[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]రా[/dropcap]వణుడు.. రామాయణంలో మరో కీలకమైన పాత్ర వహించిన వాడు. సాధారణంగా మనకు చెప్పిన కథ ప్రకారం రావణుడు అనేవాడు ఫలానా విశ్వవ్రసుడి కుమారుడు. పది తలలతో పుట్టినవాడు. వేద వేదాంగాలు చదివిన మహా మహా పండితుడు. శివతాండవ స్తుతిని రచించాడు. మహా జ్ఞాని. చాలా చాలా గొప్పవాడు.. రాముడే ఏ పనీపాటా లేకుండా ఉత్తరాది నుంచి వచ్చి.. తమ్ముడు విభీషణుడిని లొంగదీసుకొని.. అన్యాయంగా చంపేశాడని.. ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సమర్థింపుగా పుట్టుకొచ్చిన కథ ఇది. ఉత్తరాది వారు ఆర్యులని.. వారు ఇక్కడికి వచ్చి ద్రవిడుల మీద దాష్టీకం చేసి చంపడానికి రామరావణ యుద్ధం తార్కాణం అని ప్రచారం చేస్తుంటారు. తమిళనాడులో పెరియార్ రామస్వామి నేతృత్వంలో జరిగిన ద్రవిడ ఉద్యమం ఈ సిద్ధాంతాన్ని సమర్థించిందే. ద్రవిడ ఉద్యమం సమయంలో రావణుడికి పూజలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. సేతు సముద్రం ప్రాజెక్టు కొనసాగింపు సందర్భంలో కరుణానిధి మున్నగు ద్రవిడ ఉద్యమకారులు రాముడికి వ్యతిరేకంగా, రావణుడికి సపోర్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగించారు. చిత్రవిచిత్రమైన వాదనలు చేశారు. ఈ వాదనలన్నీ ఎక్కడినుంచి వచ్చాయి? రామాయణాన్ని వాల్మీకే రాశాడని ప్రామాణికంగా తీసుకొన్నాం కాబట్టి.. ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉన్నదా? ఉత్తర భారత దేశాల మధ్య విభేదాలు ఉన్నాయా? వింధ్యకు పైన.. కింద ఉన్న జనాలు కొట్టుకొన్నారా? ఇవేమైనా రెండు జాతులా? వర్ణాలా? ఏమిటి? ఎక్కడైనా, ఎవడైనా రాసి ఉన్నాడా? హేతువు ఉంటే తప్ప నమ్మని మేధా సంపన్న హక్కులు ఉన్నవారు వారు రామాయణం గురించి చేస్తున్న వాదాలకు హేతువు ఏమిటో చెప్పగలరా?
జాతుల గురించి ప్రస్తావన చేద్దామని అనుకొంటే.. రామాయణంలో వర్ణాశ్రమాల గురించిన చర్చే తప్ప జాతుల గురించిన చర్చ జరుగనే లేదు. పోనీ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ప్రకారం లెక్కలు వేసుకొందామని అనుకొంటే.. రాముడినీ ఆర్యపుత్రుడని పిలిచారు.. వాలిని అతని భార్య ఆర్య పుత్రా అని మాత్రమే సంబోధించింది. రావణుడినీ.. భార్య మండోదరి ఆర్య పుత్రా అని సంబోధించింది. ద్రావిడ పుత్రా అని ఎక్కడా మాటమాత్రంగానైనా ప్రస్తావించనేలేదు. పోనీ రంగుపరంగా చూద్దామని అనుకొంటే రాముడూ నల్లనివాడే.. రావణుడూ నల్లనివాడే.. అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకూ అంతా ఇంచుమించు ఒకే వర్ణంలో ఉన్నారు. మరి వేర్వేరు జాతుల ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? తెలియదు. రాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం