లోకాలు, పద్యాలు, స్తుతులు కంఠోపాఠమయ్యాయి. తెలుగు, హిందీ సాహిత్యం బాగా చదివింది. హిందీలో ప్రవేశిక పరీక్ష పాసయ్యింది. సంగీతంలో ప్రవేశం వుంది. ఇల్లు చిమ్ముతుంటే ఒక కాగితం కింద కనిపించినా చీపురు పక్కన పెట్టి దాన్ని చదువుతూ కూర్చునేది. ఆమె ప్రజ్ఞా, పాండిత్యం, విద్వత్తు ఆ దరిద్రుడి కిచ్చి కట్టబెట్టడంతో బూడిద పోసిన పన్నీరయింది.
***
మా వీధిలో గొప్పవాళ్ళను గురించి చెప్పకుండానే ఈ విషయాలు ముగించను. మరుపూరు కోదండరామరెడ్డి ఆజానుబాహుడు, స్ఫురద్రూపి. సగం నెరసిన వెంట్రుకలు తల నిండుగా ధోవతి, మోచేతుల వరకు చొక్కా, పై పంచె. ఎప్పుడూ నవ్వు మొహంతో గంభీరమైన భాషణ – చాలా విషయాల్లో సమకాలికుల కన్నా చాలా ముందుండేవారు. 1953 ప్రాంతాలకే వాళ్ళ ఇంట్లో మర్ఫీ రేడియో వుండేది. వీధిలో బాల బాలికలు ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి బాలానందం వంటి పిల్లల కార్యక్రమాలు వినేవారు.
హల్లో ఎత్తైన దిమ్మ మీద రెండడుగుల సుందరి మంచి నీటి కడవ ఎత్తుకున్న పోర్సిలిన్ విగ్రహం; మరికొన్ని పోర్సిలిన్, కొయ్యబొమ్మలతో ఇల్లు విలక్షణంగా వుండేది. ఆ రోజుల్లోనే వాళ్ల యింట్లో గాజు బిందెలో (టబ్ కాదు) రంగురంగుల చేపలు పెంచేవారు. ఆయన ఇల్లాలు ఇంటిని అద్దం లాగా, ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేది. మా వీధిలో వుండే కోదండరామరెడ్డి గారు ‘కామగిరి’ అనే చాలా పెద్ద ఇల్లు, దొరల బంగళా వంటి ఇల్లు కట్టారు. తల్లి కామమ్మ, తండ్రి కొండయ్య. కలిపి ‘కామగిరి’ అయింది. సాంచీ స్తూపంలో ద్వారం లాంటి పెద్ద గేటు వద్ద ద్వారాన్ని కాంక్రీటుతో నిర్మించారు. ఇల్లు తూర్పు వాకిలి, వీధి పోటు లెక్క పెట్టలేదు. ఇంటికి 15 అడుగుల విశాలమైన వరండా L షేపులో, తూర్పు, దక్షిణం చివరిదాకా సాగి వుండేది. కామగిరిని రెండు మూడేళ్ళ లోపలే అమ్మేశారు.
తర్వాత 1960 ప్రాంతాలకు జేము గార్డెన్స్‌లో విలక్షణంగా ‘అపర్ణ’ అనే ఇల్లు కట్టారు. ఇంటి గేటు వీధి మూల ఆగ్నేయంగా పెట్టారు. ఏదో దేవాలయంలో ప్రవేశిస్తున్నట్లుండేది ద్వారంలోంచి లోపలికి వెళుతుంటే. పచ్చిక మీద సిమెంటు బండల మీదుగా భవనానికి దారి. భవనం ముందు నాలుగు స్తంభాల మీద అర్ధ చంద్రాకారంలో పంచ, ఇట్లా అన్నీ విలక్షణంగానే వుండేవి. రేడియో, రేడియో వెనక నాలుగడుగుల త్యాగరాజు పటం, గోడలకు రెండు పి.టి. రెడ్డి చిత్రించిన చిత్రాలు… అందులో ఒకటి ‘వెయిల్డ్ వుమన్’. పెన్సిల్‍తో కౌతా రామమోహన శాస్త్రి గారు గీసిన పటేల్ డ్రాయింగ్, వరండాలో ప్రవేశద్వారంలో సినెమాటోగ్రాఫర్ భక్తానో, మార్కస్ బార్‌ట్లేనో తీసిన తన శిరస్సు వరకు ఉన్న ఫొటో… అంత కళాత్మకమైన మధ్యతరగతి వారి ఇళ్ళు నేను చూడలేదు. 1960 తర్వాత ‘అపర్ణ’ అనే కొత్త ఇంటికి మారిన తర్వాత హాలుకు ఆనుకొని వున్న విశాలమైన గదిలో రాతబల్ల ముందు కూర్చుని కోదండరామరెడ్డి గారు నిరంతరం రాస్తూ వుండే దృశ్యాన్ని నేను మరిచిపోలేను. వారు మా వీధిలో వుండగానే నెల్లూరులో పినాకినీ నది మీద కట్టిన వంతెనలో క్రింది స్తంభాలు (sub structure) మిత్రులు వంగల్లు కోదండరామరెడ్డితో కలిసి పూర్తి చేశారు. 1956 కల్లా ఆ బ్రిడ్జి ప్రారంభమైంది. నాలుగైదేళ్ళు భుక్తి జరుపుకోడం తప్ప ఏమీ మిగుల్చుకోలేదని అంటారు.
