రెండు ఆకాశాల మధ్య-26

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఆ[/dropcap] వూరికీ మనకూ మధ్య సమాచారం చేరవేయడానికి ఉత్తరాలే గతి. అవి కూడా ఎంతాలశ్యంగా అందుతున్నాయో.. రషీద్ చనిపోయాడని తెల్పుతూ మీ అన్నయ్య రాసిన ఉత్తరం మనకు రెండు నెల్ల తర్వాత అందింది గుర్తుందా?” అన్నాడు షరీఫ్.

“ఔనండీ. ఓ కార్డుముక్క ఇక్కడికి చేరడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో.. తపాలా శాఖ నిర్లక్ష్యమేమో.”

“కావొచ్చు.. ఫర్హానా నిఖా గురించిన సమాచారం కూడా అలానే ఆలస్యంగా అందుతుందని ఆశిద్దాం. అది మన చేతికి అంది మనం చదువుకుంటున్న సమయానికి ఫర్హానాకి ఓ బాబో పాపో పుట్టి కూడా ఉండొచ్చు” అన్నాడు నవ్వుతూ షరీఫ్.

“మీకు నవ్వులాటగానే ఉంటుంది. నాకిక్కడ ఆలోచించి ఆలోచించి తనావ్‌తో తల పగిలిపోయేలా ఉంది” అంది హసీనా.

బార్డర్‌కి ఈ వైపున్న వూరినుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో బార్డర్‌కి అవతలి వైపున్న వూరికి ఉత్తరం చేరాలంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాలన్న విషయం అక్కడ ఎవ్వరికీ తెలియదు. హుందర్మో నుంచి బయల్దేరిన కార్డుముక్క మొదట గిల్గిట్ – బాల్టిస్తాన్‌కి రాజధాని అయిన స్కర్దూకి చేరాలి. అక్కడినుంచి యిస్లామాబాద్‌కి పంపబడుతుంది. ఉత్తరంలో నిషిద్ధమైన సమాచారమేదీ లేదని పరిశీలించాక, దానివల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదమేమీ లేదని నిర్ధారణకు వచ్చాక, ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ నుంచి హిందూస్తాన్‌లోని ఢిల్లీకి పంపుతారు. ఢిల్లీలోని అధికార్లు మరోసారి ఉత్తరంలో రాసి ఉన్న సమాచారం వల్ల అపాయమేదీ లేదన్న అభిప్రాయానికొచ్చాక దాన్ని కార్గిల్ హెడ్ పోస్టాఫీస్‌కి పంపుతారు. అక్కడినుంచి ఉత్తరం ఆర్.ఎస్.పురా పోస్టాఫీస్‌కు చేరవేయబడుతుంది. చివరికి జోరాఫాంలో ఎవరికి చేరడంకోసం ఉత్తరం రాశారో వాళ్ళకు చేరవేయబడుతుంది. ఇంత తతంగం పూర్తి కావడానికి కొన్నిసార్లు నెలల తరబడి సమయం పట్టొచ్చు. మరికొన్ని సార్లు ఆ ఉత్తరం చేరాల్సిన చోటికి చేరకుండా అదృశ్యమై పోవచ్చు…

అదృష్టవశాత్తూ ఫక్రుద్దీన్ తన చెల్లెలికి రాసిన కార్డు ముక్క మరో ఆర్నెల్ల తర్వాత హసీనా చేతికందింది. అందులో ఫర్హానా నిఖా ఏ తేదీన జరపతలపెట్టారో తెలియబర్చడంతో పాటు కొత్త యిల్లు కట్టుకోవడం పూర్తయిందన్న సమాచారం కూడా రాసి ఉంది.

