కశ్మీర రాజతరంగిణి-44

3
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

అంతర్జతయా తస్య తాదృశ్య కృత సత్కృతిః।
భర్తృమేంఠః కలిర్మేనే పునరుక్తం శ్రియోర్పణమ్॥
(కల్హణ రాజతరంగిణి III, 262)

[dropcap]మా[/dropcap]తృగుప్తుడు స్వయంగా కవి. అతడు ఇప్పుడు కశ్మీర రాజు. రాజు అవుతూనే అతను ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాడు. స్వయంగా దారిద్ర్యం అనుభవించినవాడు కాబట్టి, ప్రజల కష్టనష్టాలపై అవగాహన ఉన్నవాడు కాబట్టి, ఆయన ప్రజల బాగోగులు చక్కగా చూసుకున్నాడు. ఇక అతని సామ్రాజ్యంలో కవుల ఆదరణ విషయంలో కొదువ లేదు. ఆయన కావ్యాలను అర్థం చేసుకోవడంలోను, బాగున్న వాటిని పొగడి, సన్మానించటంతో ఎంతో ముందుండేవాడు. ఆయన తన సామ్రాజ్యంలో జీవహింసను నిషేధించాడు. జంతుబలుల బదులు పిండి, పెరుగు కలిపిన ప్రసాదాన్ని పంచటం ఆరంభించాడు. ఆయన ప్రసాదాన్ని పంచుతుంటే దాహం తీరని ప్రజలుంటారా? అని ప్రశ్నిస్తాడు కల్హణుడు.

ఇది ఆసక్తికరమైన సమాచారం. ఇతర మతాలకూ, భారతీయ ధర్మానికీ ప్రధానమైన తేడా. భారతీయ ధర్మం నీటి లాంటిది. అది లొంగదు, వంగదు. ఆగదు. తనదైన రీతిలో మార్గం వెతుక్కుంటుంది. ప్రవహిస్తూనే ఉంటుంది. జంతుబలులు నిషేధిస్తే ధర్మం ఆగలేదు. అరవలేదు, నిరసనలు చేయలేదు. హింసకు దిగలేదు. ప్రత్యామ్నాయం వెతుక్కుంది. బలుల బదులు నెయ్యితో చేసిన జంతువుల బొమ్మలను అర్పించింది. దాన్నే ప్రసాదంగా స్వీకరించి సంతృప్తి పడింది. మరో రాజు వచ్చి, జంతుబొమ్మల బదులు, పిండి పదార్థాల ప్రసాదం పెట్టాలంటే ‘సరే’నంది. ఆ ప్రసాదం సర్వం అనుకుని సంతృప్తి పడింది. అదే అలవాటయ్యింది. సంప్రదాయం అయ్యింది. అంటే, ఈనాడు కొబ్బరికాయలు కొట్టడం, ప్రసాదం పంచటం వంటివన్నీ ఒకప్పటి సంప్రదాయాలకు ప్రత్యామ్నాయాలన్న మాట. ఈ రకంగా చూస్తే ధర్మం పైపైన రూపు మార్చుకుంటున్నా, మౌలిక స్వరూపంలో, మూలంలో ఎలాంటి మార్పు లేదనిపిస్తుంది. కానీ, మారుతున్న పరిస్థితులను బట్టి ధర్మం తనని తాను నిర్వచించుకుంటూ, రూపాన్ని మార్చుకుంటూ సజీవంగా నిలిచిన విధానం గురించి తగినంత దృష్టి పెట్టలేదింతవరకూ అనిపిస్తుంది. ఇదొక ప్రత్యేక అధ్యయనం అవుతుంది.

