ఆదివాసీలు నర్తించరు

2
3

[box type=’note’ fontsize=’16’] Hansda Sowendra Sekhar వ్రాసిన ‘The Adivasi will not dance’ అనే కథను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు వి.బి. సౌమ్య. [/box]

***

[dropcap]వా[/dropcap]ళ్ళు నన్ను నేలకేసి నొక్కిపెట్టారు. నన్ను మాట్లాడనివ్వలేదు. ఎదురు చెప్పనివ్వలేదు. కనీసం తలెత్తి పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటున్న నా తోటి గాయకులని, నర్తకులని చూడనివ్వలేదు. తమని వదిలేయమంటూ వాళ్ళు ప్రాధేయపడ్డం మాత్రం వినిపించింది, అంతే. నాకు బాధనిపించింది. నేను చేసిన పనేదో నా అంతట నేను చేశాను. నా వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ, నాకు ఇది కాక వేరే దారేముంది? మా అందరిదీ ఒకే కథ కదా… ఒకవేళ నా ఆలోచనలు వీళ్ళకి ముందే చెప్పి ఉంటే నన్ను సమర్థించే వారేమో. అపుడు నాతో కలిసేవారు, మేమందరం కలిసి ముక్త కంఠంతో మాట్లాడితే ఆ గొంతుక సంతాల్ పరగణాని, జార్ఖండ్‌ని దాటి దిల్లీ దాకా వెళ్ళి, యావత్ భారత్ దేశానికీ, బహుశా ప్రపంచం మొత్తానికీ మా కథ తెలిసేదేమో! అప్పుడైనా ఈ రాష్ట్రపతి నేను చెప్పిన దానికి అంగీకరించేవాడేమో. మాకేమైనా మేలు జరిగేదేమో.

కానీ, నేను నా ఆలోచన ఎవరితోనూ పంచుకోలేదు. నా పాటికి నేను మూర్ఖంగా ముందుకెళ్ళాను. వాళ్ళు నన్ను లాగి, కొట్టి, నోరు నొక్కేసారు. నాకు నిస్సహాయంగా, పిచ్చిగా అనిపిస్తోంది.

అసలు మా సంతాలీలే పెద్ద మూర్ఖులు కదా! ఆదివాసీలంతా మూర్ఖులే. ఏళ్ళ బట్టీ, తరాల బట్టీ దికూ(ఆదివాసీలు కానివారు)లు ఈ మూర్ఖత్వాన్ని బాగా వాడుకున్నారు. కాదంటారా? నేను “ఆదివాసీలు నర్తించరు” అని మాత్రమే అన్నాను. అందులో తప్పేముంది? మేమేమయినా బొమ్మలమా? ఎవరో వస్తారు – మా “ఆన్” బటన్ నొక్కుతారు. లేదంటే వెనకాల ఉన్న కీ తిప్పుతారు. వెంటనే ఓ పక్క మా కాళ్ళ కింద భూమిని ఎవరో మా నుంచి లాగేసుకుంటూ ఉంటే సంతాల్ ప్రజలంతా మా టామాక్తుమ్దా (ఈ రెండూ తబలా, డోలు  తరహా సంతాలీల సంగీత వాయిద్యాలు) ల మీద దరువేస్తూ, మా తిరియో (ఫ్లూటు లాగా గాలి ఊది వాయించేది) తో రాగాలు పలికిస్తూ నర్తించాలి అంటారు. మరి నేనన్న దానిలో తప్పేముంది చెప్పండి?

కానీ నేను ఇలా జరుగుతుందని ఊహించలేదు. మన దేశానికి రాష్ట్రపతి కదా… ఈయనే అందరికంటే బెస్టు, మనం చెప్పేది వింటాడు అనుకున్నా. పైగా ఆయనది మా పొరుగు ప్రాంతమే కదా! ఆయన పూర్వీకులంతా ఈ పక్కనే ఉన్న బీర్భూం జిల్లా వారే. వాళ్ళ పాత ఇల్లు ఇంకా అక్కడ అలాగే ఉంది. ఈ బీర్భూం లోనే రబీన్-హరాం సంతాల్ ప్రజలతో సామరస్యంగా జీవించలేదా? రబీన్-హరాం( సంతాలీ భాషలో పెద్ద మనుషులకి గౌరవసూచకం) స్థాపించిన ఆ…శాంతినికేతన్ ..దానికి చాణ్ణాళ్ళ క్రితం మా కళాకారుల గుంపుతో నేను కూడా సంగీత-నృత్య ప్రదర్శనకి వెళ్ళాను. మా సంతాలీలను అక్కడ ఎంతో గౌరవించారు. శాంతినికేతన్ బీర్భూంలో ఉంది. రాష్ట్రపతి అక్కడి వాడే. మరి నన్ను ఎపుడైనా చూసి/విని ఉండాలి కదా. లేదు.

ఎంత మూర్ఖుడిని నేను! మూర్ఖపు సంతాలీని. నేనో మూర్ఖపు ఆదివాసీని.

నా పేరు మంగల్ ముర్ము. నేనొక సంగీతకారుడిని. కాదు కాదు… రైతుని… ఒకప్పుడు. ఇపుడు వ్యవసాయం చేయడం లేదు. మా పాకుడ్ జిల్లా లోని అమడాపాడా బ్లాకులో ఉన్న మటియాజోర్ గ్రామంలో ఉండే సంతాలీలలో ఇపుడు వ్యవసాయం చేసేవారు బాగా తగ్గిపోయారు. అసలు మాలో వ్యవసాయ భూమి ఉన్న వారు పెద్దగా లేరిప్పుడు. మా భూములని పెద్ద మైనింగ్ కంపెనీ ఒకటి కొనేసింది. దీనిని మేము ప్రతిఘటించలేదు అనుకోకండి. ప్రతిఘటించాము. మేము ఈ పోరాటంలో ఉండగా మాకోసం వచ్చామంటూ ఆ రాజకీయ నాయకుడొచ్చాడు, ఈ నాయకుడొచ్చాడు. కిరస్తానీ సిస్టర్ వచ్చింది. ఫాదర్ వచ్చాడు. అయినా ఓడిపోయాము. ఓడిపోయాక వీళ్ళంతా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. రాజకీయ నాయకులంతా రాంచీ నో, డిల్లీనో..వాళ్ళు వెళ్ళాలసిన చోటికి వెళ్ళిపోయారు. కిరస్తానీ వాళ్ళు వాళ్ళ మిషన్ లకి తిరిగి వెళ్ళిపోయారు. మా భూమి మాత్రం మాకు తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా ఒక సిస్టర్‌ని ఎవరో చంపేసారు. మా కుర్రాళ్ళని ఆ కేసులో ఇరికించారు. పత్రికలు, మీడియా, అంతా మా కుర్రాళ్ళే దోషులన్నారు. ఆ సిస్టర్ మా హక్కుల కోసం పోరాడుతూన్నా కూడా మా వాళ్ళు ఆమెని చంపేశారని రాశారు. అసలా సిస్టర్ వచ్చే ముందు నుంచే మా వాళ్ళు మా హక్కుల కోసం పోరాడుతున్నారు అన్న ముక్క ఒక్కరూ గమనించలేదు.

