[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“ఈ[/dropcap] నలభైమూడేళ్ళ జీవితం అన్నీ ఉన్నా, ఏమీ లేని దాని మధ్య ఊగిసలాడి పోయింది. దానిని ఒక్కరే సరి చేయగలరు. అది నువ్వే. ఏదీ తెలీకండా నేను ఛావాలనుకోడం లేదు.
కావేరి అనుకున్నట్లు నువ్వు పిరికివాడివి కాదు. నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోకుండా ఉంటే, ఆ రోజున నీ గన్ లోని బుల్లెట్ గురి సరిగా ఉండి ఉంటే, ఏం జరిగేది. నీ మనసులో ఏం ఉందో నాకు తెలియాలి. అంతేనా ఆ మర్నాడే నువ్వు వెళ్ళి పోయావు. ఎందుకు?
ఇవే నాకు కావలసినది. ఈ స్నేహం, ప్రేమ, అబద్థాలు, దీనిమీద నాకే మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అవి నాకనవసరం. మీ సంబంధం గురించి, నిజం ఏంటో తెలుసుకోవాలని లేదు. అలా అనుకోడం లేదు.
ఓ ఇద్దరి మొగవాళ్ళ మధ్య స్త్రీ. ఆమె కావేరి. ఆమె చనిపోయి చాలా ఏళ్ళయింది.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం నీకు తెలియాలి. అది ఆమె డైరీ. పసుప్పచ్చటి డైరీ. దానికోసం ఓ రాత్రంతా వెతికాను. అప్పుడు కనిపించలేదు అని నీకు చెప్పాను కదా, ఎప్పుడూ ఉండాల్సిన డెస్క్‌లో లేదు. వెతికినా కనిపించలేదు, ఆ మర్నాడే నువ్వు వెళ్ళిపోయావు. ఆ తరవాత నేను కావేరి మాట్లాడుకోలేదు. మొహాలు చూసుకోలేదు.
ఆమె చనిపోయింది. నువ్వు ఎక్కడికో వెళ్లి పోయావు. నేను ఇక్కడే ఈ గదిలోనే ఉండిపోయాను. ఇక్కడే పోవాలనుకున్నాను. మా పూర్వీకులు అందరూ ఇక్కడే పోయారు. నేను కూడా అంతే.
ఆ పుస్తకం ఆమె మనసు. అందులో ఆమె తన ప్రేమని రాసుకుంది. అది నా మీది ప్రేమ అని అనుకోను.
అనుకోకుండా ఓ రోజున ఓ పెట్టె కనిపించింది. అది ఓ చందనం పెట్టె. దాన్ని మేము మైసూరు వెళ్ళినప్పుడు కొని, కావేరికి బహూకరించాను. అందులో ఏం పెట్టి ఉంటుందా అని కుతూహలంతో దాన్ని తీసి చూసాను.
ఆ పెట్టెలో డైరీ ఉంది. దానితో పాటూ, వాళ్ళ నాన్నగారి ఉంగరం, వాళ్ళమ్మ సన్నటి గొలుసు, ఓ ఎండిపోయిన పువ్వు. ఓ స్వారోష్కీ పెండెంట్ ఉన్న సన్నటి గొలుసు. అది మేము ఆస్ట్రియా వెళ్ళినప్పుడు టైరాల్‌లో ఉన్న స్వారోష్కీ షోరూమ్‌లో కొని కావేరికి బహుకరించాను. అది కూడా ఉంది. అది నేనే పెళ్ళైన రోజున ఆమెకి ఇచ్చాను. ఆ ఎండిపోయిన పువ్వు ఏం చెప్తోంది, నా మీద ప్రేమ ఆ పువ్వు లాగే ఎండిపోయిందనా, ఆ పువ్వు చూసాకా చాలా సేపటి వరకూ మామూలు మనిషిని కాలేక పోయాను. ఆ గొలుసు నిరాకరణకి అర్థమా, వీటితో పాటూ ఆ పెట్టెలో ఉంది ఈ డైరీ.
