కనుపించని నాలుగో ‘సింహం’

2
4

[box type=’note’ fontsize=’16’] స్వతంత్ర భారత్ 74 వసంతాలు పూర్తి చేసుకొని, అమృతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం అందిస్తున్నారు జి. వల్లీశ్వర్. [/box]

[dropcap]భా[/dropcap]రత ప్రభుత్వ చిహ్నం అశోక స్తంభంపై నాలుగు సింహాలుంటాయి. కాని ఎటునుంచి చూసినా మూడు సింహాలే కనిపిస్తాయి. భారతదేశ స్వాతంత్ర్యోద్యమానిక్కూడా నాలుగు ముఖాలు వుంటాయి. కాని మూడే కనిపిస్తాయి. అవి – ఉద్యమం నడిపించిన నాయకులు, కళలు, కవితల రూపాల్లో ఉద్యమకారులకి ఉత్తేజం ఇచ్చిన కళా సాహితీ వేత్తలు, వీథుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసిన కార్యకర్తలు.

మన జాతీయ చిహ్నంలో నాలుగో సింహంలా ఆ ఉద్యమంలో కనిపించని నాలుగో ముఖం (లక్ష్మీనరసమ్మ) కథ ఇది – ఆమె మాటల్లోనే.

~ ~

నాకు 14 ఏళ్ళ వయసులో 1924లో – నేను ఏలూరుకి కాపురానికి వచ్చాను. నా కన్నా 12-13 ఏళ్ళ పెద్దవారయిన నా భర్త (గుండు వేంకట కృష్ణమూర్తి) ఆ ఊళ్ళో పేరు మోసిన లాయరు దగ్గర గుమాస్తాగా పని చేస్తూ, కాంగ్రెసు ఉద్యమంలో ఒక కార్యకర్తగా తిరుగుతూ వుండేవారు.

మాది మధ్యతరగతి కుటుంబం. అత్తగారికి చూపుపోయింది. అత్తమామలకి నా భర్త ఒక్కరే కొడుకు. కూతురు కుటుంబం దూరంగా వుండేది. ఇలాంటి కుటుంబంలోకి నేను కాపురానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇంటి పనిభారం నా మీద పడింది. ప్రతిరోజూ పేడతో అలకాల్సిన వంటిల్లు, ఆచారవ్యవహారాల కారణంగా నేను మాత్రమే చేసి తీరాల్సిన పనులూ, అత్తగారి ఆలనా పాలనా, కట్టెలపొయ్యి మీద వంటలు, ఆవు పేడతో పిడకలు, అతిథులకి మర్యాదలు… క్రమంగా అలవాటుపడి, నేను పూర్తిగా ‘ఇదే నా కుటుంబం’ అని స్థిరపడిపోయాను.

కొంతకాలం తరువాత అకస్మాత్తుగా ఒకరోజు ఎవరో వచ్చి మా మామగారితో చెబుతున్నారు, “గడియార స్తంభం దగ్గర పోలీసులు లాఠీఛార్జి చేశారు. మీ అబ్బాయికి తల పగిలి రక్తం కారిపోతోంది”. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఒంట్లో దడ పుట్టింది. నా భర్తకి లాఠీఛార్జి చేశారంటే తట్టుకునే వయసు కాదు. మా మామగారు నన్ను ‘కంగారు పడొద్దు’ అంటూ వెళ్ళి, కొడుకుని తీసుకొచ్చారు. అల్లోపతి డాక్టరొచ్చి చికిత్స చేశారు. ఆయన మళ్ళీ తిరిగి కోలుకునేదాకా నేను ఆయన్ని ఒక పసిపిల్లాణ్ణి చూసినట్లు చూసుకోవాల్సి వచ్చింది. నిజానికి నా పెళ్ళికి ముందు నుంచీ – 1921 నుంచీ గాంధీజీ పిలుపుతో ఉద్యమంలో తిరుగుతూ వున్న తొలితరం స్వాతంత్రోద్యమ కార్యకర్త ఆయన.