అసలు మా కుర్రాళ్ళెందుకు చంపుతారు ఆమెని? మా వాళ్ళకి రిపోర్టర్ స్నేహితులు లేరు కాబట్టి ఈ పోరాటం బైట ప్రపంచానికి కనబడలేదు. సిస్టర్‌కి ఇతర మిషనరీలు, స్నేహితులు ఇలా కనెక్షన్లు ఉన్నాయి కనుక ఆమె కృషి గురించి అందరికీ తెలిసింది. ఇపుడు మా వాళ్ళు తప్పుడు మర్డర్ కేసు వల్ల జైల్లో ఉన్నారు. మరి మా కోసం పోరాడేది ఎవరు? మిషనరీలు మా శ్రేయోభిలాషులు, మాకోసం పోరాడుతున్నారు అన్నారు – మరి ఇప్పుడెక్కడున్నారు వాళ్ళు? ఒక పేరున్న సిస్టర్ని చంపేసి, ఆ నేరాన్ని తమ భూమి కోసం పోరాడుతున్న కొందరు అనామక సంతాల్ కుర్రాళ్ళ మీద పడేస్తే ఒక్క దెబ్బకి సిస్టర్, సంతాలీ ఇద్దరి అడ్డూ తొలగించుకోవచ్చు. వీలైనంత భూమి స్వాధీనం చేసుకుని, గనులు నిర్మించి ఉన్న బొగ్గంతా తవ్వుకోవచ్చు. ఇదే ఆ బొగ్గు కంపెనీ పనితీరు. నాకు ఇంత స్పష్టంగా అర్థమవుతోంది, మీడియాకి ఈ విషయం అర్థం చేసుకోడం ఎందుకంత కష్టంగా ఉంది?

ఒకవైపు బొగ్గు వ్యాపారులు వచ్చి కొన్ని భూములు లాక్కున్నారు. మిగితాది రాళ్ళ వ్యాపారులు లాక్కున్నారు. అంతా దికూలు – మార్వారీ, సింధీ, మండల్, భగత్, ముస్లిం వాళ్ళు. పెద్ద పెద్ద యంత్రాలని తెచ్చి మా భూములని అతలాకుతలం చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన రాళ్ళని దిల్లీ, నోయిడా, పంజాబ్ ఇలా ఎక్కడెక్కడో అమ్ముకుంటారు. ఈ బొగ్గు కంపెనీ, క్వారీ ఓనర్లూ వీళ్ళంతా మా భూముల ద్వారా బోలెడు డబ్బు సంపాదిస్తారు. టవున్లో అందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. మంచి మంచి బట్టలేసుకుంటారు. పిల్లలని ఎక్కడో ఉన్న పెద్ద పెద్ద స్కూళ్ళకి పంపిస్తారు. వైద్యం కావాలంటే రాంచీ, పాట్నా, బాగల్పూర్, మాల్డా, బర్ధమాన్, కోల్కతా ఇలా పెద్ద పెద్ద నగరాలకి పోతారు. మరి సంతాలీలకి మిగిలిందేమిటి? చిరిగిన బట్టలు, చాలీచాలని తిండి. ఊపిరి పీల్చడానికి కూడా ఇబ్బంది పెట్టే రోగాలు. ఇలా మేము క్షయ వ్యాధితో ఎముకల గూళ్ళలా ఉండిపోతాము.

మా పిల్లలు చదువుకోవాలంటే మధ్యాహ్న భోజనాల కోసం మాత్రమే టీచర్లు వచ్చే ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడాలి, లేదంటే మా బొంగబురు( సంతాలీల దేవుళ్ళలో ఒకరు) లని వదిలేసి యేసు, మేరీలని పూజించమనే క్రిస్టియన్ మిషనరీల దగ్గరికి పొవాలి. దీనికి మా పిల్లలు ఒప్పుకోకపోతే అక్కడ సిస్టర్లు, ఫాదర్లు హోప్న, సోం, సింగ్రాయ్ వంటి మా సంతాల్ పేర్లన్నీ బాలేవని నూరిపోస్తారు. వాళ్ళకి డేవిడ్, మైకేల్, క్రిస్టోఫర్, ఇలా ఏవో కొత్త పేర్లు పెడతారు. ఇది చాలనట్లు ముస్లిములు మా ఇళ్ళలోకి జోరబడి మా ఆడవాళ్ళతో పడుకుంటే సంతాల్ మొగవాళ్ళం ఏమీ చేయలేని నిస్సహాయులవుతాము.

ఏం చేసేదీ? వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ. సంతాల్ పరగణా లోని ఒక్కో గ్రామం నెమ్మదిగా ముస్లిం మెజారిటీ గ్రామం గా మారుతోంది. హిందువులు పాకుడ్ వంటి పెద్ద ఊళ్ళలో ఉంటారు. సంతాల్ గ్రామాల్లో ఉండే కొద్దిమంది హిందువులూ తక్కువ కులాల వారు. కనుక వాళ్ళు కూడా బలహీనులే. అయినా హిందువులు మాకెందుకు సాయం చేస్తారు? పాకుడ్‌లో ఉండే ధనిక హిందువులకి మా భూమి మీద మాత్రమే ఆసక్తి. వాళ్ళ పెళ్ళిళ్ళలో మేము పాటలు పాడి డాన్సులు వేయాలి అని ఆశిస్తారు. ఎపుడైనా సాయం చేయడానికొస్తే ఆవు మాంసం, పంది మాంసం మానేయమని, హండీ (సంతాలీల ఒక రకం మద్యం) తాగడం మానేయమని అంటారు. వాళ్ళకి కూడా మేము మా సర్నా ధర్మం (సంతాలీల మతం) వదిలిపెట్టి వాళ్ళ సఫాహోర్ గా మారితే వాళ్ళ వోటు బ్యాంకు పెరుగుతుందని వాళ్ళ ఆశ. సఫా-హోర్ (  సంతాలీ మతంలోనే సామాజిక పరమైన మార్పులని ప్రచారం చేస్తూ, వచ్చిన కొత్త మతం ఇది) అంటే పరిశుద్ధమైన వ్యక్తులు. వాళ్ళంత పరిశుద్ధులు కారనుకోండి. వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థాయే. హిందువుల దృష్టిలో సంతాల్ వారు క్రిస్టియన్లు కాగలరు, లేదంటే సఫా-హోర్ లు కాగలరు. అంతే. మా సర్నా ధర్మం, మా మూలాలు, అన్నీ కోల్పోయి ఎక్కడికీ చెందని వారిగా మిగిలిపోతున్నాము.

