[box type=’note’ fontsize=’16’] తెలుగులో అక్షర దోషాలు, ఇతర తప్పులు లేకుండా ఎలా వ్రాయవచ్చో ఈ శీర్షిక ద్వారా తెలియజేస్తున్నారు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. [/box]
~
‘కథ వ్రాయటమెలా?’
కం.
కథలను చెప్పగ సులభము
కథలను మెత్తగ లిఖించ కమనీయముగా
కథలే చెప్పును కమ్మని
కథనము శైలియు మనలకు గమనము తోడన్.
*
[dropcap]క్రిం[/dropcap]దటి వారం ఇచ్చిన పదాలను మీరంతా సరిచేసుకొని ఉంటారని భావిస్తున్నాను.
జవాబులు:
- వైవిధ్యము
- విద్య
- విధ్వంసము
- మధురము
- ఖాళీ
- ఝాన్సీ
- భయము
- బాధ
- బాధ్యత
- ఛత్రపతి
- ఛేదించుట
- క్రోధము
- ధనధాన్యాలు
- భోగభాగ్యాలు
- భవిష్యత్తు
- హాస్యము
- అద్భుతం
- ధూపదీపనైవేద్యాలు
- సేద్యము
- వ్యర్థము
- కథానిక
- శపథము
- పథము
- అధరము
- రథము
ఈపాటికి ‘స్వాంతము’ మరియు ‘సాంత్వన’ల మధ్యనున్న తికమక తొలగిపోయి ఉంటుంది అని భావిస్తున్నాను. స్వాంతమనగా మనసు, హృదయము. సాంత్వన అనగా ఉపశమనము, ఓదార్పు.
సాధారణంగా తప్పుగా వ్రాసే పదాలలో మరొకటి ‘ఆసక్తి’. దీనిని ఆశక్తి అని వ్రాస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వ్రాయకూడదు. ఆసక్తి అంటే ఇచ్ఛ, కోరిక, అనురక్తి. ఈ ‘స’ మాత్రమే వ్రాయాలి. గుర్తుంచుకుంటారు కదూ?
ఇంకా కొంతమంది అవకాసం అని కూడా వ్రాస్తూ ఉంటారు. అది అవకాశం. ఏ అక్షరానికి ఆ అక్షరమే ఉపయోగించాలని గమనించగలరు.
ఇక పోతే ఒక దీర్ఘాన్ని హ్రస్వంగా వ్రాస్తే అర్థమే మారిపోతుంది తెలుసా? నమ్మరా మీరు? ఈ క్రింది వాక్యాలు చూడండి.
- “అమ్మ మాట విను!”
- “అమ్మా, మాట విను!”
ఈ డైలాగ్ రెండవది వ్రాయటానికి బదులు మొదటిది వ్రాయటం వలన అమ్మ మాట వినమని ఎవరో, ఇంకెవరికో చెప్పినట్టు అయింది. నిజానికి ఒక కూతురు/కొడుకు కన్నతల్లితో పలికే మాటలవి. అంచేత దీర్ఘాలు ఇవ్వటం మరువకండి.
అలాగే అచ్చుతో వ్రాయవలసిన పదాలను హల్లుతో వ్రాయటం కూడా సరికాదు. ఇ, ఈ, ఉ, ఊ, ఒ లతో మొదలయ్యే పదాలు తప్పుగా వ్రాస్తున్నారు. ఈ క్రింది పదాలు గమనించండి.
తప్పు | ఒప్పు |
1. యిల్లు | ఇల్లు |
2. యిల | ఇల |
3. యీగ | ఈగ |
4. వుయ్యాల | ఉయ్యాల |
5. వుడత | ఉడుత |
6. వుడికించి | ఉడికించి |
7. వూరు | ఊరు |
8. వూరుకో | ఊరుకో |
9. వడ్డు | ఒడ్డు (తీరము) |
10. వొంటరి | ఒంటరి |
11. వోర్పు | ఓర్పు |
12. వప్పు | ఒప్పు |
13. వప్పుకో | ఒప్పుకో |
14. వప్పందం | ఒప్పందం |
15. ఒడ్లు | వడ్లు (ధాన్యం) |
16. ఒద్దు | వద్దు |
17. ఒడ్డీ | వడ్డీ |
18. ఒడ్డాణం | వడ్డాణం |
19. వెడమ | ఎడమ |
20. వకటి | ఒకటి |
21. వడి | ఒడి |
పై తేడాలు గమనించండి.
