[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
దిలీప్ కుమార్ నర్గిస్ కలిసి నటించిన మరో రొమాంటిక్ ట్రాజెడి ‘మేలా’
[dropcap]ది[/dropcap]లీప్ కుమార్ అప్పటి పాపులర్ హీరోయిన్లలో ఎక్కువ సినిమాలు నర్గిస్, వైజయంతిమాలతో చేసారు. ఇద్దరితో చెరి ఏడు సినిమాలు చేసారు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్‌తో నర్గిస్ జోడి అప్పట్లో ప్రజలను చాలా అలరించింది. అయితే వీరిద్దరి సినిమాలన్నీ ట్రాజెడీలే. 1948లో దిలీప్ కుమార్ నర్గిస్ నటించిన చిత్రం ‘మేలా’. ఎస్. యు సన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ట్రాజెడి నోట్ తోనే ముగుస్తుంది. ఈ సినిమాకు ఆయనే ప్రోడ్యూసర్ కూడా. కలిసి చేసిన ఏడు సినిమాల్లో కూడా, నర్గిస్ ప్రేమ కోసం తపించే పాత్రలే చేసారు దిలీప్ కుమార్. అందుకే మదర్ ఇండియా సినిమాలో నర్గిస్ కొడుకుగా చేయమని మెహబూబ్ ఖాన్ దిలీప్ కుమార్‌ని అడిగితే, ఆయన ఒప్పుకోలేదు. నర్గిస్‌తో అంతకు ముందు చేసిన పాత్రల తరువాత కొడుకుగా తాను న్యాయం చేయలేనని వారు అనుకున్నారట. అప్పట్లో వారి జోడి అంత పాపులర్ అయ్యింది. మేలా సినిమాలో దిలీప్ కుమార్, నర్గిస్ లు కలసినటించిన దృశ్యాలని మేజికల్ రొమాంటిక్ దృశ్యాలుగా భావిస్తారు. రాజ్ కపూర్, నర్గిస్‌ల తెరవెనుక అనుబంధం ప్రాచుర్యానికి రావటంతో, తెరపై వారిద్దరి నటన అందరి దృష్టినీ పెద్దగా ఆకర్షించింది. నర్గిస్-దిలీప్ కుమార్ జంట నటన మరుగున పడింది కానీ, లేకపోతే వీరిద్దరు తెరపై కలసి నటించిన దృశ్యాలును ప్యూర్ మేజిక్ గా భావిస్తారు సినీ విశ్లేషకులు. ‘మేలా’ సినిమాకు కూడా నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో దిలీప్ కుమార్‌కు అన్నిపాటలు ముఖేష్ పాడారు. షకీల్ బధాయిని పాటలు రాస్తే, శంషాద్ ముఖేష్‌లు వాటిని పాడారు. “ఏ జిందగీ కే మేలే” అన్న ఒక్క పాట మాత్రం రఫీ పాడారు. ఇది ఒక యాత్రికుడు పాడే పాట. ఇదే సినిమాను కొద్దిగా మార్చి తెలుగులో ఎన్.టీ ఆర్., జమునలతో చిరంజీవులు అని తీసారు.
మంజు, మోహన్ ఒక పల్లెటూరిలో చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. మంజు తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి మరో వివాహం చేసుకుంటాడు. మారుటి తల్లి నుండి నిత్యం కూతురిని కాపాడుకుంటూ ప్రాణంలా పెంచుకుంటాడు మంజు తండ్రి. మోహన్‌కు తల్లి ఉండదు. తండ్రి ఒంటరిగా బిడ్డను పెంచుకుంటాడు. కలిసి పెరిగిన ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అప్పటి దాకా వచ్చిన సినిమాలలో ప్రేమ ప్రస్తావన ముందు తీసుకువచ్చేది మగాడు. కాని ఈ సినిమాలో ఆశ్చర్యంగా వివాహం చేసుకుందాం అన్న మాట మంజు నుండి వస్తుంది. ఆ సంభాషణ చాలా సహజంగా ఉంటుంది కూడా. ఆ రోజుల్లో ఆడవాళ్ళ వ్యక్తిత్వంలో ఒక బలం ఉండేది. దేవదాసులో కూడా పార్వతి చంద్రముఖిలకు వాళ్లకేం కావాలో ఒక స్పష్టత ఉన్నట్లు ఈ సినిమాలో మంజు పాత్రలో ఆ స్పష్టత కనిపిస్తుంది. వీరి ప్రేమ సంగతి తెలిసి మోహన్ తండ్రి మంజు తండ్రి వద్ద పెళ్ళి ప్రస్తావన తీసుకు వస్తాడు. అతను కూడా ఆనందంగా ఒప్పుకుంటాడు. ఇక వివాహం వారం రోజుల్లో ఉందనగా పెళ్ళి కూతురుకి నగలు కొనడానికి మోహన్ పట్నం వెళతాడు. అక్కడ నగలు కొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దొంగలు ఆ నగలు దొంగలించబోతారు. వారితో జరిగే కొట్లాటలో గాయాల పాలయ్యి స్పృహ తప్పి ఆస్పత్రిలో చేరతాడు మోహన్.
