మహా యోగిని త్రిజట

12
3

[box type=’note’ fontsize=’16’] ఆచార్య అనుమండ్ల భూమయ్య రచించిన ‘త్రిజట’ అనే కావ్యాన్ని విశ్లేషిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. [/box]

[dropcap]”స[/dropcap]కల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుడు లోకాలను రంజింప చేయువాడు, మొక్కవోని విక్రమం కలవాడు, దోషరహితుడు, ఒకే మాట ఒకే బాణం ఒకే సతి ధ్యేయంగా, ఆడితప్పని వాడు, పరాక్రమవంతుడు” అని వశిష్ఠుడు, సుమంత్రుడు, దశరథుడు వంటి వారి చేతనే కాక సర్వ ప్రజానీకం చేతనూ వేనోళ్ల కొనియాడబడిన వాడు శ్రీరాముడు.

ఇక సీత… మైధిలి… వైదేహి… జానకి… సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మీయే. శివధనుస్సును వంచి ఆమెను పెండ్లాడిన రామునికి సర్వం ఆమెయే. అటువంటి సీతను రావణాసురుడు అపహరించి, లంకలో అశోకవనంలో ఉంచాడు.

రామదూత హనుమంతుడు సీతాన్వేషణకై లంకలో ప్రవేశించి, అంతటా వెదికి, చివరకు అశోకవనంలో శింశుపా వృక్షంపై, కొమ్మల మధ్య కూర్చుని, చుట్టూ పరికించసాగాడు. ఆ చెట్టుకింద జీర్ణవస్త్రాలంకారయైన సీతను గుర్తుపట్టాడు. అంతలో రావణాసురుడు వచ్చాడు. సీతను బెదిరించాడు. మనసు మార్చుకొమ్మని తనను వరించమని ఆజ్ఞాపించి, గడువు ఇచ్చి వెనుదిరిగాడు.

రాక్షస స్త్రీలు అందరూ మూకుమ్మడిగా సీతను ఆక్షేపించ సాగారు. ఆ గోలకి నిద్రనుండి మేల్కొన్నది ‘త్రిజట’. సీతను రక్షిస్తూ జాగ్రత్తగా కాపలా కాయమని నిర్దేశించబడిన ‘త్రిజట’ నిద్రించటం ఏమిటి? కల గాంచడమేమిటి? రామ దర్శనం కలగటం ఏమిటి?

అదిగో… అలాంటి సందేహాలే ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి మదిలో మెదిలాయి. పూర్వాపరాలను నిశితంగా పరిశీలించారు. త్రిజటకు ఇంత భాగ్యమెందుకు కలిగింది, ఎలా కలిగింది! అని ఎప్పటిలా తనకు ప్రత్యేకమైన ‘మరో చూపు’ ‘మరో కోణం’లో చూశారు, కొత్త త్రిజటను దర్శించారు, “త్రిజట” అనే కావ్యాన్ని మనకు అందించారు.

ఎరుగ రాక్షస జన్మ ఇదెట్లు కలిగె?
జన్మ ఏదైననేమి? ఈ జన్మ నిట్లె
స్వీకరించెద దైవమిచ్చిన ప్రసాద
మట్లె:ఇంత రాక్షస జన్మకంత మెపుడొ

అని ‘నిరంతరం’ త్రిజట తన మనమున ‘చింత’ చేయుచు నుండెను. ఇక్కడ నిరంతరం, చింతన అన్న పదాలు ముఖ్యం. ఎప్పుడో ఒకసారి అనుకోవడం కాదు. నిరంతరం చింతన చేసిన విషయాలే కలలోకి రావటం అనేది సహజమే. ఇక్కడ రామ దర్శనం పూర్వజన్మ వాసనా ఫలం. ఇప్పుడు రాక్షస జన్మ కలిగింది కానీ బహుశా పూర్వ జన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకొన్నదేమో! గొప్ప యోగిని ఏమో! ఆ జన్మలో ఏదేని కారణాంతరాల వల్ల ‘భ్రష్ట యోగిని’ అవడం వల్ల ఇప్పుడు రాక్షస జన్మ కలిగిందేమో! అది స్వప్నానంతరం బహిర్గతమైంది. ఆత్మజ్ఞానాన్ని పొందింది. అమృతత్వాన్ని పొందింది. లేకుంటే నిరంతర ధ్యానమగ్నులైన వారికి, యజ్ఞ యాగాదులు చేసిన తపోనిధులకు కూడా సాధ్యపడని రామ దర్శనం త్రిజటకు స్వప్నంలో కలగడం ఏమిటి?

