అలనాటి అపురూపాలు-76

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

రంగస్థల, టీవీ, సినీ ప్రేక్షకులను అలరించిన సురేఖా సిక్రీ:

సురేఖా సిక్రీ సుప్రసిద్ద రంగస్థల, సినీ, టీవీ నటి. బాలికా వధూ (తెలుగులో – చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍లో ప్రధాన పాత్ర పోషించిన నటి అంటే చాలా మందికి స్ఫురిస్తారు.

ఇంతటి ప్రఖ్యాత నటి 16 జూలై 2021న 75 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆవిడ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకి సెప్టెంబరు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ సోకింది, అప్పటి నుంచి మంచం మీదే ఉన్నారు. ఎడమ వైపు పక్షవాతం కారణంగా ఆమె తనంతట తాను నడవలేరు. ఆవిడ తన కెరీర్‍లో ‘తమస్’ నుంచి ‘బధాయ్ హో’ వరకు 30 సినిమాలలో నటించారు. కానీ బాలికా వధు సీరియల్‌లో అమితమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు. ‘దాదీ సా’ పాత్ర ద్వారా ఇంటింటికి ఆవిడ సుపరిచితమయ్యారు. అప్పుడావిడ వయసు 63 ఏళ్ళు. అయితే ఆవిడ కెరీర్ తొలినాళ్ళ నాటి ఫోటోలను చూశారా? అంటే అప్పట్లో ఆమె ముసలి బామ్మలా కాకుండా, నిరాడంబరంగా, అందమైన కొత్త నటిగా కనబడేవారు.

సురేఖా సిక్రీ 19 ఏప్రిల్ 1945న బ్రిటీష్ ఇండియాలో జన్మించారు. ఉత్తర్‍ ప్రదేశ్‍కి చెందినవారు కావడంతో ఆవిడ బాల్యం నైనిటాల్ లోనూ, అల్మోరా లోనూ గడిచింది. తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కాగా, తల్లి ఉపాధ్యాయిని. అందుకే ఆమె బాల్యమంతా అత్యంత క్రమశిక్షణతో గడిచింది.

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో చదువు పూర్తి చేసుకుని సురేఖ 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు. అప్పుడామె వయసు 26 ఏళ్ళు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కోర్సు పూర్తయ్యాకా, కొన్ని రోజులపాటు ఆలుమీ థియేటర్ కోసం రంగస్థలంపై పనిచేశారు. ఆ తరువాత తనని తాను నటిగా వెండి తెరపై చూసుకోవాలనే ఆకాంక్షతో ముంబయికి చేరారు.

1978లో వెండితెరపై తొలి అవకాశం వచ్చింది. ఆమె మొదటి సినిమా ‘కిస్సా కుర్సీ కా’, ఇందులో ఆమె ‘మీరా’ అనే పాత్ర పోషించారు. షబానా అజ్మీ, రాజ్ కిరణ్, ఉత్పల్ దత్‌లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక పొలిటికల్ సెటైర్. ఈ చిత్రం ద్వారా సినీరంగంలో ప్రవేశించినప్పటికీ, ఆమెకు తగిన గుర్తింపు రాలేదు.

సినీరంగంలో ఆమె పోరాటం మొదలైంది. ‘తమస్‌’  చిత్రం ద్వారా 1986లో ఆమె పెద్ద బ్రేక్‌థ్రూ వచ్చింది. గోవింద నిహలానీ తీసిన ఈ సినిమాలో ఆమె ‘రజో’ పాత్ర పోషించారు.

ఈ చిత్రం తరువాత ఆమెకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే పోరాటం మాత్రం తప్పలేదు. కానీ ఏడాది తరువాత ఏడాది, ఆమె సినిమాలు ఒకదాని తరువాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి. ఆవిడ ‘నసీం’, ‘సర్ఫరోష్’, ‘జుబైదా’, ‘రైన్‍కోట్’, ‘హమ్ కో దీవాన కర్ గయే’, ‘బధాయ్ హో’ వంటి చిత్రాలలో చిన్నా పెద్దా పాత్రలు పోషించారు. ‘ఘోస్ట్ స్టోరీస్’ ఆవిడ చివరి చిత్రం.

సురేఖ గారి సినీ కెరీర్ బాగానే ఉన్నా, ఆవిడ అనుకున్న రీతిలో సాగలేదు. ఆవిడ ఆశించిన స్థాయికి ఆవిడ చేరలేకపోయారు. అయితే మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. 1989లోనే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా పొందారు. అందుకే సినిమాలు తగ్గించి, టీవీకి మళ్ళారు.

‘సంఝా చులా’తో 1990లో టీవీ రంగంలో అడుగుపెట్టారు సురేఖ. కానీ 2008లో ప్రారంభమైన సీరియల్ ‘బాలికా వధు’ ఆవిడకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘దాదీ సా’ పాత్ర ద్వారా ఆమె అశేష ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇక్కడ పేరు రావడంతో సినిమాల్లో మరికొన్ని అవకాశాలు వచ్చాయి.

