నా జీవన గమనంలో…!-33

45
5

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

69

[dropcap]’నే[/dropcap]టి బాలలే, రేపటి పౌరులు’.

అలాంటి బాలలను అల్లారు ముద్దుగా, ఆరోగ్యంగా పెంచుతున్న తల్లులను ప్రోత్సహించేందుకు ‘వెల్ బేబీ షో’ నిర్వహించింది మా లయన్స్ క్లబ్.

ఆ రోజు పోటీకి… తమ పిల్లలను చక్కగా ముస్తాబు చేసి, తోడ్కొని వచ్చారు తల్లులు. ఒక్కొక్కరుగా తమ బిడ్డను తీసుకుని వేదిక పైకి వచ్చారు.

న్యాయ నిర్ణేతలు నిశితంగా పరిశీలించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇచ్చేందుకు ముగ్గురు పిల్లలను ఎంపిక చేశారు. ఆనాటి ముఖ్య అతిథితో ఆ ముగ్గురు పిల్లలకు బహుమతులు ఇప్పించాము. మిగతా పిల్లలను నిరుత్సాహపరచకూడడని, వారందరికి కూడా ఓదార్పు బహుమతులను ఇప్పించాము.

‘వెబ్ బేబీ షో’లో తమకు లభించిన బహుమతులతో బాలబాలికలు

70

గ్రామాల్లో చాలామంది పేదవారు కట్టెల పొయ్యిలపై వంట చేసుకుంటుంటారు. అలా చేసుకోవడం ఎంతో శ్రమతో కూడిన పని. ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుంది. అలాంటివారికి, కొంతలో కొంత వెసులుబాటు కలిగించేందుకు ప్రభుత్వం ‘శాశ్వత పొయ్యిల నిర్మాణ పథకం’ చేపట్టింది. ఆ పథకాన్ని మా లయన్స్ క్లబ్ ద్వారా, ములుకుదురు గ్రామంలో అమలుపరిచి, గ్రామీణ పేదలలో ఒక అవగాహన కల్పించేందుకు నిర్ణయించాము.

ఆ రోజు పేద ప్రజలందరికీ, ఆ పొయ్యిల నిర్మాణం గురించి అధికారులు వివరించారు. వారందరి ముందు ఆ పొయ్యిలను కట్టించి చూపించారు. తరువాత, ఆ పొయ్యిల వాడకం వలన కలిగే ఉపయోగాలను వివరించారు. ఆ గ్రామంలో ఆ పొయ్యిలు కావాలనుకునే వారందరికి, వాటిని కట్టించి ఇచ్చే బాధ్యతను మా లయన్స్ క్లబ్ స్వీకరించింది.

ములుకుదురు గ్రామంలో నిర్వహించిన ‘శాశ్వత పొయ్యిల నిర్మాణ కార్యక్రమం’. పైన ప్రసంగిస్తున్న రచయిత… వేదిక పైన లయన్ యమ్.వి. చౌదరి గారు, లయన్ యమ్.బి. కోటేశ్వరరావు గారు, కాంట్రాక్టరు శ్రీ బి.హెచ్.కృష్ణమూర్తి గారు మరియు గ్రామ సర్పంచ్ శ్రీ వెంకటేశ్వరులు గారు

71

పొన్నూరు ప్రాంతంలో పండించే పంటలపై ఒక రైతు సదస్సు నిర్వహించి, రైతులలో అవగాహన కల్పించ తలపెట్టింది, ఆంధ్రా బ్యాంకు, నిడుబ్రోలు శాఖ. అందుకోసం, జువారి అగ్రికెమికల్స్ వారి సహకారంతో… మామిళ్ళపల్లి గ్రామంలో, రైతు సదస్సు నిర్వహించాము. ఆ సదస్సులో గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మామిళ్ళపల్లి గ్రామంలో, జువారీ అగ్రికెమికల్స్ వారి సహకారంతో నిర్వహించిన రైతు సదస్సులో ప్రసంగిస్తున్న రచయిత మరియు జువారి కంపెనీ అధికారులు, దిగువన: రైతు సదస్సులో పాల్గొన్న రైతు సోదరులు

ఆనాటి సభలో కంపెనీ అధికారులు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరించి, సరైన మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వాడకంపై సూచనలు చేశారు. రైతులు అడిగిన ప్రశ్నలన్నింటికి, సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

72

1989 సంవత్సరం.

