[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]”అ[/dropcap]దేంట్రా.. నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటావు!” ఆశ్చర్యపోయాడు బ్రహ్మం.
సూర్యానికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. “లేదన్నా.. సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉందన్నా.. ఎంసెట్‌కి ఇంకా నెల రోజులే ఉంది.. ఇప్పుడు సరిగ్గా చదవకపోతే నా పని ఔట్! నేనూ రాఘవ కంబైండ్ స్టడీ చేస్తాము.. అందుకే వెళ్దామనుకుంటున్నాను.” అన్నాడు.
బ్రహ్మం కాసేపు ఆలోచించి “సరేరా.. నీ ఇష్టం.. నీకు ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్ళు.. కానీ బాగా చదువుకో” అని చెప్పాడు. రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు సూర్యం. బ్రహ్మం ఏదైనా కిరికిరి చేస్తాడేమో అనుకున్నాడు కానీ ఇంత స్మూత్‌గా వదిలేస్తాడనుకోలేదు. అంతా భగవంతుని దయ!
ఆ తర్వాత ఆదివారం రాఘవ వచ్చి సూర్యాన్ని పికప్ చేసుకున్నాడు. పుస్తకాలు.. బట్టలు సర్దుకుని అందరికీ బై చెప్పి రాఘవ బండెక్కి వచ్చేసాడు సూర్యం. ఊరి నుండి వైజాగ్ వచ్చి రెండు నెలలు అయింది. ఈ రెండు నెలల్లో రెండు రూములు మారాడు. ఏది చేసినా తన లక్ష్యం చేరుకోవడానికే కదా అని సర్దిచెప్పుకున్నాడు.
రాఘవ తండ్రి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. కోచింగ్ సెంటర్‌కి దగ్గర్లోనే వాళ్ళ ఇల్లు. సూర్యం ఆ ఇంటిని పరిశీలనగా చూడసాగాడు. చాలా పెద్ద ఇల్లు. రాఘవకు విడిగా ఒక రూము. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి వీలుగా ఉంది. సూర్యాన్ని తన తల్లిదండ్రులకి పరిచయం చేసాడు రాఘవ. సూర్యాన్ని చూసి చాలా సంబరపడ్డారు వాళ్ళు.
సూర్యంతో “ఎటువంటి మొహమాటాలు పెట్టుకోకు బాబూ.. నీ సొంత ఇల్లు లాగే అనుకో… బాగా చదువుకోండి” అని చెప్పారు. ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు సూర్యం. భగవంతుడు ఇన్ని విధాలుగా తనకి సహాయం చేస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే దాన్ని మించిన తప్పు ఇంకొకటి ఉండదు అని నిర్ణయించుకున్నాడు. కళ్ళు మూసినా.. తెరిచినా.. నిద్రపోతున్నా.. మెలకువలో ఉన్నా.. ఒకటే ధ్యేయం! వేరే ధ్యాస లేదు. అన్నీ మర్చిపోయి గమ్యం మీదే దృష్టి నిలిపాడు. రాఘవ కూడా తక్కువ తినలేదు. సూర్యంతో సమానంగా చదవసాగాడు. అనుకున్న టైము రానే వచ్చింది… ఎంసెట్‌కి ఇంకో రోజు ఉంది. కోచింగ్ సెంటర్ వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసేసారు. ఫ్రెండ్స్ అందరూ ‘ఆల్ ద బెస్ట్’ చెప్పుకుని విడిపోయారు. సూర్యం, రాఘవ ఆ సాయంత్రం రాఘవేంద్ర స్వామి టెంపుల్‌కి వెళ్ళారు. మనస్పూర్తిగా నమస్కరించుకున్నాడు సూర్యం. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లారగానే లేచి రడీ అయ్యాడు. అతని సెంటర్ ఆంధ్రా యూనివర్సిటీలో. రాఘవ అతన్ని బండి మీద దింపి ‘సూర్యం.. ఆల్ ద బెస్ట్ రా’ అని కౌగలించుకున్నాడు.