అయితే ఆ డైరీ మామూలుగా లేదు. దానికి ఓ నీలం సాటిన్ రిబ్బన్ ముడి వేసి ఉంది. ఇప్పుడే దానిని తీసుకుని వస్తాను.” అంటూ బ్రహ్మాజీ లేచి లోపలికి వెళ్ళి, ఓ పెట్టెతో తిరిగి వచ్చాడు.
శివరాం దాన్ని చూసి చూడనట్టున్నాడు.
బ్రహ్మాజీ ఆ పెట్టే మూత తీసాడు. అందులోంచి నీలం రంగు రిబ్బన్ కట్టి ఉన్నదాన్నితీసాడు. అది పసుప్పచ్చ వెల్వెట్ జాకెట్ ఉన్న డైరీ, ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి శివరామ్ ముందు పెట్టాడు.
“ఇదిగో ఇదే కావేరి మిగిల్చినది. కట్టి ఉన్న ఆ రిబ్బన్‌ని నేను కత్తిరించలేదు. ఆ డైరీని తెరవలేదు. అందులో ఏం ఉందో నాకనవసరం అని అనుకున్నాను. అంతే కాదు, దానిమీద ఎవరి పేరు రాసి లేదు. దానిమీద ఎవరికి హక్కులున్నాయో తెలీదు. అది ఎవరికి చెందాలో ఆథరైజేషన్ లెటర్ ఏమీ ఇవ్వలేదు. అందుకని అది నీకో నాకో ఎవరికో తెలీదు.
ఆ పుస్తకంలో నిజం ఉంటుందని తెలుసు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. ఆ అలవాటు ఆమెకి లేదు. తీసుకో” అని పుస్తకాన్ని ముందుకి తెచ్చాడు..
శివరాం చేయి చాపలేదు. ఆ డైరీ వంక చూస్తూండిపోయాడు.
“ఇప్పుడు చదువుతావా! ఆమె ఏం రాసిందో చదవాలని ఉందా!”
“లేదు.” అన్నాడు స్థిరంగా గట్టిగా అన్నాడు.
“నేను జవాబివ్వను. ఇవ్వడానికి నిరాకరిస్తున్నాను.” అని తిరిగి అన్నాడు.
ఓ విధమైన సంతృప్తి బ్రహ్మాజీ మొహంలో.
“నాకు తెలుసు నిన్ను నేను అర్థం చేసుకోగలను. దీనిని నువ్వు చూడడానికిష్టపడడం లేదు. నాకు ఇందులో ఏం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇక్కడ మన మధ్య ఎందుకు?” అంటూ పక్కన మండుతున్న ఫైర్ ప్లేస్ దగ్గరి కెళ్ళి, ఆ డైరీని పట్టుకుని దాని చివళ్ళు తిప్పుతూ కాల్చడం మొదలెట్టాడు. ఆ వెంటనే దాన్ని పూర్తిగా అందులో పడేసాడు. ఒకరకమైన వాసన అంతటా వ్యాపించింది.
కావేరి మనసు, ఆమె అక్షరాలు అన్నీ కూడా ఆ స్టౌ మంటలో బూడిద అయిపోయాయి. దానివైపు చూసి తల తిప్పి శివరామ్‌ని చూసాడు. శివరామ్ కూడా కాలిపోతున్న డైరీని చూస్తున్నాడు.
“ఇంక ఇప్పుడు నువ్వు చెప్పు. డైరీ కాలిపోయింది. సాక్ష్యాలు లేవు. సాక్ష్యం చెప్పాల్సి వాళ్ళు కూడా లేరు. నువ్వు నన్ను చంపాలని అనుకున్నావు, మరి ఈ సంగతి కావేరికి తెలుసా. జవాబు ఇవ్వగలవా”
“నేను జవాబు ఇస్తే నువ్వు నమ్ముతావో లేదో” అని అన్నాడు శివరామ్.
“అంటే, నాకర్థం కాలేదు. అంత నమ్మలేనివి చెప్పదలుచుకున్నావా,” అంటూ తల ఊపి భుజాలు ఎగరేసాడు.
గది బాగా చల్ల బడింది. పూర్తిగా తెల్లవారలేదు. సగం తెరిచి ఉన్న కిటికీ లోంచి ఫ్రెష్ గాలి వీస్తోంది. వెచ్చదనం కోసం అర చేతులు రెండూ రుద్దుకున్నాడు.
