రంగవల్లి

0
3

[dropcap]మూ[/dropcap]డు రోజుల్లో ధనుర్మాసం మొదలవుతోంది. ముగ్గుల మాసం ఇది. మా సందులో అన్ని పాతకాలపు ఇళ్ళు. ఈ వీధి నుంచి వెనక వీధి దాకా పొడుగ్గా ఉండే రైలు పెట్టెల్లాంటి వరస గదుల ఇళ్లు. ప్రతి కాంపౌండ్‌లో రెండేసి వాటాల ఇళ్లు. ప్రతి ఇంటి ముందు ఆత్మీయంగా పలకరిస్తున్నట్లు రకరకాల పూల మొక్కలు. నాకీ ఇల్లంటే చాలా ఇష్టం. ఇంత పెద్ద పాత ఇల్లు చూసి అందరూ సొంతమేనా అనడుగుతారు. అంత అదృష్టమా! ఇంటి వాళ్ళు ఇక్కడ ఉండరు. అద్దె కూడా బ్యాంక్‌లో వేసేయడమే. సొంతింటి హక్కులు, బాధ్యతలు అన్నీ అనుభవిస్తున్నట్లే ఉంటుంది నాకు.

నెలగంట పెట్టిన దగ్గర్నుంచి ఇంటి ముందు రోజుకో ముగ్గు వేయటం నాకలవాటు. నాకిష్టం. నా ముగ్గులను వీధిలో అందరూ ఆసక్తిగా చూస్తారు. మెచ్చుకుంటారు. ఏ మనిషికైనా ప్రశంసలు ఇంకా బాగా చేయాలనే ఉత్సాహాన్నిస్తాయి కదా. కానీ, ఈ ఏడాది ముగ్గులు వేయటం ఎలా?నా మనసు వేదనతో ఏడుస్తోంది. వినే వాళ్లకు చిన్న విషయంలా అనిపించచ్చు. ఒక్క ఏడాది కుదరకపోతే “ఏం చేస్తాం” అనుకోవచ్చు.

కానీ, పనిమనిషి యాదమ్మ గేటు ముందు బర బరా గీసే నాలుగు కర్రల ఎప్పటి ముగ్గుతోనే సరిపెట్టుకోవాలంటే మనసు ఒప్పుకోవట్లేదు.

మా వారితో బండి మీద వస్తుంటే ఈ మధ్య నాకు కుడి చేయి విరిగి ఫ్రాక్చర్ అయింది. చేతికి కట్టు కట్టారు. తగ్గటానికి రెండు నెలలు పడుతుందన్నారు డాక్టరు. మా వారు వంటావిడను మాట్లాడారు. ఆవిడ రెండు పూటలా వంట చేసి వెళుతుంది. యాదమ్మ మిగతా పనులన్నీ చేస్తుంది.

మా ఇంటికి అటు పక్క, ఇటు పక్క ఇళ్ళకి, ఎదురుగా మూడు ఇళ్ళకి యాదమ్మే పని చేస్తుంది. అన్ని ఇళ్ల ముందు రెండు నిలువు కర్రలు, రెండు అడ్డకర్రల ముగ్గు యూనిఫామ్‌గా వేసేస్తుంది. ఏమన్నా అంటే “నాకు ముగ్గులు రావమ్మా” అనేస్తుంది. హడావిడిగా చేసుకుపోతుంది. తప్పదు అవసరం నాది.

“యాదమ్మ! ఎల్లుండి నుంచే నెలగంట మొదలు. ఈ ఏడాది నీ పిచ్చి ముగ్గుల తోనే పండగ అయ్యేట్లుంది” అన్నాను దిగులుగా, గిన్నెలు తోముతున్న యాదమ్మతో.

యాదమ్మ నవ్వింది.”ఏం చేస్తామమ్మా, మీకేమో చెయ్యి విరిగింది. నాకేమో ముగ్గులు రావు. వచ్చే ఏడాది నుంచి పెట్టుకుందువు లేమ్మా” అంది.

“నువ్వు నేర్చుకో యాదమ్మా” అన్నాను ఆశగా.

“నాకెక్కడ కుదురుతుందమ్మా, ఎన్ని ఇళ్లలో పని చెయ్యాలి, ఇంకా ముగ్గులు నేర్చుకోవటమా. అయినా, ఈ వయసులో నాకేం వస్తాయి? నావల్ల కాదమ్మా”అంది.

