[dropcap]న[/dropcap]వ్వని పువ్వుల్లో దరహాసాల్ని వెలయిస్తావు
మధ్య తరగతి మందహాసాన్ని దృగ్గోచరం చేస్తావు
మంటల్లో చిక్కుకున్న
మానవ హృదయ ఘోషల్ని వినిపిస్తావు
నీ హృదయంలోంచి మాకు ఉదయాల్ని అందిస్తావు
నీ తపస్సుతో తేజస్సులను విరజిమ్ముతావు
నాగార్జున సాగర మథనాన్ని చేసి
కవిత్వానికి రెక్కలు కట్టి వదిలేస్తావు
విశ్వనాథ నాయకుణ్ణి, కర్పూర వసంతరాయల్ని
రామప్పలను గాఢంగా కౌగలించుకుంటావు
విశ్వంభరవై ప్రపంచపదులను పంచి
కవితలో చిరునామా చూసుకోమంటావు
గజళ్ళతో మెదళ్ళ కుదుళ్ళను కదిలిస్తావు
తేనెలూరు పాఠంతో, ఉపన్యాసంతో అలరిస్తావు
అక్షరాల గవాక్షాలను తెరచి
జనులకు జ్ఞానబోధ చేసి జ్ఞానపీఠాన్ని అధిష్ఠించావు
తెలంగాణ గెడ్డపై పుట్టిన తెలుగు తల్లి ముద్దు బిడ్ద
నీవు నిర్వహించింది మరువ లేని భూమిక
నీవు మా వాడివి – అదే చాలిక!