ఇద్దరి మధ్య మాటల్లేవు. నిశ్శబ్ధం.
శివరామ్ హటాత్తుగా ఎడమ చేతిని పైకెత్తి, వాచిలో టైము చూసుకున్నాడు.
“ఓకే. మనం అన్నీ మాట్లాడుకన్నాం. ఇంక నేను వెళ్ళాలి.”
“సరే నీ ఇష్టం వెళ్ళాలనుకుంటే బయట కారుంది.” అని తల ఊపుతూ లేచి నిలబడ్డాడు.
“అయితే నువ్వు ఇప్పుడు లండన్ వెళ్లిపోతావా?”
“అవును”
“అక్కడే ఉంటావా!”
“పోయే వరకు.”
“మరో రెండు గంటలుంటే చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎవర్నైనా కలవాలనుకుంటే, అంటే నువ్వు ఓ పాతకేళ్ళున్నావు కదా, తెలిసిన వాళ్ళున్నారు కదా, అందుకని అడిగాను. కావేరి సమాధిని చూడవా, మా నాన్నగారి, మా అమ్మగారి సమాధుల పక్కనే ఉంది. మన సీతమ్మ…. ”
తలని అడ్డంగా ఊపాడు.
“సరే అది నీ ఇష్టం. ఇంకో విషయం కావేరి ఫొటోలు ఈ ఇంట్లో ఎక్కడా కనిపించవు. అన్నీ తీసేసాను. అవన్నీ కూడా, ఆమె గదిలోనే ఉన్నాయి నీకేవైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు. ”
వెంటనే శివరామ్ ఏం మాట్లాడలేదు. మాటల కోసం వెతుక్కున్నాడు.
“వద్దు, నాకు ఎవరిని కలవాలని లేదు, ఏదీ చూడాలని లేదు. సీతమ్మని అడిగానని చెప్పు.”
అంటూ రెండడుగులు ముందుకేసాడు.
తలుపు వరకూ వెళ్ళారు. తలుపు తెరవాడానికి హాండిల్ పట్టుకున్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. ఎంతో మర్యాదగా కాస్త తలని ముందుకి వంచారు ఇద్దరూ ఒకరి కొకరు గుడ్ బై చెప్పుకోడానికి. బ్రహ్మాజీకి తెలుసు మరోసారి శివరామ్‌ని కలుసుకునే అవకాశం రాదని. అటువంటి అవకాశం లేదని.
తలని తిప్పి బ్రహ్మాజీ వైపు చూస్తూ అన్నాడు.
“నువ్వు రెండు ప్రశ్నలంటున్నావు. మరి రెండో ప్రశ్న ఏంటీ?”
“రెండో ప్రశ్నా, కాని నువ్వు నా మొదటి ప్రశ్నకే జవాబివ్వలేదు.”
మౌనంగా ఉండి పోయాడు.
బ్రహ్మాజీ తనే మాట్లాడడం మొదలెట్టాడు.
“ఒక మరణంతో కొన్ని జవాబులు రావు. అది సరి అయిన జవాబు అని తెలిసి కూడా. నువ్వు వెళ్ళిపోయావు. నేనుండిపోయాను. మనం చేసింది న్యాయమా, అలా అని నీకనిపిస్తోందా? ఆమె చావు తరవాత కూడా మన బాధ్యత ఉందని తెలీదా! ఆమె పోయింది. ఓ విధంగా మనిద్దరికీ జవాబిచ్చింది.