‘ఇప్పుడు కాకపోయినా పండగ మూడు రోజులైనా ఇంటి ముందు కాస్త మంచి ముగ్గు లేకపోతే ఎలా? సంక్రాంతి అంటే ముగ్గులే కదా ముఖ్యం!’ నాలో నేనే అనుకున్నా స్వగతంగా.

‘ఏంటో ఈ యమ్మకు చేయి విరిగింది. పాపం, లేకపోతే ఈ పాటికి ఏ రోజేం ముగ్గు పెట్టాలో వేసుకుంటూ ఉండేది.’ అనుకుంటూ ఇంటికి వెళుతున్న యాదమ్మకు మనవరాలు రంగవల్లి గుర్తుకు వచ్చింది. యాదమ్మ కూతురి కూతురు. పల్లెటూళ్ళో పదవ తరగతి చదువుతోంది. ముగ్గులు బాగా వేస్తుంది. ఆ పల్లెటూళ్ళో గుర్తించే వాళ్ళు లేక కానీ ఇక్కడైతే ఎంత పేరొచ్చేదో! పేరు రావాలంటే డబ్బుండాలి. మెళకువలు తెలిసుండాలి. అమ్మగారు చిన్న ముగ్గేసినా ఫోటో తీసి అందరికి పంపిస్తుంది. కొత్త వంట చేస్తే ఫోటోల్లో పంపించేస్తుంది. దాంతో ఆమెగారి నందరు ఆకాశానికి ఎత్తేస్తారు. పిచ్చి మాలొకం రంగకేముంది అనుకుంది యాదమ్మ. రంగని ఈ నెల్లాళ్ళు ముగ్గులేయమంటే! మెరుపు లాంటి ఆలోచన వచ్చింది యాదమ్మకు. యాదమ్మ కూతురు వాళ్ళుండేది పక్కన పల్లెటూరే! బస్సెక్కితే పావుగంట.

యాదమ్మ కూతురు లక్ష్మి ఆ ఊళ్ళో ఓ ధనవంతులింట్లో పని చేస్తుంది. అల్లుడు ఈ మధ్యే లారీ యాక్సిడెంట్ లో పోయాడు. రంగవల్లిని బాగా చదివించాలని లక్ష్మి కోరిక. ఊళ్ళో పదవ తరగతి వరకు ఉంది.

యాదమ్మ మర్నాడు పనికి రానని చెప్పి పొద్దున్నే బస్సెక్కి కూతురి ఊరికి వెళ్ళింది. నేరుగా కూతురు పని చేసే ఇంటికే వెళ్ళిపోయింది. చెప్పకుండా ఉడిపడిన తల్లిని చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. ఆ మాటా ఈ మాటా అయ్యాక తాను వచ్చిన పని చెప్పింది యాదమ్మ.

“ముగ్గులేయటానికి రంగ ఆ ఊరు రావాలా?నీకేమైనా పిచ్చా? దానికి స్కూలుంది. ఒక్క రోజు కూడా మానదు అది” అంది లక్ష్మీ.

“మానక్కరలేదులే, బడయ్యాక సాయంత్రం బస్సెక్కి వస్తే అమ్మగారి వాకిట్లో ముగ్గు వేసేసి, మా ఇంట్లో పడుకొని పొద్దుటే బస్సెక్కి స్కూలుకి వచ్చేస్తుంది. ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఏ ఖర్చులకైనా ఆదుకుంటుంది” అంది యాదమ్మ.

డబ్బంటే ఆశ కలుగుతోంది. భర్త పోయాక బతుకు మరీ దుర్బరంగా తయారైంది. ఎంత చూసి చూసి ఖర్చు చేస్తున్నా డబ్బు చాలట్లేదు. రోజంతా పని చేయించుకుంటుంది అమ్మగారు. వంట కూడా తనే చెయ్యాలి.ఇంటెడు పని. ఒక్కరోజు కూడా మానటానికి లేదు. తన భోజనం, టిఫిన్ అక్కడే! సొంత గూడు ఒకటి ఉంది కాబట్టి అలా నెట్టుకొచ్చేస్తున్నాం, అనుకుంది లక్ష్మి. ఇప్పుడు రంగ నెల్లాళ్ళు ముగ్గులేస్తే ఎంతిస్తారో! రోజు వెళ్లగలుగుతుందా? పోనీ, సంక్రాంతి సెలవలిచ్చాక అమ్మ దగ్గరే ఉంటుంది. రంగ ఏమంటుందో, ఆలోచిస్తోంది లక్ష్మి. తల్లి వచ్చిందని లక్ష్మి యజమానురాలింట్లో పనులు గబ గబ పూర్తి చేసి ఇంటికి వచ్చి వంట చేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేసేసారు. యాదమ్మ మనవరాలు వచ్చే దాకా ఉండి, విషయం చెప్పి అమ్మా కూతుళ్ళిద్దరిని ఆలోచించుకోమని ఆ రాత్రికి ఇంటికి వచ్చేసింది. ఆ మర్నాడు యాదమ్మ పనికి వెళ్ళింది.

