[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“ఓ[/dropcap] యంత్రంలా, జీవచ్ఛవంలా ఇంటికి వెళ్ళి పోయాను. నేనున్న చోటుకి కావేరి వస్తుందనుకున్నాను. కావేరి కోసం ఎదురు చూసాను ఆమె కోసం, టౌన్‌కి ఎందుకెళ్ళిందో, ఎందుకు ఆ ఫ్లాటుకి వచ్చిందో ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోయిందో అన్నీ వివరంగా చెప్తుందని అనుకున్నాను. ఆమె ఇచ్చుకునే సంజాయిషీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆమె చెప్పినదంతా విని క్షమించేయాలనుకున్నాను. కాని రాలేదు. సాయంత్రం వరకూ రాలేదు.
ఆమె వైపు నుంచి ఆలోచించాను. ఆత్మ గౌరవం పోగొట్టుకోడం కన్నా మరో అవమానం ఉండదు. అది మానవత్వానికి, దానికి మరోటి రీప్లేస్ చేయలేదు. గాయపర్చు, బాధపెట్టు, ఎంత మంట కలిగిస్తుందో చావు కూడా ఆ నరకం కూడా తక్కువే అనిపిస్తుంది. అందుకని మొహం చెల్లలేదేమో అని అనుకున్నాను. ఓ చిన్న మాట , ఓ చిన్న సందేశం ఏదో ఒకటి, వస్తుందని ఎదురు చూసాను. రాలేదు.
ఒకవేళ ఆమె ఓ మెసేజ్ లాంటిది ఏదో పంపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆమె మనసు తెలిసేది. ఆమె మనసులో ఏం ఉందో కూడా నాకు అర్థం అయ్యేది. ఆమెకి ఏం కావాలనుకుందో, అది జరిగేది. ఏం అడిగితే అది తీర్చేవాడిని. ఆమె అంటే నాకు అంత ప్రేమ. ఆమెని బాధ పెట్టడం నాకిష్టం ఉండదు.
ఒకవేళ నిన్ను తీసుకు రమ్మంటే కూడా, నీకోసం వెతకడానికి మనుషుల్ని పంపేవాడిని. నిన్ను చంపమంటే వెతికే వాడిని, ప్రపంచం చివరి వరకూ వెళ్లి చంపే వాడిని, అదేది కాదంటే విడాకులు కావాలంటే సంతోషంగా ఇచ్చే వాడిని. కాని ఆమె అవేవి చెయ్యలేదు. అవేం అక్కర్లేదనుకుంది. ఆమె చాలా స్ట్రాంగ్. ఆమె తను ప్రేమించిన వాడి మూలంగా బాధ పడింది. ఆమె మనసు గాయపడ్డది.
ఎందుకంటే అతను పారిపోయాడు. అతనికి నిజం తెలుసు. చుట్టూ ఎన్నో సమస్యలు. అరకొర పరిష్కారాలు కనిపిస్తి, ఎలా, ఎంతో అనీజీగా ఉంటోంది.
ఆమె నుంచి ఎటువంటి సమాచారం రాక పోవడంతో మనసు విరిగినట్లయింది. నేనంటే ఆమెకి ఇష్టం లేనప్పుడు, నేనెందుకు ఆమెకోసం తాపత్రయ పడాలి. ఆమె లేకపోయినా నేను బతకగలను.
అందుకే, నేను వెంటనే వేటాడడం కోసం, నాన్నగారిని కలవడం కోసం ఊళ్ళ నుంచి వచ్చే అతిథుల కోసం కట్టిన ఇంటికి వెళ్ళాను. అది పెద్ద దూరం కాదు. అదే కాంపౌండ్‌లో ఉంది. ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు.
అంతే. ఆ తరవాత నేను కావేరి ఉంటున్న భవనానికి వెళ్ళ లేదు. చూడలేదు. ఆమెకి ఆరోగ్యం బాగా లేదని తెలుసింది. కాని నేను వెళ్ళలేదు. డాక్టర్లని పంపించాను. ఆమె గర్భవతి అని తెలిసింది. నాకు ఏమాత్రం సంతోషం కలగలేదు. అది ఎవరి మూలంగా అనే దానికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఎవరైతే ఏంటి అన్న నిర్లిప్తతలో ఉండి పోయాను. సీతమ్మ ద్వారా అన్ని తెలుస్తున్నాయి.
కావేరికి ఆరోగ్యం బాగా లేదని సీతమ్మని తోడు ఇచ్చి, బొంబాయిలో ఉంటున్న ఓ డాక్టరుకి చెప్పి, వాళ్ళ హాస్పిటల్లో ఉంచాను. బాబు పుట్టాడు. మా ఇంటి పరువు కాపాడడం కోసం, తండ్రి పేరు, గార్డియన్‌గా నాదే వేయించాను.