అంతా బొగ్గు, రాళ్ళ మహిమే. వాటివల్ల మేము సోమరులమవుతున్నాము. కోయ్లా రోడ్డు మా గ్రామం మీదుగా పోతుంది. ఆ రోడ్డు మీద అంతపెద్ద హైవా లారీ బొగ్గు తవ్వుతూ ఉంటే ఇంకే బండికీ స్థలం ఉండదు. ఆ లారీ డ్రైవర్లు కూడా కొంచెం మొరటు మనుషులే. దారిలో వచ్చే వేరే బండిని గుద్దినా గుద్దగలరు. వాళ్ళనేమీ అనలేము. వాళ్ళ ఉద్యోగం అలాంటిది. ఎక్కువ రౌండ్లు తిరిగితేనే ఎక్కువ డబ్బు సంపాదించగలరు. మరి ఒకవేళ ఈ తిరుగుళ్ళలో ఎవరన్నా చనిపోతే? ఎవరో పోయారని బొగ్గు గనులలో తవ్వకాలు అపెయ్యలేవు కదా కంపెనీలు? చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఏదో కొంత డబ్బులిస్తారు. దానితో అంతా నోరు మూసుకుంటారు, డ్రైవరు ఇంకో లోడ్ దింపడానికి ఇంకో ట్రిప్ వేస్తాడు. అంతే.

మరి సంతాలీలం ఏం చేస్తామో తెలుసా? ఆ కోయ్లా రోడ్డు మీద నో ఎంట్రీ బోర్డు పెట్టేదాకా ఆగుతాము. తర్వాత ఆడా మగా పిల్లా జెల్లా అందరం అక్కడికొచ్చి హైవా లారీ చుట్టూ చేరి వేళ్ళూ గోళ్ళూ అన్నీ వాడి బొగ్గు దొంగిలిస్తాము. ఆ డ్రైవర్లు గానీ, కంపెనీ వాళ్ళు ఆ రోడ్డు పొడుగుతా పెట్టిన బాన పొట్టల బీహారీ సెక్యూరిటీ గార్డులు కానీ మమ్మల్ని ఆపలేరు. మాకు అడ్డు తగిలితే అందరం కలిసి ఘెరావ్ చేసి వాళ్ళ లారీలని కదలకుండా చేస్తామని వాళ్ళకీ తెలుసు. అయినా ఈ కంపెనీ టన్నుల కొద్దీ బొగ్గు తవ్వుతూ ఉంటుంది. దానితో పోలిస్తే కొన్ని క్వింటాళ్ళు మేము దొంగతనం చేయడం ఏపాటి? సిదో, కన్హో ( ఇద్దరూ 19వ శతాబ్దంలో ఆంగ్లేయులకి, జమిందార్లకి వ్యతిరేకంగా జరిగిన ఒక సంతాలీ తిరుగుబాటుకి నాయకత్వం వహించారు.) వంటి సంతాల్ వీరుల  వారసులం మేము. మేము నిజంగా పూనుకుంటే ఈ వ్యాపారమంతా ఆగిపోతుంది. అందువల్ల వాళ్ళూ తెలివిగా వదిలేస్తారు. అయినా వాళ్ళు ఇప్పటికే మా భూమి లాక్కున్నారు, మా బొగ్గుని దొంగిలిస్తున్నారు. దొంగల నుంచి తిరిగి దొంగిలించే హక్కుని లాక్కోలేరు.

అసలు ఈ బొగ్గే మమ్మల్ని నెమ్మదిగా మింగేస్తోందండీ. కోయ్లా రోడ్డు నిండా అదొక రకం చెరిపివేయలేనంత నలుపు ఆవరించి ఉంటుంది. మా ఊళ్ళోని చెట్టూ పుట్టా నల్లటి ఆకులనిస్తున్నాయి. మా ఎర్రటి మట్టి నల్లగా మారిపోయింది. రాయీ, రప్పా, మానూ, మట్టీ అంతా నలుపే. మా గుడిసెల పైనున్న ఎర్రటి పెంకులు ఆ రంగునెప్పుడో కోల్పోయాయి. మా ఇళ్ళ గోడలపై మేము గీసే తీగలు, నెమళ్ళు, పువ్వులూ అన్నీ నలుపై పోయాయి. ముందే నల్లగా ఉండే మా పిల్లలంతా నల్లటి దుమ్ము బారిన పడ్డారు. వాళ్ళు ఏడుస్తున్నపుడు కళ్ళ నుండి జారే కన్నీటిని చూస్తే కరువు ప్రాంతాన్ని కోసుకుని పారుతున్న నదిలా ఉంటుంది. మా కళ్ళు మాత్రమే కట్టెనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. మా పిల్లలు ఈమధ్య పెద్దగా స్కూలుకి కూడా వెళ్ళట్లేదు. కానీ స్కూలుకి వెళ్ళేవాళ్ళూ, వెళ్ళని వాళ్ళూ అంతా పగలూ రాత్రీ ఎప్పుడైనా బొగ్గు దొంగిలించడానికి, అమ్ముకోడానికి మార్గాలు వెదుక్కుంటూ తయారుగా ఉంటున్నారు.

మా సంతాల్ వారికి వ్యాపారం అర్థం కాదు. మాకు బొగ్గు తేలిగ్గా దొరుకుతుంది కానీ మేము దానికి డబ్బులు ఎక్కువ అడగము. తినడానికి, తాగడానికి, బట్ట కట్టడానికి మాకు డబ్బులు కావాలంతే. కానీ జోలహాలు – మీరు ముస్లిములంటారు, మేము జోలహా అంటాము – అలా కాదు. వాళ్ళకి బొగ్గు విలుగా, డబ్బు విలువా రెండూ తెలుసు. వాళ్ళకి కావాల్సిన ధరకి అమ్ముతారు. మటియాజోర్ నుండి ఎంత దూరం పోతే బొగ్గుకి అంత ఎక్కువ ధర పలుకుతుంది.

పదేళ్ళ క్రితం మటియాజోర్ నుండి సంతాల్ కుటుంబాలు ప్రతి సంవత్సరం లాగానే నమాల్ ప్రాంతపు పొలాలలో కౌలు వ్యవసాయం చేయడానికి పోతూ ఉంటే నాలుగు జోలహా కుటుంబాలు ఎక్కడినుంచో వచ్చి ఆశ్రయం అడిగాయి. చూడ్డానికి వాళ్ళంతా మాకంటే బీదగా అనిపించారు. మేము నమాల్ వెళ్ళినపుడు ఇక్కడ మా పొలాలలో సాగు చేసుకుంటామని, వచ్చిన పంటలో వాటా పంచుకుందామనీ అన్నారు. మేము నమ్మి సరేనన్నాము. వాళ్ళు మటియాజోర్ లోనే ఓ చివర్లో నాలుగు గుడిసెలు వేసుకున్నారు. ఇపుడు ఆ నాలుగు గుడిసెలు వేసిన ప్రాంతం వంద ఇళ్ళ టోలా గా మారిపోయింది. ఇళ్ళు – గుడిసెలు కావు. మా సొంత ఊళ్ళో సంతాలీలం అంతా ఇంకా మట్టి గుడిసెల్లోనే ఉన్నాము. కానీ ప్రతి జోలహా ఇంటికీ కనీసం ఒక ఈటికెల గోడ, ఒక సిమెంటు ముంగిలి అన్నా ఉన్నాయి. ఈ టోలా ని ఇప్పుడు మటియాజోర్ జోలహా టోలా అంటున్నారు. ఒకప్పుడు మటియాజోర్ అంటే సంతాల్ గ్రామం. ఇప్పుడు ఇక్కడ ఒక జోలహా టోలా, ఒక సంతాల్ టోలా ఉన్నాయి. జోలహా టోలా పెద్దది. ఒక్కోసారి నాకు ఇక్కడ ఎవరు మైనారిటీనో అర్థం కాదు.