చేస్తే.. రావణుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణంచేసి అనేక రాజులపైకి దండెత్తి వశపరచుకొన్నాడు. ఉత్తర దక్షిణ భారత దేశాలమధ్యన ఘర్షణ వాతావరణం ఉన్నట్టయితే.. రాముడికి సహాయం చేసిందంతా కూడా దక్షిణాది ప్రజలే కదా.. పదమూడేండ్ల రెండు మాసాలు ఉన్నది వింధ్యకు ఇవతల ఉన్న పంచవటిలోనే కదా.. మరి ఘర్షణలకు తావెక్కడ ఉన్నది? రామాయణంలో రాముడు అడవిలో ఉన్నప్పుడు కానీ, లంకలో ఉన్నప్పుడు కానీ.. యుద్ధమంటూ చేసింది రావణుడు, ఆతని సైనిక ప్రతినిధులతోనే.. అంతకుమించి మరెవరితోనూ యుద్ధం అన్నది చేయలేదు. కిష్కింధలో ఒక్క వాలిని హతమార్చడం తప్ప. ఇక్కడ జాతివైరం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆర్యద్రవిడ సిద్ధాంతం పెద్ద బూటకం. ప్రాంతాలు, రాష్ట్రాలు, రాజులు, ప్రతినిధులు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం బ్రిటిష్ వాడి కాలంలోనే మొదలైంది. వారి పంచన బతికి.. తరువాత అధికారంలోకి వచ్చినవారు మన చరిత్రను అదే దృష్టితో చూశారు. మన ప్రజలను అదే దృష్టితో చూశారు. చివరకు పరిపాలనను కూడా అదే దృష్టితో చేస్తున్నారు.
రావణుడి ప్రస్తావన.. బాలకాండలో సంక్షిప్తంగా మొదలవుతుంది. ఆ తర్వాత అరణ్యకాండలో శూర్ఫణక పరాభవం తరువాత కానీ ప్రత్యక్షంగా కనిపించదు. బాలకాండ పదిహేనో సర్గలో రాముడు జన్మించడానికి ముందు దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి రావణుడనే రాక్షసుడు దురాగతాలకు పాల్పడుతున్నాడని.. ప్రజలను బతుకనివ్వడంలేదని వాపోతారు. అప్పుడు విష్ణువు నేను మనిషినై పుట్టి రావణుణ్ణి సంహరిస్తానని చెప్తాడు. ఆ తరువాత అరణ్యకాండలో శూర్ఫణక రాముడిని చూసి మోహించి ఆయన దగ్గరకు వెళ్లి పరాభవం చెందుతుంది. ఈ విషయాన్ని ముందుగా అన్న రావణుడికి తెలియకుండా జనస్థానంలో ఉన్న ఖరదూషణులకు చెప్తుంది. వాళ్లను రాముడు చంపేస్తాడు. వాళ్లలో అకంపనుడనే వాడు తప్పించుకొని పోయి లంకకు చేరి రావణుడికి జరిగిన సంగతి చెప్తాడు. సీతను ఎత్తుకొని రమ్మని రావణుడికి ముందుగా సలహా ఇచ్చింది ఈ అకంపనుడే. సీతను అపహరిస్తే, రాముడు ఆ బాధతోనే గుండె ఆగి చస్తాడని చెప్తాడు. ‘లోకములోకెల్ల ఉత్తమురాలైన సీత అనే మంచి నడుముగల ఒక వనిత అతని భార్య. ఆమె యౌవన మధ్యమునందున్నది. ఆమె అవయవములు ఎచ్చుతగ్గులు లేకుండగ సమముగా విభజింపబడి యున్నవి. స్త్రీలలో రత్నమైన ఆమె రత్నములచేత అలంకరింపబడి యున్నది. ఆమెతో సమానమైన స్త్రీ దేవతా స్త్రీలలో కానీ, గంధర్వ స్త్రీలలో గాని, అప్సరసలలో గాని, దానవ స్త్రీలలో గాని లేదు. మనుష్య స్త్రీలలో ఎట్లుండును. నీవు మహా వనమునందు అతని భార్యను అపహరించుము. సీతమీద అత్యధిక ప్రేమగల ఆ రాముడు