స్వతహాగా కవి అయిన మాతృగుప్తుడు, తన రాజ్యంలో ‘హయగ్రీవ వధ’ అన్న కావ్యాన్ని రచించిన కవి ‘భర్తృమేంఠ’ను బంగారంతో సత్కరించాడు. అయితే కవి ఆ సత్కారంతో సంతృప్తి పడలేదు. ‘ఎందుకని?’ అన్నది కల్హణుడు చెప్పలేదు. కానీ ఊహించటం సులభం. కావ్యం విన్న మాతృగుప్తుడు మౌనంగా ఉన్నాడు. కానీ కావ్యం నుండి కారే రసం పట్టేందుకు కావ్యం క్రింద బంగారు పాత్రను ఉంచాడు. అది ఆయన కావ్యాన్ని అభినందించిన తీరు. కానీ కవులకు కావల్సింది మణిమరకత మాణిక్యాలు కాదు. కవులకు కావల్సింది   కావ్యాలను ప్రజలు చదివి అర్థం చేసుకోవటం. అవగాహన చేసుకుని ఆనందించి అభినందించటం. ఆ ఒక్క అభినందన ముందు ప్రపంచంలోని సకల ధనధాన్యాలు దిగదుడుపే. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతీయ సృజనాత్మక కళాకారులు కోరుకునేది ఇదే. వారు తపించేది ఒక అభినందన పూర్వకమైన వాక్యం కోసమే. కానీ సాహిత్య ప్రపంచం ఎంత నిర్దయమైనది, ఎంత కర్కోటకమైనదంటే తమకు చెందని, నచ్చని, తమవారు కాని రచయితలతో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అసలు అలాంటి వారున్నట్టే వ్యవహరించదు. వారి ఉనికి గురించి సృహ ఉన్నట్టే ప్రవర్తించదు. తీవ్రమైన విమర్శ కన్నా రచయితలను బాధించేది ఇదే. ఎంత మూర్ఖంగా తన రచనను విమర్శించినా, ‘కనీసం చదివేడు కదా’ అని సంతోషిస్తాడు రచయిత. కానీ రచయితలకు అలాంటి సంతోషాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ముఠాలు, పీఠాలుగా విడిపోయి వందిమాగధ గణ భజన బృందాలతో నిండి ఉన్న తెలుగు సాహిత్య ప్రపంచం.

ఇలా మాతృగుప్తుడు అయిదేళ్ళకు మూడు నెలలు, ఒక్క రోజు తక్కువగా కశ్మీరాన్ని పాలించాడు.

ఇప్పుడు భారతదేశానికి, భారతీయ ధర్మానికి మాత్రమే పరిమితమయిన మరో అత్యద్భుతమైన గాథ వస్తుంది. ఇలాంటి కథలు ప్రపంచంలో ఇతర ధర్మాలలో, నాగరికతల్లో కంచుకాగడా పెట్టి వెతికినా కనబడవు. నిజానికి మన చరిత్రలో చెప్పుకునేందుకు అశోకుడు, అక్బరు తప్ప గొప్ప రాజులు లేరనిపిస్తుంది. ఏ గొప్ప రాజు పేరు చెప్పినా, ఏదో ఒక మచ్చ చూపించి తక్కువ చేస్తారు. విక్రమార్కుడు అంటే ‘ఉన్నాడో? లేడో?’ అంటారు. భోజుడు అంటే ‘కట్టుకథ’ అంటారు. చంద్రగుప్తుడు అనగానే గొప్ప చాణక్యుడిది అంటారు. శ్రీకృష్ణదేవరాయలు అంటే ‘అప్పాజీ కళ్ళు పీకించాడు’ అంటారు. ఇలా… ‘మీరు రాజు పేరు చెప్పండి, వాడిని తక్కువ చేసే మచ్చ నేను చూపిస్తా’ అన్నట్టు ఉంటుంది భారతదేశ చరిత్ర [చూడుము – ముందుమాట, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు – రచన కస్తూరి మురళీకృష్ణ]. కానీ కళ్ళు తెరిచి చూస్తే కోట్ల సంఖ్యలో  అత్యద్భుతమైన రాజులు, పరమాద్భుతమైన గాథలు అడుగడుగునా కనిపిస్తాయి. మనం చూడడానికి ఇష్టపడం. ఒప్పుకునేందుకు ఇష్టపడం. ఒక్క కశ్మీరు చరిత్రలోనే పరమాద్భుతమైన రాజులు, ఇలాంటి వారున్నారా? ఇలా నిజంగా జరిగిందా? అనిపించే రాజులు, సంఘటనలు బోలెడున్నాయి. భారతీయ సంస్కారం తెలియని విదేశీయులు వీటిని కట్టుకథలు, కల్పిత గాథలు అంటే భారతీయులమై ఉండి  ‘తాన… అంటే… తందాన’ అంటున్నాం.