ఈ జోలహాలు కష్టించి పని చేస్తారు, కలిసి కట్టుగా ఉంటారు. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి, చిన్న చిన్న విషయాలకి తలలు పగులగొట్టుకుని పోలీసులు, కోర్టుల దాకా పోతారు కానీ, ఎవరన్నా బయటివాళ్ళొచ్చి ఒక జోలహాని ఒక మాటన్నా చాలు వాళ్ళంతా కలిసి ఆ అన్నవారి మీదకి పోతారు. పాకుడ్, సాహెబ్ గంజ్ వంటి ఊళ్ళ నుంచి కూడా జోలహా నాయకులు వచ్చేస్తారు వీళ్ళకి సపోర్టుగా. మరి సంతాల్ వారి కథేమిటి? చిన్న చిన్న కారణాలకీ, ఒక్కోసారి తప్పుడు కేసులు పెట్టీ మా వాళ్ళని కొట్టి పోలీసు లాకప్ లలో పడేస్తారు. మా ఆడవాళ్ళని రేప్ చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు కోయ్లా రోడ్డులో ఒళ్ళమ్ముకుంటారు. మాలో చాలామంది పుట్టిన ఊరు వదిలి పారిపోతున్న వారే. ఇక మాలో ఐకమత్యం ఏపాటిది? సంతాల్ నాయకులు … ఆ దొంగ వెధవలు… ఏరీ?

క్షమించాలి. ఏం చేసేది ఇక? నాకు అరవై ఏళ్ళు. ఈ లాకప్‌లో వేసి చితకబాదారు. ఇంక నాకు ఓపిక లేదు. కోపం ఒక్కటే ఉంది. ఏమిటి చెప్తున్నాను…? ఆ… మా సంతాల్‌ల కోసం పోరాడే ఒక బలమైన, గట్టి గొంతుక ఏదీ లేదు. బోలెడు సొమ్ములు దాచుకున్న భూమిపై పుట్టినా డబ్బు లేదు. మా సంపదనెలా కాపాడుకోవాలో మాకు తెలియదు. తప్పించుకు పారిపోడం ఒక్కటే మాకు తెలిసింది.

ప్రతి సీజన్ లోనూ కౌలు వ్యవసాయం కోసం వేల కొద్దీ సంతాలీలు పాకుడ్, సంతాల్ పరగణాల నలుమూలల నుండీ నమల్ వెళ్ళే ట్రెయిన్ ఎక్కుతూ ఉంటారు. మా భూముల నుంచి పారిపోడానికే నేమో.

ఇందాక చెప్పలేదూ నేను ఒకప్పుడు రైతునని? ఇపుడు నా కొడుకులు వ్యవసాయం చేస్తున్నారు. పెద్దాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడ పొలాలు చూసుకోడానికి. మిగితా ఇద్దరూ ప్రతి ఏడూ సీజన్ రాగానే కుటుంబాలతో సహా నమాల్ తరలి వెళతారు.

నేను గతంలో పాటలకి బాణీ కట్టేవాడిని. ఇప్పుడూ కడతాను. నాకొక నృత్య బృందం కూడా ఉంది. ఇది ఒకప్పుడు..అంటే పదిహేను-ఇరవై ఏళ్ళ క్రితం లాగా లేదు అనుకోండి. అప్పుడు నేను కూడా కొంత యవ్వనంలో ఉండేవాడిని. బలం, ఆసక్తి, ఆశా అన్నీ మెండుగా ఉండేవి. మటియాజోర్, పతర్ కోలా, అమడాపాడా – అన్ని ప్రాంతాల వారూ నా బృందంలో ఉండేవారు. నేను పాటలు రాసి బాణీలు కట్టేవాడిని. నా బృందంలోని యువతీ యువకులు తమ గొంతుకలనిచ్చీ, నాట్యం చేసీ, టామాక్-తుమ్దా ల తాళాలతో, తిరియో, బానాం ల తాళాలతో ఈ పాటలకి ప్రాణం పోసేవారు.

ఆరోజుల్లో మా సంతాల్ పరగణాని ఇన్ని జిల్లాలుగా విభజించలేదు. ఇప్పుడు దికూలు, బీహారీలు అంతా వచ్చి తమ స్వప్రయోజనాల కోసం మా పరగణాని ముక్కలు చేశారు. వాళ్ళకి కావాలంటే ఇలా ముక్కలు చేసీ చేసీ ఆఖరుకి ప్రతి పది బై పది అడుగుల స్థలాన్నీ ఓ ఊరు అనేయగలరు. నేను యువకుడిగా ఉన్నపుడు ఇంకా జార్ఖండ్ కూడా బీహార్ నుండి విడివడలేదు. కానీ అప్పట్లో మాకు భవిష్యత్తు మీద ఆశ ఉండేది. మేము మా పల్లె లోనే కాక చుట్టుపక్కల పాకూర్, డుమ్కా, సాహెబ్ గంజ్, దేవ్గఢ్, పట్నా, రాంచీ, కోల్కతా దాకా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. ఒకసారి భుభనేశ్వర్ వెళ్ళినపుడు పూరి తీసుకెళ్ళి సముద్రాన్ని చూపించారు కూడా. ఎంత అద్భుతంగా ఉండింది అసలు! మేము గొడ్డా జిల్లా లో కూడా ప్రదర్శన ఇచ్చాము. అక్కడే నా కూతురు ముగ్లి కి పెళ్ళయింది. ఆరోజుల్లో ఈ ప్రదర్శనలకి డబ్బులిచ్చేవాళ్ళు. మంచి ఆహారం పెట్టేవాళ్ళు. మెడళ్ళు, షీల్డులు బహుకరించేవాళ్ళు. మా గురించి పత్రికల్లో రాసేవాళ్ళు.