‘మిత్రమా.. నీక్కూడా ఆల్ ద బెస్ట్’ అన్నాడు సూర్యం. ‘థాంక్యూ బ్రో’ అని తన సెంటర్‌కి వెళ్ళిపోయాడు రాఘవ. ఎగ్జాం వ్రాయడానికి వచ్చిన విద్యార్థులని చూసి గుండె జారిపోయింది సూర్యానికి. ఇసక వేస్తే రాలనంత మంది జనం. కాంపిటీషన్ ఇంత ఉంటుందని తెలీదు సూర్యానికి. దేవుడి మీద భారం వేసి గుండె చిక్కబట్టుకున్నాడు. ఎగ్జాం హాల్లోకి ప్రవేశించి ధైర్యంగా వ్రాయసాగాడు. ‘టైము ఓవర్’ అన్న ఇన్విజిలేటర్ మాటలు వినబడి తలెత్తి చూసాడు. టైము చాలా తొందరగా గడిచినట్టు అనిపించింది. ఒక్క సారి మళ్ళీ పేపర్ చెక్ చేసుకున్నాడు. సంతృప్తిగా అనిపించింది. పేపర్ ఇచ్చేసి బయటకొచ్చి వెయిట్ చెయ్యసాగాడు. కాసేపట్లో వచ్చాడు రాఘవ.
“ఎలా రాసావు సూర్యం..” ఎగ్జైటింగ్‌గా అడిగాడు.
“బాగా వ్రాసాను రాఘవ..” ఆనందంగా చెప్పాడు సూర్యం.
“నేను కూడా బాగానే వ్రాసాను.. పద” అన్నాడు రాఘవ.
ఒక యుద్ధం ముగిసింది అన్న భావన కలిగింది సూర్యానికి. ఎందుకో ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. రాఘవని కౌగలించుకున్నాడు.
“ఊరుకోరా.. ఊరుకో..” అని దగ్గరకు తీసుకున్నాడు రాఘవ. ఇద్దరూ ఇంటికొచ్చేసారు. రాఘవ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. తర్వాత రెండు రోజులు వాళ్ళింట్లోనే ఉండి.. వీడ్కోలు తీసుకుని తమ ఊరు ప్రయాణమయ్యాడు. వచ్చేస్తున్నపుడు – రాఘవ తల్లిదండ్రులకి నమస్కరించి “మీ ఋణం నేను తీర్చుకోలేను… ఆ దేవుడే నాకు మిమ్మల్ని చూపించాడు” అని చెప్పి వచ్చేసాడు.
***
“పార్వతీ.. నీ సుపుత్రుడు వచ్చాడు చూడు” అదోలా అన్నాడు శంకరం ఇంటికి వచ్చిన సూర్యాన్ని చూసి “ఎలా రాసావు నీ ఎంసెట్.. రేంక్ వస్తుందా?”
“బాగానే వ్రాసాను నాన్నా.. మంచి రేంక్ వస్తుంది”.
“చూద్దాం.. రేంక్ రాకపోతే మాత్రం నేను చెప్పినట్టు జాబ్ చూసుకుని మాకు చేదోడు వాదోడుగా ఉండాలి” అని ఆర్డరేసాడు.
“అలాగే నాన్నా..” అని చెప్పి లగేజ్ లోన పెట్టాడు సూర్యం. కూర్చుని నిశ్శబ్దంగా రోదించసాగాడు. మూడు నెలలు బయట ఉన్న తనని ‘ఒక్కడివీ ఎలా నెట్టుకొచ్చావురా’ అని అడక్కుండా సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. ఎప్పుడు మారుతాడు? అంతే… తండ్రి మారుతాడు అనుకోవడం అత్యాశే… చిన్నగా నిట్టూర్చాడు. పార్వతమ్మ వచ్చి “ఎలా వున్నావు నాయనా.. మీ నాన్న మాటలు పట్టించుకోకు.. ఆయన అంతే అదో రకం. పోనీలే నువ్వు కోరుకున్నట్టు పరీక్ష వ్రాసావు. ఇక ఆ సింహాద్రి అప్పన్న దయ.” అని వంట గదిలోకి వెళ్ళిపోయింది.