ఓ ఏడాది తరవాత కావేరి బాబుని తీసుకొచ్చింది. మళ్ళీ వేడుకలు. నేను పిల్లాడిని చూడకూడదని మా ఇద్దరికి మంచిది కాదని జ్యోతిష్కులు చెప్పారని అందరితో చెప్పడంతో నేను వేడుకల్లో పాల్గొన లేకపోయినా ఎవరూ పెద్దగా అడగలేదు. పట్టించుకోలేదు. అన్నీ యథావిధిగా మా ఇళ్ళల్లో ఎలా జరుగుతాయో అన్నీ సీతమ్మకి తెలుసు. ఆమె అన్నీ ఏ లోపం రాకుండా, దగ్గరుండి చేయించింది. పిల్లడిని నాకు చూపించడానికి కావేరి ప్రయత్నించలేదు. నేను అడగలేదు. సీతమ్మ అంది, పిల్లాడు అంతా నాలా ఉన్నాడని, అందరూ అలాగే అనుకుంటున్నారని అంది.
ఆ కొడుకు నీ కొడుకా, అన్న అనుమానం ఉంది. కాని దానిని ఓ పక్కి తోసాను.
ఆ పిల్లాడు, ఎవరి కొడుకైనా ఇక్కడే ఉండాల్సిన వాడు. గార్డియన్‌గా, ఓ తండ్రిగా నా పేరుంది, కాబట్టి, నేను వాడి బాగోగులు చూడాల్సిందే. మేము ఎలా పెరిగామో వీడు కూడా అలాగే పెరగాలి. మంచి ఖరీదైన స్కూల్లో చేర్పించాలి. నా కొడుకు కాదు అనే అనుమానం ఎవరికీ రాకూడదు. ఎవరైనా సరే ఈ ఇంటి పిల్లాడు, కావేరి కొడుకైనై, నీ కొడుకైనా ఎవరైతే నేంటీ, ఇప్పుడు నేను వాడి తండ్రిగా చెలామణి అవుతున్న వాడిని.
తేడా చూపించాల్సిన అవసరం లేదు. అంతే కాదు, ఎందుకంటే మా దగ్గర ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి చదువు చెప్పిస్తున్నాం. పెళ్ళిళ్ళు చేయించాము. మేము ఎంతో మందిని పోషించాము. ఈ రాష్ట్రంలో, ప్రతీ స్కూల్లో ఓ ఇద్దరి చదువు, పోషణ భారం మా తాతగారు తీసుకునేవారు. అదే మా నాన్నగారు కొనసాగించారు. నీ విషయంలో అదే చేసాము. అయితే నిన్ను మా భవంతిలోనే ఉంచుకున్నాము. ఇది నా కోరిక మీద. మా నాన్న గారు నా మాట కాదనలేదు.
ఇప్పుడు ఈ బాబు విషయంలో అదే చేయ నిర్ణయించుకున్నాను. సీతమ్మకి అంతా తెలుసు.
కొంచెం పెద్దయ్యాకా రెసిడెన్షియల్ స్కూల్లో వేయాలని అనుకున్నాను. కాని సీతమ్మ ఒప్పుకోలేదు. దగ్గర్లో ఉన్న ఓ మంచి స్కూల్లో వేయించింది. ఆ తరవాత రాజుల పిల్లలు, జాగిర్దార్ల పిల్లలు, నవాబుల పిల్లలు చదివే అజ్మీర్ స్కూల్లో దూరం అయినా వేయించాను. అది రాజస్థాన్‌లో ఉంది. పిల్లాడు బెంగ పడుతున్నాడని అందరికీ చెప్పి, కావేరిని కూడా అక్కడికే పంపించేసాను. మధ్యలో ఓసారి వచ్చి వెళ్ళింది. పిల్లడిని నాకు చూపించడానికి ప్రయత్నించలేదు. నేను అడగలేదు. అసలు నేనెందుకు ఆమెతో మాట్లాడడం లేదో ఒక్కసారి కూడా అడగలేదు. ఉండలేక నాకే అనిపించేది, అడిగితే అని, కాని, ఆమె చెప్పే నిజాలని నేను విని తట్టుకోగలనా ఎన్నో విధాలుగా ఆలోచించి, అడగదలుచుకోలేదు.