ఇప్పుడంతా మారిపోయింది. నా బృందంలోని వారంతా పెద్దవాళ్ళైపోయారు. కొంతమంది చనిపోయారు. కొంతమంది శాశ్వతంగా వలస పోతే కొంతమంది ప్రతిఏడూ‌ కొన్నాళ్ళు వలస పోతున్నారు. మిగిలిన వాళ్ళం ఏదో కూనిరాగాలు తీస్తూ మా మధ్య మేము పాడుకుంటూన్నాం‌ గానీ ప్రదర్శనలు ఇవ్వడం అసాధ్యం. అందరం అలిసిపోయాము. నా లాగే అందరికీ భ్రమలు తొలిగిపోయాయి. ఆ షీల్డులు, అవార్డులూ ఏమిచ్చాయి మాకు చివరికి? దికూ పిల్లలు స్కూళ్ళకి, కాలేజిలకి పోతారు. చదువుకుంటారు. ఉద్యోగాలు చేస్తారు. సంతాల్ వాళ్ళకి వచ్చేది ఏమిటి? మాకు కళాకారులుగా నైపుణ్యం ఉంది. కానీ ఈ కళ మాకేమిచ్చింది? క్షయ వ్యాధిని ఇచ్చింది. మా భూముల నుండి మమ్మల్ని తరిమేసింది.

నాకు అరవై ఏళ్ళు. ఇంకా ఎక్కువే అనుకుంటాను. ఇపుడు నన్ను గౌరవంతో హరాం అంటున్నారు. పెద్ద కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. గొంతు బాగానే ఉంది కానీ వినికిడి కొంచెం తగ్గింది. మా ఊళ్ళో వాళ్ళంతా నా గొంతులోని మాధుర్యం ఇంకా తగ్గలేదంటారు. ఒక్కోసారి నన్ను పాడమని అడిగితే నేను వాళ్ళ ఆనందంకోసం పాత పాటలు పాడుతూ ఉంటాను. ఇప్పుడూ కొత్తవి అప్పుడప్పుడూ బాణీలు కడుతూ ఉంటాను కానీ ఏ ఆర్నెల్లకో ఒకసారి. అంతే. అదీ చిన్న చిన్న పాటలు – ఆరు-ఎనిమిది లైనుల లోపే. గతంలో కొంత పేరు తెచ్చుకున్నాను కనుక ఇప్పటికీ అప్పుడప్పుడూ పాకుడ్, డుమ్కా, రాంచీ ఇలాంటి ఊళ్ళలో ప్రదర్శనలకి పిలుస్తూ ఉంటారు.

ప్రతి ప్రదర్శనకీ ఒక బృందాన్ని కూడగడుతూ ఉంటాను. కానీ ఎవరూ ఎక్కువ కాలం ఉండరు. ఇవాళ ఒక నాట్యకారుడు ఉన్నాడు అనుకోండి – రేపు వాడే బర్దమాన్ లో ఎవరో బెంగాలీ జమీందారు పొలంలో ఆలుగడ్డలు పండిస్తూ ఉండొచ్చు. కాబట్టి వాడిని మార్చాల్సి వస్తుంది. రెండ్రోజుల తర్వాత వాడు తిరిగి వస్తే, వాడి స్థానంలో పెట్టిన వాడిని మార్చాలి. ఇలా ఉంటుంది వరస. కానీ ఈ ప్రదర్శనల వల్ల ఎంతో కొంత డబ్బు వస్తుంది. కొంచెం పెద్ద టవున్ లకి పోతే మంచి ఆహారం లభిస్తుంది. అందుకని వీటిలో ఇంకా పాల్గొంటున్నాము.

మా ఆటా పాటా మాకు పవిత్రమైనవి. కానీ, ఆకలి, పేదరికం తట్టుకోలేక మేము వాటిని కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. మా కుర్రాళ్ళు దికూ పెళ్ళిళ్ళలో ప్రదర్శిస్తున్నపుడు నేను పిచ్చివాడిలా అంతా మా కళని చూడాలి అనుకుంటాను. కానీ, మా సంగీతాన్ని వినే దికూ ఎవడు? పెద్ద పెద్ద ఫంక్షన్ లలో సైతం దికూలు మామూలుగా ఈ ప్రదర్శన ఎప్పుడవుతుందా?‌ అని చూస్తూ ఉంటారు. కానీ, ఒక క్రీడల పోటీ, ఒక శంకుస్థాపన, ఇలా పెద్ద వాళ్ళొచ్చే ఏ సందర్భం అయినా ఆదివాసీ, జార్ఖండ్ సంస్కృతి పేరు చెప్పి మా నృత్య ప్రదర్శన ఒకటి పెట్టడం తప్పనిసరి. బీహార్, బెంగాల్, ఒరిస్సా – అందరూ జార్ఖండ్ మాదే అంటారు. కానీ వాళ్ళ సంస్కృతి, కళలు మాకంటే గొప్పవి అంటారు. మరి వాళ్ళ ఆడవాళ్ళతో ఈ జార్ఖండ్ సంస్కృతి నృత్యాలు చేయించొచ్చుగా ఈ బహిరంగ ప్రదర్శనల్లో? చదువు, ఉద్యోగం, ఎందులోనన్నా ఏదన్నా ఒక విషయంలో లాభం పొందాలంటే అంతా జార్ఖండ్ మాది అంటారు – ఆదివాసీలు ఎటుపోయినా ఎవరికీ పట్టదు. కానీ, జార్ఖండ్ సంస్కృతి ప్రదర్శించాలంటే మాత్రం ఆ బాధ్యత ఆదివాసీలదే అనమాట.

ఇంతకీ రాష్ట్రపతి ముందు నిలబడి మాట్లాడే అవకాశం ఎలా వచ్చింది? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. మూడు నెలలక్రితం మటియాజోర్ లోని మా ఇంటికి జార్ఖండ్ ప్రభుత్వం అధికారిక చిహ్నంతో ఉన్న ఒక లెటర్ వచ్చింది. బాగా మందంగా ఉన్న కాగితంపైన హిందీలో ముద్రించిన అక్షరాలున్నాయి. ఐదు వాక్యాలు కూడా లేని ఉత్తరంలో ఉన్నదేమిటంటే – జార్ఖండ్ ప్రభుత్వం నన్ను ఏదో అధికారిక సభలో ప్రదర్శించమని అడుగుతోంది. కానీ వివరాలు తర్వాత చెబుతారంట. ఓ పావుగంట-ఇరవై నిముషాల ప్రదర్శనకి ఒక బృందాన్ని తయారు చేసుకోమని, బాగా డబ్బులిస్తామనీ సారాంశం. ఎవరో రాంచీకి చెందిన పెద్ద ఐ.ఏ.ఎస్. అధికారి సంతకం పెట్టాడు దానిమీద.

