[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]మ[/dropcap]న దేశంలో తమకు తాము మేధావులమని సంఘాలు పెట్టుకొన్నవాళ్లు.. హేతువును అనుసరించి వాదిస్తున్నామని చెప్పుకొనేవాళ్లు.. లక్షలాది ప్రజలను ఊచకోత కోసిన వాళ్లను, నిస్సిగ్గుగా ఆడవాళ్లను చెరబట్టి వారి మాన ప్రాణాలతో ఆడుకొన్న వాళ్లను దేవుళ్లుగా కొలిచేవాళ్లు.. రామాయణంలో రాముడిని తిట్టడానికి దొరకబట్టుకొన్న అంశాలు రెండే రెండు.. ఒకటి ఓ దళితుడు తపస్సు చేస్తుంటే పోయి చంపాడని.. ఈ వ్యవహారాన్ని గురించి ఇంతకుముందు వ్యాసాల్లో చర్చించుకొన్నాం. రెండవది సీతా పరిత్యాగం. నిండు గర్భవతిని అడవుల్లో వదిలేశాడని.. ఈ రెండింటిని పట్టుకొని అటునుంచి ఇటు.. ఇటు నుంచి అటు తెగ లాగుతుంటారు. నిజంగా రాముడు నిండు గర్భిణిని వదిలేశాడా? ఉత్తర రామాయణంలో ఉన్న ఈ కథలో రాముడు సీతను వదిలేసినప్పుడు పెద్దగా బాధపడినట్టుగా కూడా కనిపించదు (లవకుశ సినిమాలో లాగా లేదా శ్రీరామరాజులో మాదిరిగా). ప్రజల్లో ఫలానా అపవాదు వచ్చిందని భద్రుడనే గూఢచారి చెప్పగానే ఒకసారేమో అయ్యో అని కించిత్ బాధపడి.. లక్ష్మణుడిని పిలిచి వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి రమ్మన్నాడు. రామాయణం రాసిన వాల్మీకి ఈ కథలోకి ఎందుకొచ్చాడు.. ఉత్తర రామాయణం వెనుక మతలబులేమిటన్న సంగతి గతంలో విస్తారంగానే చర్చించడం జరిగింది. గమ్మత్తేమిటంటే.. ఈ సోకాల్డ్ మేధావులు దీన్ని పట్టుకొని రాముడు భార్యను వదిలేశాడని పదే పదే ప్రచారంచేస్తుంటే.. మన పండితులు సైతం ఆ మేనియాలో పడిపోయి.. సీతాపరిత్యాగానికి సమర్థనలు వెతుక్కొంటూ కూర్చొన్నారే తప్ప.. అది ఎంతవరకు వాస్తవము.. రాముడి వ్యకిత్వం ఇంత దోషభూయిష్టంగా ఉంటుందా అని మాత్రం ఆలోచించలేదు. చెప్పుడు మాటలు విని చెప్పిన మాట వినే నన్ను దశరథుడు ఎలా వదులుకొన్నాడని తమ్ముడు లక్ష్మణుడితో బాధపడిన రాముడు (చూ.అయోధ్యకాండ), అదే చెప్పుడు మాటలు విని భార్యను వదులుకొనేంత దుర్బలుడా?
ఉత్తర రామాయణాన్ని పక్కనపడేసి.. కాసేపు వాస్తవ వాల్మీకి రామాయణంలోని ఆరు కాండల్లో రాముడు సీతపై ఎంత అనురాగంతో ఉన్నాడో వాల్మీకి కావ్యంలో తరచి చూడండి. లోకంలో ఏ భర్తకైనా అలా ఉండటం సాధ్యం కాదేమో. ఒఠ్ఠి పుణ్యానికి వాళ్లు ఈ లోకానికి ఆదర్శ దంపతులు కాలేదు. ఊరకనే ప్రతి పెండ్లి కార్డుపైనా వారిని స్మరించడంలేదు. అంత గొప్ప దంపతులు వారు. సీతారాముల కలయిక బాలకాండ చివరలో ప్రారంభమౌతుంది. బాలకాండ 77వ సర్గలో సీతారాములు అనేక ఋతువులు.. (అంటే చాలాకాలం) సుఖంగా విహరించారు అని వాల్మీకి చెప్పాడు.