అంతలోనే కావేరి ఆరోగ్యం దెబ్బ తిందని విన్నాను.. కావేరి కొడుకుని తీసుకుని వచ్చేసింది. డాక్టరుని పిలిపించారు. ఆమెకి ఏం అయిందో నేను తెలుసుకోలేదు. ఆమెని బాగా చూసుకోమని అన్నాను. వాళ్ళు చెయ్యవలసినదంతా చేస్తున్నారు మంచి వైద్యం చేయించ వలసిందిగా సీతమ్మకి చెప్పాను.
ప్రతీ సాయంత్రం ఏం జరుగుతోందో ఏం వైద్యం చేయిస్తున్నారో, ఏ మందులు వాడుతున్నారో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో, అన్నీ క్లియర్‌గా చెప్పేవారు. ఆమె ఉన్నప్పుడు చెప్పారు, పోయాకా కూడా.
కావేరి చనిపోయిందని, నేను ఇంక ఇంటికి రావచ్చునని సీతమ్మ కబురు చేసింది. ఎందుకంటే కావేరిని చూడదలుచుకోలేదని, ఆమె ఉన్నంత వరకూ ఆ ఇంటికి రానని సీతమ్మకి చెప్పాను.
కావేరికి వెంటనే ఏం చెయ్యాలో అన్నీ సీతమ్మకి తెలుసు. నాన్నగారిది, అమ్మది అన్నీ కూడా ఆమె చేయించింది. ఇప్పుడు కూడా సీతమ్మ ఏమాత్రం కన్‌ఫ్యూజన్ లేకుండా దగ్గరుండి, అన్నీ చేయించింది. నేను ఆ దగ్గరికి వెళ్ళలేదు. కలగ చేసుకోక పోవడం గురించి ఎనరూ తప్పు పట్టలేదు. భార్య పోయిన బాధ, అని అన్నారు.
ఆ తరవాత నేను కావేరిని, ఆమె కొడుకుని చూసినది ఆమె ఆఖరి ప్రయాణం లోనే. ఆ తరవాత కావేరి కొడుకుని చాలా దగ్గరగా చూసాను. నీ పోలికల కోసం చూసాను. ఆశ్చర్యం నాకు అంతా మా నాన్నగారిలా అనిపించాడు. అంటే నా కొడుకు అని అనుకోవచ్చా. ఎవరైతే ఏంటి, ఎంతో మంది పిల్లలు లేక పోతే దత్తత తీసుకుంటారు కదా ఇది కూడా అలా అని అనుకుంటే.
ఆమె చావుకన్నా భయంకరమైన విషయాలు ఉన్నాయి, అవి తెలీదు, ఏం జరిగిందో, ఆమె మనసులో ఏం దాగి ఉందో తెలీదు. కాని కావేరి లేదు, వెళ్ళి పోయింది. ఆమె మనసు తెలిసే అవకాశం లేదు.”
బ్రహ్మాజీ ఆగాడు. శివరామ్ జవాబు కోసం ఆగాడు. కాని అతను ఇస్తాడని కూడా అనుకోలేదు.
“ఓ విధంగా మనం ముగ్గురం కూడా బాధితులమే. భరించాల్సిందే. ఎనిమిదేళ్ళు ఆమె నన్ను పిలవలేదు. కబురు చెయ్యలేదు. కాని నర్సు చెప్పి దానిని బట్టి తెలిసింది. ఏంటో తెలుసా కావేరి నా గురించి అడిగిందని. అప్పుడు ఆమె మరణశయ్య మీద ఉంది. ఆ సమయంలో ఆమె నీ గురించి అడగలేదు. ఇది నా తృప్తి కోసం అనడం లేదు. ఆమె నిజంగా నా గురించి అడిగింది. ఈ విషయం సీతమ్మ కూడా అనింది. కావేరి నిన్ను చూడలనుకుంటోంది అని, కాని వెళ్ళ లేదు.
కాని, అప్పుడప్పుడు అనిపించేది, ఓసారి వెళ్తే, ఆమె ఏం చెప్పాలనుకున్నదో, ఏం కావాలనుకుందో, మనసులో ఏదైనా తీరని కోరిక ఉండిపోయిందా, అని అనిపించేది. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచం దృష్టిలో నేను ఆమె భర్తనే కదా. ఆమె ఆఖరి కోరికలు తీర్చచ్చు. కాని ఎందుకో వెళ్ళాలనిపించలేదు. పోయిందని తెలిసాకా వెళ్ళాను.
నేను చూసినప్పడు ఆమె చనిపోయింది. అప్పుడు కూడా అందంగా ఉంది. ఈ ఎనిమిదేళ్ళ ఒంటరితనం ఆమె అందాన్ని ఏం చేయలేదు. జబ్బు కూడా ఆమె అందాన్ని ఏం చేయలేక పోయింది.
