[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
బీ.ఆర్. చోప్రా తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమాను దిలీప్ కుమార్‌తో పునర్నిర్మించి తీసిన చిత్రం ‘దాస్తాన్’
[dropcap]డె[/dropcap]బ్భయ్యవ దశకం వచ్చేసరికి దిలీప్ కుమార్ సినీ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. 72కు వారికి యాభై సంవత్సరాలు నిండాయి. హీరోగా అడపా తడపా చేస్తూనే ఉన్నారు. కొత్త నీరు చేరింది, సినిమాలు స్టూడియోలను దాటి దేశాల బాట పట్టాయి. ఆ సమయంలో బీ.ఆర్. చోప్రా అంతకు ముందు తాను తీసిన అఫ్సానా అనే సినిమానే మళ్ళీ దిలీప్ కుమార్‌తో తీయాలనుకున్నారు. 1951లో అశోక్ కుమార్, వీనా, ప్రాణ్, కుల్దీప్ కౌర్ లతో బీ.ఆర్ చోప్రా దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమాకు కథ అందించింది ఐ.ఎస్. జొహర్. మొదటిసారి భారతీయ సినిమాలో కవల పిల్లల కాన్సెప్ట్‌తో తీసిన సినిమా అది. అశోక్ కుమార్ మొదట డబల్ యాక్షన్ చేసిన నటుడిగా గుర్తుండి పోయిన సినిమా అది. దీన్ని 1972లో బీ.ఆర్ చోప్రా మళ్ళీ దిలీప్ కుమార్‌తో నిర్మించారు. ఈ సినిమాలో ఆఖరి సన్నివేశంలో మోసం చేసిన భార్యకు బుద్ధి చెప్పడానికి భర్త వారి కథనే నాటకంగా వేసి అసలు నిజాన్ని బైటపెట్టడం ఉంటుంది. అఫ్సానాలో వచ్చిన అదే సీన్‌ను మళ్ళీ దాస్తాన్‌లో యథాతథంగా వాడుకున్నారు బీ.ఆర్ చోప్రా. తరువాత 1950లో సుభాష్ ఘాయ్ ఇదే సీన్‌ని రిషి కపూర్ సిమి గరేవార్‌ల మధ్య పునర్జన్మ నేపథ్యంలో వాడుకున్నారు. “ఇక్ హసీనా థీ” అనే పాపులర్ పాట ఇదే సందర్భంలో వస్తుంది. ఈ సీన్ కారణంగానే సుభాష్ ఘాయ్ “కర్జ్” సినిమా సూపర్ హిట్ అయింది. అయితే అంతకు ముందే ఆ సీన్ అఫ్సానా, దాస్తాన్ లలో బీ.ఆర్ చోప్రా దర్శకత్వంలో చూస్తాం.
70లలో షర్మిలా ఠాగోర్ పాపులర్ నటి. ఆమెతో దిలీప్ కుమార్ చేసిన ఒకే ఒక చిత్రం దాస్తాన్. వీరితో పాటు బిందు, ప్రేమ్ చోప్రా, ఐ.ఎస్. జొహర్లు కూడా కలిసి నటించారు. ఈ రెండు సినిమాలకు కథ అందించింది ఐ.ఎస్. జొహర్. అతనే దిలీప్ కుమార్ స్నేహితుని పాత్రలో దాస్తాన్‌లో నటించారు. ఈ పాత్రను అఫ్సానా సినిమాలో జీవన్ చేస్తారు. సినిమాకు పాటలు రాసింది సాహిర్ లుధియాన్వి. సంగీతం ఇచ్చింది లక్ష్మీకాంత్ ప్యారేలాల్. సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాలేదు. అప్పటికే దిలీప్ కుమార్‌లో వయసు కనపడుతుంది. ఈ సినిమాలో డబల్ రోల్ చేసిన తరువాత 1976లో మళ్ళీ దిలీప్ కుమార్ “బైరాగ్” అనే సినిమా చేసారు. అందులో మొదటి సారి మూడు పాత్రలు వేసారాయన. ఇవి రెండు కమర్షియల్‌గా విజయం సాధించకపోవడంతో ఇక హీరో నుండి కారెక్టర్ పాత్రల వైపుకు మళ్ళారు.