రాముడిచ్చిన ఉంగరమ్ము తోడ లంకలో ఆ రామదూత కాలుమోపిన క్షణంలోనే త్రిజటకు స్వప్నంలో రామ దర్శనం కలిగింది. అంటే అది హనుమ అనుగ్రహం వల్లనే అయి ఉండవచ్చు. త్రిజట ఉన్నది నిద్రలో కాదు. అది స్వప్నమూ కాదు. ఆమె యోగనిద్రలో ఉన్నది, దైవ సాక్షాత్కారం కలిగింది.

“జనకుని సుత ఈ సీత దశరథ రాజు కోడలీమె” అనే వివరాలు అందరితో పాటు త్రిజటకూ తెలుసు. కానీ గతంలో ఎన్నడూ చూడని ‘విక్రాంతగామి, విశిష్ట పురుషుడు శ్రీరాముని మంగళాకారము’ నెలా దర్శించ కలిగింది! రాముని ప్రభను, సోయగమునూ గాంచిన ఆమె ‘బ్రతుకులో వెలుగు కురిసే’నట. ఆ వెలుగులో ఆమెలో ఎక్కడో ఉన్న తమస్సు లాంటిది తొలగిపోయింది. అందుకే సీతకు కాపలా పెట్టి, ఇంతటి భాగ్యం పొందటానికి కారణమైన రావణునిలో మంచితనమున్నదని మంచి మనసుతో మెచ్చుకుంది.

ఆ ‘వెలుగు’ లోనే దశరథుని పుత్రకామేష్టి యాగము, రామ జననం, సీతారామ కళ్యాణం, తాటకిని సంహరించడం, కైక కోరిన విధంగా కారడవుల కేగి, ఋషులు క్షేమమునకై రాక్షసులను దునుమాడుట, శూర్పణక వృత్తాంతము, వాలి సుగ్రీవుల వృత్తాంతం మొత్తం కలలో.. కాదు కాదు.. మనోనేత్రంలో దర్శించింది. హనుమ సీతమ్మకు రామకథ వినిపించక ముందే తాను వినిపించి సీతమ్మకు సాంత్వన కలిగించింది. చెట్టు కొమ్మల్లో దాగి ఉన్న హనుమకు సంతోషాన్ని కలిగించింది. రామపత్ని, రామదూతల అనుగ్రహాన్ని పొందిన ‘ధన్య’ త్రిజట.

సీత ఎల్లవేళలా రాముని స్మరించటం వల్ల, అదే మంత్రంలా తనకు సిద్ధించింది అని, మంత్రోపదేశం చేసినవారు గురువే కాబట్టి, సీతయే తనకు గురువు అని నిర్ధారించుకున్నది త్రిజట. రామ దర్శనం వల్ల జన్మజన్మల పాపమంతా పోయింది. ఈ జన్మ ధన్యమగుట సీత దర్శనం వల్లనే సిద్ధించిందని తోచిందామెకు.

రావణుడి ఆజ్ఞలననుసరించి సీత పట్ల మనం గతంలో చేసిన పాపము పోయేలా ఈమె చరణాల కడ సాగిలపడండని సాటి రాక్షస కాంతలకు చెప్పింది. వారు ఆశ్చర్యపోయి, స్వప్న వివరాలు చెప్పమని అడిగారు.

స్వప్నానికి ముందు త్రిజట సీతమ్మతో ఎలా ప్రవర్తించిందో వాల్మీకి చెప్పలేదు. కానీ రావణుని పలుకులతో నిస్త్రాణమైన సీతమ్మ దుఃఖభరిత మనః ప్రకంపలతో, ఆత్మహత్య చేసుకోబోతున్న ప్రధాన ఘట్టంలో ఆమెను ‘ఆశ’ అనే మంచి మలుపుకు మరల్చిన కీలకమైన పాత్ర పోషించింది త్రిజట. వాల్మీకి రామాయణంలో 48 శ్లోకాలలో ఉన్న వృత్తాంతాన్ని (129 తేటగీతి, రెండు ద్విపదులు) మొత్తం 131 పద్యాలలో సరళ సుందర శైలిలో రచించారు ఆచార్య భూమయ్య. రావణుని ఏలుబడి పడి బ్రతుకు నీడ్చుచున్న,మట్టి ముద్దగా, శవముగా బ్రతికిందిన్నాళ్ళూ. “నన్ను మరచి బ్రతికిన ఆనాటి నేను ‘నేను’ కానేకానిప్పుడు. నేను కొత్త జన్మనెత్తితి. ఈ పునర్జన్మ ఇచ్చిన రఘురాముడే నా దైవమ”నుకొంది.