ఆకలిగొన్న వాడికి కావాల్సినది ఏమిటి? ఆహారం. బీదవాడికి కావాల్సినది? డబ్బు. మరి నాకు రెండూ కావాలి కదా. పేరు కూడా. కళాకారులకి ఆశ ఎక్కువ. మమ్మల్ని అంతా గుర్తించాలని, గుర్తుంచుకోవాలనీ ఒక తాపత్రేయం. అందువల్ల మారు ఆలోచించకుండా వెంటనే ఒప్పుకుంటూ జవాబు పంపాను. ఈ లెటర్ రిజిస్టర్ పోస్టులో పంపడానికి నేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకూరు పెద్ద పోస్టాఫీసుకి ఒక్కడినే వెళ్ళొచ్చా. నాలాగా పాకుడ్ వెళ్తున్న సంతాలీలతో కలిసి ఒక కిక్కిరిసిన విక్రం బ్రాండు ఆటోలో వెళ్ళొచ్చాను. దాదాపు అందరం ఆ కోయ్లా రోడ్డు తాలూకా బొగ్గు-దుమ్ము మొహం మీద పులుముకున్నాము కానీ నేను అసలు ఆ విషయం పట్టించుకోనేలేదు.

నేను ఈ ప్రదర్శన కోసం ఒక బృందాన్ని తయారుచేస్తూ, పాత పాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నా కూతురు ముగ్లి ని గొడ్డా జిల్లాలో ఇచ్చామని చెప్పాను కదా? ఆమె తరుచుగా నా మొబైల్ ఫోనుకి కాల్ చేయడం మొదలుపెట్టింది. నాకు మొదట విషయమేమిటో అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళ భూమి గురించిన వివాదం ఏదో ఉందని మాత్రం అర్థమైంది. నా అల్లుడు రైతు. ఆ కుటుంబం, అక్కడి సంతాలీలు చాలా మంది రైతులే. చుట్టుపక్కల గ్రామాల నిండా సంతాలీలు, పహాడియాలు, తక్కువ కులం హిందువులే.

జరిగిందేమిటంటే ఆ జిల్లా అధికారులు ఈ మొత్తం చుట్టుపక్కల పదకొండు గ్రామాల వారినీ ఖాళీ చేసి పొమ్మన్నారట. పల్లెలు, పొలాలు, అంతా ఖాళీ కావాలట. ఆశ్చర్యంగా అనిపించడం లేదా? అందరికీ కలిగిన మొదటి ప్రశ్న: ఇంత భూమిని స్వాధీనం చేసుకుని సర్కారు ఏం చేయబోతోంది? అనే.

నేను మొదట ఇవన్నీ పుకార్లు అనుకున్నా. పైగా సంతాల్ పరగణా నుండి సంతాల్ వాళ్ళని ఎలా పంపేస్తారు? మనకోసం టెనన్సీ ఆక్ట్ వంటి చట్టాల్లేవా? అనుకున్నాను. ఈ పుకార్లు మొదలయ్యాక గొడ్డా వెళ్ళాను. మేమందరం ఒక గుంపుగా ఏర్పడి బ్లాక్ ఆఫీసు వద్దకి వెళ్ళాము. అక్కడి అధికారులు కూడా ఇదంతా పుకారే – మీ భూములు, మీ పల్లెలు ఎక్కడికీ పోవని భరోసా ఇచ్చారు.

కానీ, కొంతకాలానికి ఈ పల్లెల్లోకి పోలీసులొచ్చారు. రావడం రావడం జిల్లా అధికారుల నుండి ఆర్డర్లతో వచ్చారు. థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం కోసం మా పల్లెలన్నీ ఖాళీ చేయాలట.

ఈ పల్లెల్లోని జనం దీనిని ప్రతిఘటించారు. సంతాలులు, పహాడియాలు, తక్కువ కులం హిందువులు – అంతా ఒక్కటై ఎదిరించారు.

జిల్లా పరిపాలనా సిబ్బందేం తక్కువ తినలేదు. ఈ ప్రతిఘటించిన అందరినీ కొట్టించి లాకప్ లలో వేయించారు. నా అల్లుడిని కూడా జైల్లో పెట్టడంతో నా కూతురిని, ఆమె పిల్లలని మటియాజోర్ వచ్చేయమని చెప్పాను. ముగ్లి, పిల్లలు, తన అత్తమామలతో సహా మా ఊరు వచ్చారు. ఏటేటా కౌలు వ్యవసాయం కోసం దూరాలు పోయే స్థానికుల వల్ల ఖాళీ అయ్యే మా ఊరు ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది.

అయితే, నా మీద ఆధారపడ్డ వీళ్ళందరికీ తిండి ఎలా పెట్టేది? ఇలాగే తమ ఇళ్ళకి వచ్చిన బంధువులకి నా బృందం లోని సభ్యులు అన్నం పెట్టేదెలా? మాకు డబ్బులు కావాలి. వివరాలు చెప్పకుండా ఆహ్వానించిన ఈ ప్రభుత్వం వారి ఉత్సవమే మాకు దిక్కు. అందువల్ల ఈ సమస్యల మధ్య కూడా మేము వదలకుండా ప్రాక్టీసు చేస్తూ ఉన్నాము.

ఇదిలా ఉండగా ఇలా గొడ్డా లో ఇళ్ళని పోగొట్టుకున్న వాళ్ళకి సాయం చేస్తామని కొందరొచ్చారు. వీళ్ళు రాంచీ, డిల్లీలలోని ప్రభుత్వాలకి ఉత్తరాలు రాశారు. ఈ థర్మల్ ప్లాంటు కడుతున్న వ్యాపారవేత్తకి కూడా రాశారు. ఈయనొక డబ్బున్న, తెలివైన ఎం.పీ. ఈయనకి గుర్రాలతో ఆడే ఏదో ఆట – పోలో అంటే ఇష్టమంట. ఈ గుర్రాలు సంతాల్ పరగణాలోని సంతాల్ లు అందరికంటే చురుకైనవి అని విన్నాము.

గొడ్డా లో జరుగుతున్న కథ పత్రికల్లో, వార్తల్లో రావడం మొదలైంది. మేము మా ప్రాక్టీసు కొనసాగిస్తున్నాము కానీ ఇలాంటి గడ్డు పరిస్థితులలో దానిమీద పూర్తి దృష్టి ఎలా పెట్టగలము? ఈ మధ్య నాకు రాంచీ, డుమ్కా, పాకుడ్ ల అధికారుల నుండి ఫోనులు వచ్చాయి. బాగా సాధన చేయండి, ఇది చాలా పెద్ద ప్రదర్శన, గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు, అని. అసలు కొంతమంది అధికారులు నిజంగా మేము సాధన చేస్తున్నామా లేదా అని చూడ్డానికి మటియాజోర్ వచ్చి వెళ్ళారు కూడా. వచ్చినపుడు మాతో తియ్యటి కబుర్లు చెప్పి, నవ్వుతూ, ప్రోత్సాహకరంగా మాట్లాడారు. మా పరిస్థితి తెలిసీ అలా ఎలా మాట్లాడి వెళ్ళారో అర్థం కాలేదు. “అసలు ఓ పక్క మా జీవితాలని పెకలిస్తూ మీరు అంత ఉదాసీనంగా ఎలా ఉంటున్నారు? ఈ పరిస్థితులలో మేము పాటలూ, నాట్యాలు ఎలా చేయాలి?” అని చాలాసార్లు అడగాలనిపించింది నాకు. “అసలు ఆ వీఐపీ ఎవరు? భారత రాష్ట్రపతా? అమెరికా ప్రెసిడెంటా? పాకుడ్ లోని సంతాలీలను నాట్యాలు చేయమంటున్నారు. గొడ్డా లోని సంతాలీలను తరిమేస్తున్నారు. మీ ముఖ్య అతిథికి ఈ విషయం తెలియదా? ఆయన వార్తలు చూడడా? పత్రికలు చదవడా? అమాయకపు సంతాలీలకే ఈ అన్యాయం బాగా కనిపిస్తోంది. అంత గొప్పోళ్ళకి కనబడ్డం లేదా?” అని కూడా అడగాలనిపించింది.

