[dropcap]ప్ర[/dropcap]పంచంలోని ఆడపిల్లలకి అంకితం ఇవ్వబడ్డ సినిమా ‘కమ్లి’. 2006లో విడుదల అయిన ఈ చిత్రానికి దర్శకుడు K N T శాస్త్రి గారు. ఆ సంవత్సరం ఉత్తమ జాతీయ బహుమతి పొందిన చిత్రం.
జాతీయ బహుమతులు పొందిన చిత్రాలు సాధారణంగా కమర్షియల్‌గా విజయం సాధించవు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉండదు. కాబట్టి ఏ మారుమూల థియేటర్లలోనో రిలీజ్ అయి అతి కష్టం మీద ఒక వారం ఆడి వెళ్ళిపోతాయి.
ఆ రోజుల్లో సామాన్య ప్రజానీకానికి ఇప్పుడున్నంత స్థాయిలో యూట్యూబ్ చూసే అలవాటు ఉండేది కాదు. కాబట్టే ఎక్కువ మంది చూసి ఉండరని భావిస్తున్నాను.
ఆకాశంలో సగ భాగమయిన స్త్రీలు తమ హక్కులు పొందటంలో కానీ, తమ శ్రమకి.. తమకున్న ప్రత్యేకమైన నైపుణ్యాలకి గుర్తింపు పొందటంలో కానీ అధః పాతాళంలో ఉన్నారనేది జగమెరిగిన సత్యం.
అవకాశం ఇవ్వాలే కానీ తమ ప్రతిభకి ఆకాశమే హద్దు అని నిరూపించిన నిన్నటి అంతరిక్ష యాత్రికురాలు ‘శిరీష బండ్ల’, నేటి ఒలింపిక్ పతక విజేతలు ‘పి వి సింధు’, ‘మీరా బాయి చాను’ లాంటి వారు.. ఆడపిల్లలని వద్దనుకుంటున్న తల్లిదండ్రులకి పెద్ద సవాలు.
ఆడపిల్ల అనగానే గర్భంలోనే చిదిమేస్తున్న తల్లిదండ్రులు… పుట్టిన తరువాత ఆడపిల్ల అని తెలిశాక అమ్మేస్తున్న తల్లిదండ్రులు…. తమకి పుట్టింది ఆడపిల్ల అని తెలిశాక ఆసుపత్రిలోనే వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. లేదా ఆయాలతో.. నర్సులతో లాలూచి పడి, అదే సమయంలో అక్కడ పుట్టిన ఇంకొక మగ బిడ్డతో మారకం చేసుకుంటున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.
ఇక చిత్ర కథలోకి వస్తే…. ఇలా ఆడపిల్లల ఉనికిని అనేక రకాలుగా చిదిమేస్తున్న సందర్భంలో… తనకి పుట్టిన కొడుకుని ఆయా తెలివిగా మాయచేసి మరొక ఆడపిల్లని తన చేతిలో పెట్టినప్పుడు, తన కన్న బిడ్డని తనకిస్తేనే ఆసుపత్రి నించి బయటికి వెళతానని తెలంగాణాలోని లంబాడా (వీరినే బంజారాలని కూడా అంటారు) తండాలో ఒక స్త్రీ చేసిన పోరాటమే ఈ చిత్ర కథ! వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించబడిన చిత్రం!
లంబాడాలు గొర్రెలని మేపుకుంటూ, ఎక్కడ పని దొరికితే అక్కడికి తరలి వెళ్ళే సంచార జీవనులు. ఈ చిత్రంలో లంబాడ భాషలో సంభాషణలు ‘కళా చంద్ర’ అందించారు. గానం కల్వకుర్తి ప్రాంతంలోని జానపద కళాకారులు పాడారు. చిత్ర నిర్మాణం సహజ పల్లె వాతావరణంలో జరిగింది.
ముఖ్య తారాగణం ‘నందితా దాస్’, ‘షఫీ’. ఇతర పాత్రలు తనికెళ్ళ భరణి, రూపా దేవి, కోట శంకర రావు మొదలగువారు పోషించారు.
ఈ సినిమాలో కొన్ని సంభాషణలు అచ్చమైన బంజారా భాషలో సాగాయి. ‘కమ్లి’ అంటే నా కూతురు అని అర్థం’ట’.
ముఖ్య పాత్రధారి అయిన నందితా దాస్ పాలిచ్చే పురిటి ఆడపిల్లని డబ్బుకోసం అమ్మటంతో సినిమా మొదలవుతుంది.
తన బిడ్డకి జన్మనిచ్చిన ఆసుపత్రి భవనం పడగొట్టటానికి, తనే కూలీగా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు తన గత స్మృతుల్లోకి వెళుతుంది. మొదటి బిడ్డని తెలియక అమ్ముకున్న నాయికకి రెండవ కానుపులో కొడుకు పుడతాడు. ఆయా డబ్బుకి కకుర్తిపడి, ఆ కొడుకుని వేరే వారికి ఇచ్చేసి నాయికకి ఎవరి ఆడపిల్లనో తెచ్చి ఇస్తుంది.
