[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
బ్యాంకులతో నా అనుబంధం..!!
[dropcap]స[/dropcap]మాజంలో అందరూ నోటిలో వెండి చంచా తోనే పుట్టరు. అది అందరికీ సాధ్యం కాదు కూడా. కొందరు బంగారు స్పూనుతో కూడా పుట్టొచ్చు అది వేరే విషయం. వారి గురించి ఇక్కడ పెద్దగా చర్చించనవసరం లేదు. ఒక్కొక్కరికీ వారి వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి వారి జీవనశైలి రూపు దిద్దుకుంటుంది. అది వారి వారి చురుకుదనాన్ని బట్టి, ద్యేయాన్ని బట్టి, అకుంఠిత దీక్షను బట్టి, ఏర్పరచుకున్నలక్ష్యాన్ని బట్టి నెరవేరుతుంటుంది. అరకొర వసతులతో చదువుకొని వెనుక ఆస్తిపాస్తుల భరోసా లేనివారు, తల్లిదండ్రులమీద ఆధారపడి తమ జీవన విధానాన్ని రూపకల్పన చేసుకోవడం సాధపడే విషయంకాదు. అది పూర్తిగా నూటికి నూరుపాళ్లు స్వయంకృషి వల్లనే సాధ్యం అవుతుంది. తమ జీవన చిత్రాన్ని చూసి భయపడిపోకుండా, తమ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి కోరుకున్న జీవితాన్ని స్వంతంగా, స్వయంగా తయారుచేసుకునే అవకాశం కలుగుతుంది. తమ వృత్తి వల్ల వచ్చే ఆదాయంతో కోరుకున్న జీవితాన్ని అనుభవించే అవకాశాలు అందరికి ఉండకపోవచ్చును. అలాంటప్ప్పుడు నిత్య జీవితానికి అవరోధం కలిగించని ఏదైనా ఆర్థికవనరును ఎంచుకునే విషయం ఆలోచించడం మంచిదే! ఉద్యోగస్థులకు ఎక్కువ ఇబ్బంది కలిగించని ఆర్థిక సహాయం కేవలం బ్యాంకుల ద్వారా, వారు అందించే బ్యాంకు ఋణాల ద్వారా సాధ్యం అవుతుంది. ముఖ్యంగా వైద్యరంగములోని వైద్యులకు బ్యాంకులు ప్రవేశ పెట్టిన పర్సనల్/ప్రొఫెషనల్ ఆర్థిక ఋణాలు ఎంతోమంది వైద్యులను ఆర్థికంగా ఆదుకున్నాయి. అందులో నేనూ ఒకడినని చెప్పడానికి ఎంతమాత్రమూ వెనుకాడబోను.
దంత వైద్య వృత్తిలో ప్రవేశించగానే నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టవలసిన అవసరం ఏర్పడింది. దీనికి రెండు ప్రధాన కారణాలు. 1) ప్రభుత్వ ఆసుపత్రిలో నన్ను నియమించినా (మహబూబాబాద్) అక్కడ చికిత్సకు అవసరమైన ముఖ్య సామగ్రి అప్పటికి ప్రభుత్వం ఇంకా సమకూర్చకపోవడం. 2) నిత్యమూ చికిత్స విధానాలు ప్రాక్టీస్‌లో లేకుంటే, అది క్రమంగా మరచిపోయే ప్రమాదం. దీనితో పాటు చిల్లర ఖర్చుల కోసం కొంత సొమ్ము సమకూర్చుకునే వెసులుబాటు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టే దిశలో ఆలోచనలో ఉండగా అక్కడ ఇండియన్ బాంక్ మేనేజర్, ఖమ్మం వాసి, శ్రీ వినోదరావు గారు పరిచయం అయినారు. అడగడమే ఆలస్యం డెంటల్ చైర్ కొనుక్కోవడానికి బ్యాంకు ఋణం మంజూరు చేసినారు. బహుశః పదివేలు అనుకుంటాను. దీనితో బ్యాంకులతో సంబంధాలు మొదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తరువాతి మేనేజర్లు శ్రీ కేశవరావు గారు, శ్రీ పి. గంగరాజు గారూ ఎంతగానో సహకరించారు. అదే సహాయంలో నా సమీప బంధువు కొడుకు వరుస (పెదనాయన మనవడు) కె. గోపాల కృష్ణ, బదిలీపై పర్వతగిరి నుండి మహబూబాబాద్‌కు రావడం నాకు ఎంతో మేలు కలిగింది. వారు నిర్ణయించిన సమయానికి ముందే లోన్ తీర్చివేయడం గొప్ప తృప్తి నిచ్చింది.