“యాదమ్మా, మీ అమ్మాయి దగ్గరకు వెళ్ళావా” అడిగాను

“అవునమ్మా, అది ఒక్క రోజు కూడా రావటానికి కుదరదు. నేనే వెళ్లి వస్తుంటాను” అంది యాదమ్మ.

“నీ మనవరాలు ఏం చదువుతోంది?”

“పదవ తరగతిలో ఉందమ్మా, స్కూల్ ఫస్టు అదే నమ్మా, ముగ్గులు బాగా వేస్తుంది. బొమ్మలు వేస్తుంది. మీ గురించి చెప్పాను” అంది యాదమ్మ.

“ఏమంది” ఆసక్తిగా అడిగాను.

“అది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను వచ్చేశానమ్మా! విషయం చెప్పాను. మరి చూడాలి,”అంది యాదమ్మ.

మర్నాడు పొద్దున్న యాదమ్మ కూతురు ఫోన్ చేసింది. “అమ్మా, రంగ ముగ్గులు వేస్తానంటోంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక బస్సెక్కిస్తాను. రమ్మంటావా మరి?” అంది. “రమ్మను, అమ్మగారితో ఇవాళే చెపుతాను. డబ్బు కూడా ముందే మాట్లాడుకుంటే మంచిది. అది అంత కష్టపడి వేస్తే ఎంతో కొంత లాభం లేకపోతే ఎలా?” అంది యాదమ్మ.

“సరే, నువ్వు మాట్లాడమ్మా, సాయంత్రం వస్తుంది. రాత్రి నీ దగ్గరుండి రేపు పొద్దున్నే బస్సెక్కిస్తే వస్తుంది” అంది లక్ష్మి.

“అట్లాగే, ముగ్గుల పుస్తకం కూడా తెచ్చుకోమను” అంది యాదమ్మ.

యాదమ్మ పని కొచ్చినప్పుడు “అమ్మగారు, నా మనవరాలు సాయంత్రం వస్తానందమ్మా!మరి ముగ్గులు వేయించుకుంటారా?” అంది.

“రమ్మను యాదమ్మా, రేపట్నుంచే నెలగంట మొదలు. పండగ వెళ్ళేదాకా వేయమను” అన్నాను.

“అమ్మగారు, అది స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. ఏదో రెండు రాళ్లు వస్తాయని వాళ్ళమ్మ ఆశపడి పంపిస్తోంది. రోజూ బస్సులో రావాలి మరి” అంది యాదమ్మ.

“అలాగే యాదమ్మా, ఇవాళ చూడనీ, ఎలా వేస్తుందో” అన్నాను.

“అందులో డౌటే లేదమ్మా, బాగా వేస్తుంది” అంటూ వెళ్ళిపోయింది యాదమ్మ.

సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చింది రంగ. యాదమ్మ రంగ కోసం తెచ్చిన జంతికలు, బిస్కెట్లు పెట్టింది. రంగ తింటుంటే యాదమ్మ “ఏడింటికి వెళదాం. నేను నీళ్లు జల్లేస్తాను. పెద్ద ముగ్గు వెయ్యి ఇవాళ. అమ్మగారికి ముగ్గులంటే పిచ్చి. బాగా వేస్తే వదలరు నిన్ను” అంది యాదమ్మ.

రంగ కాయితం మీద ముగ్గు వేసి చూసుకుంటుంటే యాదమ్మ వంట చేసేసింది. ముగ్గు వేసి వచ్చిన వెంటనే మనవరాలికి అన్నం పెట్టేయచ్చని.