రికవరీ సీజన్ మొదలైంది. మా బ్రాంచిలో వున్న ఇద్దరు గ్రామీణాభివృద్ధి అధికారులతో కలిసి, గ్రామాలన్నీ తిరుగుతూ, రైతులను, వివిధ ప్రభుత్వ పథకాల క్రింద అప్పులు తీసుకున్న లబ్ధిదారులను కలుస్తూ, వసూళ్ళ ప్రయత్నాలను ముమ్మరం చేశాము. మార్చి నాటికి యాభై శాతం మేర అప్పులు వసూలు చేయగలిగాము. జూన్ నాటికి తొంభై శాతం పైగా అప్పులు వసూలు చేసేందుకు, మేము కంకణం కట్టుకున్నాము.

నిడుబ్రోలు బ్రాంచి సిబ్బందితో రచయిత (సఫారీలో)

మా సిబ్బంది సహకారంతో, డిపాజిట్లు సేకరించడంలో, అప్పులు ఇవ్వడంలో, అప్పులు వసూళ్ళు చేయడంలో, వివిధ అంశాలలో మార్చి మాసాంతానికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలిగాము.

73

పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్ ద్వారా తలపెట్టిన సమాజ సేవా కార్యక్రమాలన్నింటిని అమలుపరచగలిగాము. అందుకు గాను 1988-89 సంవత్సరానికి, మా క్లబ్‍కు ‘బెస్ట్ క్లబ్’ అవార్డు, అధ్యక్షుడిగా నాకు ‘బెస్ట్ ప్రెసిడెంట్’ అవార్డు లభించాయి.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టినప్పుడు, మధుమేహ వ్యాధిపై ఒక నివేదికను రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను వ్యక్తిగతంగా చేపట్టిన ఒక బృహత్తర కార్యక్రమం. ఒక వైపు లయన్స్ క్లబ్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలను అమలు పరుస్తూ,… మరో వైపు దాదాపుగా ఇరవై ఐదు దేశాలలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్‌లతో, ఆయా దేశాల్లో, మధుమేహ వ్యాధిపై చేస్తున్న విస్తృత పరిశోధనల గురించి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తెలుసుకున్నాను. వాళ్ళ వద్ద నుండి, మధుమేహ వ్యాధిపై ముద్రించబడిన పుస్తకాలు, కరపత్రాలు వచ్చాయి. వాటన్నింటిని క్లబ్ ఆఫీసులో సభ్యులందరికీ అందుబాటులో ఉంచాను. వాటి ఆధారంగా, నా ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా, ఒక పుస్తకాన్ని తయారు చేసి, మా పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ జిల్లా గవర్నరు గారికి పంపించాను. మా జిల్లా గవర్నరు గారు ఆ పుస్తకాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్‌కు పంపించారు.

ఆ పుస్తకాన్ని చూసిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్, ఇల్లినాయిస్, అమెరికా వారు… మా పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్‌కు అభినందనలను తెలుపుతూ, ప్రశంసాపత్రాన్ని పంపారు.

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్, అమెరికా వారు… పొన్నూరు నిడుబ్రొలు లయన్స్ క్లబ్‍కు పంపిన ప్రశంసాపత్రం

మా క్లబ్‌కు స్పెషల్ అవార్డును ప్రకటించి ‘ఔట్‌స్టాండింగ్ క్లబ్ ప్యాచ్’ని కూడా పంపించారు. ఒక ప్రత్యేకమైన సభలో మాత్రమే, తగిన రీతిని గౌరవించి, ఆ అవార్డును బహుకరించాలని మా జిల్లా గవర్నరును ఆదేశించారు.

తదుపరి జిల్లా గవర్నరు ఆ అవార్డును మా క్లబ్‌కు బహుకరిస్తూ, “గత పన్నెండు సంవత్సరాల్లో, ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డు మన జిల్లాలోని క్లబ్‌కి రావడం ఇదే ప్రథమం…” అని చెప్తూ, అందుకు కారణభూతమైన పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్‌ను, ప్రత్యేకంగా ఆ క్లబ్ అధ్యక్షుడినైన నన్ను ఘనంగా సత్కరించారు.

చివరిగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్, ఇల్లినాయిస్, అమెరికా వారు నాకు పంపిన ‘న్యూ హొరైజన్స్ అవార్డ్ ఫర్ డయాబెటిక్ ఎడ్యుకేషన్’ అనే స్పెషల్ అవార్డును నాకు అందించారు. అంతటి గౌరవప్రదమైన అంతర్జాతీయ అవార్డు నాకు దక్కడం,… నిజంగా నా అదృష్టం…

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్, అమెరికా వారు… రచయితకు పంపించిన… స్పెషల్ అప్రీషియేషన్ అవార్డు ‘న్యూ హొరైజన్స్ అవార్డ్ ఫర్ డయాబెటిక్ ఎడ్యుకేషన్’

74

నిడుబ్రోలు బ్రాంచిలో నేను మేనేజర్‌గా జాయిన్ అయి మూడు సంవత్సరాలు కావస్తుంది. బహుశా, ఇక్కడి నుండి నన్ను బదిలీ చేయవచ్చు. ఒకవేళ చేస్తే, ఎక్కడికి చేస్తారో… ఏమో… అనే ఆలోచనలు నా మనసులో మెదలసాగాయి. అప్పుడే నాకు బదిలీ ఉత్తర్వులు అందాయి…

ఆశ్చర్యం… గుంటూరు రీజినల్ ఆఫీసుకి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‍గా బదిలీ చేశారు….

బహుశా 1986వ సంవత్సరంలో, అదే పోస్టుకి నన్ను బదిలీ చేసి, జాయిన్ అయే లోపే నిడుబ్రోలు బ్రాంచి మేనేజర్‌గా, ఆ ఆర్డర్‍ను మార్పు చేసినందుకు… బదులుగా ఇప్పుడు ఇలా చేసుంటారా…!!

ఏమైతేనేం… గుంటూరులో కొంత కాలం పని చేయాలనే కోరిక అప్పుడు నెరవేరలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.

***

గుంటూరు మా సొంత ఇంట్లో, ప్రస్తుతం మా దగ్గరి బంధువులే అద్దెకుంటున్నారు. ఒక వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకుని, మా ఇంటిని ఖాళీ చేయమని చెప్పాను. వారం తిరక్క ముందే వారికి మా ఇంటికి దగ్గరలోనే ఇల్లు దొరికింది. మా ఇంటిని మాకు అప్పగించారు. అవసరమైన కొద్దిపాటి రిపేర్లు చేయించి, రంగులు వేయించాను.

***

ఆ రోజు నిడుబ్రోలు బ్రాంచిలో రిలీవ్ అయ్యాను. ఆంధ్రా బ్యాంకు పొన్నూరు శాఖ సిబ్బంది, నిడుబ్రోలు శాఖ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, ఇతర స్నేహితులు, శ్రేయోభిలాషులు, అందరూ నాకు ఉచిత రీతిలో వీడ్కోలు పలికారు.

పిల్లల స్కూల్లో టీ.సీ.లు తీసుకుని, సామాన్లను గుంటూరులో మా ఇంటికి చేర్చి, సెటిల్ అయ్యాను. అబ్బాయిని గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్నీడియట్ ఫస్ట్ ఇయర్‌లో, అమ్మాయిని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఆరవ తరగతిలో చేర్పించాను.

75

ఆ రోజు గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్టు మేనేజర్‍గా జాయిన్ అయ్యాను. ముందుగా రీజినల్ మేనేజర్ శ్రీ బి.టి. కాంతారావు గారిని కలుసుకుని, వారి ఆశీస్సులు తీసుకున్న తరువాత, మిగతా సిబ్బందిని కలిసి పరిచయం చేసుకున్నాను. 1975-77 సంవత్సరాల మధ్య కాలంలో నేను ఇదే ఆఫీసులో అగ్రికల్చరల్ క్లర్కుగా పని చేశాను. అప్పటి ఆఫీసుకు అదనంగా ప్రక్కనే వున్న మరో పెద్ద హాలు కూడా కలుపబడింది.