సీత హృదయములో భర్తయైన రాముడు రెండింతలుగా మసలుచున్నాడు. లోలోపలనున్న భావమును గూడ ఒకరి హృదయము, మరొకరి హృదయముతో చెప్పుచుండెడిది. సీత రాముని హృదయములో ఇంకనూ ఎక్కువగా మసలుచుండెను. ఆమె యొక్క సద్గుణముల చేతను, లోకోత్తర సౌందర్యముచేతను అతని ప్రేమ ఇంకను వృద్ధి చెందెను.
ఇదీ వారిద్దరి తొలినాళ్లలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గురించి వాల్మీకి వివరించినది. తరువాత కొంతకాలానికి దశరథుడికి రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలనిపించింది. సహజంగానే అందరినీ పిలిచి అడిగాడు. ఇంటికిపోయినాక.. కైకేయికి చెప్పడం.. ఆమె వరాలు అడగడం.. రాముడు అడవికి వెళ్లడం ఖాయమైపోయింది. అంతకుముందే.. రాముడు కిరీటం పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ లోగా సీన్ మారిపోయింది. రాముడిని పిలిచి కైకేయి చెప్పింది. ఆయనేం చేస్తాడు.. తండ్రి చెప్పాడు కదా.. వెళ్లక తప్పదు. కాబట్టి సరేనన్నాడు. అక్కడినుంచి తల్లి కౌసల్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఆమె ఏడ్చింది. ఈయన అనునయించాడు. చివరకు ఆమె ఆశీర్వదించి పంపించింది. అక్కడినుంచి సీతా నివాస భవనానికి వచ్చాడు. సీత సంబరంగా పట్టాభిషేకానికి తయారవుతున్నది. ఆమెకు విషయం తెలియదు. భర్త రాగానే పాలిపోయిన ఆయన ముఖం చూచి వణికిపోయింది. రాముడు అప్పటిదాకా దాచుకొన్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటపెట్టాడు.
‘రాముడు సిగ్గుతో కొంచెము తల వంచుకొని సంతోషించిన జనులతో నిండిన చక్కగా అలంకరించబడిన తన ఇంటిలోనికి ప్రవేశించెను. సీత వెంటనే లేచి దుఃఖముతో బాధపడుచు విచారముచే వ్యాకులమైన ఇంద్రియములు గల భర్తను చూచి వణికిపోయెను. ఆమెను చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనస్సులోనున్న దుఃఖమును లోపల ఇముడ్చుకొనజాలక బయటపడిపోయెను. (అయోధ్యకాండ 26 వ సర్గ 5 నుంచి 7 శ్లోకాలు).
భర్తకు భార్య దగ్గర తప్ప బయటపడటానికి వేరే అవకాశమెక్కడున్నది. తండ్రి దగ్గర, తల్లి దగ్గర గాంభీర్యాన్ని ప్రదర్శించిన రాముడు.. సీతాదేవిని చూడగానే లోపల ఉన్న దుఃఖాన్ని అంతా బయటపెట్టేశాడు. ఆ క్షణంలో ఆయన పాలిపోయిన ముఖంతో, చెమటలు పట్టి.. పట్టరాని కోపంతో ఉన్నాడట. ఇప్పుడు చెప్పండి.. రాముడు సినిమాల్లో చూపించినట్టు రాగద్వేషాలకు అతీతంగా.. కోపతాపాలకు అతీతంగా సంపూర్ణంగా శాంత స్వరూపుడై ఉన్నాడా? సాధారణంగా మన మనుషుల్లో ఆయా సందర్భాల్లో ఎలాంటి వికారాలు కలుగుతాయో అవన్నీ ఆయనలోనూ కలిగాయి. కానీ.. వాటన్నింటినీ అధిగమించి ఆయన ముందుకు సాగాడు. ఆయనను ముందుకు నడిపించింది ధర్మం మాత్రమే. దాన్ని మాత్రం విడనాడలేదు.