ఆ రాత్రి ఇరవై ఒక్క చుక్కల ముగ్గు పెద్దది వేసింది రంగ మా ఇంటి ముందు. నాకు బాగా నచ్చింది.

రాత్రి పన్నెండు గంటలకు “మా ఇంటి ముందు మొదటి ముగ్గు” అని వాట్సాప్ లోను, స్నేహ బృందాలలోను ముగ్గు ఫోటో తీసి పెట్టేసాను. మర్నాడు పొద్దుటి నుంచి ఫోన్లో ముగ్గు బాగుందంటూ ప్రశంసలు, అభినందనలు. రంగ పొద్దున్నే బస్సుకి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.

రాత్రే బస్ టికెట్‌కి సరిపోయే డబ్బులిచ్చేసా. యాదమ్మ బద్దకించకుండా సాయంత్రం బడైన వెంటనే రంగని బస్సెక్కి వచ్చేయమంది.

రోజూ ఇలా ఛార్జీలిచ్చి నెలకి ముగ్గులకి డబ్బులివ్వాలంటే ఎంత ఇవ్వాలి? ముగ్గుల కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఆలోచిస్తూ కూర్చున్నాను. రెండు సందులవతల ఉన్న నాగలక్ష్మి,స్నేహ బృందంలో సభ్యురాలు ఫోన్ చేసింది. “ముగ్గు చాలా బాగుంది. నువ్వు వేయలేవుగా, ఎవరు వేశారు?” అంది.

నేను విషయం అంతా చెప్పాను. “ఈ నెల్లాళ్ళు వేయించాలనుంది. ఎంతిస్తే బాగుంటుంది?నువ్వు చెప్పు!” అన్నాను. “ఎనిమిది వందలివ్వచ్చేమో” అంది నాగలక్ష్మి. “సరిపోతుందా, ప్రత్యేకంగా ముగ్గులు వేయటానికే వస్తోంది.”

“ఒక్కఇంటి కోసం రావటం అంటే కష్టమే, ఒక పని చేద్దాం. నేను రోజూ వేయలేను. నడుం నొప్పి వస్తోంది. మా ఇంటి ముందు కూడా వేయమందాం. ఇద్దరం కలిసి పదిహేను వందలు ఇద్దాం. యాదమ్మ ఇల్లు మీ ఇంటి దగ్గరే. మనిద్దరి ఇళ్ళు దగ్గరే. ఎంత లేదన్నా రాత్రి ఎనిమిది లోపు ఇద్దరి ఇళ్లలో వేసేయచ్చు. ఏమంటావ్?” అంది నాగలక్ష్మి.

“బాగుంది. ఇద్దరం కలిసి పదిహేను వందలంటే ఏమంటుందో. యాదమ్మ గట్టిదే, చాలదని అంటే?”

“ముందు చెప్పి చూడు. మరీ కాదంటే ఓ వందో, రెండొందలో అందాం. ముగ్గులొక్కటేగా, ఇంకే పని చేయదుగా” అంది నాగలక్ష్మి. “సరే” అని సాయంత్రం యాదమ్మ వచ్చినప్పుడు విషయం చెప్పాను.

“అమ్మగారూ రెండిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలంటే మాటలా, కాస్త ఆలోచించండి” అంది యాదమ్మ.

“నువ్వు చెప్పు పోనీ”

“రోజూ టికెట్ కొని బస్ ఎక్కటం కష్టం కదమ్మా, బస్ పాస్ కొనిచ్చి చెరో వెయ్యి ఇవ్వండమ్మా. నేను న్యాయంగానే అడిగాను”అంది యాదమ్మ.

“ముగ్గులు వేయటానికి వెయ్యి రూపాయలా!” ఆశ్చర్యపోయాను.

“ముగ్గు అంటే నేను వేసే నాలుగు కర్రల ముగ్గు కాదు కదమ్మా, నా కూతురు వద్దంటున్నా దీని చదువుకు పనికివస్తుంది ఈ డబ్బు అని నేను ఒప్పించా. మీ ఇష్టమమ్మా!” అంది యాదమ్మ.

మీ ఇష్టం అందంటే అంత ఇవ్వకపోతే రాదని అర్థం. నాకు ఒప్పుకోక తప్పలేదు. నాగలక్ష్మి కూడా కాదనదు. రంగని వదల లేక పోతున్నా. “సరేలే అయితే” అనేసాను.

