[dropcap]”సం[/dropcap]ధ్యా! రేపు ఉదయాన్నే మా కంపెనీ మేనేజరుతో కలిసి రాజమండ్రి వెళ్ళాలి. అవసరమైతే రాత్రికి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఒక జత బట్టలు సర్ది, ప్రయాణంలో తినడానికి ఏమైనా ప్యాక్ చేసి ఉంచు.” నిద్రకుపక్రమిస్తూ భార్యకు చెప్పి పడుకున్నాడు మహేష్.
తెల్లారి అయిదుకల్లా బయల్దేరిపోవడంతో కూతుర్ని నిద్ర లేపడమెందుకని, చెప్పకుండానే బయల్దేరిపోయాడు.
మహేష్‌ది ఎగువ మధ్యతరగతి కుటుంబం. పెద్దలిచ్చిన ఆస్తిని వృద్ధి చేసి, తండ్రి తన చేతికి పది ఎకరాల సాగు భూమిని వారసత్వంగా ఇచ్చాడు.
చివరిదశలో కాన్సర్‌తో పోరాడుతున్న తండ్రి వైద్యం కోసం తక్కువ రేటుకే రెండెకరాల వరకు అమ్మేయ్యాల్సి వచ్చినా దిగులు పడలేదు. చెల్లెళ్లిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసాడు.
ఊళ్ళో పలుకుబడి, నిజాయితీ ఉన్న సుందరం మాష్టారి అమ్మాయి సంధ్యని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లినాటికి ఇంటర్ వరకు మాత్రమే చదివి ఆపేసిన సంధ్య… సాంప్రదాయబద్ధంగా పెరిగిన పిల్ల. అత్తవారింట్లో అడుగుపెట్టగానే ఇట్టే ఇమిడిపోయింది. సుందరం మాష్టారి పెంపకం అలాంటిది.
అనువైన కోడలు రావడంతో మహేష్ తల్లి జానకమ్మ చాలా సంతోషించింది. సొంత కూతురిలాగే సంధ్యను తమలో కలుపుకుంది.
“ఏమండీ! నాకింకా చదువుకోవాలనుంది. ప్రైవేటుగా బీఏకి కట్టనా?” పెళ్ళయాక మొదటిసారి నోరుతెరిచి భర్తని అడిగింది సంధ్య.
“మనం ఉన్నది పల్లెటూరు. నీ చదువుతో ఇక్కడ పెద్దగా పనిలేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేస్తావు? బ్రతకడానికి నాన్నగారిచ్చిన భూములున్నాయి కదా” తేలిగ్గా తీసిపడేశాడు మహేష్.
“అది కాదండీ, పంట మీద ఆదాయం మనకెలాగూ సరిపోవడం లేదు. డిగ్రీ అయినా అయ్యిందనిపిస్తే, ఇంటి దగ్గర నలుగురికి ట్యూషన్లు అయినా చెప్పుకోవచ్చు అని” చూచాయగా మనసులో మాటను బయటపెట్టింది సంధ్య.
అంతా విన్న మహేష్ మౌనంగా ఊరుకున్నాడు. మర్నాడు టౌన్‌కి వెళ్లి ఫ్యాక్టరీలో పని వెతుక్కున్నాడు. క్లర్క్ ఉద్యోగం… పదిహేనువేలు జీతం. పంట మీద వచ్చే డబ్బుకు, ఈ జీతం కలిస్తే… వేన్నీళ్లకు చన్నీళ్ళు తోడు అన్నట్టు ఉంటుందని ఆలస్యం చెయ్యకుండా ఉద్యోగంలో చేరిపోయాడు.
అత్తగారికి సుస్తీ చేసి అనారోగ్యంతో మంచాన పడడంతో, ఇంటి బాధ్యతల చట్రంలో ఇరుక్కుపోయిన సంధ్య, మరెప్పుడూ తన చదువు గురించి ఆలోచించలేదు.
పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలకి ఎందరో దేవుళ్ళకు మొక్కి, ఎన్నో పూజలు చేసిన సంధ్యకి కడుపు పండి… పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
‘హనీష’ ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు పెరిగింది.
***
“ఏవండీ! ఇంతవరకూ ఎప్పుడూ ‘హనీ’ని విడిచి ఉన్నది లేదు. ఇప్పుడు దానికి హైదరాబాదులో సీటు వచ్చిందని హాస్టల్లో ఉంచి చదివించాలంటే ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు.” తన మనసులోని ఆందోళన అంతా భర్త ముందుంచింది సంధ్య.
“అదేమన్నా చిన్నపిల్లా? ఇంటర్మీడియట్ పూర్తయ్యింది. దాని వయసుకి నువ్వు పెళ్లి చేసుకుని ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నావు. ఈ కాలం పిల్లలకి మనం ఏమీ నేర్పక్కర్లేదు. అనవసరంగా ఆందోళన పడకు” అన్నాడు అనునయంగా.
అయినా సంధ్య ఊరుకోలేదు. మనం కూడా హైదరాబాదుకి మకాం మార్చేద్దామని మొండి పట్టు పట్టడంతో తన ఫ్రెండ్ కంపెనీలోనే ఉద్యోగం సంపాదించి హైదరాబాదుకి మకాం మార్చాడు మహేష్.
హైదరాబాదుకి వచ్చినదగ్గర్నుంచీ హనీషలో చాలా మార్పు వచ్చింది. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలోకి వచ్చేసరికి అడ్డూ… అదుపూ లేని స్నేహాలతో చదువు పక్కన పడేసింది. కూతుర్ని ఎప్పటికప్పుడు మందలిస్తున్నా, కొన్ని విషయాలు భర్త వరకూ వెళ్లకుండా జాగ్రత్తపడేది సంధ్య.
ఇంతకుముందు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుంటేనే కానీ టిఫిన్ ముట్టుకునేది కాదు హనీష. కానీ ఇప్పుడు ఎనిమిది దాటాకే నిద్ర లేవడం… ఒక్కోసారి స్నానం కూడా చేయకుండానే కాలేజీకి వెళ్లిపోవడం… ఎప్పుడో సాయంత్రం ఏడు తర్వాత ఇంటికి చేరడం… వస్తూనే ఫోను చేతిలోకి తీసుకుని రాత్రి పదకొండు వరకు ఫ్రెండ్స్‌తో చాటింగులు.
కూతురి ప్రవర్తనకు విసిగిపోయిన మహేష్, నయనా భయానా చెప్పి చూసాడు. భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్దని నచ్చ చెప్పాడు.
“మీవన్నీ పాత పద్ధతులు నాన్నా! మీ చాదస్తాల వల్లే అమ్మ చదువు కూడా ఆపేసి, తన ఇష్టాలూ, కోరికలూ అన్నీ తనలోనే సమాధి చేసేసుకుంది “
“సాంప్రదాయం, కట్టుబాట్లు పేరుతో ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు… హాయిగా ఎంజాయ్ చేసే వయసు నాది” నిష్కర్షగా తేల్చి చెప్పేసింది.
కూతుర్ని మందలిస్తే ఇంకా మొండికేస్తుందన్న భయంతో తామే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నారు.
ప్రతినెలా కూతురి అక్కౌంట్ లో పది వేలు జమ చేస్తూ, హనీష ఖర్చులకి కావాల్సిన డబ్బు ఆమే తీసుకునేలా ఏటీఎం కార్డు ఏర్పాటు చేశాడు మహేష్.
***
“అమ్మా! నాన్నెక్కడ? ఉదయం నుంచీ కనిపించలేదు.” బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అడిగింది హనీష.