ఇతర ప్రాంతాలనుండి ఉద్యోగ రీత్యా మహబూబాబాద్‌కు వచ్చిన బ్రహ్మచారులు, ఇతరులు ప్రతి రోజు సాయంత్రం ఆఫీసు వేళలు అయిన తర్వాత రైల్వే స్టేషన్‌లో కలుసుకునేవాళ్ళము. అలా కబీరు దాసు అనే ‘వీరవాసరం’ వాసి ఇండియన్ బ్యాంకు మేనేజర్ పరిచయం అయినారు. నేను జన్మతః తూర్పు గోదావరి జిల్లా వాసిని, ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా. ఆయనకు ప్రాంతీయ అభిమానం మెండుగా ఉండేది. అందుకేనేమో నేనంటే ప్రత్యేకంగా ఇష్టపడే వాడు. ఆయన ఒక రోజు “మీకు రిఫ్రిజిరేటర్ ఉందా డాక్టర్ గారూ?” అన్నారు. లేదని చెప్పాను. “నేను లోన్ ఇస్తాను కొనుక్కోండి” అని కొటేషన్ ఆయనే రప్పించి లోన్ విడుదల చేశారు. అప్పట్లో అది ఊహించని వింత. ఆయనకు నాపై వున్న విపరీతమైన అభిమానం. అలా గాడ్రెజ్ రిఫ్రిజిరేటర్ తొలినాళ్లలో స్వంతం చేసుకోగలిగాను.
తర్వాత మళ్ళీ టెలివిజన్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును ఆశ్రయించాను. అడిగినదే తడవుగా బ్యాంకు ఋణం మంజూరు చేశారు. అదే అప్పట్లో బాగా అమ్మకాలు జరుగుతున్న సోలీడర్ టి.వి. బాగా ఉండేది. అప్పుడు ఇన్ని చానల్స్ ఉండేవి కాదు. అయినా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది మేము 1994లో హన్మకొండకు వచ్చేవరకూ వాడాము. ఆ టి.వి.ని మిత్రుడు, నాగేంద్ర బుక్ స్టాల్ అధినేత, ఎం. నాగేశ్వరరావు నా ప్రమేయం లేకుండానే తక్కువ ధరలో ఖమ్మం నుండి కొని తీసుకురావడం మా స్నేహంలో ఆయన నాకు చేసిన సహాయాలలో ఒకటి. నేను పని చేస్తున్న హాస్పిటల్ నుండి నివాసం ఉంటున్న ఇల్లు చాలా దగ్గర ఉండేది. నడిచి హాయిగా వెళ్లదగ్గ దూరం. కానీ డాక్టర్ హోదాకు కనీసం స్కూటర్ లేకపొతే ఎలా? ఇది ఇంట్లోను, బయట ముఖ్యమైన మిత్రులు తరచుగా సంధిస్తున్న ప్రశ్న. నిజానికి అప్పుడు స్కూటర్ అవసరం లేనే లేదు. కానీ కొనుక్కోవాలనే నిర్ణయానికి వచ్చాను. అయితే అప్పటికే నా శ్రీమతి అరుణ స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో, మహబూబాబాద్ బ్రాంచ్‌లో పని చేస్తున్నది. వాళ్లకి తక్కువ వడ్డీలో స్కూటర్ కొనుక్కునే ఋణ సదుపాయం ఉండడం వల్ల అది ఉపయోగించుకున్నాము. అయితే అప్పుడు స్వేచ్ఛగా విపణిలో అప్పటికి అప్పుడు డబ్బు చెల్లించి కొని తెచ్చుకునే అవకాశం ఉండేది కాదు. ముందు బుక్ చేసుకోవాలి. తర్వాత వారి సమాచారం అందుకుని డబ్బు కట్టి బండి తెచ్చుకోవాలి.