కావేరి మనిద్దరికి తెలిసిన మనిషి, మనిద్దరికీ కావలసిన మనిషి, నువ్వు వెళ్ళిపోయాక, నా నిరాదరణ, వీటన్నిటిని ఆమె నిశ్శబ్దంగా, మొండిగా, ఓ స్త్రీ భరించే దానికన్నా ఎక్కువగా భరించింది. మనం కూడా పిరికిగా పురుషాహంకారంతో బాధించాం. మనిద్దరం ఆమె నుంచి దూరంగా వెళ్లిపోయాం. ఇది నిజం కాదా,
ఇప్పుడు ఆమె లేదు. మనం ఉన్నాం. మనం బతికి ఆమెని అవమానించాం. ఇది నిజం. నువ్వు లండన్‌లో తీరిగ్గా ఆలోచిస్తూ తెలుసుకోవలసినిది ఇదే. జరిగినది సరి అయినదేనా, మనం ఈ ఆఖరి రోజుల్లో మన ఒంటరితనంలో మనల్ని సెల్ఫ్ సర్జరీ చేసుకుంటూ తెలుసుకోవలసినది ఇది, మనం ముగ్గురం ఒకలాగా ఉన్నాం. ఒకటే అనుకున్నాం. కాని, కాదు. మనం ఒకరికొకరం అర్థం కాలేదు. అర్థం చేసుకోలేదు.” అని ఆగి పోయాడు బ్రహ్మాజీ.
శివరామ్ ఆశ్చర్యంగా చూసాడు.
“ఈ మాటలు నువ్వంటున్నావా, వీటిని అనాల్సింది నేను. కావేరిని మనం బాధ పెట్టాం అని అంటున్నావ్, కాని అది తప్పు, బాధ పెట్టింది మనం కాదు, నువ్వు. పైగా సందేహాలు, ప్రశ్నలు అంటున్నావు. ఇన్ని ఏళ్ళ నుంచి తయారు చేసుకున్నానని అంటున్నావు, “
బ్రహ్మాజీ ఏదో అనబోతూంటే, శివరామ్, చేయి అడ్డు పెట్టాడు.
“ఏం మాట్లాడకు, ఇంత సేపు నువ్వు మాట్లాడావు, నేను విన్నాను. ఇప్పుడు నన్ను మాట్లాడనీ, నువ్వు వినాలి. నిన్ను అర్థం చేసుకోలేదని అంటున్నావ్, నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావా, లేదు, నిజానికి నువ్వు ఎవర్నీ అర్థం చేసుకోలేదు. కాని మా ఇద్దర్నీ మాత్రం తప్పు పడుతున్నావు. ముందు నీకు నీ గురించి తెలియాలి. నేను సరే నిన్ను అర్థం చేసుకోలేదు, మరి నువ్వు అర్థం చేసుకున్నావా, ఓ ఇరవై ఏళ్ళు పైనే నీతో ఉన్నాను, నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా, చెప్పు. లేదు. పైగా ఎంత సులభంగా మోసగాడినని అనేసావు.
నిన్ను ఎంతో ప్రేమించి, నీకోసం బతికిన కావేరిని అర్థం చేసుకున్నావా, లేదు. ఏదీ అర్థం చేసుకోకుండా ప్రతీ విషయాన్ని నీ కోణం లోంచి చూస్తూ అన్నీ నువ్వే నిర్ణయించుకున్నావు.
ఆమె మరణం వల్ల నీకేం లభించింది? విజయం పొందావా, ఆమెని మానసికంగా చంపేసావు, ఆమె జీవితాన్ని ఇవ్వగలవా చెప్పు. ఓ రాక్షసుడి కన్నా ఘోరంగా ప్రవర్తించావు. ఓ నరకంలో తోసావు.
నేను వచ్చినప్పటి నుంచి, నేను, కావేరీ నిన్ను మోసం చేసానని, దగా చేసాం అని అంటూ వచ్చావు, ఏదో ప్రశ్నలంటూ, చెప్పిందే చెప్తున్నావు, పైగా వాటిని నీ మనసులోనే ఉంచుకుని, జవాబులు కావాలనంటున్నావు. జరిగిన దానిలో నీ తప్పులేం లేనట్లుగా మాట్లాడావు,
ఇన్ని ఏళ్ళల్లో ఏవో జరిగి పోయాయి అని అంటున్నావు కదా, ఆ జరిగిన దానిలో నీ పాత్ర ఏదైనా ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. జరిగినదేంటో ఒక్కసారైనా అడిగావా? లేదు. అన్నీ నీ మనసులోనే ఉంచుకుని మామీద కోపం పెంచుకున్నావు,
నువ్వేంటో నీకే తెలీదు, అసలు జరిగిన దేంటో నీకు తెలీదు. ఏదేదో ఊహించుకుని, గోరొంతల్ని కొండంతలు చేసుకున్నావు, ఓ సైకోలా మారిపోయావు, ఇవి నీకు తెలీడం లేదు.”