తన వెంట సీతను తీసుకొని పోవడం రాముడికి సుతరామూ ఇష్టంలేదు. రాజభోగాలు అనుభవించిన ఆమెను అడవుల్లో తన వెంట తిప్పి కష్టపెట్టడం అస్సలు ఇష్టంలేదు. అలాగని రాజమందిరంలో వదిలేసి అడవికి వెళ్తే ఆమెను తాను గౌరవించినట్టుగా.. తాను చూసుకొన్నట్టుగా ఇతరులు చూసుకొంటారన్న నమ్మకమూ లేదు. కానీ అడవుల్లో కష్టాలకంటే రాజమందిరంలో నిరాడంబరంగానైనా ఓర్చుకొని ఉండటం మంచిదని భావించాడు. అందుకే తాను ఒక్కడినే అడవికి వెళ్తున్నానని చెప్పాడు.
‘నేనిప్పుడు నిర్జనారణ్యమునకు పోవుటకు బయలుదేరి, నిన్ను చూచుటకై వచ్చినాను. నీవెన్నడూ భరతుని ఎదుట నా ప్రసంగము తీసుకొని రావలదు. ఎందుచేతననగా, ఐశ్వర్యముతో ఉన్నవారు, ఇతరులను పొగుడుచుండగా సహించరు. అందుచే భరతుని ఎదుట నీవు నా గుణములను గూర్చి ముచ్చటించరాదు. నిన్ను విశేషముగా పోషించవలసిన బాధ్యత కూడా భరతునకు లేదు. అతనికి అనుకూలముగా ప్రవర్తించుచు మాత్రమే నీవాతని వద్ద ఉండగలవు.(అయోధ్యకాండ, 27వ సర్గ)’
ఒకవేళ సీతను అయోధ్యలోనే ఉంచి వెళ్లినట్టయితే పరిణామాలు ఎట్లా ఉంటాయో ముందే చెప్పాడు రాముడు. దాయాదుల మధ్య ఉండే స్పర్థల గురించి స్పష్టంగా వివరించాడు. తన భార్య పట్ల ఎంత ఆందోళన చెందాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు.. అడవిలో ఉంటే.. అక్కడి క్రూరమృగాలు.. ఆహారపానీయాలు.. ఇతరాల గురించి వివరించాడు. ఈ కష్టాలన్నీ నువ్వు భరించలేవని అనునయించాడు. కానీ సీత వినలేదు.
‘నీవిపుడే దుర్గమారణ్యమునకు ప్రయాణమైనచో, నేను గూడ నీ ముందే నడుచుచూ దర్భలను, కంటకములను నలగగొట్టి, నీవు నడుచుటకు సుఖముగా చేసేదను. నన్నుకూడా తీసుకొని వెళ్లుము’
అని ఆమె అన్నది. నీతో రావాలా వద్దా అని నాకెవరూ చెప్పాల్సిన పనిలేదు.. నేను డిసైడ్ అయిపోయానని తేల్చిచెప్పింది. సీత చెప్పిన ఈ మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. కొంత విశ్లేషణ చేయాలనిపిస్తున్నది. రామాయణంలో రాముడి ప్రస్థానం అంతా రావణ వధవైపే సాగుతుంది. నేను ముందు నడుచుచూ దర్భలను, కంటకములను నలగగొట్టి.. దారి తేలిక చేస్తానని చెప్పింది సీత. రాముడి కంటే ముందుగానే రావణుడి దగ్గరకు చేరింది సీత. అక్కడ రావణుడి మనోబలాన్ని దెబ్బతీసింది. హనుమంతుడు వచ్చిన తరువాత అతడి చేత లంకాదహనానికి ప్రేరకురాలైంది. అసుర స్త్రీలందరినీ వశులను చేసుకొన్నది. అందువల్లనే రావణుడు చేసిన సీతాపహరణం లంకలోని చాలామంది రాక్షసులకు నచ్చలేదు. కానీ పైకి ఏమీ అనలేక ఊరకుండినారు. తాను ముందు చెప్పినట్టుగానే రాముడు తన గమ్యాన్నిచేరడానికి దారిని తేలికచేసింది.