కల్హణుడికి తెలుసు, తాను పరమాద్భుతమైన వ్యక్తుల పరమాద్భుతమైన గాథలు చెప్తున్నానని. ఈ సంఘటనల వర్ణనలో కల్హణుడిలోని కవి విశ్వరూపం ప్రదర్శిస్తాడు. సుందరమూ, అర్థవంతమూ, అత్యంత రమణీయమైన సార్వజనీన సత్యాలను, మానవ మనస్తత్వాన్ని జగతి రీతిని ప్రదర్శించే శ్లోకాలు ఈ సందర్భంగా గుప్పిస్తాడు కల్హణుడు. చరిత్ర రచయితగా, సృజనాత్మక కవిగా, సున్నిత మనస్కుడిగా, ప్రపంచ రీతిని, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తాత్త్వికుడిగా కల్హణుడి రాజతరంగిణి రచన ప్రణాళికను మరింత విస్పష్టం చేస్తుందీ భాగం.

అన్యోన్యం సాభిమానానా మన్యో న్యాచిత్య శాలినామ్।
త్రయాణామ్ పి వృత్తాన్త ఏష త్రిపథగాపయః॥
(కల్హణ రాజతరంగిణి III, 323)

రాజ్యం కోల్పోయిన ప్రవరసేనుడు తపస్సు చేశాడు. పరమశివుడి అనుగ్రహం పొందాడు. కశ్మీర రాజ్యంపై పరాయి పాలనను భరించలేకపోయాడు. మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా పంపి కశ్మీరుకు విక్రమార్కుడు అన్యాయం చేశాడు, అవమానించాడని రగిలిపోతున్న ప్రవరసేనుడు సైన్యం సమకూర్చుకుని కశ్మీరుపై దాడికి బయలుదేరాడు. అతడికి మాతృగుప్తుడిపై క్రోధం లేదు. విక్రమార్కుడిపై కోపం. ఇంతలో విక్రమార్కుడు మరణించాడు. తన చేతిలో కాక ప్రాకృతికంగా విక్రమార్కుడు మరణించినందుకు బాధపడతాడు ప్రవరసేనుడు. త్రిగర్తను గెలుచుకున్న ప్రవరసేనుడు విక్రమార్కుడి మరణం వార్త విని బాధపడిన విధానాన్ని కల్హణుడు వర్ణించిన విధానం ఒక శ్లోకంలోనే సర్వం చెప్తుంది.

విస్మన్నహాని భూధత్రో శోకాన్నిః శృస తానిశమ్।
నాస్నాయి నాశి నాస్యాపి స్థితేనా వనతాననమ్॥
(కల్హణ రాజతరంగిణి III, 286)

విక్రమార్కుని మరణ వార్త విన్న రాజు పదే పదే దీర్ఘ నిశ్వాసలు విడిచాడు. ఆ రోజంతా స్నానం చేయలేదు. నిద్ర పోలేదు. భోజనం చేయలేదు. బొక్కబోర్లా పడుకుని విషాదంగా ఉండిపోయాడు.