నువ్వు ఓ మూల ఉంటున్నావు. ఎక్కడ ఉంటున్నావో తెలీదు. అందుకే కావేరి చనిపోయిందన్న సమాచారాన్ని నీకు చెప్పలేకపోయాం.
నా ఎన్నో ప్రశ్నలకి ఆమె తనదైన విధంగా జవాబిచ్చింది.
నువ్వు వెళ్ళి పోయావు, నేను ఆమెని చూడడం మానేసాను. మనిద్దరం ఆమెతో మాట్లాడాలని అనుకోలేదు. వెంటనే ఇలా ఆమె తన ఫైనల్ ఆన్సర్ ఇచ్చింది. ఎందుకంటే ఎనిమిదేళ్ళ తరవాత నాతో ఏం చెప్పగలుగుతుంది, మరణించడం తప్ప. అంతకన్నా ఎవరు ఏం చెప్పగలరు.
మా దాంపత్యంలో తన స్థానం ఏంటో, కోల్పోయిందేంటో, అన్ని అర్థం అయ్యేసరికి తన జీవితం ఏంటో అర్థం అయి అసంతృప్తికి, వేదనకి గురి చేసింది.
ఆమె నా ప్రశ్నలకి జవాబిచ్చేసింది. ఆమె వైపు నుంచి, ఆ కోణంలోంచి ఆలోచిస్తూంటే ఆమె చాలా మోసపోయింది.
కృతజ్ఞత, మోసం, దగా ఇలాంటి మాటలకి దూరంగా ఆమె వెళ్ళిపోయింది. మనిద్దరం మిగిలాం.
నాకు ఏం మిగిలింది అంటే నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే దాహం. నీ మూలంగా నేను నా విలువైన జీవితాన్ని, అందులోని ప్రశాంతతని కోల్పోయాను. అలా చేసే హక్కు నీకు లేదు. అందుకే ఎందుకిలా చేసావ్, నా వెనక ఎందుకు గోతులు తవ్వావ్, అని నిన్ను నిలదీయాలని అనుకున్నాను. నువ్వు కనపడలేదు. నీ రాక కోసం ఇంక ఎదురు చూసాను. ఇప్పుడు నువ్వొచ్చావు, ఎదురుచూడడం ముగిసి పోయింది. ప్రతీకార సమయం వచ్చింది.
ఇప్పడు ఇన్నేళ్ళ తరవాత నువ్వు కనపించేసరికి కాల మహిమ అర్థం అవుతోంది. మెల్లగా అర్థం అవుతోంది. కాలం ఓ క్లీనింగ్ ఏజెంట్ అని, అన్నింటిని కడిగేస్తుందని, జ్ఞాపకాలన్నింటిని ఓ మూలకి తోసేస్తుందని. కాని, ఇప్పుడు నా పగలో అంత తీవ్రత లేదు.
అలాగే ఇప్పుడు నాకు ఆమె మీద కోపం లేదు, తిరస్కారం లేదు. అసలు ఏ విధమైన ఫీలింగ్ లేదు. అయినా ఇది ఇప్పుడు నేను ఆమె మీద జాలి పడుతూ అంటున్నది.
ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసూస్తే, ఏకాంతంలో నాకు ఎన్నో కనిపిస్తూంటాయి. ఇది నేను ఎంతో అలసిపోయినప్పుడు కనిపిస్తుంది. అది ఒక ఊహ చిత్రం కళ్ళ ముందు కనిపిస్తూంటుంది. ఓ ఒంటరి ద్వీపం. అక్కడ నేను ప్రయాణం చేసి వచ్చిన నా పడవ ముక్కలై, నీళ్ళల్లో తేలుతోంది. తిరిగి చూసాను. ఓ ఇద్దరు కనిపించారు, వాళ్ళెవరో కాదు. నువ్వూ కావేరి. ఒకరు స్నేహితుడు, మరొకరు నా భార్య. ఆ ద్వీపం పట్నంలోని నీ అపార్టుమెంటు. అందులో మీ రహస్య సమావేశాలు. నేను లేకుండా మీరిద్దరు. ఇవి బాధాకరమైన జ్ఞాపకాలు.”
శివరామ్ మాట్లాడడానికి తలెత్తాడు. గొంతు సవరించుకున్నాడు.
“ఇంత వరకూ నువ్వు మాట్లాడావు, నీ మనసు, బాధ అన్నీ చెప్పుకున్నావు. నేను విన్నాను. ఇంక ఇప్పుడు నీ గురించి, నీకు తెలియాల్సినవి ఉన్నాయి.