అరణ్యానికి బయలుదేరిన రాముడు.. సీతాసమేతుడై.. పద్నాలుగేండ్లు గడ్డి పరకలపైనే నిద్రపోయాడు. అడవిలో ఆమె పట్ల అడుగడుగునా ప్రేమానురాగాలను చూపించాడు. ఆమెకు చిన్న కష్టం కలుగకుండా జాగ్రత్త పడ్డాడు. అయోధ్యనుంచి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు ముందుగా చేరుకొన్నది నిషాద రాజైన గుహుడి (ఇతడు నిషాదుడు.. ఒక రాష్ట్రానికి పాలకుడుగా ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన విషయం) ఇంటికి. అక్కడినుంచి బయలుదేరిన తరువాత నావ ఎక్కేముందు ‘నది ఒడ్డున ఉన్న నావను చూచి లక్ష్మణునితో ‘లక్ష్మణా! నావ నిలిచి యున్నది. దానిని మెల్లగా ఎక్కుము. పిదప సీతను కూడా చేయి పట్టుకొని ఎక్కించుము’ అనెను. బుద్ధిమంతుడైన లక్ష్మణుడు ముందుగా సీతను ఎక్కించి పిదప తాను నావను ఎక్కెను. తేజఃశాలి అయిన రాముడు కూడా నావనెక్కెను’ (అయోధ్యకాండ 52 వ సర్గ). చూడటానికి చిన్న సన్నివేశం లాగానే కనిపించవచ్చు. కానీ, భార్య పట్ల రాముడు తీసుకొన్న జాగ్రత్తలకు ఇది ఒక మచ్చు తునకమాత్రమే. అరణ్యవాసంలో ఇలాంటి తురుపుముక్కలు కొల్లలుగా మనకు కనిపిస్తాయి. గంగానదిని దాటి బయటకు వచ్చిన రాముడు వత్సదేశము దాటిన తర్వాత అడవిలో ఒక మహా వృక్షము కిందకు చేరుకొన్నాడు.
‘ఇప్పుడు మన దేశము బయటకు వచ్చినాము. సుమంత్రుడు కూడా వెళ్లిపోయినాడు. ఇటుపై మనము ఒంటరిగా ఉండవలసిన రాత్రులలో ఇది మొదటిది. నీవు దుఃఖింపకుము. నేడు మొదలు మనమిద్దరము రాత్రులందు మేల్కొనియుండవలెను. సీత క్షేమము మన యిద్దరిపైననే ఆధారపడి యున్నది కాదా. ఏవియో పర్ణాదులు స్వయముగా తెచ్చుకొని భూమిపై పరచుకొని పరుండి ఈ రాత్రి ఏదోవిధముగా గడిపెదము’ (అయోధ్య 53 వ సర్గ) అన్నాడు.
వనవాసం గడిచినంత కాలం సీతా రక్షణ కోసం రాత్రుళ్లు రామలక్ష్మణులు మేలుకొనే ఉన్నారు. తరువాత చిత్రకూటానికి వెళ్లే దారిలో ‘లక్ష్మణా! సీతను తీసుకొని నీవు ముందు నడువుము. నేను ఆయుధ ధారినై వెనుక నడిచెదను. సీత ఏయే ఫలములు, పుష్పములు కావలెనని కోరునో వాటిని ఇచ్చుచుండుము’ అన్నాడు. ముందు లక్ష్మణుడు, మధ్యలో సీత, వెనుక రాముడు నడుస్తూ వెళ్తున్నారట. ఆ రామ లక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత రెండు దిగ్గజేంద్రముల మధ్య నడుస్తున్న ఆడ ఏనుగు వలె ఉన్నదట. చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకొన్న తరువాత సీతారాముల దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. తమ నగరాన్ని విడిచిపెట్టామన్న బాధే లేకుండా హాయిగా జీవనం కొనసాగింది. చిత్రకూట పర్వత ప్రాంతమంతా విహరిస్తూ అక్కడి శోభను అనుభూతి చెందుతూ గడిపారు.
తరువాత పంచవటిలో ఉన్నప్పుడు శూర్ఫణక పరాభవ అనంతరం ఖరదూషణులు రాముడిపై యుద్ధానికి దండెత్తి వచ్చారు. అప్పుడు సీతను కాపాడటం రాముడుకి కష్టతరమైంది. ఓ పక్క యుద్ధం చేస్తూనే.. లక్ష్మణుడితో సీతను సురక్షిత స్థావరానికి తరలించాడు.