‘ఏక్ థా రాజా ఏక్ థీ రాణి’, ‘పర్‌దేశ్ మే హై మేరా దిల్’, ‘కేసర్’ వంటి ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించారు సురేఖ. 2007లో సిఐడి సీరియల్‍లో ఒక ఎపిసోడ్‌లో నటించారు. ఆ పాత్రకీ చక్కని ఆదరణ లభించింది.

సురేఖా సిక్రీ టీవీ, సిరీ రంగాలలో సుమారు 42 ఏళ్ళ పాటు క్రియాశీలకంగా ఉన్నారు. అయితే జీవితంలో ఆవిడకున్న బాధల్లో ఒకటి – సినీ రంగంలో హీరోయిన్ కాలేకపోవడం. జీవితం చివరి దశల్లో ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. వైద్య చికిత్సకు అధిక వ్యయం కావడం, లాక్‌డౌన్ వల్ల షూటింగ్‍లు లేకపోవడం ఆర్థికంగా క్రుంగదీశాయి. ఆ పరిస్థితుల్లో ఆవిడ బాలీవుడ్‌ని సహాయం కోరారు.

ఇప్పుడు ఆవిడ సజీవంగా లేకపోవచ్చు, కానీ ఆవిడ ప్రదర్శనలు మనతో ఉన్నాయి… ఎప్పటికీ ఉంటాయి.


సోగకళ్ళ ముంతాజ్:

కొందరి ఆకర్షణ వారి కళ్ళల్లో ఉంటుందంటారు. ముంతాజ్ విషయానికొస్తే, ఇది పూర్తి నిజం. అయితే ప్రేక్షకులని ఆకట్టుకోవాలంటే బికినీ ధరించనక్కర్లేదు, పూర్తిగా దుస్తులు ధరించి ముఖ కవళికలతో అలరించవచ్చని ముంతాజ్‍ని చూస్తే తెలుస్తుంది. స్కిన్‌‍టైట్ చుడీదార్లని పరిచయం చేసిన ఘనత ఆవిడకే దక్కుతుంది. 70లలో ఆమె దుస్తులను అనుకరించిన ఎందరో యువతులు ఊపిరాడక ఇబ్బంది పడ్దారట.

ముంతాజ్ తన సినీ జీవితాన్ని బాలతారగా ప్రారంభించారు. టీనేజర్‌గా ఎదిగేవరకూ మేకప్ కిట్ మూయాల్సిన అవసరం రాలేదు. సినిమాల్లో ఏ గాడ్‌ఫాదర్ లేకపోయినా, సినీరంగంతో పూర్వ పరిచయం లేకపోయినా, విశేషంగా రాణించారు. కేవలం పట్టుదలా, దృఢ నిశ్చయాలతో, తనకున్న ఆకర్షణతో ఆమె ముందుకు దూసుకుపోయారు. అయితే ప్రేమలో పడినప్పుడు, వీటన్నిటిని అత్యంత సులువుగా వదిలేసారు.

ఆమె తల్లిదండ్రులు అబ్దుల్ సలీం అక్సారీ, షాదీ హబీబ్ ఆఘా ఇరాక్‌కి చెందినవారు. ముంతాబ్ జన్మించిన ఏడాదికే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయాకా, ముంతాజ్ తల్లి – తన బంధువులతో కలిసి ఉండేందుకు భారత్ వచ్చేశారు. కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో, ముంతాజ్, ఆమె సోదరి మల్లిక – కుటుంబానికి చేయూతగా ఉండేందుకు సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు.

ముంతాజ్ ‘సంస్కార్’ (1952) చిత్రంతో బాలనటిగా మారారు. ‘సోనే కీ చిడియా’ (1958) ఆమెకి బాగా పేరు తెచ్చింది. యువనటిగా తొలి చిత్రాలు – ఓపి రల్హాన్ తీసిన ‘గెహ్రా దాగ్’ (1963), ఆ తరువాత సునీల్ దత్ డెకాయిట్ డ్రామా ‘ముఝె జీనే దో’ (1963). దారాసింగ్ సరసన హీరోయిన్‌గా తొలి బ్రేక్ ‘ఫౌలాద్’ (1963) చిత్రంలో లభించింది. అప్పట్లో ఆమె వయసు 16 ఏళ్ళు, దారాసింగ్ ఏమో వరల్డ్ ఫ్రీస్టయిల్ బాక్సింగ్ చాంపియన్. ఆయన పేరు ప్రఖ్యాతులు ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరూ కలిసి 16 సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఆమె అత్యధికంగా పారితోషియకం తీసుకునే ద్వితీయ శ్రేణి నటి అయ్యారు. అప్పట్లో ఆమెకి సినిమాకి 2.5 లక్షల రూపాయలిచ్చేవారట. 60లలో అది చాలా పెద్ద మొత్తం. తరువాత ఆమె సోదరి మల్లిక – దారాసింగ్ సోదరుడు రణధావాని పెళ్ళి చేసుకున్నారు. “చెప్పాలంటే, కొంత వరకు నా కెరీర్ ఎదుగుదలకు దారాసింగ్ దోహదం చేశారు. ఆయనతో పని చేస్తుంటే చక్కని అవకాశాలు వచ్చాయి. ఆయనంటే నాకు గౌరవం” చెప్పారొకసారి ముంతాజ్.