చెల్లెల్లిద్దరూ చుట్టు ముట్టేసి “ఎలా ఉంది అన్నయ్యా వైజాగ్! చాలా బాగుంటుందట కదా… మా కోసం ఏం తెచ్చావు?” అని ప్రేమగా అడుగుతున్నారు.
“ఏం తెస్తానమ్మా.. చదువుకోవడంతోనే సరిపోయింది” అంటూ “…ఈ సారి మళ్ళీ వెళ్తే మీకు మంచి డ్రెస్సులు తెస్తాను..సరేనా” అన్నాడు.
“అలాగే అన్నాయ్యా..” అంటూ తుర్రున వెళ్ళిపోయారు.
శంకరం ప్రతీ రోజూ ఇంటికి రాగానే పెళ్ళాన్ని పిలిచి తన మిత్ర బృందం బుర్రలో ఎక్కించిన జ్ఞానాన్ని కక్కుతుండేవాడు.
“పార్వతీ.. ఇంజనీరింగ్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుందట.. గవర్నమెంట్ కాలేజ్‌లో సీటు వస్తే కొంచెం పర్వాలేదు కానీ ప్రైవేట్ కాలేజ్ అయితే మనం తట్టుకోలేమంట..” అని చెబుతున్నాడు. వింటున్న సూర్యానికి మనసు చివుక్కుమంది.
“అదేంటండీ సీటు వస్తే ఏదో రకంగా చదివిద్దాం.. వాడి భవిష్యత్తుని పాడుచెయ్యలేము కదా” అంది.
“చదివిద్దాం.. తప్పకుండా చదివిద్దాం.. దానికేం.. మీ నాన్న కట్నంగా ఇచ్చిన లక్షల ఆస్తి మూలుగుతుంది కదా.. అలాగే చదివిద్దాం” అంటున్నాడు. పార్వతమ్మ చిన్నబుచ్చుకుంది.
సూర్యం తండ్రి దగ్గరకు వెళ్ళి “నాన్నా.. ఎన్నో కష్టాలు పడి ఎంసెట్ వ్రాసాను. రేంక్ వచ్చి సీటు వస్తే మాత్రం నన్ను చదివించు.. నీకు దండం పెడతాను” అని వేడుకున్నాడు
“రేంక్ రానీ.. చూద్దాం” కేర్లెస్‌గా అన్నాడు శంకరం. మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఫీల్ అయ్యాడు సూర్యం. కానీ ఏం చెయ్యగలడు? తండ్రి మీద ఆర్థికంగా ఆధారపడినవాడు… వయసులో చిన్నవాడు… అందుకే మౌనంగా బాధపడసాగాడు.
ఒక రోజు.. సూర్యాన్ని కలవడానికి వైజాగ్ నుండి రాఘవ వచ్చాడు. అతన్ని చూడగానే సంబరపడిపోయాడు సూర్యం.
“ఏరా సూర్యం.. మర్చిపోయావా.. కనీసం ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా” అని ప్రేమగా తిట్టాడు రాఘవ.
“నిన్ను మర్చిపోతే.. నన్ను నేను మర్చిపోయినట్టే.. అంత మాట అనకు..” నొచ్చుకున్నాడు సూర్యం
“ఊరికే సరదాకు అన్నాను రా.. నీ మనసు నాకు తెలీదా” నవ్వేసాడు రాఘవ.
సూర్యం తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళి “అమ్మా.. నా ఫ్రెండ్ రాఘవ.. నేను చెబుతుంటానే.. వాడే… వైజాగ్ నుండి వచ్చాడు. నాకు దేవుడితో సమానం” అని పరిచయం చేసాడు
“నమస్కారం అమ్మా” అన్నాడు రాఘవ
“నమస్తే బాబూ..” అని “నీ గురించి మా అబ్బాయి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అని దీవించి “కాసేపాగండి… వంట పూర్తవుతుంది” అంది. వంట అయ్యాక ఇద్దరికీ వడ్డించింది. తృప్తిగా తిన్నాడు రాఘవ. తర్వాత రాఘవకు ఊరంత తిప్పి చూపించాడు సూర్యం.