అక్కడ మా లీడ్ బ్యాంక్ డిపార్ట్‌మెంటుతో పాటు, మరికొన్ని డిపార్టుమెంటులున్నాయి. మా లీడ్ బ్యాంక్ డిపార్టుమెంటులో, నాతో పాటు, ఇద్దరు ఆఫీసర్లు (శ్రీ పాలేటి సుబ్బారావు గారు, శ్రీ యన్. ఆర్. సత్యనారాయణ గారు); ఇద్దరు క్లర్కులు (శ్రీ ఎ.డి.ఎస్.వి ప్రసాద్ గారు, శ్రీ డి. వెంకటేశ్వర్లు గారు); ఒక స్టెనో/టైపిస్టు (శ్రీ యస్.టి.పి. యల్. యన్. చారి గారు) వున్నారు. ఆ హాల్లో పని చేస్తున్న అటెండర్లలో ఎవరో ఒకరు మా డిపార్టుమెంటుకు సహాయకారిగా వుంటున్నారు. వాళ్ళందరితో కలిసి కూర్చుని లీడ్ బ్యాంకు డిపార్టుమెంటు గురించి తెలుసుకున్నాను. వాళ్లందరిలో విషయ పరిజ్ఞానం, అనుభవం మెండుగా వున్నాయి. ఆ రోజే నాకు నమ్మకం కలిగింది, వాళ్ళ సహకారంతో లీడ్ బ్యాంక్ డిపార్ట్‌మెంటును నడిపించడం, నాకు నల్లేరు మీద నడకే… అని. రీజినల్ ఆఫీసు జీపును కూడా మా డిపార్టుమెంట్, జిల్లా వ్యాప్తంగా తిరగడానికి వాడుకుంటుందట! ఆ జీపు అందుబాటులో లేనప్పుడు, బాడుగ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చట!

అప్పటికే ఆ సంవత్సరానికి గాను జిల్లా ఋణ ప్రణాళికను తయారు చేయడం, జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో, జిల్లాలో పని చేస్తున్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్న జిల్లా సంప్రదింపుల సంఘం సమావేశంలో ఆమోదం పొందడం కూడా జరిగింది. ప్రతి మూడు నెలల కోసారి జరిగే ఆ సమావేశంలో, వివిధ బ్యాంకుల ఋణ ప్రణాళికల అమలు తీరును సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల క్రింద లబ్ధిదారుల ఎంపిక, అప్పుల మంజూరు, వసూళ్ళపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది.

76

ఉన్నట్టుండి కొన్ని గ్రామాలలో పశువులకు గొంతువాపు వ్యాధి సోకింది. రోజు రోజుకీ, ఆ వ్యాధి ఉధృతికి, పశువుల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

లీడ్ బ్యాంక్‌గా, ఆ సమయంలో, జిల్లా పశు సంవర్ధక శాఖ సహకారంతో, పశువులను మృత్యువు బారి నుడి కాపాడేందుకు ఉచిత వాక్సినేషన్ క్యాంపు నిర్వహించాము.

సత్వర గ్రామీణాభివృద్ధి పథకం క్రింద ఎన్నిక చేయబడిన వైకుంఠపురంలో, జవహర్ గ్రామ యోజన పథకం క్రింద ఎన్నిక చేయబడిన కొత్త జడ్డావారి పాలెం, మరియు, కొత్త చెరువు కొమ్ము పాలెంలో వున్న పశువులన్నింటికి ఆ వ్యాధి సోకకుండా వుండేందుకు వాక్సిన్లు వేయించాము. అప్పటికే, ఆ వ్యాధి బారిన పడిన పశువులను క్వారంటైన్‌లో వుంచి, చికిత్స కొరకు అవసరమైన మందులను ఉచితంగా సమకూర్చాము.

వైకుంఠపురం గ్రామంలో ఆంధ్రాబ్యాంకు వైకుంఠపురం బ్రాంచి, జిల్లా పశు సంవర్ధక శాఖ మరియు గుంటూరు లాం ఫారం వారి సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరము
కొత్త జడ్డావారి పాలెం గ్రామంలో ఆంధ్రాబ్యాంకు, వినుకొండ బ్రాంచి, జిల్లా పశు సంవర్ధక శాఖ మరియు గుంటూరు లాం ఫారం వారి సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరము
కొత్త చెరువు కొమ్ము పాలెంలో ఆంధ్రాబ్యాంకు, వినుకొండ బ్రాంచి, జిల్లా పశు సంవర్ధక శాఖ మరియు గుంటూరు లాం ఫారం వారి సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరము

మొత్తం మీద ఆ భయంకరమైన వ్యాధి నుండి, పశువుల మరణాలను గణనీయంగా తగ్గించగలిగాము.

సరైన సమయంలో స్పందించి, నోరు లేని ఆ మూగ జీవాలను రక్షించేందుకు, మేము చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్థులంతా ఎంతో సంతోషించారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here