ఆ ఉత్తరం అందుకున్న నాలుగు రోజుల వరకు హసీనా ఏడుస్తూనే ఉంది. “ఏం బతుకులు మనవి? స్వంత అన్న కూతురి పెళ్ళికి కూడా వెళ్ళలేని బతుకు.. అన్న కొడుకు చనిపోయినా చివరి చూపులకు కూడా నోచుకోని బతుకు.. పెళ్ళిళ్ళకో చావులకో వెళ్ళలేనపుడు ఇంక ఈ బంధుత్వాలకు అర్థమేముంటుంది? ఫర్హానా పెళ్ళయిన ఆర్నెల్లకు మనకు కబురందింది. రేపు మా అన్నకేమైనా అయితే..” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. “మన సరిహద్దుకి అటూ ఇటూ ఉన్న కుటుంబాలంత దురదృష్టకరమైన కుటుంబాలు దునియాలో ఎక్కడా ఉండవేమో.. యా అల్లా.. ఈ మనుషులు యుద్ధాలు ఎందుకు చేస్తారు? ఈ సరిహద్దు రేఖల్ని ఎందుకు గీస్తారు? అందరూ శాంతిగా బతకొచ్చుగా” ఎప్పటికిమల్లే సరిహద్దు రేఖని నిరసిస్తూ బాధపడింది.

***

తన కూతురు ఆస్మని లతీఫ్ కొడుక్కిచ్చి నిఖా చేస్తానని షరీఫ్ మాటిచ్చి ఐదేళ్ళు దాటింది. ఆస్‌మాకు పెళ్ళీడు వచ్చింది. పిల్ల విరబూసిన సన్నజాజితీగెలా నాజూగ్గా ఏపుగా ఎదిగింది. తన కూతురి అందాన్ని చూసుకుని మురిసిపోని రోజు లేదు షరీఫ్‌కి.

ఆ రోజు నమాజ్ కోసం బ్రోల్మోకి వెళ్ళబోతుంటే “అబ్బాజాన్.. వర్షం పడేలా ఉంది. ఆకాశం చూశారా ఎలా మబ్బు పట్టిందో.. గొడుగు తెచ్చిస్తానుండండి” అంటూ లోపలికెళ్ళి గొడుగు తెచ్చిచ్చింది ఆస్‌మా.

ఆ గొడుగు వైపు ఆపేక్షగా చూసుకున్నాడు. ఎప్పటి గొడుగో అది.. తన చిన్నప్పుడు నాన్న వాడిన గొడుగు.. నల్లటి గుడ్డకి ఎన్ని సార్లు అతుకులు వేయించారో.. చువ్వలు రెండు విరిగిపోయాయి. అందుకే గొడుగు విప్పదీసినపుడు పూర్తిగా తెర్చుకోకుండా ఓ వైపుకి వొంగిపోతుంది. ఐనా ఇప్పటికీ తన రక్షణ కోరుతూ తలదాచుకునే వ్యక్తిని వర్షం నుంచి కాపాడటంలో తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తోనే ఉంది.

తనకు తన భార్యా పిల్లల్లోనే కాదు ఈ గొడుగుతో కూడా అనుబంధం ఉందనిపించింది. ఈ యిల్లూ, ఈ వూరు, ఇక్కడి కొండలూ లోయలు, చెట్లూ పొలాలూ, షింగో నది.. వీటితో కూడా విడదీయరానంత అనుబంధం ఉంది.

హసీనా వైపు చూస్తూ “చూశావా నా కూతురికి నేనంటే ఎంత ప్రేమో” అన్నాడు.

“నేనంటే కూడా దానికి ప్రేమే.. మీరు సరిగ్గా గమనించలేదేమో. ప్రేమకు ప్రతిరూపం మనమ్మాయి” అంది హసీనా.

“నా కూతురు చూశావా ఎంతందంగా ఉందో.. మొఘల్-ఎ-ఆజం సినిమాలో మధుబాల కన్నా బావుంది కదూ” అన్నాడు.

“నా కూతురంటారేమిటి? మన కూతురు అనండి” అంది హసీనా.