అప్పుడు అలా ‘బజాజ్ చేతక్’ బండి కొనుక్కున్నాను అది ఎస్.బి.హెచ్. (ఇప్పుడు ఎస్.బి.ఐ) వారి కానుక అనుకోవలసిందే! అంటే అధికారికంగా బండి నా శ్రీమతిది, వాడుకున్నది నేనూ! ఆవిడ ఎప్పుడూ స్కూటర్ నేర్చుకునే సాహసం చేయలేదు. అది నేను హన్మకొండకు వచ్చిన చాలాకాలం వరకూ వాడాను.
అంత మాత్రమే కాదు, బ్యాంకు వారు మా పిల్లల ట్యూషన్ ఫీజు (మార్కులను బట్టి) భరించేవారు. ప్రధమ స్థానంలో ఉత్తీర్ణులైతే పిల్లలకు స్కాలర్షిప్‍లు కూడ ఇచ్చేవారు.
1994లో జనగామకు బదిలీ అయి, హన్మకొండలో నివాసం ఏర్పరచుకుని అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. ఖాజీపేట స్టేషన్ వరకూ స్కూటర్ మీద వెళ్లి అక్కడ స్టాండులో పెట్టి రైలులో జనగామకు వెళ్లి వచ్చేవాడిని. ఈలోగా సాయంత్రాలు క్లినిక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. కానీ స్వంతంగా షట్టర్ అద్దెకు తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అయినా ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొద్దిరోజులు డా. రాజయ్య (ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ – శాసనసభ్యుడు -మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి) గారి ఆసుపత్రిలో ఒక రూం తీసుకుని కొద్దినెలల తర్వాత కృష్ణమూర్తి (మెడికల్ షాపు యజమాని) చొరవతో హన్మకొండ పాత బడిపో రోడ్డులో ‘సంరక్ష డెంటల్ క్లినిక్’ ప్రారంభించాను.
కొద్దినెలల తర్వాత కృష్ణమూర్తి ఒక సూచన చేసాడు. డాక్టర్ అంటే కారు వుండాలనీ, అది ఉంటే పేషంట్ల సంఖ్య పెరుగుతుందనీ తరచుగా గుర్తు చేస్తుండేవాడు. అయినా నేను పట్టించుకునేవాడిని కాదు. అయితే, అప్పుడు నా శ్రీమతి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ నక్కలగుట్ట బ్రాంచిలో పని చేస్తుండేది. వాళ్ళ మేనేజర్ శ్రీ సూర్యనారాయణ రావు గారు.
ఆయన పరిచయం తరచుగా నన్ను బ్యాంకుకు లాక్కెళుతుండేది. ఆయన తరచుగా “డాక్టర్ గారూ.. కారు ఎప్పుడు కొంటున్నారు?” అని అడుగుతుండేవారు. అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటుండేవాడిని.
అలాగే మెడికల్ షాప్ కృష్ణమూర్తి కూడా కారు కొనమని ఒకటే నస పెడుతుండే వాడు. ఇంట్లో కూడా పిల్లలు కారు కొనమని పదే పదే అడగడం మొదలు పెట్టారు. ఇదొక సమస్యగా తయారైంది నాకు. ఒకరోజు నేను నా శ్రీమతి పని చేసే బ్రాంచికి వెళ్లి, మేనేజర్ సూర్యనారాయణ రావు గారి ఛాంబర్‌కు వెళ్లాను.
కబుర్లు కాఫీలు పూర్తయ్యాక, “కారు కొనదలచుకోలేదా? ఇంకెప్పుడు, చేతిలోకి ఊత కర్ర వచ్చినప్పుడా? అప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని బండి తోలనివ్వడు, డిక్కీలో కూర్చోబెట్టి తీసుకెళతాడు” అన్నారు మేనేజరు గారు నవ్వుతూ.
ఆయన మాటలు నాకు ఉత్ప్రేరకంగా పనిచేసాయి. ఇక కారుకొనుక్కోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చేసాను. అప్పుడు ఎందుకోగానీ మా ఇంటికి దగ్గరలో వున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ నిట్ బ్రాంచ్‌లో లోన్ తీసుకున్నాను.
అంతే కాకుండా మా రామకృష్ణా కాలనీకి ఎదురుగా అప్పుడే హుండై షో రూమ్ వచ్చింది. అక్కడ శాంత్రో -సిల్వర్ కారు తీసేసుకున్నాను. అది నాకు చాలా నచ్చిన కారు. ఈ మధ్యనే ఆ కారు అమ్మలేక అమ్మేసాను.