సీత లేకపోవుటచే ప్రాణములు విడువగలడు’ అని అకంపనుడు రెచ్చగొట్టాడు. ఆడుదాని మాట వినగానే రావణుడు వివశుడైపోతాడు. మిగతావేవీ పట్టించుకోడు. అకంపనుడికి ఆ విషయం తెలుసు కాబట్టే అలా రెచ్చగొట్టాడు. అప్పుడే సీతను అపహరించడానికి ప్లాన్ చేస్తాడు. మారీచుడి దగ్గరకు వెళ్లి సాయానికి అడుగుతాడు. నీకేమైనా పిచ్చా.. రాముడితో పెట్టుకొమ్మని నీకెవడు చెప్పాడు.. ఆ చెప్పినవాడు నీకు శత్రువు.. అని చెప్పాడు. అరణ్యకాండ 32 వ సర్గలో చదవండి.. ‘నిద్రించుచున్న రాముడనే ఈ సింహమును లేపుట నీకు మంచిది కాదు. రణ మధ్యమునందు నిలుచుట అనునదే దీని నడుమునకు చుట్టుకొనిన తోక. ఇది శరములనే గోళ్లు మొదలైన అవయవములతో పరిపూర్ణముగానున్నది. ఖడ్గములే దీని కోరలు. ఇది నేర్పుగల రాక్షసులనే లేళ్లను చంపివేయగలదు. రాక్షసరాజా అతి భయంకరమైన రాముడనే పాతాళము ముఖమునందు జారిపడుట మంచిది కాదు. ధసుస్సే దాని లోని మొసలి. భుజముల వేగమే పంకము. శరములే తరంగ పంక్తులు. గొప్ప యుద్ధమే దీనిలోని జలపవ్రాహము.’ అని.. నీ భార్యలతో నువ్వు చక్కగా హాయిగా ఉండు.. ఎందుకు పెట్టుకొంటావు.. అనగానే రావణుడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇక్కడితో ఆగిపోయి ఉంటే.. రామరావణ యుద్ధం జరిగేదే కాదు. కానీ ఆ తరువాత శూర్ఫణక వచ్చి.. సీతను నువ్వే పెండ్లి చేసుకోవాలి అంటూ ఫుల్లుగా రెచ్చగొడుతుంది. ‘రాముని భార్య విశాలమైన నేత్రములు, పూర్ణ చంద్రుని వంటి ముఖము గలది. చాలా ప్రియురాలు. ఆమె ఎల్లప్పుడు భర్త హితమునే కోరును. అందమైన జుట్టు, ముక్కు, తొడలు గల సౌందర్యవతి యైన ఆ కీర్తిమంతురాలు జనస్థానమునకు దేవతవలె, రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్నది. ఆమె శరీర కాంతి శుద్ధమైన బంగారు వర్ణము వంటిది. మంగళప్రదురాలైన ఆమె గోళ్లు ఎర్రగాను, ఎత్తుగాను ఉండును. నడుము సన్నగా ఉండును. సీతను పొందగలిగినవాడు.. సీత ఆనందపూర్వకంగా ఎవనిని కౌగిలించుకొనునో.. అతడు, అన్ని లోకములలోనూ దేవేంద్రునికంటె కూడా గొప్పగా జీవించును. భూలోకములో సాటిలేని రూపము గల ఆమె నీకు తగిన భార్య అగును. నీవు ఆమెకు తగిన భర్తవు కాగలవు. గొప్ప భుజములు కలవాడా! విశాలమైన జఘనము, బలిసిన కటి ప్రదేశము, స్తనములు, సుందరమైన ముఖము గల ఆ సీతను నీకు భార్యగా చేయుటకై తీసుకొని వచ్చుటకు నేను ప్రయత్నము చేయగా క్రూరుడైన లక్ష్మణుడు నన్ను అవయములు ఖండించి విరూపను చేసినాడు’… (అరణ్యకాండ, 34 వ సర్గ) అప్పటికే స్త్రీలోలుడైన రావణుడిని రెచ్చగొట్టడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ మాటలు విన్నతరువాత ఇక రావణుడు ఆగనే లేదు. తన సైన్యాన్ని చంపిన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవడం కంటే సీతను