తన కెరియర్ మొత్తంలో దిలీప్ కుమార్ ఐదు సినిమాలలో డబల్ రోల్‌లో కనిపిస్తారు. మధుమతి సినిమాలో రెండు జన్మల నేపథ్యంలో డబల్ రోల్‌లో చూస్తాం వీరిని. తరువాత రెండు రోల్స్ ఒకే స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న సినిమా రామ్ ఔర్ శ్యాం. ఆ తరువాత సినిమా దాస్తాన్, బైరాగ్‌లో మూడు రోల్స్ తో కనిపిస్తారు. వీరి ఆఖరి సినిమా “ఖిలా” లో కూడా వీరిది డబల్ రోల్. ఇందులో రాం ఔర్ శ్యాం తెలుగు సినిమా రాముడు భీముడు రీమేక్ అయితే, దాస్తాన్ సినిమా హిందీ సినిమా అఫ్సానా రీమేక్. అలాగే తన సినిమాను తానే మళ్ళీ రీమేక్ చేసుకోవడం అన్నది ప్రముఖ దర్శకుడు మెహమూబ్ ఖాన్ చేసారు. తాను తీసిన ఔరత్ సినిమాను మళ్ళీ మదర్ ఇండియాగా తీసారు ఆయన. అటువంటి ప్రయత్నమే బీ.ఆర్ చోప్రా తన మొదటి సినిమా అఫ్సానాను మరోసారి దాస్తాన్‌గా తీస్తూ చేసారు. అయితే దాస్తాన్ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.
సినిమా కథకు వస్తే అనిల్, సునీల్ ఇద్దరు కవల సోదరులు. మీనా వీరి పొరుగింట్లో ఉండే అమ్మాయి. ఆమె సునీల్‌తో ఎక్కువ స్నేహంగా ఉంటుంది. ఒకసారి ఊర్లో సంత చూడడానికి ఈ ముగ్గురు పిల్లలు వెళతారు. అక్కడ వచ్చిన గాలి తుఫానుకి అందరూ తలో దిక్కున తప్పిపోతారు. చివరకు అనిల్, మీనా, అనిల్ స్నేహితుడు బీర్బల్ కలుసుకుంటారు. ఒక చెట్టు కొమ్మ పడడంతో స్పృహ తప్పి పడిపోయిన సునీల్‌ని తరువాత వేరేవారు తమతో తీసుకెళతారు. సునీల్ తప్పిపోయాక ఆ బెంగతో వారి తండ్రి కూడా మరణిస్తాడు. మీనా మాత్రం సునీల్‌ని మర్చిపోదు. అతను ఎప్పటికయినా వస్తాడని నమ్ముతుంది. అనిల్ ఎంత సఖ్యంగా ఉన్నా అతనిలో సునీల్‌ని చూడలేకపోతుంది. ఆమెకు సునీల్ లేని లోటు ఎప్పటికీ ఉండిపోతుంది.
పెద్దవారయిన తరువాత అనిల్ పెద్ద వ్యాపారి అవుతాడు. అలాగే నాటకాలు వేయిస్తూ ఒక పెద్ద డ్రామా కంపెనీకి యజమానిగా కూడా ఉంటాడు. ఇక తప్పిపోయిన సునీల్ తన గతం మర్చిపోయి తనను తీసుకెళ్ళిన వాళ్ల వద్ద పెరుగుతాడు. పెద్ద చదువులు చదివి జడ్జ్‌గా పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని పేరు విష్ణు సహాయ్. ఇతని భార్య మాల. మాల అంటే అతనికి ప్రాణం. అతనికి ఉన్న ఏకైక స్నేహితుడు రాజన్. అయితే రాజన్ మాలతో అక్రమ సంబంధం నడుపుతుంటాడు. ఇద్దరు కూడా విష్ణుని మోసం చేస్తూ ఉంటారు. ఇది తెలియని విష్ణు తాను ఊర్లో లేనప్పుడు భార్య బాధ్యతను రాజన్‌కు అప్పగించి కోర్టు పని కోసం మసూరి బయలుదేరుతాడు.
ఒకసారి అనిల్ ఒక సినిమా ప్రొడ్యూసర్‌పై చేయి చేసుకుంటే అతను మరణిస్తాడు. భయంతో అతను మసూరి పారిపోతాడు. అతను ఉన్న హోటల్ లోనే విష్ణు సహాయ్‌ని చూస్తాడు అనిల్. అచ్చం తనలా ఉన్న విష్ణుని తన స్థానంలో ఉంచి తాను పారిపోవచ్చని అనుకుంటాడు. స్నేహం పేరుతో విష్ణుని తన గదికి పిలిపించి అక్కడ మత్తు మందు ఇచ్చి అతన్ని అనిల్‌గా మార్చి తాను విష్ణు కారులో పారిపోతాడు. కాని దారిలో ఒక ఆక్సిడెంట్లో మరణిస్తాడు. విష్ణు సహాయ్ వేషంలో అనిల్‌ని విష్ణు సహాయ్ అనే గుర్తిస్తారు పోలీసులు. అతను మరణించాడని ప్రకటిస్తారు. ఇది విని మాల రాజన్‌లు తమకు అడ్డు తొలగిందని సంతోషిస్తారు.