“నా పోలికలో పుట్టబట్టే అంతందంగా ఉంది. అందుకే నా కూతురన్నాను.”

“మనబ్బాయి ఆరిఫ్ కూడా అందగాడే. వాడికన్నీ నా పోలికలే వచ్చాయి. చూస్తూ ఉండండి.. వాడు పూర్తి యవ్వనంలోకి అడుగుపెట్టేటప్పటికి దిలీప్ కుమార్‌ కన్నా అందంగా తయారవుతాడు.”

తన తల్లీతండ్రీ ఇలా వాదులాడుకుంటుంటే వినడం ఆస్‌మాకి ఎంతిష్టమో.. అమ్మకు తమ్ముడంటే ఇష్టం. నాన్నకు తనంటే ఇష్టం. తనకూ ఇద్దరూ ఇష్టమే. కానీ నాన్నంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. నాన్నలోని అమాయకత్వం, యింకా తడి యింకని పసితనం అంటే ఆస్‌మాకు చాలా యిష్టం. ఎటొచ్చీ అతని మొహమాటం, పిరికితనం అస్సలు నచ్చదు. “ఎందుకు నాన్నా ఎవరేం చెప్పినా నమ్మేస్తావు? బైటి వాళ్ళ పనులెందుకు చేస్తావు? పోనీ నీకవసరమైనప్పుడు వాళ్ళకు పనులు చెప్పి చేయించుకోమంటే చేయించుకోవు. మొహమాటమంటావు. యిలా అయితే ఎలా బతుకుతావు నాన్నా” అని ఆరిందాలా నాన్నని నిందిస్తో ఉంటుంది.

పిల్లల చిన్నప్పుడు హసీనా కూడా ఇవే మాటలో పదేపదే పోరుతో ఉండేది. పిల్లలు పెద్దయ్యాక ఆ బాధ్యతని ఆస్‌మా తీసుకుంది. ఆరిఫ్‌కి తండ్రంటే భయం.. ఎక్కువ మాట్లాడడు. కానీ ఆస్‌మాకి చనువెక్కు వ కాబట్టి అనాలనుకున్నది మొహం మీదే అనేస్తుంది.

తన కూతురు అలా మందలించినప్పుడల్లా “నా బతుక్కి ఏమైంది? ఇప్పుడు బతకడం లేదా.. అలానే బతికేస్తాలే. దిగులు పడకు” అంటూ నవ్వేస్తో ఉంటాడు.

మూడు నెల్లనుంచీ ఆస్‌మా పెళ్ళి విషయంలో యింట్లో గొడవ జరుగుతోంది. మూడు నెలల క్రితం లతీఫ్, అతని భార్య హుందర్మో వచ్చి ఆస్‌మాని చూసుకుని వెళ్ళినప్పటినుంచీ అతని మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. లతీఫ్ పెద్ద కొడుక్కి నిఖా అయింది. రెండో కొడుకు హనీఫ్‌కి పందొమ్మిదేళ్ళు నిండాయి. కుర్రవాడు తండ్రిలానే బాగా పొడుగైనాడు. వూళ్ళోనే కిరాణా షాపు తెరిచాడు. వ్యాపారం బాగానే పుంజుకుందని లతీఫ్ చెప్పాడు.

షరీఫ్‌కి తన మాట నిలబెట్టుకోవాలనే ఉంది. హసీనాకి కూడా ఈ సంబంధం ఇష్టమే. కానీ ఆస్‌మానే అడ్డు పడ్తోంది. హుందర్మోలో సంబంధమైతేనే చేసుకుంటానని మొండి పట్టుపట్టి కూచుంది. ఎవరెంత నచ్చచెప్పినా వినడం లేదు. అటువైపు లతీఫ్ తొందర పెడ్తున్నాడు.

నిన్న కూడా ఇదే విషయమై యింట్లో గొడవ జరిగింది. “నామాట విను తల్లీ… చాలా మంచి సంబంధం. అబ్బాయి బుద్ధిమంతుడు. నువ్వు సుఖపడ్తావు” అన్నాడు షరీఫ్.