త్రిజట మాటలు వింటున్న మారుతికి ముచ్చట వేసింది. రాముని కథ విని మురిసిపోయాడు. రాముని దర్శనమైన “వెలుగు” త్రిజట ముఖంలో మారుతి గుర్తించి, ఆ వెలుగులో రాముని దర్శించి నమస్కరించాడు.

మూల కథకి భంగం కలగకుండా త్రిజట హృదయాంతర్గతమైన, నిద్రాణమై ఉన్న సంస్కార పరిమళం భూమయ్య గారు మనకు పంచారు. కొన్ని కల్పనలతో త్రిజటను ఇంకా ఎక్కువ సంస్కారవంతమైన స్త్రీగా నిరూపించారు. సీతను గురువుగానూ, గురువే తన దగ్గరకు వచ్చినట్లుగానూ భావించడం, సీతమ్మ వదనంలో ఏదో కాంతిని దర్శించటం, ఆమెను ఓంకారమూర్తిగా గుర్తించటం త్రిజట లోని ‘యోగదృష్టి’ వలననే సాధ్యమైనది. జన్మతః రాక్షస స్త్రీ అయినను ఆమెలోని ఔన్నత్యానికి, ఆమెలో గల ‘రాము నరసి మ్రొక్కె’నట. ఎవరూ? రామభక్తాగ్రగణ్యుడైన హనుమ.

ఇలాంటి కల్పనలు భూమయ్య గారి లోని భావుకత, కల్పనాశక్తి, సృజనశీలతకు తార్కాణం.

శ్రీమద్రామాయణంలో సందర్భానుసారం మూడుసార్లు కలల ప్రస్తావన వస్తుంది. ఒకటి దశరథునికి (తన మరణం) కాగా, రెండవది (తండ్రి మరణించినట్లు) భరతునకు వచ్చింది. ఈ రెండూ అరిష్టాలు. మూడవ కల త్రిజటకు వచ్చింది. కానీ త్రిజటా స్వప్నం శుభమైనది. రామ దర్శనం, సీతమ్మకు సాంత్వన కలిగించేది, రాక్షస స్త్రీలలో దుర్మార్గపు ఆలోచనలు తొలగించేది.

త్రిజటకు స్వప్నంలో శ్రీరాముడు నాలుగు విధాలుగా దర్శనమిచ్చాడు. తెల్లని వస్త్రాలు ధరించి రామలక్ష్మణులు రావటం, సీత తెల్లని వస్త్రాలు ధరించి వస్తుంటే నాలుగు దంతాలు గల ఏనుగు నెక్కి ఆమెను చేరటం, 8 ఎద్దులు కట్టిన రథమునెక్కి వచ్చే రూపం, పుష్పకవిమానము నెక్కి ఉత్తర దిశగా సీతా లక్ష్మణులతో వెళ్ళటం. ఎర్ర గన్నేరు పూల దండలు వేసుకొని, ఎర్రని వస్త్రాలు ధరించి, రావణుడు దక్షిణ దిశగా వెళుతూ, మలపంకంలో పడ్డాడని వాల్మీకి రామాయణంలో ఉంది.

ఈ కావ్యంలో విశేషమేమంటే – రావణుడు పడటం కాదని, ఇలాంటి వాడిని నేను మోయటమా, సిగ్గుమాలిన పని అనుకుంటూ గాడిద కూడా నిరసనగా తన పైనున్న రావణున్ని తోసేసింది అని భూమయ్య గారు చెప్పారు.