పొందాలన్న కోరికే అత్యంత బలంగా రావణుణ్ణి ప్రభావితంచేసింది. మారీచుడు మళ్లీ చెప్పిచూశాడు. వినలేదు. చంపేస్తానని బెదిరించాడు. సీత దగ్గరకు మాయలేడిలా పంపించాడు. రామ లక్ష్మణులు సీత దగ్గరి నుంచి దూరంగా వెళ్లగానే రావణుడు పంచవటికి చేరి సీతను చూసి పిచ్చివాడైపోయాడు. కనీకనిపించగానే ఆపాదమస్తకం ఆమెను అభివర్ణించడం మొదలుపెట్టాడు. ఆమె అతడిని చూసి అతిథి అనుకొని అర్ఘపాద్యాదులు ఇచ్చి ఆసనం చూపించింది. మంచి పండ్లు ఉన్నాయి.. నిదానంగా తినమని ఇచ్చింది. ‘బ్రాహ్మణుడా! కొద్ది సేపు ఆగితే తన భర్త ఉడుములు, జింకలు, వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్యపదార్థములను తీసుకొని వస్తాడు.. ఈ లోపు నీ వివరాలు చెప్పాల’ని కోరింది. ఆ రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కాదని స్పష్టమవుతున్నది. అక్కడినుంచి ఆమెను బలాత్కారంగా రావణుడు అపహరించుకొనిపోతాడు. ఇక రావణుడికి సీత తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది. లంకలో అంతఃపురాలను చూపించాడు. మణులు, మాణిక్యాల వంటి అసామాన్య ఐశ్వర్యాన్ని చూపించాడు. ఆమె లొంగిపోలేదు. చివరకు ఎంతగా దిగజారిపోయాడంటే.. ఆమె కాళ్లమీద పడి దండంపెట్టి ప్రాధేయపడ్డాడు. ‘సీతా ధర్మలోపము కలుగనున్నదని సిగ్గుపడవద్దు. నీకు దైవవశము చేత లభింపబడనున్న ఈ సంబంధము ధర్మశాస్త్రములలో ఋషులచేత అంగీకరింపబడినదే. సుందరమైన నీ పాదములను స్పృశించి నమస్కరించుచున్నాను. నా మీద శీఘ్రముగా అనుగ్రహము చూపుము. నేను నీకు వశుడనైన దాసుడను. కామ పీడితుడనైన నేను ఈ శూన్యములైన (నా వంటి వాడు చెప్పకూడని) మాటలు చెప్పుచున్నాను. రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా’ అన్నాడు. (అరణ్యకాండ 55 వ సర్గ) ఇక్కడ రావణుడు సీతకు ఏడాది గడువు ఇచ్చాడు. లేకపోతే బలాత్కరిస్తానని హెచ్చరించాడు. రావణుడి కామం ఎంతదాకా వెళ్లిందంటే.. సమస్త రాజ్యాన్ని, అమాత్య, పుత్ర, పౌత్ర, బంధు మిత్రాది సమస్త ప్రజానీకాన్ని పణంగా పెట్టే దశకు చేరుకొన్నది. రాముడు యుద్ధం కోసం లంకకు చేరుకొన్నప్పుడు కూడా మహాసభలో సిగ్గువిడిచి తాను సీత పొందుకోసం ఎంతగా పరితపిస్తున్నదీ వివరంగా చెప్తాడు. ఆమెను విడిచిపెట్టడం తప్ప మరేదైనా సరే చెప్పాలని కుండబద్దలు కొడతాడు. నువ్వు ఎత్తుకొచ్చినప్పుడు మాకేమైనా చెప్పావా? ఇప్పుడు సలహా ఇవ్వాలని అడుగుతున్నావ్ అంటూ తమ్ముడు కుంభకర్ణుడు తిట్టినా కూడా పట్టించుకోలేదు. రావణుడు చేసిన పనికి వేరే దిక్కులేక రాక్షసులు రాముడితో యుద్ధం చేశారు. చివరకు సర్వనాశనం తప్పలేదు. రావణుడికి అణువణువునా.. నరనరానా స్త్రీల పట్ల కామం తప్ప మరేమీ కనిపించదు. అత్యంత నీచమైన, దుర్మార్గమైన వ్యక్తిత్వమది.