బ్రహ్మాజీ తెల్లబోయాడు. ఇదేంటీ శివరామ్ ఇలా మాట్లాడుతున్నాడు, నేరం తన మీద వేస్తున్నాడు, నోట మాట రాలేదు. సైకోలా మాట్లాడాడా తను. ఎలా ఒప్పుకుంటాడు శివరామ్ మాటలని.
“ఆమెని నేను చంపేసానా, నేనా, నిజానికి మీ ఇద్దరూ కలిసి నన్ను మానసికంగా చంపేసారు. ఆమె నీ స్నేహితుడి భార్య. నీ హృదయంలో నిలిచి పోయింది.” అని ఆగాడు.
శివరామ్ ఒక్కసారి రియాక్ట్ అయ్యాడు.
“మళ్ళీ అదే భాష వాడుతున్నావు. నిలిచి పోయింది నా హృదయంలోనా, నీ హృదయం లోనా, ఎవరి హృదయాల్లోనో, ఆ సంగతి నీకు బాగా తెలుసు.” వ్యంగ్యంగా అన్నాడు.
బ్రహ్మాజీ అవాక్కయ్యాడు. వెంటనే తనని తాను తమాయించుకున్నాడు. శివరామ్ మాటలు ఇంక వినదల్చుకోలేదు. సమయం ఎక్కువ లేదు. అడగాల్సినది అడగాలి అనుకున్నాడు.
“సమయం ఎక్కువ లేదు. నిన్ను అడగాల్సిన ప్రశ్న ఉంది.” అని తలుపు మీద చేయి వేస్తూ అన్నాడు బ్రహ్మాజీ.
“మనం ముగ్గురం తెలివైన వాళ్ళమే, మన అహంకారం మనకు ఏం ఇచ్చింది. ఏమైనా లాభించిందా. జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చిందా.”
“ఇది చాలా కష్టమైన ప్రశ్న. దీనికి జవాబు నేనివ్వలేను, ఎందుకంటే నా దృష్టిలో నీది అహంకారం.”
బ్రహ్మాజీ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు, తన ఎదురు చూపు వేస్టవలేదు. ఓ కష్టమైన ప్రశ్న అడిగాడు. జవాబు వెంటనే ఇవ్వలేక పోతున్నాడు.
“మా జమీందారి కుటుంబంలలో దాయాదుల మధ్య ఎన్నో దెబ్బలాటలు వచ్చాయి. మొహా మొహాలు చూసుకోలేని పరిస్థితి ఉన్నాం. అవి ఓ రకమైన యుద్ధాలు. అందులో కత్తులు, కటార్లు లేవు. ఆ యుద్ధాలకి కారణం అహంకారం, స్వార్థం, అందులో మా హోదా, మా పరువులు, మెరుపులు అన్నీ ఉన్నాయి. అందులో ఎవరూ లొంగే వారు కాదు. పైకి ఎవరూ తేలేవారు కాదు.
కాని ఇక్కడ జరుగుతునుది జరుగుతున్నది రెండు మనసుల యుద్ధం. ఇందులో నీ పిరికితనం చూసాను. నా మొండితనం కూడా ఉంది. వీటి మధ్యలో కావేరి మౌనం, చూసాం, మనుషుల్లో ఈ ఇష్టం, కోరిక, తృష్ణ, లోతుగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తోంది. ఇది ఎవరి గురించి అంటున్నానో నీకర్థం అయిందనుకుంటాను.
ఓ వ్యక్తిని కోరుకోడం తప్పు కాదు. అలా అనుకున్న ఆ వ్యక్తి చెడ్డవాడు కావచ్చు. మంచివాడు కాచ్చు. ఇది ముఖ్యం కాదు. ఆ వ్యక్తి మనసులో ఉన్న భావాల తీవ్రతని, ప్రవర్తనని పట్టించుకోదు. ఇది నిజం కాదా, దీనికి జవాబు ఇవ్వ గలిగితే ఇవ్వు.” అంటూ తలెత్తి శివరామ్‌ని చూసాడు.
వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఆరిపోడానికి సిద్దంగా ఉన్న కొవ్వొత్తులు అటూ ఇటూ ఊగిపోతున్నాయి. వారిద్దరి నీడలు కూడా నాట్యం చేస్తున్నాయి. ఇద్దరూ నిశ్శబ్ధంగా మెట్లు దిగడం మొదలెట్టారు.
“ఆఖరుగా అడుగుతున్నాను. జవాబు ఇవ్వవా?” అన్నాడు తలుపు మీద చేయి వేస్తూ.
“సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను, ఇన్ని గంటల నీమాటల్లో నాకు అర్థం అయింది ఒకటి, అది నీకు అనుమానాల దెయ్యం పట్టుకుంది, అది చాలా ప్రమాదకరం. ఎయిడ్స్ కన్నా భయంకరమైనది. ఆ అనుమానపు కళ్ళద్దాలు పెట్టుకుని మమ్మల్ని చూసావు. అందుకే నీకు వచ్చిన, ఉన్న అనుమానాలు, నీ సందేహాలు, నీ ప్రశ్నలు అన్నీ కూడా నీ కోణం లోంచి చూసినవే. నువ్వు ఈ విధంగా ఆలోచిస్తావని, దీని గురించి ఇన్నాళ్ళూ నీ మనసు పాడు చేసుకుంటావని అసలు అనుకోలేదు.
నువ్వు ఇలా అనగలవని అనుకోలేదు. ఆ వైపుగా నా దృష్టి వెళ్ళలేదు. నీ చదువు సంస్కారం అన్నీ ఏమయ్యాయి. అదంతా ఓ ముసుగేనా, ఆ ముసుగు వెనకాల మనిషివి నువ్వు. హిపొక్రెసీనా, నువ్వు పైకొకటి, లోపల ఒకటి అన్నమాట.
ఇందాకటి నుంచి నువ్వు చెప్పినది విన్నాను, వాటి గురించి ఆలోచిస్తూనే విన్నాను. అవి అన్నీనీకు విపరీతంగా అనిపించాయి. నేను మాత్రం, నిజానికి అదో పెద్ద విషయం అని అనుకోలేదు. నువ్వు ఓ భూతద్దంలోంచి చూసి సైకోలా అయిపోయావు. ఇప్పుడు గనక నేను చెప్పక పోతే నీ అనుమానాలు ఇంకా పెద్దగా అయి బ్రహ్మ రాక్షసిలా తయారయ్యి నిన్ను నీ మనసుని పీక్కు తింటాయి.
ఒంటరితనంలో ఉండిపోయానని అంటున్నావు. ఎవరుండమన్నారు, ఆ ఒంటరితనం నువ్వు కావాలని కోరుకున్నదే. ఎవరూ అక్కర్లేదని అనుకున్నావు. అందుకే ఒంటరి వాడివైయ్యావు.
ఆశ్చర్యం, ఇన్నేళ్ళయినా ప్రపంచం అంతా ముందుకెళ్తూంటే నువ్వు మాత్రం నలభైమూడేళ్ళ క్రితం నాటి అర్థం లేని సంఘటనలతో బతుకుతున్నావు. నీలో ఇవల్యూషన్ లేదు. ఓ మురికిగుంటలా అక్కడే ఉండిపోయి బతుకుతున్నావు.
నీకు కావలసినది, చూడాల్సింది ఓ సైకియాట్రిస్ట్. అతని సలహా. కాని అది నువ్వు చెయ్యలేదు.
నువ్వన్నట్లు మనిద్దరం జీవితానికి మలి దశలో ఉన్నాము. కనీసం ఈ మిగిలిన కొద్ది రోజులైనా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు.
అందుకని జరిగినది నీకు క్లియర్ అయ్యేలా చెప్తాను, ఈ వయసులో నువ్వు అనుకుంటున్న అనుమానపు చీకట్లో నిన్ను ఉంచను. నేను ఇన్నాళ్ళు దీనికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయని అనుకోలేదు. అందుకే జవాబులు తయారుగా ఉంచుకోలేదు. కాని ఇప్పుడు నీ అనుమానాలని నువ్వు చెప్పాకా చెప్పక తప్పదని, చెప్తున్నాను,” అంటూ తల పైకెత్తి బ్రహ్మాజీని చూసాడు.