* * *

ఇంకో రోజు మా వారూ, కొటికలపూడి ఆంజనేయులు అనే మరో కార్యకర్తా, ఇంకో ఇద్దరూ కలిసి ‘సైమన్ గో బ్యాక్’ అని అరుచుకుంటూ ఏలూరు పెద్దబజార్లో ఊరేగింపుగా వెళ్ళారు. పోలీసుల లాఠీలు కర్కశంగా వాళ్ళ మీద విరుచుకుపడ్డాయి. పోలీస్ స్టేషనులో నిర్బంధించారు. ఇది తెలిసి, నేను మళ్ళీ విలవిల్లాడిపోయాను. కన్నీళ్ళు కార్చటం తప్ప ఏమీ చేయలేను. మా మామగారు వెళ్ళారు. ఆయన ఊళ్ళో కులపెద్ద కావటం వల్ల పోలీసులు గౌరవించి, “మీ అబ్బాయని తెలీదు, తీసుకెళ్ళండి” అన్నారు.

అయితే మా వారు మాత్రం, “నన్ను నమ్ముకొని ఈ ముగ్గురూ వచ్చారు. వీళ్ళని వదిలి నేను రాను” అని ఖండితంగా చెప్పారట. మా మామగారు తిరిగొచ్చి “ఇదమ్మా మీ ఆయన నిర్వాకం” అని చెబితే దుఃఖం పొంగుకొచ్చింది.

అయినా నాకు తెలీకుండా మనసులో ఎక్కడో ఆయన పట్ల గౌరవం పెరిగింది… ఇదంతా 1920 దశకంలో జరిగింది. అప్పటికింకా స్వాతంత్రోద్యమం గ్రామాల్లో విస్తృతం కాలేదు.

నేను కాపురానికి వచ్చిన కొత్తలోనే “గాంధీగారు చెప్పారు – ఖద్దరు వాడాలని. ఇకనుంచీ నువ్వు ఖద్దరు చీరలే వాడాలి. మిల్లుబట్టలు వాడకూడదు” అని ఆయన నాకు చెప్పారు. అప్పటికే ఆయన ఖద్దరు వస్త్రధారణ గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఆయన విశ్వాసాన్ని గౌరవించటం తప్ప మరో ఆలోచన లేదు నాకు. ఆయన స్వయంగా రాట్నం మీద నూలు వడికేవారు. ఆ నూలు తీసుకెళ్ళి ఇచ్చి, ఖద్దరు బట్టలు తెచ్చుకునేవారు. రాట్నం ఎలా వడకాలో నాకు నేర్పారు. ఆయనతోపాటు రాట్నం వడుకుతుంటే తెలియని ఆనందం పొందేదాన్ని.

ఒక రోజు వంటంతా అయింది. మా మామగారు పూజ ముగించుకున్నారు. భోజనాలకి కూర్చోబోతున్నాం. మావారు రావాలని ఎదురు చూస్తున్నాను. అంతలో వచ్చిన కబురు – ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా తయారు చేసిన ఉప్పు తీసుకెళ్ళి అమ్ముతున్నారని వారిని పోలీసులు నిర్బంధించారు. రెండు రోజులు ఆయన కనబడలేదు. నాకు తిండి సయించలేదు, నిద్రపట్టలేదు.

మరోసారి రాత్రికి ఇంటికి రావలసిన సమయానికి ఆయన రాలేదు. ‘ఉద్యమం పనిలో తిరుగుతున్నాను. ఈ రాత్రికి రావటం లేదు’ అని కబురుచేశారు…!

బెంగ, భయం! ఈ రాత్రి గడుస్తుందా, ఆయన రేపు ఉదయం తిరిగివస్తారా?… అలా ఆందోళన పడటం మామూలైపోయింది.