రంగవల్లి రోజూ వస్తోంది. మా ఇద్దరి ఇళ్ల ముందు వేసినవి వేయకుండా ముగ్గులు వేస్తోంది. ఒక రోజు రాత్రి ముగ్గు వేసాక నేను, “రంగా, ఈ పేపర్ మీద మంచి ముగ్గు వేసి స్కెచ్ పెన్ లతో రంగులు వేసి ఇవ్వు” అన్నాను.

“ఎందుకమ్మగారు” అంది రంగ.

“కావాలిలే, వేసివ్వు” అన్నాను. ఎంతముగ్గయిన క్షణాల్లో అవలీలగా వేసేస్తుంది రంగ. చిలకల ముగ్గు వేసి ఆకుపచ్చ రంగు, ముక్కులకి ఎరుపు వేసి చూపించింది. నా కళ్ళు మెరిసాయి. “బాగుంది, జాగ్రత్తగా వెళ్లు” అన్నాను. మా అబ్బాయి చిన్నా అక్కడే వున్నాడు. “రంగా, నువ్వెప్పుడు చదువుకుంటావు? టైమంత ముగ్గులకి అయిపోతుంటే?” అన్నాడు.

“చదువుతుంది లేరా, నువ్వు వెళ్లు రంగా” అన్నాను. రంగ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత నా పేరుతో ఓ దినపత్రికలో చిలకల ముగ్గు వచ్చింది.

“అమ్మా, ఆ రోజు రంగవల్లి వేసిన ముగ్గు కదూ ఇది?” అన్నాడు చిన్నా.

“అవునురా” అంటూ ఫోటో తీసి అందరికీ పంపే ప్రయత్నంలో వున్నాను.

“అమ్మా, ఆ అమ్మాయి పేరు తోనే పంపచ్చుగా, శ్రమంతా తనది గుర్తింపు నీకా”అన్నాడు చిన్నా. “ఊరుకోరా ఎవరితో అనకు”అని కేకలేసాను వాడిని.

ఆ రోజు రంగ అమ్మమ్మతో చెప్పి బస్సుకి నడుస్తోంది. వెనక నుంచి చిన్నా బండి మీద వచ్చి ఆగాడు.

“చినబాబు మీరా”ఆశ్చర్యపోయింది రంగ.

“అవును, ఇది చూడు” అంటూ పేపర్ చూపించాడు.

“హాయ్, నేను వేసిన చిలకల ముగ్గు లాగానే ఉందే” అంది ఆశ్చర్యంగా.

“లాగే కాదు, నువ్వు వేసిందే, కింద పేరు చూడు” అన్నాడు.

“అమ్మగారి పేరు, రమా మణి, అమ్మగారు పంపారా పేపర్‍కి?” తన ముగ్గు ఆవిడ పేరుతో వచ్చినందుకు బాధ రంగలో లేదు. తన ముగ్గు అచ్చులో చూస్తుంటే ఆనందం!

“చూడు రంగవల్లి! నీలో గొప్ప ప్రతిభ వుంది. నువ్వు వేసే ముగ్గులన్నీ అమ్మ, నాగలక్ష్మి ఆంటీ రోజూ ఫోటోలు తీసి అందరికి పంపించుకుంటున్నారు. వాళ్లే వేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకిదేంనచ్చలేదు.” అన్నాడు చిన్నా.

“వేసినందుకు డబ్బులిస్తారుగా బాబూ” అంది రంగ అమాయకంగా.

“ఇస్తారు. కానీ నీ వల్ల వాళ్లకెంత పేరొస్తోందో తెలుసా! రంగా, ముగ్గులు వేయటం ఓ కళ. నువ్వు కొత్త కొత్తవి కల్పించి అందంగా వేయగలవు. నువ్వు ఈ ముగ్గులని ఫోన్లో పెడితే మంచి పేరొస్తుంది. ఎక్కువ మంది చూస్తే డబ్బులు కూడా వస్తాయి తెలుసా” అన్నాడు చిన్నా.

“నా దగ్గర ఆ ఫోనెక్కడుంది బాబూ, అయిన అవన్నీ నాకేం తెలుస్తాయి?” అంది రంగ.