మిత్రులు సూర్యనారాయణ రావు గారు నక్కల గుట్ట బ్రాంచ్ మేనేజర్‌గా వున్నప్పుడు ఆయనతో మరో అనుభవం వుంది. ఆ రోజుల్లో నేను స్థానిక ‘సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ’కు అధ్యక్షుడిగా వున్నాను. ప్రతి సంవత్సరము మూడు రోజులపాటు నాటక పోటీలు నిర్వహించేవాళ్ళం. రావుగారితో వున్న చనువు కొద్దీ నాటక పోటీలకు బ్యాంకు పక్షాన నాటకాల కోసం కొంత డబ్బు స్పాన్సర్ చేయమని అడిగాను. సరే చూద్దాం అని, బ్యాంకుకు దగ్గరలోనే ఆయన నివాసం ఉంటున్న గదికి తీసుకు వెళ్లారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉండేది. వారు ఒంటరిగా ఉండేవారు. వారి స్వహస్తాలతో తేనీరు తయారు చేసి ఒక కప్పు నాకు అందించడం ఎప్పటికీ మరచిపోలేని సన్నివేశం. టీ తాగుతూనే “మీ నాటకాలకు ఐదు వేలు మంజూరు చేస్తాను ఏమంటారు?” అన్నారు. వెంటనే నేను లేచి “ఇది చెప్పడానికా నన్ను ఇంత దూరం తీసుకు వచ్చారు. నేను వెళ్తున్నా!” అంటూ కదలబోయా. ఆయన చిరునవ్వు నవ్వుతూ.. “మరీ అంత కోపం ఏమిటి? కూర్చోండి ముందు” అని కూర్చోబెట్టి, “పోనీ.. పదివేలు సరిపోతుందా?” అన్నారు. “ఆ.. అలా అన్నారు.. బావుంది” అన్నాను. ఇద్దరం నవ్వుకుంటూ బయటపడ్డాము.
అంతటి సహృదయులు శ్రీ సూర్య నారాయణ రావు గారు. ఆయన వరంగల్‌లో పనిచేసినంత కాలం ‘సహృదయ’ సంస్థకు బ్యాంకు తరఫున సహాయం చేస్తూనే వున్నారు. తర్వాత ఆయన వివిధ ప్రాంతాలలో పనిచేసి ఎన్నో పదవులు పొంది ‘డి.జి.ఎం.’ గా పదవీ విరమణ చేసి భాగ్యనగరంలో స్థిరపడినారు. ఇప్పటికీ స్నేహితులుగా ప్రతి రోజూ పలకరించుకోవడం ఆయన సహృదయతా, సంస్కారమే అని నేను అనుకుంటాను.
తర్వాత బ్యాంకు పక్షాన సంవత్సరాని కొకసారి బ్యాంకు సిబ్బంది సహచరులకు పిల్లలకు సాహిత్య పరమైన పోటీలు పెట్టేవారు. అది హైదరాబాద్ మెయిన్ బ్రాంచి వారు జాతీయ స్థాయిలో నిర్వహించేవారు. కథ/కవిత/వ్యాసం అలా మూడు భాషల్లోనూ ఉండేవి. తెలుగులో కథ/వ్యాసం విభాగాలలో నాకు మూడుసార్లు బహుమతులు వచ్చాయి. ఆకర్షణీయమైన క్యాష్ ప్రైజ్ ఇచ్చేవారు.
నాకు ఈ రోజున హన్మకొండలోనూ, హైదరాబాద్‌లోనూ ఇళ్ళు వున్నాయంటే, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వల్లనే సాధ్యమైందని ఘంటాపథంగా చెప్పగలను.
క్లార్క్ నుండి డిప్యూటీ మేనేజర్‌గా నా శ్రీమతిని తయారు చేసిన బ్యాంకు ఋణం ఏమి చేసినా తీర్చుకోలేము. బ్యాంక్ ద్వారా పొందిన సహాయ సహకారాలు ఎన్నటికి మరువలేము.
నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగి కావడం మూలాన నాకు పరిచయం అయిన మరో సహృదయ మూర్తి, మంచి మిత్రులు శ్రీ విజయరంగం గారు. వారు ప్రస్తుతం ఎక్కడ వున్నారో తెలియదు, కానీ నా జ్ఞాపకాల నుండి ఆయన ఎక్కడికీ పోలేదు.
(మళ్ళీ కలుద్దాం)