అనుకున్న సమయానికి మోహన్ తిరిగి రాకపోవడంతో అతను ఆ డబ్బుతో వేరే అమ్మాయితో ఊరు వదిలి వెళ్ళిపోయాడని పుకారు పుట్టిస్తాడు ఆ ఊరికి అప్పుడే వచ్చిన మెహకూ. మెహకూ కూడా మంజు మోహన్లతో ఒకే స్కూల్‌లో చదువుకున్నాడు. చిల్లరగా ప్రవర్తిస్తూ ఊరి నుండి వెళ్ళిపోయి మిలటరీలో చేరతాడు. అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చి ఊరి ఆడపిల్లలతో అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతను. మోహన్ మంజుల మధ్య ప్రేమ అతనిలో అసూయ పుట్టిస్తుంది. మంజు సవతి తల్లితో కలిసి పంచాయితీ పెట్టించి, అనుకున్న సమయానికి మంజు పెళ్ళి జరగాలని నిర్ణయించి హడావిడిగా ఆమె పెళ్ళి డెబ్భయ్ ఏళ్ళ ఒక ముసలివానితో జరిపిస్తాడు.
మంజు భర్త అమ్మాయిని చూడకుండానే పెళ్ళి చేసుకుంటాడు. ఇక పెళ్ళయిన తరువాత గదిలో ఆమెను చూసి అంత చిన్న పిల్లకు తాను అన్యాయం చేసానని పెళ్ళికి ముందు ఆమె వయసు తనకు చెప్పలేదని భార్యను క్షమించమని కోరుకుంటాడు. అతని పిల్లల కోసం పెళ్ళి చేసుకోవలసి వచ్చింది అని, వారికి తల్లిగా న్యాయం చేయమని ఆమెను బ్రతిమిలాడుకూంటాడు. మంజు పరిస్థితులకు తల వంచి తన బాధ్యతలు ఒక గృహిణిగా స్వీకరిస్తుంది.
కొన్ని రోజుల తరువాత ఆసుపత్రి నుంచి వచ్చిన మోహన్‌కి మంజు పెళ్ళి అయిపోయిన విషయం తెలుస్తుంది. మంజు తండ్రి మోహన్ తిరిగి వచ్చాక తన కూతురికి జరిగిన అన్యాయం అర్థమవుతుంది. మోహన్ మాత్రం మంజుని మర్చిపోలేక పోతాడు. మంజు భర్తకు మూర్ఛ రోగం. ఒక రోజు రైలు పట్టాల వధ్ధ మూర్ఛతో స్పృహ తప్పి పడిపోతున్న అతన్ని మోహన్ కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. మంజు అతనికి అతిథి మర్యాదలు చేయాలనుకునేంతలోనే అతను బైటికి వెళ్ళిపోతాడు. కాని వెళూతూ మంజుతో తాను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మని ఆ ఇంట్లో మర్చిపోతాడు. ఆ బొమ్మ ఇంట్లో పిల్లల చేతిలో చూసిన మంజు ఆ వచ్చింది మోహన్ అని తెలుసుకుంటుంది. ఊరికి వెళ్ళి తన చిన్ననాటి బొమ్మ పోయిందని తెలుసుకుని మోహన్ మళ్ళీ మంజు ఇంటికి వస్తాడు. అతని బొమ్మని తాను తీసుకుని మోహన్ తన వద్ద ఉంచిన మరో బొమ్మని ఆ పెట్టెలో పెట్టి అతనికి అది ఇంటి లోపలి నుండి భర్తతో పంపిస్తుంది మంజు. ఆ బొమ్మను చూసిన మోహన్ ఆ ఇంటి యజమానురాలు మంజు అని తెలుసుకుని తన ఊరు వెళ్ళిపోతాడు.