‘రాక్షసుల అరుపులు, క్రూర కర్మలు చేయు ఆ రాక్షసులు మ్రోగించుచున్న భేరీల భయంకరమైన మహాధ్వని వినవచ్చుచున్నవి. ఆపద రానున్నదని అనుమానము కలిగినపుడు శుభమును కోరు బుద్ధిమంతుడైన పురుషుడు రాబోవుదానికి ప్రతిక్రియ చేసుకొనవలెనుకదా! అందుచేత నీవు ధనుర్బాణములు ధరించి, సీతను నీవెంట గైకొని వెళ్లి, వృక్షములచేత ఆవరించబడిన ప్రవేశింపశక్యముకాని పర్వత గుహలో ఉండుము. నేనే ఈ రాక్షసులను సంహరించెదను’ (అరణ్యకాండ 24 వ సర్గ).
సీతాపహరణం జరిగిన తర్వాత రాముడు సీతను ధ్యానించని క్షణం లేదు. మారీచుడిని సంహరించి పర్ణశాలకు తిరిగి వచ్చిన రాముడు సీత లేకపోవడాన్ని చూసి తమ్ముడిని తీవ్రంగా నిందించాడు. సీత కోపంలో ఏదో అన్నదని వచ్చేయడమేనా? నా పరాక్రమం నీకు తెలియనిదా? ఇప్పుడేమైందో చూడు అని గోడుగోడున ఏడ్చాడు. అడవిలో పిచ్చివాడిలా సీత కోసం తిరగడం ఆరంభించాడు. ఓ కదంబ వృక్షమా? ఓ బిల్వ వృక్షమా? అర్జున వృక్షమా? తాల వృక్షమా? జంబూ వృక్షమా? అశోక వృక్షమా? ఎవరినైనా స్త్రీని మీరుచూశారా? ఆమె ఫలానా చీర కట్టుకొని ఉన్నది. ఫలానా శరీరఛాయ గలిగినది.. మీరు చూశారా? అంటూ కనిపించిన చెట్టునల్లా అడిగాడు. ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు.. ఒక పర్వతం నుంచి మరో పర్వతం వైపు.. ఒక కాలువ నుంచి మరో కాలువ వైపు పరిగెడుతూ.. విలపిస్తూ.. గట్టిగా అరుస్తూ.. సీతకోసం పరితపించాడు. జంతువులను దగ్గరకు తీసుకొని సీత గురించి అడిగాడు. సీతాన్వేషణలో తానేం చేస్తున్నాడో తనకే తెలియనంతగా అటూఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఎవరైనా అపహరించారా? ఏ క్రూర జంతువైనా తినేసిందా? నీటికోసం నదికి పోయిందా? పూలు పండ్లు తేవడానికేమైనా వెళ్లిందా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు. వనాలు దాటి, సెలయేళ్లు దాటి.. సీతను వెతుకుతూ.. ఉన్మత్తుడిలా మారిపోయాడు. ‘సీతా నాతో పరియాచకమాడుటకై చెట్ల చాటున దాగియునానవా? ఇంక చాలు.. బయటకు వచ్చేయి.. దుఃఖాక్రాంతుడనైన నన్ను పొందుము’ అని పరిపరి విధాలుగా విలపించాడు. నువ్వు నన్ను విడిచిపెడితే.. నేను జీవితాన్నే విడిచిపెడతాను అన్నాడు. గోదావరి నదికి పద్మములు తేవడానికేమైనా వెళ్లిందేమోనని తీరప్రాంతమంతా కలియదిరిగి వచ్చారు. ఎక్కడా కనిపించలేదు. ‘సీతా ఎక్కడున్నావు? అని గట్టిగా అరిచాడు. తీవ్రంగా కోపమొచ్చింది. ఆ కోపంలో అంతటి సౌమ్యుడు కూడా
‘ఇక యక్షులను గానీ, గంధర్వులను గానీ, పిశాచములను గానీ, రాక్షసులను కానీ, కింనరులను కానీ, మానవులను కానీ సుఖముగా ఉండనివ్వను. ఆకాశమునందు నా అస్త్రములతోను, బాణములతోను నింపివేసి మూడు లోకములలో సంచరించే దేవతాదులకు ఎగురుటకు అవకాశము లేకుండా చేసెదను. ముల్లోకములలో ప్రళయము సృష్టించెదను’