“కంపెనీ పనిమీద రాజమండ్రి వెళ్లారు. ఆరు గంటలకే ఫ్లయిటు. నిన్ను లేపడమెందుకని నీకు చెప్పలేదు. రేపటికల్లా వచ్చేస్తారులే” కూరలు తరుక్కుంటూనే సమాధానమిచ్చింది సంధ్య.
పది నిముషాల్లో రెడీ అయ్యి కిందకి వచ్చిన కూతురితో “ఎక్కడికి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఈరోజు కాలేజీ లేదా?” అడిగింది సంధ్య.
“ఉందమ్మా! ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ లేవు. పైగా ఈరోజు సందీప్ బర్త్ డే. అందరం కలిసి సినిమాకి వెళ్లాలనుకున్నాం… నిన్ననే టికెట్స్ రిజర్వ్ చేసేసుకున్నాం” టిఫిన్ తినేసి గబగబా కాలేజీకి బయల్దేరిపోయింది హనీష.
ఎనిమిదవుతోంది. చీకటి పడిపోతున్నా హనీష ఇంటికి రాకపోయేసరికి సంధ్యలో ఆందోళన పెరిగిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏం చెయ్యాలో ఆమెకు పాలుపోలేదు. కంగారుగా హనీష స్నేహితులందరికీ ఫోన్లు చేసింది.
సినిమా అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేసామని, హనీష సంగతి తమకు తెలియదనీ చెప్పారు.
సంధ్యకి కాళ్ళూ, చేతులూ ఆడలేదు. పోలీసులకి ఫోన్ చేద్దామా అనుకుంది.
మహేష్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది.
“కంగారు పడకు… మా ఫ్రెండ్స్ అందరికీ ఇన్‌ఫార్మ్ చేస్తాను. రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా హైదరాబాదులో ల్యాండ్ అవుతాను” చెప్పి ఆడిటర్ దగ్గర వర్క్‌లో ఉన్న మహేష్ ఫోన్ పెట్టేసాడు.
ఆ రాత్రంతా గంట గంటకీ సంధ్యకి ఫోన్ చేసి ధైర్యం చెబుతూనే ఉన్నాడు.
తెల్లవార్లూ కంటిమీద కునుకు లేకుండా గడిపిన సంధ్య, ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడింది.
పాలవాడు పాలు తెచ్చి ఇచ్చి వెళ్ళాడు.
లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని, పాలు స్టవ్ మీద పెట్టింది.
ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. కళ్ళల్లో ఎర్రటి జారలు. చిన్న శబ్దం అయినా తత్తరపాటుతో ఉలికులికి పడుతోంది. ఇంతలో మహేష్ నుంచి ఫోన్…
“ఏవండీ!” పూడుకుపోతున్న గొంతుతో పీలగా మాట్లాడింది సంధ్య.
“సంధ్యా! కంగారు పడకు. మనమ్మాయి సేఫ్ గానే ఉందని ఎవరో నాకు కాల్ చేసి చెప్పారు. ఇప్పుడే… నేను ఫ్లయిటు దిగుతుండగా… పంజాగుట్ట ‘యామినీ’ క్లినిక్‌కి రమ్మన్నారు… నేను ఇట్నుంచి ఇటే పoజాగుట్ట వెళ్తున్నాను… నువ్వు పావుగంటలో అక్కడుండు” చెప్పాడు మహేష్.
“మన ‘హానీ’ కి ఏమీ కాలేదుగా!?” ఆందోళనగా అడిగింది సంధ్య.
“షి ఈజ్ సేఫ్! అనవసరంగా కంగారు పడకు. వెంటనే బయల్దేరి హాస్పిటల్ దగ్గరకు రా.” చెప్పి ఫోన్ పెట్టేసాడు మహేష్.
ముక్కోటి దేవతలకు మనసులోనే ముడుపులు కట్టేస్తూ, మొక్కులు మొక్కేస్తూ ఆటో దిగి హాస్పిటల్ లోకి వెళ్ళింది సంధ్య.
