[dropcap]వి[/dropcap]శాఖ సాహితి స్వర్ణోత్సవాలలో భాగంగా విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠల్ మూర్తి గారి ‘మన పుణ్య వృక్షాలు – వేప చెట్టు’ పుస్తక ఆవిష్కరణోత్సవం 1-8-2021 తేదీ సాయంత్రం 5:45 గంటలకు అంతర్జాల మాధ్యమంలో జరిగింది.
చి. వెన్నేటి భవ్య, చి. వెన్నేటి భార్గవ్‌ల ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సభలో ఆచార్య మలయవాసిని గారు, ఇప్పటివరకు విశాఖ సాహితి స్వర్ణోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలలో ఈ సభ ఒకటిగా పేర్కొంటూ, రచయిత ఆచార్య పాండురంగ విఠల్ మూర్తి గారిని అభినందించారు.
భారతదేశంలో వృక్షశాస్త్ర విభాగంలో D.Sc. పొందిన ప్రథమ మహిళ ఆచార్య మహేశ్వరీదేవి గారు ముఖ్య అతిథిగా, కృతి స్వీకర్తగా పాల్గొన్నారు. ఆచార్య విఠల్ మూర్తి గారు మిటీరియాలజీలో శాస్త్రవేత్తగా ఉన్నా వృక్షశాస్త్ర సంబంధమైన ‘వేప చెట్టు’ మీద పుస్తకం వెలువరించడం ఎంతో అబినందనీయమని ఆమె అన్నారు.
ప్రియాతిథిగా సభలో పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు గారు పుస్తకావిష్కరణ చేస్తూ విజ్ఞాన రంగంలోనూ, సాహితీ రంగంలోను విశేషమైన కృషి చేస్తున్న ఆచార్య విఠల్ మూర్తి గారిని అభినందించారు.
ఆచార్య విఠల్ మూర్తి గారు రచయిత స్పందనగా మాట్లాడుతూ, వృక్షాల నేపథ్యంలో పుస్తకం వ్రాయడానికై ప్రేరణగా నిలిచిన ముఖ్య అతిథి ఆచార్య మహేశ్వరీదేవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాతావరణ కాలుష్య నివారణలో వృక్షాల ప్రాముఖ్యత వివరించారు.
జి.ఎస్.టి. విభాగంలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డా. కె.వి. మోహన్ రావు గారు పుస్తక సమీక్షని ‘పవర్ పాయింట్’ ద్వారా చేస్తూ పుస్తకంలోని విశేషమైన అంశాలను చర్చించారు.
ఆచార్య ఆండ్ర రవి ప్రసాద్ గారు, శ్రీయుతులు శ్రీరంగం దివాకర్ గారు, శ్రీ ఘండికోట విశ్వనాధం గారు ఆత్మీయ భాషణములు చేసారు.
ముఖ్య అతిథిని శ్రీ కందాళ మోహన్ రావు గారు, రచయితను శ్రీ డి. రాంబాబు గారు సభకు పరిచయం చేసారు. శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్, శ్రీ మేడా మస్తాన్ రెడ్డి, శ్రీ భమిడిపాటి సుబ్బారావు, డా. కూటికుప్పల సూర్యారావు, డా. కందాళ కనకమహాలక్ష్మి, డా. డి.వి.సూర్యారావు, డా. కె. కమల, ఆచార్య విశ్వనాథ శర్మ, శ్రీమతి రామరాజు విశాలాక్షి, మొదలగువారు స్పందనలు తెలియజేసారు.
దేశ విదేశాల నుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సమన్వయకర్తగా వ్యవహరించగా, సంయుక్త కార్యదర్శి శ్రీమతి లలితా వాశిష్ట వందన సమర్పణ చేసారు.