ఇది ఒక్క భారతీయ ధర్మంలోనే సాధ్యం. శత్రువు మరణిస్తే ఇలా దుఃఖించే రాజులు ఎవరయినా, ఎక్కడయినా ఉన్నారా? విక్రమార్కుడు గొప్ప రాజు. కశ్మీరుకు రాజు లేడు, రాజును పంపమని కశ్మీరు మంత్రులు అభ్యర్థిస్తే ఆయన మాతృగుప్తుడిని పంపాడు. దాన్ని అవమానంగా భావించి విక్రమార్కుడితో ప్రవరసేనుడు వైరం పూనాడు కానీ, లేకపోతే, విక్రమార్కుడంటే గౌరవం ఉన్నవాడే. ఆ గౌరవం అతడిపై అలాగే ఉంది. శత్రువుని సైతం గౌరవించే అత్యద్భుతమైన సంస్కారం మనది. ఈ సంస్కారమే లేకపోతే, గజనీలు, గోరీలు మనపై గెలవగలిగేవారా? దుష్టుల ముందు మంచితనం కూడా హానికరం!

విక్రమార్కుడి మరణ వార్త తెలిసిన తెల్లారే మరో వార్త తెలుస్తుంది. మాతృగుప్తుడు కశ్మీర సింహాసనం వదిలి సన్యాసం స్వీకరించేందుకు ‘వారణాసి’ వెళ్ళిపోతున్నాడు! ఈ వార్త తెలియగానే ప్రవరసేనుడు సింహాసనం అందుకునేందుకు తన మార్గం సుగమమైందని సంతోషించలేదు. ‘నా సమర్థకులు ఎవరయినా మాతృగుప్తుడిని పదవీచ్యుతుడిని చేశారా?’ అని బాధపడ్డాడు. మాతృగుప్తుడి వద్దకు అతి తక్కువ సహాయకులతో వెళ్ళాడు. పదవీచ్యుతుడయిన వాడి వద్ద తన బలగాన్ని చూపి అవమానించ దలచుకోలేదు ప్రవరసేనుడు. ఇదీ సంస్కారం అంటే! పేదవాడయిన ఐశ్వర్యవంతుడి ముందు తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించటానికి మించిన పేదరికం లేదు కదా!

మాతృగుప్తుడికి వందనాలు అందజేసి, గౌరవించి, రాజ్యం వదిలేందుకు కారణం అడుగుతాడు ప్రవరసేనుడు. ఎవరైనా బాధించారా? అవమానించారా అని అడుగుతాడు. దానికి మాతృగుప్తుడి సమాధానం అతి గొప్పగా ఉంటుంది.

“స్ఫటికంపై సూర్యకిరణం పడినంత కాలమే అది మిరుమిట్లు గొలుపుతుంది”. ఇక్కడ సూర్యుడు విక్రమార్కుడు. స్ఫటికం మాతృగుప్తుడు. అంటే రాజయినంత మాత్రాన తాను సర్వశక్తిమంతుడనని గర్వించలేదు మాతృగుప్తుడు. అతడికి నిజానిజాలు తెలుసు. తన శక్తిసామర్థ్యాలు తెలుసు.

“ఎవరి మీద కోపంతో, ఎవరు చేసిన అవమానం వల్ల మీరు విక్రమార్కుడు లేకపోతే రాజ్యం చేయలేనని భావించి రాజ్యం వదిలేస్తున్నారు?” అని అడుగుతాడు ప్రవరసేనుడు.

“ఎంత శక్తిమంతుడైనా నాకు హాని చేయలేడు” అంటాడు మాతృగుప్తుడు నిరసనగా.  ఇక్కడ అతడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చూడండి. ఎలాంటి అభిమానధనులు ఉండేవారో ఈ దేశంలో!