త్రిజట ‘మహా యోగిని’ అన్న స్పృహ మనకు కలిగేలా భూమయ్య గారి వాక్యాలు కొన్ని తెలియజేస్తాయి. సీత “లో” వెలుగును దర్శించిన గలిగినది త్రిజట. ఆమే ఒక ఓంకారమనీ గ్రహించింది. ఆమెను గురువుగా సంభావించడం, తర్వాత శ్రీ లలితా మహాదేవిగా భావించటం, ఆ జ్ఞానం తన నిలువెల్లా “వెలుగై” నిండిపోయిందనుకోవటం, అందువల్ల తన రాక్షస జన్మ నుండి విముక్తి అని నమ్మటం. అలాగే, సీతను మాటలతో హింసించరాదని, ఒక స్త్రీని చంపడం మహాపాపమని సాటివారికి రాక్షస స్త్రీలకు హితవు పలకటం, ఇప్పుడు సీతను రక్షించడం వల్ల రాబోయే కాలంలో ‘కోదండరాముడు’ సర్వ పరివార సహితంగా రావణుని సంహరించినప్పుడు తాము రక్షింపబడే అవకాశం ఉంటుందని నమ్మడం ఆమెలోని జ్ఞానావిష్కరణకు తార్కాణం. పురాకృత సంస్కారం.

ఆంజనేయుడు అంతటివాడు ‘త్రిజటలో గల రాము నరసి మ్రొక్కె’ ననుట, త్రిజట మహోదాత్త అని చెప్పడమే. రామలక్ష్మణులు, సీత కలయికను చూసినంతనే “ఏదో ఒక కాంతి వచ్చి నా ఎల్ల తనువు నందలి అణువణువు జేరి అమృతమయ్యె… ఆనాటి నేను ‘నేను’ కానే కానిప్పుడు” అని త్రిజట తన్మయంలో మునిగిపోవడం “రాక్షసత్వం నుండి దివ్యత్వం వైపు మరలడం”.

తను మాత్రమే కాక తన తోటి రాక్షసాంగనలు కూడా తరించాలనే ఉన్నతమైన ఉత్తమమైన మనసామెది. విభీషణుడు రాముని శరణు వేడినట్లు, త్రిజట సీతమ్మను శరణు వేడింది. లంకలోని వారికి రామ వృత్తాంతం శూర్పణఖ ద్వారానో, చారుల ద్వారానో కొంత తెలిసి ఉండవచ్చు. కానీ వానరులతో స్నేహం, హనుమ రాక తెలిసే అవకాశం లేదు. మరి “ఒక కోతి ఎట్లో చేరి విరిచి కుప్పబెట్టి తగలబెట్టినట్లు” త్రిజటకు స్వప్నంలో భవిష్య దర్శనమెలా కలిగింది!

ఆమె చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని (ఉపదేశాన్ని) విని ఆశ్చర్యపోయి, మనస్పూర్తిగా నమ్మి, సీతను బెదిరించడం మాని, ఆమె చెంత చేరి సంతోషంగా ఆడి, పాడారు. త్రిజట మాటలకున్న శక్తి అంతటిది. బ్రతుకు పరమార్థం తెలిసికొని, రాక్షసత్వం నుండి దివ్యత్వం వైపు మెరవాలంటే ‘ఇలాంటి’ కలగనాలి, కనుగొనాలి.

“ఈ సృష్టి యావత్తూ పరిణామ సిద్ధాంతం (transformation) మీదనే నడుస్తుంది. అంతేకాక, ఊర్ధ్వముఖంగా (uplift) పరిణమిస్తుంది. రాయి రాయి లానే వుండదు. రాతిలో కూడ ప్రాణం వుంటుంది, ఎప్పటికైనా పరిమాణంలో పరిణామం తప్పదు. త్రిజట రాక్షస స్త్రీగానే ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు” అంటారు ఆచార్య అనుమాండ్ల భూమయ్య. బురద లోంచి కమలం రావడం సృష్టి లోని ఒక చిత్రం అయితే, “బురదే కమలంగా మారింది” అని కొత్త కోణంలో చూడగలగడం ఒక విశిష్టమైన భావన. ఆ భావన లోంచే “త్రిజట” పద్య కావ్యం (2015లో) రచించి సదసద్వివేకి, జగచ్ఛా‌స్త్రవేత్త, కావ్యరసవేత్త అయిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారికి అంకితమిచ్చారు.

శుభం భూయాత్.

***

త్రిజట (పద్యకావ్యం)

రచన: అనుమాండ్ల భూమయ్య

పుటలు: 86

వెల: ₹ 75

ప్రచురణ:

మనస్వినీదేవి

‘సౌందర్యలహరి’, ఫ్లాట్ నెం. 303, బృంద హైట్స్,

స్వరూప్ నగర్, ఉప్పల్, హైదరాబాద్ – 500039

88970 73999

ప్రతులకు:

నవోదయ బుక్ హౌస్,

ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా,

కాచీగుడా చౌరస్తా, హైదరాబాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here