ఈలోగా అనారోగ్యంతో మంజు భర్త మరణిస్తాడు. ఆ ఇంట్లో ఆమె పరిస్థితి అధ్వానమవుతుంది. ఆ సమయంలో మోహన్ ప్రస్తావన తీసుకు వస్తుంది. కాని మంజు తాను వితంతువునని తన జీవితంలో ఇక ప్రేమ ఆశ లేదని, మరో పురుషుని గురించి ఆలోచించకూడదని స్నేహితురాలికి చెబుతుంది. కాని చివరిసారి మోహన్‌ని కలవాలని తాము ఎప్పుడు కలిసే చోటకు వెళుతుంది. అక్కడ ప్రమాదవశాత్తు గుట్ట మీద నుండి క్రింద పడి మరణిస్తుంది. ఊరి వారందరూ ఆమెను మోహనే హత్య చేసాడని అతన్ని పోలీసులకు పట్టిస్తారు. మోహన్ ఎదురు తిరగకుండా శిక్షను అనుభవిస్తాడు. ఇరవయ్యేళ్ళూ జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాక తిరిగి ఆ గుట్ట వద్దకే వస్తాడు. మంజు ఆత్మ అతన్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అతను కూడా అదే గుట్ట మీద నుండి క్రిండ పడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు.
ఈ సినిమా కథ అంత లాజికల్‌గా అనిపించదు. ఊరి నుండి ఒక్క రెండు రోజులు లేకుండా పోయిన మోహన్ కోసం వెతికే ప్రయత్నం చేయకూండా హడావిడిగా మంజు వివాహం జరిపించడం, మంజు భర్త ఆమె వయసు తెలియకుండానే ఆమెను పెళ్ళి చేసుకోవడం అంతగా అతికినట్లు అనిపించని సంఘటనలు. దిలీప్ కుమార్‌కు కూడా మొదట్లో ఈ సినిమా కథ నచ్చలేదట. కాని ఈ సినిమా పాటలను విన్న తరువాత ఈ సినిమా చేయకుండా ఉండలేక పోయారట. నిజంగా సినిమాలో పాటలు చాలా బావుంటాయి. దిలీప్ కుమార్ పూనుకుని కొన్ని మార్పులు కథలో చేసారట కూడా. ఈ సినిమా సంగీత పరంగా చాలా ప్రశంసలు అందుకుంది. పాటలు లేకపోతే ఈ సినిమాలో చెప్పుకోవలసిన అంశాలు పెద్దగాలేవు అనే చెప్పవచ్చు. దిలీప్ కుమార్ నటన నర్గిస్ నటన బావుంటాయి. కాని వీరి నటనను ఈ సినిమాలో సంగీతం ఎలివేట్ చేసింది. మేలా సినిమా చూసిన తరువాత దిలీప్ కుమార్ స్నేహితులు అతని ఇంటికి వచ్చారట. ఆ వచ్చినవారు దిలీప్ కుమార్ వైపు విచిత్రంగా చూస్తూ కూచున్నారట. వారిలో ఒకరేమో, మాముందు మాట్లాడటానికే సిగ్గుపడుతూంటావు, సినిమాలో ఆ అమ్మాయితో అంత బహిరంగంగా ప్రేమ ఎలా నటించావని ఆశ్చర్యపోతూంటే, ఇంకొకరు, దిలీప్ కుమార్ చేతులుపట్టుకుని ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను వాళ్ళవాళ్ళని ఎలాగయినా ఒప్పించి నీతో పెళ్ళిజరిపిస్తాను. అంతేకానీ, నువ్వంత దుఖించకు, అని బ్రతిమిలాడుతూ, ధైర్యం చెప్పటం ప్రారంభించాడట. ఈ సంఘటనను దిలీప్ కుమార్ తన జీవిత చరిత్ర The Substance and the Shadow లో రాశాడు. మేలా సినిమాలో దిలీప్ కుమార్ నటన గొప్పతనం అది. అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించగలగటమే అసలు నటనకు అత్యుత్తమ నిదర్శనం.