నీ డబ్బు, అహం నీకు దైర్యాన్నిచ్చింది. అందుకే ఇన్ని ఏళ్ళైనా కూడా నువ్వు అన్నీ చెప్పావు. ఆశ్చర్యం ఒక్కరోజు కూడా మంచిగా ఆలోచించలేక పోయావు.
ఎందుకంటే నీలో మరో మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో ఉన్నవి అన్నీ నెగిటివ్‌గా ఆలోచించే గుణం. ప్రతీదానికి మరో అర్థం తీయడం. ఆ సంగతి నీకు తెలీదు. అది స్ప్లిట్ పర్సనాలిటీ లోకి వస్తుందో లేదో నాకు తెలీదు. అందుకని ఇప్పుడు నీలోని వాడి గురించి నేను చెప్తాను.
నాకు తెలుసు నా గురించి ఆలోచించినప్పుడల్లా నీకు ద్వేషం కలుగుతూంటుంది. ఎందుకంటే నువ్వు అన్నివిధాలా అసంతృప్తిగా ఉన్నావు కాబట్టి.”
చివ్వున తలెత్తాడు బ్రహ్మాజీ.
“నా గురించి నువ్వు చెప్పేదేంటి, నీ గురించి నే చెప్తాను, విను, నేను అసంతృప్తిగా ఉండడం ఏంటీ, నాన్సెన్స్. నువ్వు ఓ అన్‌హాప్పీ లవర్. నన్ను మోసం చేయచ్చు. మరొకరి భార్యని రోజూ తీసుకెళ్ళచ్చు. పుస్తకాలు తెచ్చి ఇవ్వచ్చు. అంతే కాదు, కావేరిని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నావు. నేను అడ్డు అందుకే నేను చావాలని కోరుకున్నావు. చంపాలనుకున్నావు. అంతకన్నా ఇంకేం చేయగలవు. ఏదీ చేయలేక పోయావు. పారిపాయావు.
పాపం కావేరి ఏం చేస్తుంది. నీకోసం ఎదురు చూసింది. మనం ఇద్దరం మౌనంగా ఉన్నాం. ఈ మౌనానికి అర్థం తెలుసుకోవాలనుకుంది. కాని మరణించింది. నేను ఉండిపోయాను. కాని ఒక్కటి మాత్రం తెలీలేదు. ఎందుకు నువ్వు వెళ్లిపోయావు. కావేరి నీ ఇంటికి ఎందుకొచ్చింది. ఈ సమయంలో నాకు వీటికే జవాబులు కావాలి.” బ్రహ్మాజీ ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు.
శివరామ్ ఇబ్బందిగా కదిలాడు.
“నా సందేహాలు, ప్రశ్నలు నీకు ఇబ్బంది కలిగిస్తాయని తెలుసు. కాని తప్పదు. ఇన్ని ఏళ్లూ అయోమయంలో ఉన్నాను. ఇప్పుడు క్లారిటీ కావాలి. కనీసం ఈ వయసులో. అనుమానంతో మరణించేవరకూ ఉండాలనుకోవడం లేదు.
ఆ రోజున నేను నీ అపార్టుమెంటులో ఉన్నప్పుడు కావేరి వచ్చింది. నువ్వు వెళ్ళి పోయావని ఆమెకి తెలిసింది. ఆమె ఏదో అని గొణిగింది. నేను విన్నది. అది ఆఖరి పదం. కాని స్పష్టంగా లేదు.
కాని ఏదో అంది. ఆ పదం ‘చెప్పకుండా వెళ్ళాడు, పిరికివాడు’ అని అనిపించింది. ఆ పదం దేని గురించి అంది. ఎంత ఆలోచించినా నా బుర్రకి జవాబు దొరకలేదు. ఎందుకంది. ఎవరి గురించి, విడిపోవడం గురించా, జీవించడానికి ధైర్యం లేని వాడనా, చావడానికి కూడా ధైర్యం లేని వాడనా, విల్ పవర్ లేనివాడనా, ఈ పిరికి అన్నది దేనిగురించి, ఏమి లేనిదాని గురించా, నీ ప్లాన్ ఫెయిలైందనా పిరికి అంది. ఆలోచించి, ఆలోచించి నా తల తిరిగి పోయింది.
ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి. ప్రశ్నలన్నీ సరిగ్గా లేక పోవచ్చు, కాని నా సందేహాలు మాత్రం అవే. మళ్ళీ నువ్వు కలవక పోవచ్చు. అందుకే నేను పోయేలోగా అని కాదు, ఇప్పుడే కావాలి.”
(సశేషం)