నాయిక నిర్భయంగా వారిని ఎదిరించి, అక్కడున్న వారితో పోట్లాడి తన కొడుకుని తనకి ఇస్తే కానీ డిశ్చార్జ్ అయి వెళ్ళనని మొండికేస్తుంది. ఆసుపత్రి యాజమాన్యం బలవంతంగా బయటికి పంపేస్తే, బయట మెట్ల మీద కూర్చుని నలుగురి దృష్టిని ఆకర్షిస్తుంది. అది చూసి వార్తాపత్రికల వారు కూడా ఆమెకి సహాయం చెయ్యటానికి ముందుకి వస్తారు.
తనకి పుట్టింది ఆడపిల్లే అయినా, వదిలించుకోవటానికి “ఈ బిడ్డ (ఆడపిల్ల) నాది కాదు, నాకు పుట్టింది మగపిల్లవాడు అని అబద్ధమాడుతున్నది” అని చుట్టు పక్కల మూగిన జనం తలో రకంగా మాట్లాడతారు.
నాయిక తన పట్టు వదలకుండా, తన కొడుకుని తనకి ఇప్పించమంటుంది. అలా ఆరుబయట ఆసుపత్రి మెట్ల మీద పసిబిడ్డతో కూర్చున్న ఆమెని..”బిడ్డకి పాలిమ్మని, దాని ప్రాణం కాపాడమని” రకరకాలుగా చెబుతారు.
భర్త వచ్చి “కొడుకు తప్పిపోతే పోయాడు. ఈ ఆడపిల్లని తీసుకెళితే అమ్ముకుని డబ్బు చేసుకోవచ్చు” అని ఒప్పించటానికి ప్రయత్నించి ఆమెతో ఘర్షణ పడతాడు. ఆమె మాట వినకపోయేసరికి వదిలేసి వెళ్ళిపోతాడు.
అలా ఒంటరిదైన ఆమె పట్టుదలగా తన బిడ్డని ఇచ్చేవరకు వదిలి వెళ్లనని మొండితనంగా కూర్చుంటుంది. అప్పటి వరకు చీరలో ఉన్న నాయికని, బంజారా వేష ధారణలోకి మారమని అయిన వాళ్ళు వచ్చి సలహా ఇస్తారు. అప్పుడే బడుగు జీవులుగా ప్రభుత్వ దృష్టిని ఆకట్టుకోవచ్చని చెబుతారు. ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి వచ్చి, ‘డి.ఎన్.ఏ’ పరీక్ష జరిపి ఆమెకి న్యాయం జరిపించమని ఆదేశిస్తుంది.
గత్యంతరం లేని ఆయా చివరికి ఆమె కొడుకుని ఆమెకి తెచ్చి ఇస్తుంది. అప్పటివరకు తన చేతిలో ఉన్న ఆడపిల్లని కూడా తనే తీసుకెళ్ళి కొడుకుతో పాటు పెంచుకుంటానని తీసుకెళుతుంది.
రోజు కూలీలకి వెళ్ళే ఆ తెగ వారిలో కాస్త కనుముక్కు తీరు బాగున్న ఆడవారికి ఇతర మగవారి నించి ఎదురయ్యే సమస్యలు, తాగుబోతు మొగుళ్ళు వారికి కలిగించే సమస్యలు సహజంగా చిత్రించారు.
పాత్రల చేత బంజారా భాషలో మాట్లాడించటం బాగానే ఉన్నది కానీ, ఇతరులకి అర్థమవటానికి వీలుగా సబ్ టైటిల్స్ తెలుగులో వేసి ఉంటే బాగుండేది.
ఆడపిల్ల అని తెలియగానే ఎలాగోలా వదిలించుకోవటమో, అమ్ముకోవటమో, గొంతులో వడ్ల గింజ వేసి పురిట్లోనే నాశనం చెయ్యాలనుకోవటమో, చెత్తకుండీలో వదిలేసి వెళ్ళిపోవటమో అనే తీవ్ర రూపం దాల్చిన నేటి సామాజిక సమస్యకి కూలి నాలి చేసుకునే వారి దగ్గరనించి ఉద్యోగాలు చేసుకు బతికే మధ్య తరగతి జీవులవరకూ ఎవ్వరూ మినహాయింపు కాదు.
అలాంటి సమస్యని ఎన్నుకుని సినిమా తీసిన నిర్మాత, దర్శకులు అభినందనీయులు.
కూలీ చేసుకు బతికే బడుగు జీవి అయినా కూడా ఆత్మవిశ్వాసంతో తను పెంచి పోషించగలను అనే నమ్మకంతో పోరాడి తెచ్చుకున్న తన కన్న కొడుకుతో పాటు పరాయి ఆడపిల్లని చేరదీసిన నాయిక ఎంతోమంది తల్లులకి ఆదర్శంగా నిలిచింది.
ఒక గంటా 20 నిమిషాల సినిమా.. లంబాడాల జీవితాన్ని చూపించటంలో కృతకృత్యమయింది అని చెప్పచ్చు.
ఇప్పుడు యూట్యూబ్‌లో లభ్యమవుతున్నది. చూసి ఆనందించండి.