ఆయన తరుచూ పోలీసు లాఠీదెబ్బలు తినిరావటం, నేను ఆయనకి కాపడం పెట్టడం, పసర్లు రాయడం అలవాటైపోయింది.

లోథి కమిటీ బహిష్కరణోద్యమంలో పాల్గొని, ఒక బృందానికి నాయకత్వం వహించినపుడు తగిలిన లాఠీ దెబ్బలకే ఆయన చనిపోయి ఉండేవారు. ఒళ్ళంతా రక్తమే. ఆ రోజు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. అప్పుడు ఆయన బతుకుతారని అనుకోలేదు.

* * *

నాకు చిన్నప్పుడే అమ్మా, నాన్న చనిపోవటం వల్ల గుంటూరు జిల్లా నూతక్కిలో మేనమామ దగ్గర పెరిగాను. ఆయనే పెళ్ళి చేశారు. అదే నాకు పుట్టిల్లు. ఒకసారి పురిటికి వచ్చి నూతక్కిలో వున్నాను. కాన్పు జరిగాక కొన్ని రోజులకి మా మామగారి దగ్గర్నుంచి పోస్టుకార్డు వచ్చింది. “కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. జైలుశిక్ష పడింది. సబ్ జైలులో వున్నాడు. మరో వారం రోజుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు” అని ఆ పోస్టుకార్డు సారాంశం.

నాకు వారిని చూడాలని ఆరాటం. మా మేనమామ మనిషిని సాయం ఇచ్చి ఏలూరుకి పంపారు. పసికందుని భుజాన వేసుకుని వెళ్ళి, మా వారిని రైల్వే స్టేషన్లో పోలీసులు రైలెక్కిస్తున్నప్పుడు చూశాను. ఇద్దరిద్దరు కార్యకర్తలకి కలిపి సంకెళ్ళు వేసివున్నాయి. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

వారి దగ్గరకెళ్ళి, “నేను ఎక్కడ వుండను?” అని అడిగాను. “నీకు ఎక్కడ వుండాలనిపిస్తే అక్కడ వుండు. ఏడవకు, ఇది పవిత్రమైన ఉద్యమం. దేశానికి సంకెళ్ళు పోవడం కోసం ఈ సంకెళ్ళు వేయించుకున్నాం. నాలాంటి వాళ్ళు లక్షల్లో వున్నారు” అని ముక్తసరిగా అన్నారు. ఆ మాటలు అప్పుడు నా ఏడుపుని ఆపలేకపోయాయి. అవే ఇప్పుడు గుర్తుకొస్తే గర్వంగా అనిపిస్తుంది.

ఆయన జైల్లో వున్నప్పుడే నా రెండో కాన్పులో పుట్టిన పసిపిల్ల కొన్ని నెలలు జీవించి చనిపోయింది. ఆయన ఉద్యమంలో ఉధృతంగా తిరగటంతో ఎప్పుడు అరెస్టు అవుతారో, ఎప్పుడు లాఠీదెబ్బలు పడతాయో, ఎప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తారో, ఎప్పుడు జైలుకెళ్తారో తెలీకుండా తిరిగిన కాలంలో మాకు ఇద్దరాడ పిల్లలూ, ఇద్దరు మగపిల్లలు పుట్టారు. పుట్టి, కొన్ని మాసాలో, ఒకటి రెండేళ్ళో పెరిగి చనిపోయారు. నలుగురు పిల్లలు చనిపోయారన్న బాధ వెంటాడుతుండేది. అయినా ఆయన దేశం కోసం ఉద్యమంలో తిరుగుతున్నారన్న భావన తెలీని గర్వాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. మొదట పుట్టిన పిల్లకి ఆయన ప్రేమగా పెట్టుకున్న పేరు ‘వీరభారతి’.

