[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
హాబీలు పాతవే..! అవతారం కొత్తది..!!
[dropcap]బా[/dropcap]ల్యంలో ఆటపాటల్లో, ఇతర అభిరుచులలో, ఆనందంగా గడిపిన క్షణాలు వయసు పెరిగేకొద్దీ చదువుకు సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగంలో ప్రవేశించిన తరువాత కొత్త విషయాలు నిత్య జీవన శైలిలో ప్రవేశించి గతంలోని అభిరుచులను కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే అందరి విషయంలో పరిస్థితులు ఇదే మాదిరిగా వుండవు. వారి నిత్య కార్యక్రమాలతో యెంత తీరిక లేకపోయినప్పటికీ తమ అభిరుచులను లేదా హాబీలను వదిలేయకుండా కొనసాగించడానికే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాటిలో క్రీడలు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటివి ప్రధానమైనవి. అంతమాత్రమే కాదు, తాము వృద్ధాప్యం లోనికి ప్రవేశించినా గతంలోని నృత్యం లాంటి అభిరుచులను, వదిలేయకుండా, మరిచిపోకుండా దానిని కొనసాయించేవారు కోకొల్లలు. అయినా ఇప్పుడు టివి, మొబైల్ మైకంలో పడి జనం ఇతర అభిరుచులను కనీసం గుర్తు కూడా చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు బద్ధకం మొదలై, ఉత్సాహం కోల్పోయి జీవచ్ఛవాలుగా మారిపోనున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. కాల మహిమ.. అంతే! దానికి అనుకూలంగానే మనం పయనించాలి. మనం కోరుకున్నట్టు కాలం మన మాట వినడు. అది చెప్పినట్టు మనం చేయవలసిందే. దానికి ముఖ్య ఉదాహరణ ఒకటిన్నర సంవత్సరం నుండి యావత్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తూ ప్రజల ప్రాణాలను కరోనా తన గుప్పిట్లోనికి తీసుకోనడమే!
కరోనా ఆగమనంతో అన్ని పనులు కుంటుపడ్డాయి. ఒకరినొకరు కలుసుకునే రోజులు పోయాయి. ఒకరి గురించి మరొకరు ఆలోచించే రోజులూ పోయాయి. అందుచేత అభిరుచుల గురించి ప్రత్యేకంగా ఆలోచించే పరిస్థితులు తల్లకిందులయ్యాయి. మామూలు జీవితం గడపడానికే ప్రజలు భయకంపితులైపోతున్నారు. అయితే నిజంగా హాబీల గురించి అభిరుచి బాగా వున్నవారు ప్రపంచం తిరగ పడిపోయినా, వాటిని విడిచి పెట్టరు. అలాంటి వాటిల్లో రచనా వ్యాసంగం, సంగీతం, క్రీడలు, వంటలు మొదలైనవి. అయితే అనుకూల పరిస్థితులు లేనప్పుడు, వాటితో సంబంధాలు తెగిపోయి ఎక్కువ గేప్ ఏర్పడినప్పుడు తిరిగి వాటిని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడం కొంచెం కష్టమైన పనే!
అయినా పట్టుదల వుంటే అలాంటి పరిస్థితిని సైతం అధిగమించి మనకు ఇష్టమైన హాబీలను కొనసాగించుకునే పరిస్థితులు మనమే మన చేతుల్లోకి తీసుకునే గొప్ప అవకాశాలు వున్నాయి. దీనికి ఎన్నైనా ఉదాహరణలు చెప్పవచ్చు. ఇవి తప్పక నేటి లేదా రాబోయే తరాలకు తప్పక స్ఫూర్తిదాయకంగా వుంటాయని నేను భావిస్తాను. నా జీవితం నుండే మీకు ఇక్కడ రెండు ఉదాహరణలను తెలియజేస్తాను.
నాకు అతి సమీపపు బంధువు చిన్నాన్న వరుస అయిన కుసుమ వెంకటరత్నం గారు, తాను పదవీ విరమణ చేసిన తర్వాత – ఎప్పుడో హైస్కూల్‌లో నేర్చుకున్న ఛందస్సును గుర్తు తెచ్చుకుని – చక్కని శతకం రాశారు. మరో నాలుగు పుస్తకాలకు రచయిత ఆయన. కవిత్వం రాయాలనే దృఢ విశ్వాసం ఆయనలో ఉండడం మూలాన్నే ఆయన అవలీలగా ఆ పని చేయగలిగారు.