అప్పటికే అక్కడికి చేరిన మహేష్, రిసెప్షన్‌లో హానీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు.
ఆందోళనగా తన భుజంపై తల పెట్టుకుని ఏడుస్తున్న సంధ్య తలపై చెయ్యిపెట్టి భయం లేదన్నట్టు దగ్గరకు తీసుకున్నాడు.
“రండి! మీ కోసమే ఎదురుచూస్తున్నాను. మీరు మహేష్ కదా!” అడుగుతున్న పెద్దాయన వైపు ‘అవునన్నట్టు’ చూసి, “మా అమ్మాయి!” అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు.
‘నాతో రండి’ అన్నట్టు ముందుకి దారి తీసిన ఆయన వెనకే నడిచారు ఇద్దరూ. ఒక రూమ్‌లో బెడ్‌పై నిస్తేజంగా ఉన్న హనీషను పట్టుకుని, గట్టిగా కుదుపుతూ ఏడ్చేసింది సంధ్య.
“మమ్మీ! డాడీ!!” అంటూ ఏడుస్తూ లేచి కూర్చోబోయిన కూతుర్ని చూస్తే కోపం ఆగలేదు మహేష్‌కి. నిగ్రహించుకున్నాడు.
“చెప్పండి సర్! మా అమ్మాయికి ఏమయ్యింది?” పెద్దాయన వైపు తిరిగి అడిగాడు.
“ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు నేను జూబ్లీహిల్స్ రోడ్ పై టూ వీలర్ మీద ఇంటికి వెళ్తున్నాను. అప్పుడే వీధి కార్నర్‌లో మలుపు తిరుగుతున్న కారులోనుంచి ఎవరో ఆడపిల్ల లోపల పెనుగులాడుతున్నట్టు అనిపించి, ఆ కారును వెంబడించాను.
ఫ్లై ఓవర్ కిందుగా కొంతదూరం ముందుకు వెళ్లి, చెక్ పోస్ట్ దగ్గర మలుపు తీసుకుని, నిర్మానుష్య ప్రదేశంలోకి కారు మలుపు తిరిగింది.
వదలకుండా వెంబడించాను. లోపల ఏం జరిగిందో తెలీదు కానీ, డోర్ తీసి ఈ అమ్మాయిని బయటకు తోసేసి, కారు ఆపకుండా వెళ్లిపోయారు.
ఆలస్యం చెయ్యకుండా ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఆమెను ఈ హాస్పిటల్ కి తీసుకు వచ్చాను. అప్పట్నుంచి షాక్ లో ఉండడం వల్ల స్పృహలో లేదు.
ఒంటిపై చిన్న చిన్న దెబ్బలు మినహా ప్రమాదం ఏదీ జరగలేదు. రాత్రంతా సిలైను ఎక్కేదాకా ఇక్కడే ఉన్న నేను, ఆమె ఎవరి తాలూకో తెలుసుకుందామని వెదికితే… చేతిలో ఉన్న పర్సులో ఫోను లేదు కానీ, కాలేజీ ఐడీ కనపడింది. అందులో ఉన్న మీ నంబర్ కి కాల్ చేసి చెప్పాను” చెప్పడం ముగించాడు పెద్దాయన.
“మా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉంది అంటే, అందుకు మీరే కారణం! చాలా థాంక్స్ బాబాయ్ గారూ!” అంటూ ఇద్దరూ పెద్దాయనకు నమస్కరించారు.
“అవునూ! నువ్వు సుందరం మాష్టారి అమ్మాయి… సంధ్యవు కదూ!!” అప్పటిదాకా సరిగా చూడని ఆయన, అప్పుడే గుర్తుపట్టి సంధ్యను అడిగారు.
“నేనమ్మా! పార్థసారథిని… మీ నాన్నగారి స్నేహితుడ్ని… గుర్తుపట్టలేదా?” అడిగాడు పెద్దాయన.