విక్రమార్కుడి మరణంతో రాజ్యకాంక్ష నశించిందని, వారణాసి వెళ్ళి సన్యసించాలని నిశ్చయించానని, అందుకని స్వచ్ఛందంగా రాజ్యాధికారం త్యజించానని చెప్తాడు మాతృగుప్తుడు. ప్రవరసేనుడు రాజ్యం కోసం తపస్సు చేస్తే ప్రత్యక్షమైన శివుడు “రాజ్యాధికారం క్షణభంగురం. అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది కోరుకో” అంటాడు. కానీ ప్రవరసేనుడు రాజ్యాధికారం కోరతాడు. ఇప్పుడు అతడు స్వచ్ఛందంగా రాజ్యాధికారం త్యజించిన వాడిని చూస్తున్నాడు. దేని కోసం తాను రాత్రింబవళ్ళు తపన పడుతున్నాడో, దాన్ని తృణంలా కాలదన్నిన అతి గొప్ప వ్యక్తిని చూస్తున్నాడు. ఎంత గొప్ప సన్నివేశం! అపూర్వమైన సంఘటన ఇది! చరిత్రలో ఎక్కడా ఇలాంటి వారు లభించరు. గతంలో యాభై ఏళ్ళు పాలించిన రాజ్యాన్ని త్యజించి, మరో రాజుకు స్వచ్ఛందంగా అధికారం అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయిన సంధిమతి కశ్మీరు నేలపై నడయాడాడు. ఇప్పుడు రాజ్యం కోసం తపన పడుతున్న ప్రవరసేనుడు, రాజ్యం త్యజించిన మాతృగుప్తుడు, వారిద్దరి అపూర్వ సంగమానికి కారకుడయిన విక్రమార్కుడు ఉజ్జ్వలమానం చేసిన భారతభూమిపై మనం నడయాడుతున్నాం! ఒక మతం వారు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి, ఆ భూమి తమదేనని రక్తపాతాన్ని కలిగిస్తున్న నీచాతినీచమైన దుష్ట రాజకీయులాటల హింసాత్మక క్రీడలను అనుభవిస్తున్నాం!

“ఈ భూమి రత్నగర్భ అని విన్నాను. నీలాంటి రత్నాలకు జన్మనివ్వటం వల్ల భూమి మరింత జాజ్జ్వల్యమానం అయింది” అంటాడు ప్రవరసేనుడు, ఎవరిపైకి సేనతో దండెత్తి వచ్చాడో, అతడి ముందు సాగిలపడుతూ! మాతృగుప్తుడితో సంభాషణతో ప్రవరసేనుడిలో రాజ్య వ్యామోహం, ఐశ్వర్యదాహం, సుఖానుభవాల తాపత్రయం నశిస్తాయి. “కశ్మీర రాజ్యాన్ని త్యజించకు. రాజ్యాన్ని స్వీకరించు. సత్యం వైపుండి, ధర్మాన్ని సమర్థించిన ఖ్యాతి నాకు రానీ” అని ప్రవరసేనుడు, మాతృగుప్తుడిని బ్రతిమిలాడుతాడు.

ఇదెక్కడయినా విన్నారా? కనీ వినీ ఎరుగని పరమ రమణీయము, ఆధ్యాత్మిక భావ పరిపూర్ణమయిన సన్నివేశం ఇది. ఒక్క భరతభూమిలోనే సాధ్యం ఇలాంటి అపూర్వమైన సంఘటన.

తనకు రాజ్యం ఇచ్చిన మహానుభావుడు మరణించటంతో రాజ్యేచ్ఛ నశించి, సన్యాసం స్వీకరిస్తున్న రాజు, – ఏ రాజ్యాధికారం కోరి, ఎవరినైతే యుద్ధంలో గెలుద్దామని బయలుదేరాడో, అతని కాళ్ళపై పడి “ఈ రాజ్యం మీకు అప్పజెప్పిన ఖ్యాతిని నన్ను పొందనీ” అని బ్రతిమిలాడే మరో రాజు! ఏ దేశ ప్రజలయితే ఇంతటి అనిర్వచనీయము, అపూర్వము అయిన ఘనతను విస్మరిస్తారో, అలాంటి ప్రజలు మనలాగే జీవిస్తారు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అన్నవి లేకుండా, విషపు పళ్ళు తింటూ,  అదే అమృతం అని భావించే వారిలా!