చెప్పు అన్నట్టుగా చూసాడు బ్రహ్మాజీ.
“నేను వెళ్ళిపోయాకా మీరిద్దరూ బాగా ఉన్నారని, ఆ పెయింటింగ్, ఆమె తను రాసినవి, చేయించినవి నీకు ఇచ్చిందని అనుకున్నాను. కాని నేను వెళ్ళాకా, మీరిద్దరూ విడి, విడిగా ఉన్నారని నువ్వు ఇప్పుడు అంటేనే తెలిసింది. నిన్ను గాఢంగా ప్రేమించిన మనిషికి మంచి బహుమానాన్నే ఇచ్చావు, దీనికి నిన్ను ఆ దేవుడు క్షమించడు.
సరే నీ మొదటి ప్రశ్నకి జవాబు, నేను నిన్ను చంపాలని అనుకున్నానని నీ ఆరోపణ కదా, జవాబు ఇదిగో,
ఆ రోజు బుధవారం అన్న విషయం కూడా నాకు గుర్తు లేదు. ఇప్పుడు నువ్వు అంటూంటే అంటున్నాను. ఆ బుధవారం రోజున నీ వెనకాల రెండు చిరుతల్లాంటి అడివి పిల్లులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. నీమీదకి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఎంత భయంకరమైనవో మనందరికి తెలుసు. అవి ఎక్కువగా ఈ గోల్కొండ ప్రాంతంలో ఉంటాయన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. నాకు గురి చూడడం రాదు, ఆ సంగతి నీకు బాగా తెలుసు.
నువ్వనుకున్నట్లుగా నేను జింకని చూడలేదు. అది సరిగ్గా నీకు ఎదురుగా ఉందని కూడా నేను చూసుకోలేదు. తెలీదు కూడా. నా దృష్టి అంతా ఆ అడివి పిల్లుల మాదే ఉంది. వాటిని భయపెట్టడం కోసమే గన్ తీసాను.
నాకు గురి చూడడం రాదన్న సంగతి నీకు తెలుసు. ఆ సమయాన కూడా అంతే ఏదో భయపెట్టాలని తీసాను. అంతే. అంతలో చిరుగాలి కదలికకి, ఆకులు గలగలలాడాయి, ఆ అడివి పిల్లులు పరిగెత్తాయి. ఆ శబ్దాలకి జింక కూడా పరిగెత్తింది.
ఇది జరగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏమీ జరగని దాని గురించి నీకేం చెప్తాను. అసలు ఆ సంగతి నేను అప్పుడే మర్చిపోయాను. దానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. నేను నిన్ను చంపాలని అనుకున్నానన్నది నువ్వు నామీద వేసిన నేరం. అసలు ఆ ఊహ నీకెలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.
రెండో ప్రశ్న.
అది కూడా చెప్తాను. కావేరి గర్భవతి అని ఇప్పుడు నవ్వు చెప్పే వరకూ నాకు తెలీదు.
ఓ రోజున మీ ఇంట్లో భోజనాలయ్యాక నాతో అంది. ఓ పెయింటింగ్ వేయించాలని, ఎవరైనా తెలిసిన పెయింటర్ ఉంటే చెప్పమంది. సిటీలో ఆమెకి ఒక భవంతిని నువ్వు ఒకటి కొని బహుమతిగా ఇచ్చావు. అది నా ఇంటికి దగ్గరలోనే ఉందన్న సంగతి నీకు తెలుసో లేదో నాకు తెలీదు. నేను వేరే వెళ్ళి పోదామన్న సంగతి నీకు ప్రత్యేకంగా చెప్పలేదు. నువ్వు వద్దంటావు. నీకు పెళ్ళి కాకముందు పరవాలేదు కాని, పెళ్ళయ్యాక ఉండడం బాగుండదని నాకే అనిపించింది. అందుకే నేను చెప్పలేదు.
కావేరి నాతో పెయింటర్ల గురించి కనుక్కోమంది. ఆ విషయం నీకు తెలీకూడదని కూడా చెప్పింది. అందుకోసం మా ఇంటికి వస్తూండేది. అంతే.
(సశేషం)