కానీ నేను ఊరుకున్నాను.

ప్రదర్శన తేదీ ఇంకా మూడు వారాలలో ఉందనగా చివరికి మాకు కొన్ని వివరాలు తెలిశాయి. మొదట పుకార్లు విన్నాము, తరవాత వార్తల్లో చూశాము.

ఆ పోలో ఆడే వ్యాపారవేత్త గొడ్డాలో థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నాడు. పాకూర్, సాహెబ్ గంజ్ లలోని బొగ్గు గనుల నుండి అక్కడికి బొగ్గుని పంపిస్తారు. కావాలంటే ఇతర ప్రాంతాలనుంచి కూడా తీసుకొస్తారు. అసలైతే ఈయన జార్ఖండ్ లో కొత్త ఉక్కు, ఇనుము కర్మాగారాలు పెట్టబోతున్నాడు. దీనికి పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా అవసరం. దీనికోసం ఈ పవర్ ప్లాంటు పెడుతున్నాడు. అంటే ఇది తన స్వార్థం కోసం. కానీ యావత్ జార్ఖండ్‌కి విద్యుత్ వస్తుందని, అసలు టవున్‌లలో విద్యుత్ కోత ఉండదు, ఫ్యాక్టరీలు ఆగకుండా పనిచేయొచ్చు అనీ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధీ, ఆనందం వెల్లివిరిస్తాయి అనమాట. ఈ ప్లాంటు శంకుస్థాపన భారత రాష్ట్రపతి చేస్తాడంట. ఆయన ముందే మేము ప్రదర్శన ఇవ్వాలి అని తెలిసింది.

మేమందరం ఆశ్చర్యపోయాము. ఈ ప్లాంటు విషయం బాధపెట్టింది. కానీ ఒక విధంగా ఆనందం కలిగించింది. మేము గతంలో ముఖ్యమంత్రులు, గవర్నర్ల ముందు ప్రదర్శించాము కానీ, రాష్ట్రపతి ముందు ఎప్పుడూ చేయలేదు. గొప్పగా అనిపించింది తల్చుకుంటే.

మా గ్రామాల నుండి కొత్త వార్తలు వచ్చాయి. జిల్లా యంత్రాంగం తమని ఊరు ఖాళీ చేయమనడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న అందరినీ పోలీసులు కొట్టి లాకప్లో వేస్తున్నారు. పేరామిలిటరీ, సీఆర్పీఎఫ్ దళాలు వచ్చాయంట పరిస్థితిని అదుపులోకి తేవడానికి. పదకొండు గ్రామాల్లో నాల్గింటిని శంకుస్థాపన స్థలం కోసం ఇప్పటికే బుల్డోజర్లు పెట్టి నాశనం చేసేశారంట.

కానీ పత్రికలు మాత్రం రిపేర్లు ముగించుకుని ముస్తాబవుతున్న రాంచీ, డుమ్కారోడ్ల గురించి గొప్పగా వ్యాసాలు రాశాయి. రాష్ట్రపతి జార్ఖండ్‌లో మూడు రోజులుంటాడని -ఒకరోజు రాంచీ, రెండో రోజు డుమ్కాలో ఒక విశ్వవిద్యాలయపు స్నాతకోత్సవం, మూడో రోజు గొడ్డా వచ్చి ఈ శంకుస్థాపన చేసి తిరిగి పోతాడని గుక్కతిప్పుకోకుండా ఆయన కార్యక్రమాల గురించి రాశాయి.

వారంలో ఈ శంకుస్థాపన ఉత్సవం అనగా మళ్ళీ చివరి సారి గుర్తుచేశారు. ముందు రోజు మమ్మల్ని గొడ్డా కి బస్సులో తీసుకెళ్ళారు. అసలా జిల్లా, హెడ్ క్వార్టర్స్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఒక ఫుట్బాల్ మైదానాన్ని హెలీపాడ్ గా మార్చేశారు. వందలకొద్దీ పోలీసు వాళ్ళు, సీఆర్పీఎఫ్ జవానులూ ఉన్నారు. ఎక్కడ చూసినా జన సముద్రం. వీళ్ళంతా ఆ హెలికాప్టర్ చూడ్డానికి వచ్చారనుకుంటాను. పత్రికల్లో కనీ కనిపించకుండా నిరసనకారులని ఎక్కడో ఒక చోట ఉంచారన్న వార్త ఒకటి చదివాను. నా అల్లుడు బహుశా అక్కడే ఉన్నాడేమో.

నేను నిలబడ్డ దగ్గర్నుంచి చూస్తే ఉత్సవం జరిగే వేదిక చాలా పెద్దగా కనిపించింది. అయినా కూడా దాన్ని ఎక్కాలనుకునేంత మందికి చాలదేమో అనిపించింది. డిల్లీ, రాంచీ నుండి వచ్చిన మంత్రులు మంచి మంచి గుడ్డలేసుకుని, వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ ఈ అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు. సంతాల్ పరగణా ఇపుడు డిల్లీ బాంబే లలా మారిపోతుంది. చంద్రుడి వైపు దూసుకు పోతుంది. మన వ్యాపారవేత్త మొహమంతా నవ్వే. నలుమూలలా పెట్టిన లౌడ్ స్పీకర్ల నుండి హిందీలో దేశభక్తి గీతాలు వినిపిస్తూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళని ఉత్సాహ పరచడానికి ఎవరో ‘భారత్ మహాన్’ అని అరిచారు ఈ లౌడ్ స్పీకర్లలోకి. ఏంటో ఆ ‘మహాన్’? ఇలా వేలకొద్దీ ప్రజలని నిరాశ్రయులని చేసి నగరాలకి, ఫ్యాక్టరీలకి విద్యుత్ ఇచ్చే దేశం అంత గొప్పదెలా అవుతుందో నాకు అర్థం కాలేదు. ఉద్యోగాలిస్తారంట. ఏం ఉద్యోగాలు? ఆదివాసీ ఉద్యోగధర్మం వ్యవసాయం చేయడమే. ఇంకేం చేయాలి ఇది కాకుండా? వారం క్రితం తనదైన భూమిలోనే ఇపుడు ఓ కోటీశ్వరుడి ఫ్యాక్టరీ పనివాడిగా చేరడమేనా ఉద్యోగం?