అసలు ముఖ్యమైన ఉదాహరణ ఇప్పుడు మీ ముందు వుంచుతాను. మేము నాగార్జున సాగర్, హిల్ కాలనీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1972-74 బ్యాచ్ ఇంటర్మీడియెట్‌కు చెందినవాళ్ళం. అందులో కొద్దిమందిమి, మాకు బోధించిన లెక్చరర్ల సమక్షంలో సుమారు 47 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో మా మిత్రుడు టి. వరప్రసాద్ ఫామ్‌హౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిపాం. ప్రొఫెసర్ నాగులు గారు, డా. రమేష్ కుమార్ గారు, నా సహాధ్యాయులు టి. వర ప్రసాద్, ఆర్. చంద్రశేఖర్ రెడ్డి,శ్యామ్ కుమార్, శ్రీమతి లీల హాజరయ్యాము. అందులో శ్యామ్ కుమార్ నాకు సరిగా గుర్తులేడు. అతను మాతో కలసి కొద్దికాలమే చదివాడని, ఆ తర్వాత వేరే జిల్లాకు వెళ్లిపోయాడని మా ఆత్మీయ సమ్మేళనం లోనే తెలిసింది. అయితే మా సహాధ్యాయిని లీలనే అతను వివాహం చేసుకున్నాడు. మాలో వరప్రసాద్ (టి. వి.గా ప్రసిద్ధుడు) పారిశ్రామికవేత్త. మిగతా వాళ్ళం ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వాళ్ళం. ఈ ఉపోద్ఘాతంతో ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది మిత్రుడు శ్యామ్ కుమార్ (నిజామాబాద్ )గురించి.
తంగేడులో మా ఆత్మీయ సమ్మేళనం జరిగిన తర్వాత అందరికంటే ఎక్కువ శ్యామ్ మొబైల్‌లో చాట్ చేయడం, ఫోన్లో మాట్లాడడం జరుగుతూ వస్తున్నది. స్నేహానికి అతను ఇస్తున్న ప్రాధాన్యతను చాలా తొందరగానే గ్రహించాను. అలాగే, శ్యామ్ శ్రీమతి కూడా చాలా ఆత్మీయంగా గౌరవంగా ప్రవర్తించడం నేను గమనించాను.
శ్యామ్ ఇంటర్ చదవడం కోసం సాగర్ వచ్చాడు, వాళ్ళ చిన్నాన్న దగ్గర (పైలాన్)లో వుండి, హిల్ కాలనీలోని జూనియర్ కాలేజీకి వచ్చేవాడు. అక్కడ అతనికి కనీస అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల శ్యామ్ ఎక్కువ కాలం సాగర్‌లో లేడు. నిజామాబాద్ వెళ్ళిపోయాడు. ఇంటర్, డిగ్రీ అక్కడే పూర్తి చేసి నప్పటికీ సాగర్ జ్ఞాపకాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నం చేసాడు. అదే ఇంటర్‌లో మా సహాధ్యాయని లీలను ప్రేమించి తన జీవిత భాగస్వామిని చేసుకోవడం. దీనికోసం చాలా సంవత్సరాలు ఓపిక పట్టి తాను అనుకున్నది సాధించాడు. మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న శ్యామ్ తండ్రిగారు దాని ద్వారా పిల్లలకు సంపాదించి పెట్టింది పేదరికమే!
విద్యార్థిగా శ్యామ్ మంచి ఆర్టిస్ట్, గాయకుడు, క్రీడాకారుడు. కానీ తల్లిదండ్రుల సంతానంలో అతనే పెద్దవాడు గనుక, ఉద్యోగంలో చేరగానే, కుటుంబ బాధ్యతలలో నిండా మునిగిపోయి తనకున్న అభిరుచులు లేదా హాబీలను ఇంచుమించు మరిచిపోయాడు. ఒక్క సంగీతాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు.