“సరే, నీ కవన్నీ తెలియవులే, ముందు నేనొకటి చెపుతాను, చెయ్యి. ఈ ఊళ్ళో మహిళా సంఘం వాళ్ళ ముగ్గుల పోటీ వచ్చే ఆదివారం ఉంది. ప్రథమ బహుమతి మూడువేలు, రెండవదానికి రెండు వేలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు ఇస్తారు. ఇప్పటిదాకా వేయని మంచి ముగ్గు బాగా ప్రాక్టీస్ చెయ్యి. కావలసిన రంగులవీ నేను కొనిస్తాను. యాదమ్మకు నేను చెప్పానని చెప్పు. నేనూ చెపుతాను. ముగ్గుల పోటీ దగ్గరకు నేనూ వస్తాను. నీకు తప్పకుండా బహుమతి వస్తుంది. అమ్మతో చెప్పకు ఇది. పేపర్ చూపించానని కూడా చెప్పకు. ఇంక వెళ్ళు. బస్‌కి టైం అవుతోంది” అని వెళ్ళిపోయాడు చిన్నా.

రంగ ఆరోజు సాయంత్రం వచ్చినప్పుడు యాదమ్మతో చినబాబు చెప్పినదంతా చెప్పింది.

“నీ చేత వేయించుకుని ఆమె గారి పేరుతో వేయించుకుందా? ఆమె తెలివి ఎవరికి రాదులే, చినబాబు మంచోడే, నువ్వు మంచి ముగ్గు నేర్చుకో. బాబు చెప్పిన చోటికి నేను తీసుకెళతా” అంది యాదమ్మ.

శుక్రవారం రాత్రి వీధిలో ముగ్గేసి వెళ్ళొస్తానని చెప్పింది రంగ.

“రంగా, మీ అమ్మకి చెప్పి రేపు రాత్రి మీ అమ్మమ్మ దగ్గర ఉండిపో. ఆదివారం ఇంట్లో పెయింట్‌తో ముగ్గులు వేద్దుగాని” అన్నాను.

“ఆదివారమా అమ్మగారూ”అంది రంగ. “అవును ఏమైనా పని ఉందా” అన్నాను.

దానికి సమాధానం చెప్పకుండా “సోమవారం నుంచి సెలవలేనమ్మా! సోమవారం వేస్తాను, అంది రంగ.

“సోమవారం చుట్టాలొస్తున్నారు. ఇంట్లో అందరూ తిరుగుతుంటే కుదరదు” అన్నాను నేను. చిన్నా అక్కడే ఉన్నాడు. “అమ్మా, ఆదివారం ముగ్గుల పోటీ ఉంది ఈ ఊళ్ళో. రంగ దానికి వెళుతోంది. నేనే చెప్పాలే. చుట్టాలు వెళ్లాక వేస్తుందిలే. వాళ్ళు మర్నాడు వెళ్లిపోతారుగా”అన్నాడు.

“వాళ్ళు వచ్చేటప్పటికి వేసేయ్యాలి. అయినా ముగ్గుల పోటీ ఏమిటి? నాకు తెలియదే! ఎవరు పెట్టారు? నువ్వు తీసుకెళతావా?” అన్నాను కోపంగా.

“నువ్వు వెళ్లులే రంగా” అన్నాడు చిన్నా. రంగ వెళ్ళిపోయింది.

“ఏమిటిరా, ఆడవాళ్ళ ముగ్గుల గొడవ నీకెందుకు?నీకేంటసలు ఆ అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్?” అన్నాను తీవ్రంగా.

“హలో అమ్మా! నువ్వనుకునే ఇంట్రెస్టులేం లేవక్కడ. అనవసరంగా ఊహించేయకు. రంగవల్లిలో అద్భుతమైన కళ ఉంది. ఆ కళ ఇలా వీధుల్లో ముగ్గులేసు కోవటంతో ఆగిపోకూడదు. కాస్త ప్రోత్సాహమిస్తే తను బాగా రాణిస్తుంది. మహిళా సంఘం వాళ్ల ముగ్గుల పోటీ యాదమ్మే తీసుకు వెళుతుంది. ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవటం తెలీని అమాయకులు వాళ్ళు. నేను తనకి సాయం చేద్దామనుకుంటున్నా. అంతే!” అంటూ వెళ్ళిపోయాడు.

బి.టెక్. ఫైనల్ లోకి వచ్చిన వీడు తగిన స్నేహాలు చేయకుండా ఇలా ఉన్నాడేంటి?కొంపదీసి…. ఇంక ఆలోచించ లేకపోయాను.