పత్రికల వాళ్ళు కెమరాలతో తిరుగుతున్నారు. పెద్ద పెద్ద డిష్ ఆంటెనాలు ఉన్న వ్యాన్‌లు మూడు వేదిక దగ్గర నిలిపి ఉంచారు. ఒక వ్యానుపై ఉన్న ప్రముఖ టీవీ ఛానెల్ బొమ్మని నేను గుర్తుపట్టాను. వీళ్ళలో ఎవరన్నా మా వాళ్ళని పోలీసులు బంధించి ఉంచిన ప్రదేశానికి వెళ్ళారా? అన్న సందేహం కలిగింది నాకు.

కళాకారుల కోసం కట్టిన ఒక చిన్న ఆవరణలో మమ్మల్ని ఉంచారు. మా ట్రూపులోని ఆడవాళ్ళంతా ఎర్రటి బ్లౌజులు, నీలం రంగు గౌనులు ధరించి, పైన ఆకుపచ్చ పల్లూలు కప్పుకున్నారు. తలనిండా రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులు దోపుకున్నారు. చేతుల్లో ఉన్న స్టీలు లోటాలలో ఆకులు, పువ్వులూ పెట్టారు. మగవాళ్ళంతా ఎర్రటి ఫుట్బాల్ జెర్సీలు, ఆకుపచ్చ రంగు సంప్రదాయ వస్త్రం కాచా, తలగుడ్డలూ కప్పుకున్నాము. అందరం చూడముచ్చటగా తయారయ్యాము.

పెద్ద శబ్దం చేస్తూ, దుమ్ము లేపుతూ, హెలికాప్టర్ వచ్చింది. నెమ్మదిగా జనంలో అరుపులూ అవీ మొదలయ్యాయి.

రాష్ట్రపతిని అనుసరిస్తూ ఆయ్న సెక్యూరిటీ వాళ్ళు కూడా వేదిక వద్దకి వచ్చారు. ఆయన పొట్టి మనిషి. ఆలోచనాపరుడిలా ఉన్నాడు. బంగాలీ వాళ్ళు అంతా ఇలాగే ఉంటారు. ఈయన కూడా అక్కడివాడే కదా.

వేడుకలు మొదలయ్యాయి. ఇందాక భారత్ మహాన్ అని అరిచినాయనే మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఆ పెద్ద వ్యాపారవేత్త కోట్ల పెట్టుబడితో పవర్ ప్లాంటు స్థాపించడానికి జార్ఖండ్‌ని ఎన్నుకోడం ఎంత అదృష్టమో అని కొనియాడాడు. మరి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉండి, జనం అమాయకంగా ఉండి, రాష్ట్రాన్ని, దాని భూ వనరులనీ తమ ఆధీనంలో పెట్టుకున్న పేరాశ గల దొంగలు నాయకులుగా, అధికారులుగా ఉన్న జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో స్థలం దొరకడం ఆ కోటీశ్వరుడి అదృష్టం కూడా కదా – అది ఎవరూ ప్రస్తావించలేదు.

ఆ భారత్ మహాన్ మనిషి ఇపుడు స్వాగత నృత్యం ఉంటుందని ప్రకటించగానే మమ్మల్ని వేదిక మీదకి రమ్మన్నారు. మేము మా వాయిద్యాలు – టామాక్, తుమ్దా, తిరియో, బానాం లను తీసుకుని వేదికనెక్కాము. రాష్ట్రపతి మమ్మల్ని చూసి ఆనందించినట్లే కనిపించాడు. వ్యాపారవేత్త మాత్రం విసుగ్గా మొహం పెట్టాడు.

మేము వేదిక మీద మా మా స్థానాలు సరిచూసుకున్నాక నేను మైకు తీసుకుని రాష్ట్రపతికి నమస్కరించాను. తర్వాత మైకు పని చేస్తోందో లేదో సరి చూసుకుంటూ, నాకు వచ్చినంతలో ఉత్తమమైన హిందీ మాట్లాడదామని మొదలుపెట్టాను. అసలు అప్పటి నా మానసిక స్థితికి నేను ఏడవకుండా మాట్లాడ్డం గొప్ప విషయమే.

‘జోహార్, రాష్ట్రపతి బాబు. మీరు మా సంతాల్ పరగణా కి రావడం ఎంతో ఆనందదాయకం. మాకెంతో గర్వకారణం. అలాగే, మిమ్మల్ని మా ఊర్లోకి స్వాగతిస్తూ, మీ ముందు సంగీత నృత్య ప్రదర్శన చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా సంతోషంగా, గర్వంగా ఉంది. మా ప్రదర్శన మొదలయ్యే ముందు మీకో ప్రశ్న – అసలీ పాటలూ, నాట్యాలు చేయడానికి మా దగ్గర కారణమేముంది? మేము ఆనందంగా పాడుకోడానికి కారణాలు ఉన్నాయా? ఇపుడు మీరు ఈ పవర్ ప్లాంటు నిర్మాణం మొదలుపెడతారు. ఇది ఈ ప్రాంతంలో మా ఆదివాసీల జీవితానికి చరమగీతమే కదా? ఈ ప్లాంటు మా అదృష్టాలని తిరగరాస్తుందని మీ పక్కన కూర్చున్న వాళ్ళు అంటున్నారు. కానీ మా ఇళ్ళని, మా భూములనీ లాక్కున్నది కూడా ఈ ప్లాంటే కదా? ఇప్పుడు మాకు ఉండడానికి చోటు లేదు. సాగు చేసుకోడానికి పొలం లేదు. మరి ఈ పవర్ ప్లాంటు వల్ల మాకు జరిగిన మంచేమిటి? మేమెందుకు ఆనందంగా నృత్యాలు చెయ్యాలి? మా భూములూ, మా ఇళ్ళూ తిరిగి ఇచ్చేదాకా మేము పాడము, నాట్యాలు చేయము. మేము నర్తించము. ఆదివాసీలు నర్తిం….’

***

ఒక మాట:  ఈ కథ మొదట “The Dhauli Review” అన్న పత్రికలో వచ్చింది. తరువాత  ఇదే పేరుగల  కథా సంకలనంలో 2015 లో పుస్తకరూపంలో వచ్చింది. తెలుగు అనువాదానికి అనుమతినిచ్చిన రచయిత Hansda Sowendra Sekhar కు, ప్రచురణ కర్తలు Speaking Tiger Books వారికి ధన్యవాదాలు. – వి.బి. సౌమ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here