“బావుంది రా మీ ఊరు” అని మెచ్చుకున్నాడు రాఘవ. “ఇక నేను బయలు దేరుతాను రా” అన్నాడు.
“సరే వెళుదువు గాని.. మా నాన్నను కూడా పరిచయం చేస్తాను.. ఉండు” అన్నాడు సూర్యం.
కాసేపటికి శంకరం వచ్చాడు. ఆయనను చూడగానే “నమస్కారమండీ..” అని చేతులు జోడించాడు రాఘవ
“ఎవరు నువ్వు” అన్నట్టు చూసాడు శంకరం.
సూర్యం “నా ఫ్రెండ్ రాఘవ నాన్నా.. వైజాగ్ నుండి నన్ను కలవడానికి వచ్చాడు” అని చెప్పాడు.
“ఓహో… నువ్వు కూడా ఎంసెట్ వ్రాసావా”
“వ్రాసానండీ…”
“రేంక్ వస్తుందా”
“వస్తుందనే అనుకుంటున్నాను” చెప్పాడు రాఘవ
“మరింకేం.. ఇద్దరికీ జోడీ బాగా కుదిరింది.. మీ నాన్నగారేం చేస్తుంటారు?”
“స్టీల్ ప్లేంట్‌లో జాబ్ చేస్తుంటారండీ..”
“అదీ సంగతి… మీకు డబ్బుంది.. ఏమైనా చదవచ్చు.. మా లాంటి వాళ్ళకి ఈ గొప్ప చదువులు అవసరమా” అన్నాడు
పరిస్థితి అర్థమైంది రాఘవకు. సూర్యానికి ఉన్న మొదటి ఆటంకం అతని తండ్రే అని అర్థమైంది. చెప్పాలి.. అతని తండ్రికున్న అపోహలన్నీ తొలగిపోయేలా చెప్పాలి అనుకున్నాడు.
“చూడండి సార్.. నేను మీకంటే చాలా చిన్నవాడిని. కానీ నాకున్న పరిజ్ఞానంతో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి వినండి. సూర్యం మీరు అనుకునేట్టు అమాయకుడు.. పనికిరానివాడు కాదు. చాలా తెలివైనవాడు. చెప్పాలంటే మట్టిలో మాణిక్యం లాంటి వాడు. మా లాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవదగ్గవాడు. కేవలం ఈ పల్లెటూరిలో మీ కడుపున పుట్టినందుకు అతన్ని తక్కువ అంచనా వెయ్యకండి. అతని ఎదుగుదలకు అడ్డుగోడగా నిలవకండి. భూమిలో నిక్షిప్తమైన విత్తనం అన్ని అడ్డంకులను చీల్చుకుని మొలకెత్తి మొక్కలా బయటకు వస్తుంది. సగర్వంగా ఈ లోకం ముందు నిలబడుతుంది. సూర్యం కూడా అలాంటి వాడే. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈనాడు పరుగుపెడుతున్నాడు.. పోరాడుతున్నాడు. ప్రత్యక్షంగా చూసిన నేను చెబుతున్నాను. అతన్ని పోరాడనివ్వండి. కొంచెం సహకారం మీ వైపు నుండి ఇవ్వండి. అది చాలు.. దూసుకుపోతాడు. అతను మీ కొడుకుగా పుట్టడం మీ అదృష్టం.. అంతే” అని ముగించాడు.
శంకరం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. బహుశా ఆలోచనలో పడ్డట్టు ఉన్నాడు. పార్వతమ్మ మనసులో సంతోషించసాగింది – ‘ఇన్నాళ్ళకు తన భర్త నోరు ముయ్యించేవాడు ఒకడు తగిలాడ’ని.
“ఇక వెళ్ళొస్తాను” అని చెప్పి నిష్క్రమించాడు రాఘవ. అతన్ని సాగనంపడానికి వెనకనే అనుసరించాడు సూర్యం.
(సశేషం)