* * *

ఒకసారి జిల్లా నాయకులు అల్లోపతి డాక్టరు జోగయ్యగారొచ్చి “పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, నువ్వు ఇక నుంచీ గ్రామాల్లో ఉద్యమ వ్యాప్తి కోసం, ప్రజల్ని ఉత్తేజపరిచే సాహిత్యాన్ని, పత్రికల్నీ, కరపత్రాల్నీ పంపిణీ చేయించాలి. నీ ఇల్లే ఈ సాహిత్య పంపిణీ కేంద్రం” అని మా వారికి చెప్పారు. క్రమంగా మా ఇంటిమీద పోలీసు నిఘా పెరిగింది. అప్పట్నుంచీ మా ఇంటికి తాటాకు బుట్టల్లో కూరలు వచ్చేవి. ఆ కూరలకి అడుగున ఈ సాహిత్యం వుండేవి. ఊళ్ళో గరికపాటి మల్లావధాని అనే మరో కార్యకర్తా, మా వారూ కలిసి ‘ఢంకా’ అనే ఉద్యమ వార్తా పత్రికను రహస్యంగా నడిపేవారు. మా ఇంటికొచ్చిన సాహిత్యాన్ని పంపిణీ అయ్యే దాకా దాచిపెట్టడం నా విధి.

మొదటిసారి చూసుకోకుండా కూరలబుట్ట మీద చెంబుతో నీళ్ళు పోశాను. కాని తరువాత చూస్తే ఆ కూరల క్రింద ఈ పత్రికల కట్ట వుంది. తడిసిపోయింది. బాధతో వణికిపోయాను. ఏడుపొచ్చింది. ఆయన సముదాయించారు. “మళ్ళీ జరక్కుండా చూసుకో” అన్నారు. పోలీసులు చాలాసార్లు మా ఇల్లు సోదా చేశారు. పోలీసుల కళ్ళపడకుండా పత్రికల్ని నేను తాటాకు దడిలో దాచిపెట్టాలసి వచ్చేది.

ఉద్యమం ఊపందుకున్న కొద్దీ మా ఇంటికి కార్యకర్తల రాకపోకలు పెరిగాయి. చూపు కనబడని అత్తగార్ని, ఊళ్ళో పెద్దరికం వల్ల ఎక్కువ సమయం బయట తిరిగే మామగారి అవసరాల్ని చూసుకోవడం, పాడి చూసుకోవటం, కార్యకర్తలకి అతిథి మర్యాదలు, ఖాళీ దొరికితే రాట్నం వడకటం, ఆయన లాఠీదెబ్బలు తినివస్తే కాపడం పెట్టడం… ఈ పనులన్నీ నాకు నలుగురు పిల్లలు పుట్టిపోయారన్న విచారాన్ని మరుగుపరుస్తూండేవి. ఇర్విన్ ఒప్పందం రద్దయిన కొద్ది మాసాల్లోనే మా వారిని ఎమర్జెన్సీ ప్రెస్ ఆక్టు క్రింద అరెస్టు చేసి జైలుకి పంపారు. అప్పుడే నేను నూతక్కి నుంచి పసిపిల్లతో వచ్చి వారిని స్టేషన్లో చూడటం.

* * *

రాజమండ్రి జైల్లో చాలామంది సాధారణ కార్యకర్తల్లాగే మా వారిని ‘సి’ క్లాసులో వేశారు. ముక్క పురుగుల్తో మురిగిపోయిన ఉప్పుడు బియ్యపు అన్నం, రాళ్ళూ, మేకులూ కలిపి వండిన సాంబారూ భోజనం తినలేక ఆయన ఉపవాసం వుండేవారని చూసొచ్చినవాళ్ళు చెబితే నాకు ఇంట్లో అన్నం సయించేది కాదు.