ఆదివారం పొద్దున్న తొమ్మిదింటికి ముగ్గుల పోటీ. నేను కొంచెం ముభావంగానే వున్నాను. యాదమ్మ అంట్లు తోమేసి వెళుతూ “అమ్మగారూ, పన్నెండు గంటల కంతా ముగ్గుల పోటీ అయిపోతుంది. అన్నం తినేసి వచ్చి రంగ ముగ్గులు వేస్తుంది. రేపు నాగలక్ష్మమ్మ ఇంట్లో వేస్తుంది” అంది. “సరేలే, మధ్యాహ్నమైనా రమ్మను” అన్నాను.

యాదమ్మ రంగవల్లిని పోటీ జరిగే చోటుకి తీసుకెళ్లింది. చిన్నా అప్పటికే వచ్చి వున్నాడు. కావలసిన రంగులు తెచ్చాడు. చాలా మంది ఆడవాళ్లు వచ్చారు పోటీకి. రంగ చెరకు గడలు, పొంగలి కుండలు, గుమ్మడి కాయలు, హరిదాసులు, అన్నీ వచ్చేట్లు సంక్రాంతి శోభ అని రాసి పెద్ద ముగ్గు వేసి రంగులు వేసింది. ఫలితాలు ఆ సాయంత్రం ఫోన్లో తెలియ జేస్తామన్నారు. యాదమ్మ తన ఫోన్ నంబరిచ్చింది.

ఇంటికొచ్చి యాదమ్మ పెట్టిన అన్నం తింది రంగ.

“కాసేపు పడుకోవే రంగా, పొద్దున్నే అంత పెద్ద ముగ్గు వేశావు. నడుం నొప్పి వస్తుంది. ఇవాలంతా ఇంట్లో ఉండి పోతే బాగుండు. కానీ, వెళ్లకపోతే అమ్మగారికి కోపం వస్తుంది”అంది యాదమ్మ.

మధ్యాహ్నం రెండింటికి వచ్చింది రంగ. గుమ్మం బైట హాల్లో, వంటింట్లో పెయింట్‌తో ముగ్గులు దగ్గరుండి వేయించాను. సాయంత్రం ఐదింటి వరకు వేస్తూనే ఉంది. యాదమ్మ అంట్లు తోమటానికి వచ్చి ముగ్గుల దగ్గర కూర్చుంది. అంతలో చిన్నా వచ్చాడు. – “యాదమ్మా, నీకు మెసేజ్ వచ్చిందా” అన్నాడు.

“ఏమో బాబూ, నాకేం తెలుస్తది?” అంటూ చిన్న చేతి సంచి లోంచి ఫోన్ తీసింది.

“నేను అక్కడ నుంచే వస్తున్నాలే, రంగకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. భోగి పండుగ రోజు మహిళా సంఘం ఆఫీసులో మూడు వేల రూపాయలు, సర్టిఫికెట్ ఇస్తారు. రేపు పేపర్లో గెలిచిన వాళ్ళ పేర్లు వేస్తారు” అని చెప్పి యాదమ్మ ఫోన్ తీసుకుని చూసి మెస్సేజ్ వచ్చిందని చెప్పాడు.

రంగవల్లి ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

“చినబాబూ, ఇదంతా మీ పుణ్యమే బాబూ, లేకపోతే ఇవన్నీ మాకేం తెలుస్తాయి”అంది యాదమ్మ.

“రంగా, నువ్వు కొత్త, కొత్త ముగ్గులు ప్రాక్టీసు చేస్తూ ఉండు. పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో ఎవరైనా వేయించు కుంటారు. నీ పేరు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయకు. పదవ తరగతిలో మంచి మార్కులు రావాలి. కష్టపడి చదువు.చదువు లేకపోతే విలువ లేదు. తెలిసిందా?” అన్నాడు చిన్నా.

“అలాగే బాబూ” పొంగిపోతూ అంది రంగ.

“యాదమ్మా, రంగవల్లి అని పేరు ఎవరు పెట్టారు తనకి?” అడిగాడు చిన్నా.

“వీళ్ళ నాయనమ్మ ముగ్గులు బాగా వేసేది. ఎంత పెద్ద ముగ్గయిన అవలీలగా తిప్పేసేది. ఇది పుట్టినప్పుడు తనలా ముగ్గులు వేయాలని అంటూ రంగవల్లి అని పేరు పెట్టింది. ఆవిడ పోలికే దీనికి వచ్చినట్లు ఉంది” అంది యాదమ్మ.