అనిల్ స్థానంలో విష్ణుని పోలీసులు హత్యా నేరం క్రింద అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళతారు. కాని అక్కడ ఆ ప్రొడ్యూసర్ చనిపోయింది అనిల్ కొట్టిన దెబ్బకు కాదని గుండె జబ్బుతో అతను మరణించాడని తెలియడంతో నిర్దోషిగా బైట పడతాడు. భార్య మాల దగ్గరకు వెళదాం అనుకుని వెళ్ళినప్పుడు తనను మాల ఇన్ని రోజులు మోసం చేస్తూ ఉందని, ఆమె మొదటి నుండి రాజన్ ప్రేమికురాలని అతనికి తెలుస్తుంది. ఈ మోసాన్ని అతను తట్టుకోలేక పోతాడు. అనిల్ స్నేహితుడు బీర్బల్ అతన్ని అనిల్ అనుకుని ఇంటికి తీసుకువస్తాడు. అనిల్ మెడపై ఉన్న మచ్చ చూసి మీనా అతన్ని సునీల్ అని పోల్చుకుంటుంది. అతనికి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తుంది. కొంత సమయం తరువాత తన చిన్నతనం గుర్తుకువచ్చినా భార్య చేసిన మోసంతో దెబ్బ తిన్న అతని మనసు ప్రతీకారం కోరుకుంటుంది.
అనిల్‌గా అతను మళ్ళీ తన భార్య మాలతో రాజన్‌లతో స్నేహం పెంచుకుంటాడు. అనిల్ చాలా డబ్బున్న వాడని తెలిసి మాల అతన్ని వలలో వేయడానికి ప్రయత్నిస్తుంది. వారికి తానెవరో తెలీయనివ్వకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టించి రాజన్ దివాళా తీసేలా చేసి, అప్పుడు తాను విష్ణుని అని అతనికి చెప్తాడు అనిల్. ఇది విని తట్టుకోలేకపోతాడు. ఒక ప్రమాదంలో విష్ణు మరణించిన తరువాత మాలను తన డ్రామాకు పిలిచి అక్కడ స్టేజీపై తన జీవిత కథను వేసి మాలకు తానెవరో తెలిసేలా చేస్తాడు. మాల ఇది భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. చివరకి అన్ని విషయాలు అర్థమయిన మీనా అతనికి చేరువ అవుతుంది.
సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోయినా 70లలో వచ్చిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఐదు పాటలను సాహిర్ రాసినా “నా తూ జమీన్ కే లియె” అన్న పాట ఒక్కటే పాపులర్ పాటల కేటగిరీలోకి వస్తుంది. తాను నమ్మిన భార్య స్నేహితుని మోసం తెలుసుకుని బాధ పడే విష్ణుపై చిత్రించిన పాట ఇది. “పలట్ కె సు-ఎ-చమన్ దెఖనె సె క్యా హొగా, వొ షాఖ్ హీ నా రహీ జొ థీ ఆషియా కె లియె, గరజ్ పరస్త్ జహా మె, వఫా తలాష్ న కర్, యె షయ్ బనీ థీ కిసీ దూసరే జహాన్ కె లియె” అంటూ సాగీ ఈ పాటలో సాహిర్ ముద్ర కనిపిస్తుంది. మిగతా పాటలు మహేంద్ర కపూర్ పాడారు. “కొయి ఆయా లచక్ ఉఠి కాయా” అనే పాట ఆశా స్టైల్ లో కంపోజ్ చేసారు లక్ష్మికాంత్ ప్యారేలాల్. బీ.ఆర్ చోప్రాకీ రఫీకి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చి బీ.ఆర్ సినిమాలకు తరువాత రఫీ దూరం అయ్యారు. తాను మరో మహమ్మద్ రఫీని తయారు చేస్తానని ప్రతిజ్ఞ పూని రఫీపై కోపాన్ని తీర్చుకోవడానికి, మహేంద్రకపూర్‌తో అద్భుతమైన పాటలు పాడించారు బీ.ఆర్. చోప్రా. మహేంద్ర కపూర్ రఫీ శిష్యుడే. అతని ఉన్నతిని మనస్ఫూర్తిగా కోరుకుని రఫీ మౌనంగా ఉండిపోయారట. కాని చివరకి రఫీ ప్రతిభను అంగీకరిస్తూ బీ.ఆర్. చోప్రా తాను చేసింది తప్పని ఒప్పుకున్నారని అప్పటి సినీ పండితులు చెబుతారు. ఇంత జరిగినా రఫీ పెదవి విప్పి ఎవరినీ ఒక్క పరుష వాక్యం అనకపోవడం అతని గొప్పతనం.
దాస్తాన్ సినిమాలో షర్మిలా ఠాగోర్ హీరోయిన్ అయినా ఎక్కువ స్క్రీన్ స్పేస్ బిందుకు కథాపరంగా దొరికింది. దిలీప్ కుమార్‌తో చేయడానికి మాత్రమే తాను మాల పాత్ర ఒప్పుకున్నానని చెప్పారు ఆవిడ. హీరోగా ఇక తనను ప్రేక్షకులు అంగీకరించరని దిలీప్ కుమార్‌కు ఈ సినిమా ద్వారా అర్థం అయిన తరువాత మరొక్క ప్రయత్నం చేసి కారెక్టర్ నటుడిగా మారి కొన్ని అద్భుతమైన సినిమాలను తరువాత అందించారు ఆయన.