ఆయన్ని గురించి దేవుడికి ప్రార్థనలు చేసేదాన్ని. తిండిలేక శుష్కించిపోయారనీ, ఆరోగ్యం చెడిపోయిందనీ ఆయన్ని జైలు నుంచి ఆస్పత్రికి తరలించారట. అక్కడ పాలు, రొట్టె ఇస్తారు. కాని అక్కడ “సి-క్లాసు ఖైదీలందరికీ పాలు రొట్టె ఇమ్మని” ఆయన గొడవపడేవారు.. ఆయన జైలునుంచి తిరిగొచ్చాక మనిషి బాగా కృశించిపోయి ఉన్నారు. అయినా, ఆయనలో పట్టుదల ఏ మాత్రం సడలలేదు. ఈసారి నాకు దుఃఖం రాలేదు. గర్వంగా అనిపించేది. చావో, బ్రతుకో ఆయనతో పాటే దేశం కోసం జీవిస్తున్నానన్న ఆనందం నాకు చాలా శక్తినిచ్చేది.

గాంధీగారు మా వూరికి రెండుసార్లు వచ్చారు. ఒకసారి ఆయన దిగిన స్కూలుకి నేను కూడా వెళ్ళాను. కొల్లాయి కట్టుకున్న గాంధీ గార్ని చూసి అంతా శిరసు వంచి నమస్కారం చేశారు. అప్పట్నుంచే ఆ స్కూలుకి ‘గాంధీ స్కూలు’ అని పేరు… 1948లో గాంధీగారి మరణవార్త విన్నాక నాకు రెండు రోజులపాటు అన్నం సయించలేదు. మా వారైతే చాలా రోజుల పాటు మౌనవత్రంలో మునిగిపోయారు. 1974లో అనుకుంటా – వారిని భారత ప్రభుత్వం తామ్రపత్రంతో గౌరవించింది. అనేక ఆర్థిక బాధలు అనుభవించి, 83 ఏళ్ళ వయసులో 1981లో ఆయన కాలం చేశారు. అప్పటికి ఆయన నాకు వదిలిన ఆస్తి- నలుగురు కొడుకులు, పాత పెంకుటిల్లు, నెలవారీగా వచ్చే స్వాతంత్ర్య సమరయోధుల పింఛను రూ. 200.

* * *

నాలాంటి ఇల్లాళ్ళు లక్షల్లో వుంటారు. (కొంతమంది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు) వాళ్ళల్లో 90 శాతం పైగా ఇవ్వాళ బ్రతికిలేరు. వాళ్ళల్లో చాలామంది నా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. ఎక్కువమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబాల్లో బరువు, బాధ్యతలు చాలా భరించారు. తీవ్రమైన ఆర్థిక దుస్థితిని అనుభవించారు. కొంతమందైతే వయసులో వుండగానే భర్తల్ని స్వాతంత్ర్య ఉద్యమంలో కోల్పోయారు. మరికొందరు భర్తలు జైలునుంచి తిరిగొచ్చేలోపలే మరణించారు. వాళ్లెవరూ చరిత్ర పుటల్లో వుండరు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత అనిపిస్తూంటుంది.

ఇప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వం నెలనెలా పింఛను వేలల్లో ఇస్తోంది. ఎ.సి. రెండో తరగతిలో ఎక్స్ ప్రెస్ రైళ్ళల్లో దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా మరో మనిషి సాయంతో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది… కాని వాటిని అనుభవించే అర్హత వున్న నా భర్త ఇప్పుడు లేరు. నాకు తెలిసున్న స్వాతంత్ర్యయోధుల భార్యలు కూడా ఎవరూ ఇప్పుడు లేరు. మా వూరిలోకెల్లా మిగిలింది నేనొక్కదాన్నే… అందుకే ఈ పింఛనూ, ఈ సదుపాయలూ ఈ వయస్సులో నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వటం లేదు. పిల్లలు చూసుకుంటున్నారన్న తృప్తి మాత్రమే మిగిలింది.

(103 వసంతాలు చూసిన లక్ష్మీ నరసమ్మ గారు 2013 లో స్వర్గస్థులు కావటానికి కొన్ని మాసాలముందు కొడుకులతో పంచుకున్న అనుభవాలు.)

శ్రీ గుండు వేంకట కృష్ణమూర్తి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ దంపతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here