దిలీప్ కుమార్ పట్నం నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక పాట వస్తుంది. “గాయేజా గీత్ మిలన్ కే”. ఇది ముఖేష్ పాడిన గొప్ప పాటలలో ఒకటి. ఇక మంజు మోహన్‌లు పాడుకునే పాట “ధర్తీ కా ఆకాష్ పుకారే” మర్చిపోలేని మెలోడి. సినిమాలో మొత్తం పద్నాలుగు పాటలుంటే పది పాటలు శంషాద్ బేగం పాడారు. “ఫిల్ ఆహ్ దిల్ సె నికలీ” “మెరా దిల్ తోడనే వాలే’ పాటలలోని విషాదం చాలా చిక్కగా ఉంటుంది. ఈ సినిమా సమయానికి నౌషాద్ ప్రముఖ సంగీత దర్శకులు. ఆ తరువాత వరుసగా వీరు మ్యూజికల్ హిట్లు ఇచ్చారు. కాని అప్పటికి రఫీ నౌషాద్‌ల పరిచయం ప్రథమ స్టేజీ లోనే ఉంది. అందుకే ఈ సినిమాలో రఫీకి ఒక్క పాట మాత్రమే దక్కింది. “అన్మోల్ ఘడి” సినిమాలో నౌషాద్ సంగీతంలో తన పాటలతో అలరించిన జొహ్రాబాయి అంబాలే వాలి ఈ సినిమాలో “ఫిర్ ఆహ్ దిల్ సే నికలీ” అని ఒక పాట పాడారు. మేలా సినిమాకి వచ్చేటప్పటికి ఆమె కెరీర్ చివరికి వచ్చింది. కాని ఈ పాట మాత్రం ఆమె ప్రతిభను గుర్తుకు తీసుకువస్తుంది. మెహకూగా జీవన్ నటన బావుంటుంది. దిలీప్ కుమార్ నటించిన చాలా సినిమాలలో ఇతను విలన్‌గా కనిపిస్తాడు. హిందీ పౌరాణికాలలో నారదుని వేషానికి ఇతనికి మంచి పేరు వచ్చింది. సుమారు 49 సినిమాలలో నారదుని వేషమే వేసారట. ఇతని కొడుకు కిరణ్ కుమార్ టెలివిజన్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
‘మేలా’ సినిమా తెలుగులో తీసినప్పుడు కొద్దిగా కథ మార్చి ఎన్.టీ.ఆర్ పాత్రను గుడ్డివానిగా, జమున వివాహం ఒక యువకుడితో జరిగినట్లు చూపిస్తారు. తెలుగులో చిరంజీవులు 1956లో తీసారు. వేదాంతం రాఘవయ్య దానికి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాను తమిళంలోకి డబ్ చేసారు. తెలుగు సినిమాలో గుడ్డివాడయిన హీరోని, జమున భర్త రక్షిస్తాడు. అతను డాక్టర్. ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో చాలా బాగా ఆడింది. 1953లో దేవదాసు సినిమా వచ్చిన తరువాత దానికి పోటీగా వినోదా బానర్ లోనే వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేవదాసుకి పోటీగా ఎన్.టీ.ఆర్.కు రాసారని అప్పట్లో హిందీ చిత్ర నేపథ్యం తెలియని తెలుగు సినీ జనం అనుకున్నారు కూడా. ఇది ‘మేలా’ సినిమాకి రీమేక్ అన్నది చాలా మందికి తెలియని సంగతి.
మేలా సినిమా ఫోటోగ్రఫీకి మంచి పేరు వచ్చింది. అప్పటి సినిమాటోగ్రఫర్లలో మంచి పేరు ఉన్న ఫాలి మిస్త్రీ ఈ సినిమాకు సినిమటొగ్రఫీ అందించారు. అప్పట్లో సినిమాలన్నీ స్టూడీయోలలో తీసేవారు. రాత్రి సన్నివేశాల చిత్రీకరణకు ఈయన పెట్టింది పేరు. వీరి పనితనం ‘మేలా’లో కనిపిస్తుంది. మంచి సాహిత్యం, సంగీతంతో అలరించే సినిమా ‘మేలా’.