సీత కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు రాముడు. మొత్తం ప్రపంచాన్నే నాశనం చేసేస్తానన్నాడు. నాడు కైకేయిమీద కోపంతో దూసుకుపోయిన లక్ష్మణుడిని వారించిన రాముడేనా ఇతడు? ఈ కోపాగ్ని అంతా అనన్య సామాన్యమైన ప్రేమ కలిగిన తన భార్య సీత కనపడకపోవడం వల్ల కలిగిన దుఃఖానికి ప్రతిబింబం. తరువాత కిష్కింధలో ఆంజనేయుడు సీతాభరణాలను చూపించినప్పుడు ‘రాముడు ధైర్యము విడిచి.. హా! ప్రియా అని ఏడ్చుచూ మూర్ఛ చెంది నేలపై పడెను.. రాముడు ఉత్తమములైన ఆ అలంకారములను మాటిమాటికి వక్షస్థలము (గుండెలపై)నందుంచుకొనుచు కలుగులో ఉన్న కోపించిన సర్పము వలె బుసలు కొట్టెను’ (కిష్కింధకాండ ఆరో సర్గ). రాముడు తన భార్య పై చూపించిన ప్రేమ, అనురాగం, బంధం.. రామాయణమంతా అణువణువునా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. తన భార్యపై ఎంత ప్రేమ ఉంటే.. ఆమె ఆనవాళ్లు చూడగానే భర్త మూర్ఛ చెందుతాడు చెప్పండి? తరువాత హనుమంతుడు సీతను చూచి వచ్చిన తరువాత ‘సీతాదేవిని చూచితిని’ అన్న మొదటి వాక్యం విన్న తరువాత కానీ రాముడి మనస్సు ఊరట చెందలేదు. ఆమె పంపించిన చూడామణిని చూసిన తరువాత దుఃఖము ఆగలేదు.
మధురా మధురాలాపా కిమహ మమ భామినీ.. మద్విహీన వరారోహా హనుమాన్ క తయస్వమే.. సీత మధురమైనది. ఆమె ప్రతి ఆలాపము.. మాట.. మధురమైనది. అలాంటి ఆమె ఏమి చెప్పింది.. మళ్లీ మళ్లీ వినాలని ఉన్నది చెప్పు అని రాముడు హనుమంతుడితో అన్నాడు. భార్య పట్ల ఎంత మధురమైన భావన ఇది…
ఆ తరువాత రావణ వధకు ఎక్కువ సమయం పట్టనే లేదు. అనంతరం సీతను తన దగ్గరకు తీసుకొని వచ్చిన పిమ్మట ఆమెను ఆయన స్వీకరించలేదు. దీంతో తానే అగ్ని ప్రవేశం చేసింది. అనంతరం ఆమెకు రాముడు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. రేపు నేను పట్టాభిషక్తుణ్ణయితే.. సింహాసనంపై కూర్చొన్నవారికి ఎలాంటి అపవాదు ఉండవద్దన్న కారణంతోనే ఈ పరీక్ష పెట్టాల్సివచ్చిందన్నాడు. ఈ సమయంతో భార్య తనను ఎన్ని మాటలన్నా సహించాడు. ఎందుకంటే.. ఇక్కడ ఆయనకు ఆనాటి రాజధర్మం ప్రధానమైంది. భార్యపై అనుమానం కాదు. భార్యపై అనుమానమున్న వ్యక్తిత్వమే రాముడిది అయితే.. భార్య కోసం ఇంతగా దుఃఖించేవాడు కానేకాదు. ఇంతగా బాధపడేవాడు కానేకాదు. లోకంలో అరుదుగానైనా కానరాని అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి కాబట్టే సీతారాములు లోకానికి ఆదర్శప్రాయులయ్యారు. పూర్వరామాయణంలో ఇంతటి ప్రేమను సీతపై అభిషేకించిన రాముడు.. సీత కోసం ఇంతగా పరితపించిన రాముడు.. పిచ్చివాడిలా, ఉన్మాదిలా మారి విలపించిన రాముడు.. ఉత్తర రామాయణంలో అంత ఈజీగా చెప్పుడు మాటలు విని భార్యను వదిలిపెట్టడం పూర్తి కాంట్రాస్ట్‌గా అనిపించడంలేదా? అది సృష్టించింది కాకుంటే..!