[dropcap]”నే[/dropcap]ను అధికారం లాకి వస్తే మీ బిడ్డలందరికి పుగసటిగానే సదువులు చెప్పిస్తా అని హామి ఇస్తా వుండా” అని నాయకుడు అనె.
“ఆహా నాయకా ఓహో నాయక” అని జనం కిరిసి కిరిసి పెట్టీసిరి.
“మీ గుడిసె ఇండ్లు పీకి పారేసి మీ అందరికి మిద్దె ఇండ్లు కట్టిస్తా అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి హామి ఇస్తా వుండా” అని నాయకుడు అన్నింది తడువు
జనం చప్పట్లు కొడతా “జే జే నాయకా” అని వాగిరి వూగిరి.
నాయకుడు మాట మింద మాట మాట్లాడుతా హామీల వాన కురిపిస్తా వుంటే ఆ వానలా జనం తడిసి ముద్దవ్వతా వుండారు.
ఇట్లా తబుడు నేను నాయకుని తాకి పోయి మెల్లగా
“నాయకా… నాయకా” అంట్ని.
“ఏమి… ఏమి” గట్టిగా అనె నాయకుడు.
“ఇబుడంటే ఇబుడు నువ్వు సచ్చిపోతే నాయక”
“లేదురా నేను సచ్చిపోనురా”
“అవునా నాయకా”
“ఊరా”
“అట్లని హామి ఏమైనా వుందా నాయకా?”
“హామీనా?”
“ఊ… నాయక”
“లేదురా… సావుకి హామి లేదు” దిగులుగా అనె నాయకుడు.
“ఇచ్చిన హమీలు సాలు. వాటిని బిరినా నెరవేరి, ఏలంటే సావుకి హామీ లేదు” అని చెప్పి ఆడనింకా వచ్చిస్తిని.
***
పుగసటిగా = ఊరకనే