అలాంటి రావణుడిని గొప్పవాడని కీర్తించడానికి, భుజకీర్తులు ధరించి ఊరేగడానికి ఎలాంటి హేతుబద్ధత ఉన్నదో అర్థం కాదు. పోనీ.. వీళ్లంతా రాముడిని తిట్టడానికి అంగీకరించే ఉత్తరకాండలోనైనా రావణుడి గురించి గొప్పగా ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదాయె.. పుట్టుకతోనే దుష్టుడిగా పుట్టాడని ఉత్తరకాండలోనే స్పష్టంగా ఉన్నది. దీనికి తోడు.. తండ్రిని అడ్డం పెట్టుకొని అన్న కుబేరుడి దగ్గరి నుంచి లంకను స్వాధీనం చేసుకొన్నాడు. లంక రావణుడు కట్టిందేమీ కాదు. కుబేరుడు అద్భుతంగా డెవలప్ చేసిన మహానగరాన్ని అప్పనంగా పొంది అనుభవించాడు. రెడీమేడ్ రాజ్యం రావణుడికి లభించింది. ఎవరినీ సుఖంగా ఉండనివ్వలేదు. అయితే ఐశ్వర్యాన్ని పారేశాడు… లేకపోతే.. భయపెట్టాడు.. తాను కోరుకున్న దేనినీ విడిచిపెట్టలేదు. నందనవనాన్ని ధ్వంసం చేశాడు. జనస్థానంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేలా చేశాడు. ఇంతెందుకు సాక్షాత్తు లంకలో రావణుడికి భయపడి వ్యతిరేకంగా మాట్లాడగలిగే దమ్మున్న జనమే లేకుండాపోయారు. ఎవరు వచ్చి తమకు స్వేచ్ఛను ప్రసాదిస్తారా అని ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూస్తూ గడిపారు. అన్ననైనా చూడకుండా హింసపెట్టినవాడు.. కనిపించిన ఆడదాన్నల్లా (వేదవతి, రంభ.. ఉత్తర కాండలో పేర్కొన్న పేర్లు) చెరపట్టినవాడిని గొప్పవాడని కీర్తించడానికి నోళ్లెలా వస్తాయో అర్థం కాదు. రావణుడు ఎంతవరకు చదువుకున్నాడు.. ఏమేం చదువుకున్నాడన్నది కూడా ఇటు తొలి ఆరు కాండల్లో కానీ, సోకాల్డ్ ఉత్తర కాండలో కానీ స్పష్టంగా లేదు. ఉత్తరకాండలో అతను పుట్టిన కొన్నాళ్లకే ఏవో తపస్సు చేసి బ్రహ్మచేత వరాలు పొందాడని చెప్పారే తప్ప అతను ఫలానా ఆయన దగ్గర చదువుకున్నాడని మాత్రం చెప్పలేదు. కాకపోతే.. ఆ రోజుల్లో అన్ని శాస్త్రాలు చదువుకోవడం అన్నది సర్వ సాధారణం కాబట్టి.. రావణుడూ అన్నింటినీ చదువుకొని ఉండటం సాధారణమే. కైలాస పర్వతం సీన్ ఉత్తరకాండలో ఉన్నది. తన భుజాలతో పర్వతాన్ని కదిలించాడని రాశాడే తప్ప.. మహాభారతం, భాగవతంలో మాదిరిగా ఏ శివతాండవ స్తోత్రాన్ని చదివినట్టుగా అందులో ప్రస్తావించలేదు. ఏమైతేనేం.. ఆ స్తోత్రం రావణుడి పేరుతో ప్రసిద్ధమైంది. రావణుడి క్యారెక్టర్‌ను మనం ఏ విధంగా అనలైజ్ చేసినప్పటికి కూడా.. అతడిలో స్త్రీల మీద కాముకత్వం తప్ప మరేదీ కనిపించదు. శత్రువు ఎంత బలవంతుడో ఎప్పటికప్పుడు అంచనా వేశాడు. సీతను అపహరించినప్పటినుంచి రాముడిమీద ఎనిమిది మంది గూఢచారులతో కన్నేశాడు. కానీ.. మోహం ఏదైతే ఉన్నదో అది అన్నింటినీ డామినేట్ చేసింది. పరస్త్రీని పొందాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు రావణుడికి మిగతావేవీ కనిపించలేదు. అందుకే రాజ్యం సర్వనాశనమైంది.