“మీరా బాబాయ్!? మీరు ఇక్కడ… హైదరాబాదులో ఎలా?” ఆశ్చర్యంగా అడిగింది సంధ్య.
“నాకిద్దరు కొడుకులు. ఒకడు అమెరికాలో స్థిరపడితే, మరొకడు రియల్ ఎస్టేటు వ్యాపారంలో బాగా లాభాలు గడించి, జూబ్లీహిల్స్‌లో ఉంటున్నాడు. మీ పిన్నిగారు కాలం చేసాక, నేను కూడా హైదరాబాదు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాను.”
“అవునూ! నిన్ను మీ నాన్నగారు అంత పద్ధతిగా పెంచారు కదా! నువ్వు నీ కూతురికి కొంచెమైనా భయం చెప్పుకోవద్దూ? ఆడపిల్లలు… ఇలా మగపిల్లల స్నేహాలు పడితే ఇలాగే పెడదోవన పట్టిపోతారు” అన్నాడు హనీష వంక చూస్తూ.
“అమ్మా! నేనే తప్పూ చెయ్యలేదు. నన్ను నమ్ము!. ప్లీజ్!! వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళాను అంతే. అక్కడ్నుంచి సందీప్ పార్టీకి రమ్మని పిలిస్తే వాళ్ళింటికి తన కారులోనే వెళ్ళాను” వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని దగ్గరకి తీసుకుంది సంధ్య.
“చూడమ్మా! హనీషా!! పెద్దలు మనకి సాంప్రదాయాలూ, కట్టుబాట్లూ నేర్పేది ఇందుకేనమ్మా… కాల ప్రవాహంలో సాంప్రదాయాలు గతి తప్పుతున్నాయి… నాగరికత పేరుతో కట్టుబాట్ల గట్టు తెంచుతూ… ఇలాగే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మీ యువత. నువ్వు ఆడపిల్లవి. మరింత జాగ్రత్తగా ఉండాలి. నా మనవడు మాట వినే పరిస్థితిలో లేడు, అందుకే వాడిమీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను.” చెప్పడం ముగించి భారంగా నిట్టూర్చాడు పార్థసారథి.
“వ్వాట్?? అంటే!! సందీప్ మీ మనుమడా? ఆశ్చర్యంగా అడిగాడు మహేష్.
“అవును బాబూ! వాడు నా మనవడే. నా కొడుకు రియల్ ఎస్టేటు బిజినెస్ లో కోట్లు సంపాదించాడు. వ్యాపార లావాదేవీలు, బిజినెస్ వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా తిరుగుతూ ఉంటాడు. తండ్రి సంపాదించినదాంతో విలాసాలకు అలవాటు పడిన నా మనవడు సందీప్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఎన్నోసార్లు హెచ్చరించి చూసాను. ఊహూ!! లాభం లేదు. వాడి ప్రవర్తనలో మార్పు లేదు.
నిన్న సాయంత్రం మా వీధి చివరలో మలుపు తిరుగుతున్న కారును చూసి, గుర్తుపట్టి వెంబడించాను. నేను ఊహించినట్టే అందులో ఉన్నది నా మనవడూ, వాడి స్నేహితులే. అందుకే పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను” దృఢంగా చెప్పాడు పెద్దాయన.
“బాబాయ్!! ఎంతో ముద్దుగా పెంచుకున్న మీ ఇంటి బిడ్డ మీదే కంప్లయింట్ ఇచ్చారా?” ఏడుస్తోంది సంధ్య.
“ఏం చెయ్యనమ్మా! విచ్చలవిడి తనంతో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న వీడిలాంటి వాళ్ళకి కాలమే బుద్ధి చెప్పాలి” అంటున్న పెద్దాయన కాళ్లకు కృతజ్ఞతతో నమస్కరించి, తమ బిడ్డను తీసుకుని ఇంటికి బయల్దేరారు సంధ్యా-మహేష్.