[dropcap]అ[/dropcap]ప్పుడప్పుడు మాత్రమే
ఆ పేజీలు అక్షరాలతో అద్దుకోబడతాయి
రాతిరి వేళ తెరిచిన
ఆ తెల్లని పేజీలు మీద
గడిచిన, గతించిన రోజంతా
కలంపాళీ కొనలోంచి జారి
అక్షరాలుగా మారి అక్షరమవుతుంటుంది
గాయాలై కుదిపేసిన బాధలు
గాలిపటాలై ఆకాశానికి ఎగసిన ఆనందాలు
సత్తువ ఉన్న సంఘటనలు,
సుతిమెత్తనివో … కరకు కత్తుల్లాంటివో
రోజులో సాగిన ఎన్నో కొన్ని సంభాషణలు
పంక్తులుగా పేరాలుగా ప్రత్యక్షమవుతుంటాయి
అప్పటికి…
ఆ రోజుకి గొప్పగా అనిపించిన
భావాలు, భావనలు
అక్షరాల సాయంతీసుకుని
ఒకటో రెండో వాక్యాలుగా సర్దుకుంటాయి
చెప్పలేనివే ఐనా
చెప్పకుండా ఉండలేనితనంతో
కొన్ని కొన్ని రహస్యాలు
ప్రమాదంలేని .. అపాయంరాని రీతిలో
పలు దఫాలుగా సెన్సార్ అయి
డైరీతెరపై విడుదలవుతుంటాయి
తనకు వచ్చేదే కాదు
తననుంచి వెళ్ళే లెక్కకూడా
పక్కాగా చోటు చూసుకుంటుంది
కలిగిన అనుమానాలు
కలతగా మారిన అపార్థాలు
తీసుకున్న అర్థాలు, చేసుకున్న వ్యర్థాలు
మనసు లోపలి లేకితనం
మంది ఎదుట బయటపడని భయం
మనసుకిష్టమైన కోణంలోంచే
మూల్యాంకనం అవుతుంటుంది
మనిషిలోని మనిషితనం … మంచైనా చెడైనా
పేజీ పేజీకి కొత్తగా పరిచయమవుతుంటుంది
రాతిరిలో కేటాయించిన ఆ కొద్ది సమయం
గడిచిన రోజునంతా డాక్యుమెంట్ చేసేస్తుంది
దర్జాగా … శాశ్వతంగా
అపుడో ఇపుడో అక్షరాల సహవాసం చేస్తోన్న
ఆ … డైరీ లోపల