ప్రవరసేనుడి మాటలకు మాతృగుప్తుడి సమాధానం ఇంకా గొప్పగా ఉంటుంది.

ఆత్మైన వేట్తి మాహత్మ్యం వర్తమానె క్షణే పునః॥
(కల్హణ రాజతరంగిణి III, 311)
‘ప్రతీ వ్యక్తికీ తన ఆత్మగౌరవం తెలుస్తుంది. ఆ క్షణంలో తన విలువ తెలుస్తుంది’.

మాతృగుప్తుడికి రాజ్యం ఇచ్చింది విక్రమాదిత్యుడు. ఇప్పుడు రాజ్యం ఇస్తానంటున్నది ప్రవరసేనుడు – ప్రవరసేనుడు రాజ్యం వదిలి పారిపోతేనే మాతృగుప్తుడు కశ్మీరు వచ్చాడు రాజుగా! కాబట్టి, మళ్ళీ ప్రవరసేనుడి నుంచి రాజ్యం స్వీకరించటమంటే విక్రమార్కుడిని అవమానించటమే. అతని ఔన్నత్యాన్ని చులకన చేయటమే. పైగా రాజు అయి ఉండి రాజ్యం మరొకరి నుంచి దానంగా స్వీకరించటం ఎంతటి అనౌచిత్యం! ఎంతటి అవమానం! కాబట్టి కేవలం రాజ్యాధికారాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించాలనే తాపత్రయంతో, తనకు మేలు చేసిన వారి ఔన్నత్యాన్ని విస్మరించి, దిగజార్చటం భావ్యం కాదు అంటాడు మాతృగుప్తుడు. కాబట్టి సర్వం త్యజించి, సన్యాసం స్వీకరించాలన్న తన నిశ్చయంలో మార్పుండదని స్పష్టం చేస్తాడు మాతృగుప్తుడు.

అప్పుడు ప్రవరసేనుడు అంటాడు – ‘త్వదీయ నమాయా స్పృశయాస్త్యయి జీవతి సంపదః’ – ‘ఈ సంపద నాది కాదు నీది, నీవు జీవించి ఉన్నంత కాలం ఈ సంపద నీది’ అని. మాతృగుప్తుడు వారణాసిలో సన్యాసిగా ప్రాణాలతో ఉన్నంత కాలం, కశ్మీరు ఆదాయాన్నంతా వారణాసిలో ఉన్న మాతృగుప్తుడికి పంపించాడు ప్రవరసేనుడు. ఆ ఆదాయన్నంతా వారణాసిలో పేదలకు పంచేసి తాను మాత్రం సన్యాసిగా, భిక్షమెత్తుతూ జీవించాడు మాతృగుప్తుడు. అలా పదేళ్ళు ఆయన సన్యాసిగా భిక్షమెత్తుతూ జీవించాడు. ఐశ్వర్యంపై ఆశ లేని సన్యాసికి కశ్మీరు ఆదాయాన్ని పంపుతూ వచ్చాడు ప్రవరసేనుడు. దాన్ని పేదలకు పంచుతూ వచ్చాడు మాతృగుప్తుడు. ఈ గాథ చెప్పి చివరలో అంటాడు కల్హణుడు “ఈ ముగ్గురి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, పరస్పర మైత్రీ, గౌరవభావనలు, మూడు విభిన్నమైన నదుల పవిత్ర సంగమం లాంటిది” అని. త్రివేణి సంగమం అంత పవిత్రం, అపురూపం ఈ గాథ. ఈ గాథను భావితరాలకు అందించిన కల్హణుడు ధన్యుడు. ఈ గాథ విని తన ధర్మం ఔన్నత్యం, తమ దేశ వైశిష్ట్యం అర్థం చేసుకున్నవారు ధన్యులు. లేనివారు తామే తెలివైన వారమని, రాళ్ళు విసురుతూంటారు. అంతా తెలిసిన భగవంతుడు మౌనంగా చూస్తుంటాడు. నవ్వుకుంటూంటాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here