రంగకి బహుమతి రావటం, చిన్నా ప్రోత్సాహం ఇవన్నీ ఏంటో అసంతృప్తిగా అనిపించాయి నాకు. ఈ పల్లెటూరి పిల్లకు ప్రథమ బహుమతా! అక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి వుంటారు. వాళ్ళందరిని కాదని రంగకి మొదటి బహుమతి వచ్చిందంటే ఈ అమ్మాయిలో ఆ ప్రతిభ ఉంది. కొంచెం ఈర్ష్యగా, కొంత అసంతృప్తిగా అనిపించింది. పైకి తేలకుండా, “బహుమతి ముగ్గు సంక్రాంతి నాడు ఇంటి ముందు వెయ్యి” అన్నాను.

“అలాగే అమ్మగారూ!” అంది రంగ. మర్నాడు నాగలక్ష్మి ఇంట్లో పెయింట్‌తో ముగ్గులు వేసింది.

ఈ చిన్నా గాడేమిటో రంగ వెంట పడుతున్నాడు. అదో దిగులుగా ఉంది. ఈ పండగ వరకేగా రంగ వచ్చేది. తరవాత వాళ్ళ ఊరెళ్లిపోతుంది. వీడు నెమ్మదిగా మర్చిపోతాడులే, అని సరిపెట్టుకున్నాను.

భోగి నాడు రంగ పోటీ ముగ్గే వేసింది మా ఇంటి ముందు. నాగలక్ష్మి ఇంటి ముందు మరో సంక్రాంతి ముగ్గు వేసింది. ఆ రోజు బహుమతి తీసుకోవటానికి యాదమ్మతో వెళ్ళింది. రంగ తల్లి లక్ష్మి కూడా ఆ సమయానికి మహిళా సంఘం ఆఫీసు దగ్గరకు వచ్చింది.

నిర్వాహకులు ముగ్గుల ప్రాధాన్యం గురించి, అందులోని ఆరోగ్య రహస్యాల గురించి చెప్పి, ముగ్గులు వేయటం ఒక కళ అని, అందరికి వచ్చేది కాదని, చెప్పారు. ఈ సంవత్సరం అందరిలోకి చిన్నదైన రంగవల్లి ప్రథమ బహుమతి గెలుచుకోవటం విశేషమని పొగిడి, రంగవల్లికి మూడువేల రూపాయల చెక్కు, సర్టిఫికెట్ ఇచ్చారు. చిన్నా ఫోటోలు తీసాడు.

ఇంటికొచ్చి రంగ నాకు సర్టిఫికెట్, చెక్కు చూపించి నాగలక్ష్మికి కూడా చూపించింది. పండగ వెళ్ళేదాకా ముగ్గులు వేసి నాగలక్ష్మి, నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని రంగ వాళ్ళ ఊరు వెళ్లిపోయింది.

చిన్నా తనకు తెలిసిన పెళ్లిళ్లలో, ఈవెంట్లలో ముగ్గులు వేయటానికి యాదమ్మ ద్వారా రంగని పిలుస్తున్నాడు. రంగ వేసిన ముగ్గులు ఫోన్లో పెడుతున్నాడు. తను కొత్త ఫోన్ కొనుక్కుంటూ పాత ఫోన్ రంగకి ఇచ్చి అందులో ముగ్గులు వేస్తున్నట్లుగా, నేర్పిస్తున్నట్లుగా ఎలా పెట్టాలో నేర్పించాడు. రంగయాదమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా కలుస్తూ మెళకువలు చెపుతున్నాడు. ఇపుడు రంగవల్లి ముగ్గులకి ఎంత మంది వీక్షకులో ఎందరు అభిమానులో ఎంత గుర్తింపో! ఇదంతా కలలోనైనా ఊహించారా రంగ కానీ, యాదమ్మ కానీ, లక్ష్మి కానీ ఎప్పుడైనా!

కాస్త ప్రోత్సాహమిస్తే చాలు, వికసించి పరిమళాలు వెదజల్లే అమాయక మొగ్గలెన్నో! సాంకేతిక ప్రయోజనాలు అందుబాటులో లేక, ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవటం తెలీక అజ్ఞాతంగా ఉండిపోయే ప్రతిభామూర్తులు మన మధ్యలోనే ఎందరో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here