బహుశః వంశపారంపర్యంగా తల్లి గారి నుండి గానకళ అబ్బి ఉండవచ్చు. అసలు విషయం చెప్పేముందు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తాను పదవీ విరమణ చేయడం, తన బాధ్యతలు (పిల్లలకు పెళ్లిళ్లు వగైరా) పూర్తిగా ముగించుకుని ఆనందంగా పాటలు పాడుకుంటూ అటు బెంగుళూరు కొడుకు దగ్గరికీ, ఇటు హైదరాబాద్ కూతురి దగ్గరికి తిరుగుతూ ఆనందంగా గడుపుతున్న తరుణంలో, ఆత్మీయ సమ్మేళనం ద్వారా మేము కలుసుకోవడం ద్వారా, శ్యామ్ చాటింగుల ద్వారా, అప్పుడప్పుడూ అతను చెప్పే కథల ద్వారా, అతనిలోని రచయితను, అతని సాహిత్య పిపాసను చాలా సులభంగా పట్టుకుని గ్రహించగలిగాను. మెల్లగా రచనా వ్యాసంగంలోనికి దింపాను. ఇక్కడ నా సలహా, ప్రోత్సాహం గొప్పకాదు. అరవై ఏళ్లుదాటిన ఆతను, రాస్తానని ఒప్పుకోవడమే చెప్పుకోదగ్గ విషయం. కబుర్లు చెప్పడమే కాదు, ఆ పని చేసి చూపిస్తున్నాడు. నన్నే ఆశ్చర్యపరిచాడు. ఒక అంతర్జాల పత్రికలో తన బాల్యంలోని అనుభవాలను వ్యాస రూపంలో ఇప్పటికే చాలా రాసాడు, ఇంకా రాస్తున్నాడు కూడా. అతనిలో అంతర్గతంగా నిబిడీకృతమై వున్న రచయితను బయటకు తీసే అవకాశం నాకు దక్కింది. ఇది నా గొప్ప ఏ మాత్రం కాదు, అతని పట్టుదల మాత్రమే. అతని వ్యాసాలు చదివిన మిత్రులు, శ్రేయోభిలాషులూ అందించే అభినందనలకు శ్యామ్ పులకించి పోతుంటాడు. అది మనిషికి మానసికంగా ఎంతో తృప్తిని ఇస్తుంది. ఇది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదుగా!
మరో విషయం ఏమిటంటే, మిత్రుడు శ్యామ్‌ని ఇంతటితో వదిలెయ్యలేదు. మాటల సందర్భంలో చిత్రలేఖనం పట్ల అతనికి గల అభిరుచిని విన్నప్పుడు గతంలో తన చిత్రలేఖనం అనుభవాలను గురించి తెలుసుకున్నప్పుడు,మళ్ళీ చిత్రలేఖనం సాధన చేయవలసిందిగా కోరాను. ఒక క్రమశిక్షణ గల శిష్యుడిలా మళ్ళీ చిత్రలేఖనంకు సంబంధించిన పరికరాలు, వ్యయ ప్రయాసలకు వెనుకాడకుండా సమకూర్చుకుని ఎప్పుడో వదిలేసిన చిత్రలేఖనంను తిరిగి సాధన చేయడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. సమయాన్ని అతను ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాడో అతను ఇప్పుడు చేస్తున్న పనులు చూస్తే అర్ధం అవుతుంది. సహకరించే పిల్లలు, అనుకూలవతి అయిన భార్య కలిగి ఉండడం ఆతని అదృష్టం.
శ్యామ్ కుమార్ గతంలోని అతని హాబీలు అన్నింటికీ ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవనం కలిగించడమేగాక, తన స్నేహితుడికి, అతని సలహాలకూ ఇచ్చిన విలువ లెక్కగట్టలేనిది. ఇవాళ శ్యామ్ కుమార్ ఒక గాయకుడు, ఒక చిత్రకారుడు, మరో అవతారంలో మంచి రచయితగా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నాడు, నలుగురికీ సంతోషాన్ని పంచుతున్నాడు. ఇన్ని ప్రవృత్తులున్న శ్యామ్ కుమార్ ‘ది న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్’లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశాడు. ‘స్నేహమేరా జీవితం’ అన్నదానికి నిలువెత్తు సంతకం మా మిత్రుడు శ్యామ్ కుమార్.
మా గ్రూప్‌లో అతను ప్రత్యేకం. ‘కష్టపడ్డవాళ్లు తర్వాతి కాలంలో సుఖపడతారు’ అన్న నానుడికి చాలా మంచి ఉదాహరణ మా శ్యామ్ కుమార్!
(మళ్ళీ కలుద్దాం)