“మీకు దూరంగా ఉండి కూడా సంతోషంగా ఎలా ఉండగలననుకున్నారు నాన్నా?” అంది ఆస్‌మా.

“ఎంత దూరం తల్లీ… పక్క వూరేగా.. అరగంట నడక. అంతే.”

“పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అరగంట నడకైనా సరే రోజూ రాలేనుగా నాన్నా.”

“నేను రోజూ వచ్చి నిన్ను చూస్కుంటానమ్మా.”

“అలా అనుకుంటాం గానీ రోజూ రావడం కష్టం నాన్నా. మీకూ ఇక్కడ వ్యవసాయ పనులుంటాయిగా.. వద్దు నాన్నా.. యిక్కడే ఏదైనా సంబంధం చూడండి. నేను మీ కళ్ళముందే ఉంటాను” అంది ఆస్‌మా.

“ఆ కుర్రాడు పచారీ దుకాణం నడుపుతున్నాడే. ఉప్పుకీ పప్పుకీ యింట్లో యిబ్బంది ఉండదు. లతీఫ్‌కి, అతని భార్యకి నువ్వంటే చాలా యిష్టం. అత్తమామల పోరుండదు. మా మాటిను” అంది నచ్చచెప్తూ హసీనా.

“లేదమ్మా.. నాకు ఇక్కడి సంబంధమే చేయండి” ఇదే తన చివరి నిర్ణయం అన్నట్టు తేల్చి చెప్పింది ఆస్‌మా.

మసీదు దగ్గరపడే కొద్దీ షరీఫ్‌కి గుండె కొట్టుకునే వేగం పెరగసాగింది. లతీఫ్‌కి ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదు. హనీఫ్‌కి చాలా సంబంధాలు వస్తున్నాయని, ఏ విషయమూ రెండ్రోజుల్లో తేల్చి చెప్పమని మొన్ననే చెప్పాడు. అతనికెందుకో ఆస్‌మా మూర్ఖంగా ప్రవర్తిస్తోందని అన్పించింది. పెళ్ళయ్యాక భర్త తోడిదే లోకంలా బతకాలి తప్ప తండ్రి తల్లో కావాలనుకుంటే ఎలా? జీవితాంతం తోడుండేది భర్తీగా.. తల్లిదండ్రులు ఎన్నాళ్ళు తోడుంటారు? ఎప్పటికైనా పోవల్సినవాళ్ళేగా..

ఆస్‌మా కన్నా అక్క జైనాబీ కూతురు అనీస్ ఏడాది పెద్దది. మొదట దానికి పెళ్ళి సంబంధాలు చూడాలి. పెద్దమ్మాయికి గతేడాదే పెళ్ళయింది. తను సంబంధాలు చూడటం మొదలెట్టేలోపలే మిలట్రీలో ఉన్న బావ తనతోపాటు మిలట్రీలో పనిచేసే కుర్రాడి సంబంధం పక్కా చేశాడు. అక్కకు ఇష్టం లేకున్నా భర్త మాట కాదనలేకపోయింది. అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో నిఖా జరిగిపోయింది.

ఆస్‌మా కోసం లతీఫ్ కొడుకుని ఐదేళ్ళ క్రితమే అనుకున్నాడు కాబట్టి అనీస్ కోసమే ఇన్ని రోజులూ సంబంధాలు వెతకసాగాడు. హుందర్మోలోనే సంబంధం చూస్తే అనీస్ తన కళ్ళముందుంటుదన్న ఆశ. కానీ ఇప్పుడు ఆస్‌మా కూడా ఇక్కడే సంబంధాలు చూడమంటుంది కాబట్టి ఇక నుంచి ఇద్దరి కోసం సంబంధాలు వెతకాలని నిర్ణయించుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here