మీరు ఒక్కసారి భారతీయ ధర్మమని చెప్పబడే అంశాలున్న గ్రంథాలను పరిశీలించండి. వేదాలు కావొచ్చు.. ఉపనిషత్తులు కావొచ్చు.. ఇతిహాసాలు కావొచ్చు.. పురాణాలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. అన్నీ మహిళ సెంట్రిక్ గానే ఉన్నాయి. అదిశక్తి అనండి.. పరాశక్తి అనండి.. ఆద్యాది శ్రీమహాలక్ష్మి అనండి.. దశమహావిద్యలు కావొచ్చు.. త్రిమూర్తుల సహచారిణులు కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.. అన్నింటికీ అమ్మ.. ప్రకృతి.. దైవం.. కేంద్రమై ఈ ‘భారతీయం’ అనే అసాధారణమైన జీవన విధానాన్ని నిర్వచించింది. కొనసాగించింది. పదహారువేల మంది స్త్రీలను చెరపట్టినందుకు నరకుడు నాశనమయ్యాడు. స్త్రీని మోహించి బలవంతంగా బలాత్కరించ పూనినందుకు రావణుడు నాశనమయ్యాడు.. స్త్రీని అవమానించినందుకు ధుర్యోధనాదులు మట్టికలిసిపోయారు. వారిని సమర్థించినందుకు.. తాము ధర్మాత్ములని చెప్పుకొని తిరిగినా.. భీష్మద్రోణాదులకు నాశనం తప్పలేదు. సైంధవుడు, కీచకుడు, ఇంద్రుడు.. ఇలా ఎవ్వరినైనా తీసుకొండి.. వీటన్నింటినీ ఏ ప్రాతిపదికన ఇవాల్టి సోకాల్డ్ మేధావులని చెప్పుకొనేవాళ్లు తిరస్కరిస్తారు? ఇవన్నీ తప్పు అని దేని ఆధారంగా వీళ్లు చెప్పగలరు?
మీరు ఇవాల్టి పిల్లలకు..
ఇదిగో స్త్రీ అంటే అమ్మ.. స్త్రీ అంటే లక్ష్మి అంటే ధనం.. స్త్రీ అంటే సరస్వతి అంటే.. విద్య.. స్త్రీ అంటే పార్వతి.. అంటే శక్తి.. అని ఎందుకు చెప్పకూడదు?
ఇదిగో స్త్రీల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించినందుకు నరకుడనే వాడు ఇలా అయ్యాడు, రావణుడు అనేవాడు ఇలా అయ్యాడు.. ధుర్యోదన దుశ్శాసన, కర్ణ, శకుని ఈ విధంగా అయ్యారు. అని ఎందుకు చెప్పకూడదు?
స్త్రీల పట్ల ఈ విధంగా వ్యవహరించాలి అని చిన్నతనం నుంచి ఈ చరిత్రను, కథలను ఉదాహరణలు చేసుకొని చెప్తే ఇవాళ నిర్భయ, దిశ వంటి చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరమే ఉండేది కాదు కదా…