‘మేరే సనమ్’ (1965), ‘కాజల్’ (1965), ‘ప్యార్ కియే జా’ (1966) ఇంకా ‘సావన్ కీ ఘటా’ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించినా, చక్కని గుర్తింపు వచ్చింది. అయితే ఆమెకి అత్యంత కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన పాత్ర – దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సరసన ‘రామ్ అవుర్ శ్యామ్’ (1967) చిత్రంలోనిది. ఈ సినిమాలో దిలీప్ కుమార్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన మరో హీరోయిన్‌గా వహీదా రెహమాన్ నటించారు. ‘మేరే హమ్‌దమ్ మేరే దోస్త్’ (1968), ‘పత్థర్ కే సనమ్’ (1967) ‘హమ్‌రాజ్’ (1967) వంటి చిత్రాలలో రెండవ హీరోయిన్‌గా నటించినా, ఆమెకి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.

సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా సరసన ‘దో రాస్తే’ (1969)లో హీరోయిన్‍గా నటించడం ఆమె కెరీర్‍ని మలుపు తిప్పింది. ఆ సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ జోడీని అందరూ మెచ్చుకున్నారు. ఫలితంగా, వీరిద్దరూ కలిసి 10 సినిమాలు చేశారు. ‘సచ్చా ఝూటా’ (1970), ‘అప్నా దేశ్’ (1972), ‘ఆప్ కీ కసమ్’ (1973) ఇంకా ‘రోటీ’ (1974) వీటిల్లో ముఖ్యమైనవి.  ఇతర నటులు కూడా ఆమె పేరుని నిర్మాతలకి సూచించసాగారు. బీ గ్రేడ్ హీరోయిన్ అని ఒకప్పుడు ఆమెతో నటించేందుకు తిరస్కరించిన శశి కపూర్, తర్వాత తన ‘చోర్ మచాయే షోర్’ (1974) చిత్రానికి ఆమెనే హీరోయిన్‍గా తీసుకున్నారు. ‘బ్రహ్మచారి’ (1968) చిత్రంలో ఆమెతో నటించిన షమ్మీ కపూర్ ఒకానొక దశలో ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నారట. కొద్ది రోజులోనే, ఆమె తన కాలంలో టాప్ హీరోయిన్ అయ్యారు. షమ్మీ కపూర్, ధర్మేంద్ర ముంతాజ్‌తో ప్రేమలో పడ్దారనీ, షమ్మీ అయితే ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నారని చెప్పుకుంటారు. “నేను అదృష్టవంతురాలిని… కొందరు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కాని అది ఆకర్షణ మాత్రమే, అందుకే నేను స్పందించలేదు. నాకు అప్పట్లో, ప్రేమలకీ, రొమాన్స్‌కీ సమయం లేదు. అయితే, నాకు జితేంద్ర నచ్చారు. ధర్మేంద్రలో ఆకర్షణ ఉండేది. దేవ్ సాబ్ అందగాడు. అయితే ప్రతీసారీ తోటినటులతో సంబంధం పెట్టుకోవలసిన అవసరం లేదు. దూరం నుంచే వాళ్ళని అభిమానించవచ్చు” అన్నారు ముంతాజ్ ఒక ఇంటర్వ్యూలో. “బ్రహ్మచారి సినిమా షూటింగ్ అప్పుడు నాకు 18 ఏళ్ళు. షమ్మీ గారంటే ఇష్టం ఏర్పడింది. ఆయనేమో సినిమాలు మానేయమన్నారు. నేను అందుకు సిద్ధంగా లేను. నాకు కుటుంబం బాధ్యత ఉంది. ‘బూంద్ జో బన్‌గయే మోతీ’ (1967) చిత్రం షూటింగ్ చేస్తూండగా అమ్మ చనిపోయింది” చెప్పారామె.

ప్రవాస భారతీయ వ్యాపారవేత్త మయూర్ మాధ్వాని ఆమెని పెళ్ళికి ఒప్పించారు. మే 1974లో వారి వివాహం జరిగింది. కొన్నేళ్ళ తరువాత ఆమెకు కేన్సర్ అని తెలిసింది. భర్తకున్న ఇతర సంబంధాల కారణంగా కుటుంబంలో ఘర్షణ రేగింది. అన్ని ఇబ్బందులను, అడ్దంకులను అధిగమించి గృహిణిగా, వ్యాపారవేత్తగా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నారిప్పుడు. ఫిరోజ్ ఖాన్ కొడుకు, నటుడు ఫర్దీద్ ఖాన్‌కి ముంతాజ్ అత్తగారు. ఆమె కూతురు నటాషా ఫిరోజ్ ఖాన్ కుమారుడిని 2005లో పెళ్ళి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here