ఆయన ‘హాలికుడు’ అనే పేరుతో రచనలు చేశారు. వారి పన్నెండేళ్ళ వయసు లోపలే 150 ఎకరాల మాగాణి, ఆస్తి పోయింది. కోదండరామరెడ్డి గారికి ‘మందాకిని’ అనే వారపత్రిక వుండేది. 1954-62 మధ్య నడిపారు. ఎందరెందరో సాహిత్యవేత్తల రచనలు అందులో ప్రచురించారు. ఆయనే ఓ.హెన్రీ వంటి వారి కథలు అనువదించి తన పత్రికలో ప్రచురించారు. ఒక వైపు జమీన్ రైతు వారపత్రిక అధికార కాంగ్రెస్ రాజకీయాలు సమర్థిస్తూ రాస్తుంటే, కోదండరామరెడ్డి గారు స్వతంత్ర పార్టీ, రాజాజీ, బెజవాడ రామచంద్రారెడ్డి వంటి వారి రాజకీయాలకు పత్రికను వేదిక చేశారు. రోజూ హిందూ క్షుణ్ణంగా చదివేవారు; దగ్గరుండి 16 సంవత్సరాల కుమారుడి చేత చదివించేవారు. నెల్లూరులో ఆడే మంచి ఇంగ్లీషు సినిమాలకు కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళేవారు. ఏ హాలు వాళ్ళూ ఆయన వద్ద టికెట్ తీసుకోరు. కొత్త సినిమా హాలు ప్రారంభోత్సవ సభలో మరుపూరు గారు ఉపన్యసించాల్సిందే. ఆయన బందరు జాతీయ కళాశాలలో కొంత కాలం చదవడం తప్ప, ఏ పరీక్షలు పాసు కాలేదు. ఒక నడిచే విజ్ఞాన సర్వస్వం, గ్రంథాలయం అని పేరు తెచ్చుకొన్నారు. ఆయన ఇద్దరు బిడ్డలు నా జీవితకాల మిత్రులు కావడం నా అదృష్టం.
***
మా కస్తూరీదేవీనగర్ వీధిలో, మా ఎదురు వరుసలో చివరి ఇల్లు డాక్టర్ మల్లవరపు శ్రీనివాసరావు గారి వైద్యశాల. ఆయన జి.సి.ఐ.యం. వంటిదేదో చదివారు. అల్లోపతి ప్రాక్టీసు చేస్తారు. ఇల్లు కట్టారు కానీ అందులో ఎప్పుడు ఎవరూ కాపురం లేరు. వారు తమ ఇంటికి ‘సీతా కుటీరం’ అని బోర్డు పెట్టారు. మిద్దెనే కుటీరంగా మార్చారు. ఇల్లంతా లతలు, పువ్వుల వాసనలు, సూర్యకిరణాలు పడకుండా దట్టంగా మొక్కలు పెంటారు. డాక్టరు గారు తెల్ల ధోవతి కట్టుకొని తెల్లటి స్లాకు తొడుక్కునేవారు. మా నాయన మిత్రులు. రోగులెవరూ కనిపించరు గానీ, కవి పండితులు (మరుపూరు వారితో సహా) కూర్చుని గోష్ఠి జరుపుతూ కన్పించేవారు.
1958కి ఆ ఇంటిని సోమయాజులు అనే సివిల్ ఇంజనీరుకు బాడుగకు ఇచ్చారు. మా వీధి చివర రైలు కట్ట, కట్ట ఆవల విజయమహల్ అనే సినిమా హాలు నిర్మాణాన్ని వీరు పర్యవేక్షించారు. వారికి కాలేజీ చదివే అమ్మాయిలు. ఒక అమ్మాయి తెల్ల కాగితంపై కలం పెడ్తే ఎదుటి వ్యక్తి భూత భవిష్యత్తులను ఆ కలం రాస్తూ పోతుందట తనంతట తానుగా! ఏదో ‘ఆటో రైటింగ్’ అని పేరు పెట్టారు లేండి. జనం వారి ఇంటి ముందు గుంపులుగా వచ్చి నిలబడి వుండేవాళ్ళు. సోమయాజులు గారికి కూడా ఆధ్యాత్మికత హెచ్చే. ఆ తర్వాత ఆ కుటుంబం ఏమయిందో గుర్తు లేదు. అందరూ ఆ సీతా కుటీరంలో ఏదో మహిమ ఉందని అనేవారు. డాక్టర్ శ్రీనివాసరావు కుమారులొకరు ఆధ్యాత్మిక జీవనం వైపు ఆకర్షణలో శిఖ, పంచె ధరించి ఆ ఇంటిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించేవారు 1980 దాకా.
కలం పట్టుకుంటే నాకు బాల్య స్మృతులు తన్నుకొని వస్తున్నాయి, ఆటో రైటింగేనా ఏమిటి?
(ఇంకా ఉంది)