ఈ రోజు కథారచన గురించి కాసేపు ముచ్చటించుకుందాము. మనమంతా రచయిత్రులమే… ఇప్పుడే కాదండీ, చిన్నతనం నుంచీ… అమ్మ మనకు చెప్పిన రాజు, ఏడు చేపల కథ మళ్ళీ మళ్ళీ ఎంత మందికో చెప్పాం కదా… అలాగే ఇంటికి ఆలస్యంగా వచ్చి, చెప్పే కథలూ ఎన్నో, ఎన్నెన్నో… ఆ రకంగా అందరం రచయిత్రులమే మరి. కథలు ప్రచురించబడినా, లేకున్నా…
ఇప్పుడు పత్రికలకు పంపించే కథల గురించి చెప్పుకుందాము.
మనం చెప్పదలచుకున్నది కథ ద్వారా అంటే, కథలోని పాత్రల ద్వారా చెప్పిస్తాము. కథ యొక్క గమనం మూడు భాగాలుగా ఉంటుంది. కథాప్రారంభం, మధ్యభాగం, ముగింపు. ప్రారంభం ఎంత ఆసక్తికరంగా ఉంటే కథ అంత వేగంగా పాఠకులను ఆకర్షిస్తుంది. దీనినే టేక్ ఆఫ్ అంటారు. ఈ టేక్ ఆఫ్ ఎంత చక్కగా ఉంటే కథాగమనం కూడా అంత ఆసక్తికరంగా సాగుతుంది. సాధారణంగా ఈ ఆరంభం డైలాగ్స్‌తో ఉంటే చాలా బాగుంటుంది.
తరువాత కథ మధ్యభాగం. ఇది కూడా కీలకమైన భాగమే. రచయిత తాను చెప్పదలచుకొన్న విషయాన్ని, పాత్రల ద్వారా గట్టిగా చెప్పే ప్రయత్నం ఇక్కడే చేస్తాడు. ఎక్కడెక్కడో ఉన్న పాత్రలన్నీ కథలో భాగమైపోతాయి. అన్నీ కథను నడుపుతూ ఉంటాయి, ఈ భాగంలో.
ఆఖరుగా ముగింపు. కథ ముగింపు చాలా బాగుంటే, ఆ కథ పాఠకుడి మనసులో అలా నిలిచిపోతుంది. కొసమెరుపుతో ముగిస్తే మరి ఆ అందం చెప్పనక్కరలేదు. కథ యొక్క ముగింపు ఏదో ఒక సందేశంతో ముగిస్తే మరింత బాగుంటుంది. అంటే మనం చెప్పదలచుకున్న విషయాన్ని బలంగా చెప్పి ముగించటం అన్న మాట.
కథారచన అంటే ఇంతే. కానీ ప్రతీ వాక్యాన్ని ఎంతో అందంగా మనసు పెట్టి మలచాలి. అప్పుడే అది పాఠకులకు నచ్చుతుంది, గుర్తుండిపోతుంది.
మీరు ఈ సారి కథ వ్రాసేటప్పుడు ఈ విషయాలు ఒకసారి వ్రాసుకోండి.
- కథ ఏ విషయం గురించి వ్రాస్తున్నారు?
- పాత్రలు ఎన్ని, అవి ఎవరెవరు?
- ఎలా మొదలుపెడుతున్నారు?
- ఎలా కొనసాగిస్తున్నారు?
- ఏ విధంగా ముగిస్తున్నారు?
- సీనిక్ డివిజన్ (దృశ్య విభజన)
- సంభాషణలు
- పాత్రల స్వభావం
- ఏదైనా సందేశం
పై అంశాలను వ్రాసుకున్నాక, మీకు కథ ఎలా వ్రాయాలి అన్నది మీ మెదడులోకి వచ్చేస్తుంది. కథ ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ తరువాత కథను వ్రాసేయండి.
ఇంతే కథ వ్రాయటమంటే.
ఈ విషయాలను గురించి ముందు ముందు మరింత విపులంగా చర్చించుకుందాము.