ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 30 – షబ్నమ్

0
3

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్, కామినీ కౌషల్ కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ – షబ్నమ్

[dropcap]సి[/dropcap]నిమా ప్రభావం ప్రేక్షకులపై ఎంత ఉంటుందో మనకందరికీ తెలుసు. కొన్ని సినిమాలు మొదట మనల్ని అలరిస్తాయి, అప్పట్లోని చిన్న వయసు, తెలిసి తెలియని జీవితం కారణంగా కొన్ని కథలను ఇష్టపడతాం, కాని కొంత పరిపక్వత జీవితంలో కలిగాక మనం ఇష్టపడిన సినిమాలను చూసి నవ్వుకుంటాం. కాని వాటిని అంటిపెట్టుకున్న జ్ఞాపకాలు తీయగా ఉంటాయి. ఆ నాస్టాల్జియా కోసం కొన్ని సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తాం, గుర్తుకు తెచ్చుకుంటాం. ఆ కోవలోకి వచ్చే కొందరికి నచ్చే సినిమా షబ్నమ్. 1949లో బి.బిత్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దిలీప్ కుమార్, కామినీ కౌషల్, జీవన్ ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ఎస్.డి బర్మన్ సంగీతం అందించారు. కమర్ జలాలాబాది రాసిన పది పాటలను శంషాద్ బేగం, గీతా దత్, ముఖేష్‌లు పాడారు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పదకొండేళ్ళ వయసులో ఈ సినిమా చూసిన హరికిషణ్ గోస్వామి అనే ఒక చిన్న కుర్రవాడు ఈ సినిమాను ఆ హీరోను, ఆ హీరోయిన్ను ఎంతగా ప్రేమించాడంటే, తాను నటుడిగా మారి పేరు మార్చుకోవలసి వచ్చినప్పుడు ఈ సినిమా హీరో పేరు మనోజ్‌ను తన పేరుగా చేసుకుని మనకందరికీ తెలిసిన మనోజ్ కుమార్‌గా మారిపోయారు.

తరువాత ఈ సినిమా హీరో దిలీప్ కుమార్‌ను ఎంత ఇష్టపడ్డారంటే అతనితో కలిసి పని చేసే అవకాశం రాక తానే క్రాంతి అని ఒక సినిమా చేస్తూ దిలీప్ కుమార్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కామినీ కౌషల్ తరువాత ఎన్నో సినిమాలలో మనోజ్ కుమార్‌కు తల్లిగా నటించారు. మనోజ్ కుమార్ చాలా ఇష్టపడి ఆమెను తన సినిమాలలో తీసుకున్నారు. షహీద్ అనే మనోజ్ కుమార్ సినిమా 1964లో భగత్ సింగ్ జీవితం ఆధారంగా తీసారు. అందులో భగత్ సింగ్ తల్లి గా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు కామినీ కౌషల్. తరువాత మనోజ్ కుమార్ తీసిన ఏడు సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతగా మనోజ్ కుమార్ మనసులో ముద్రించబడిన షబ్నమ్ సినిమా ఇప్పుడు చూడాలంటే కొంచెం ఓపిక కావాలి. కాని జానపద కథలను, కలల రాకుమారుడు ఇష్టపడి కష్టపడి రాకుమారిని వరించే కథలను ఇప్పటికీ మర్చిపోలేని భారతీయ సినిమాలలో షబ్నమ్ ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో హీరో మనోజ్ 1942 రంగూన్ యుద్ధం తరువాత శరణార్థిగా బెంగాల్ వైపుకు తరలి వెళ్తున్న వ్యక్తి. అతనికి దారిలో ఒక చిన్న అబ్బాయి తండ్రి కోసం నీరు వెతుకుతూ కనిపిస్తాడు. వారు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్న శరణార్థులు. ఎంత మందిని బ్రతిమిలాడినా ఎవ్వరూ అతనికి నీరు ఇవ్వరు. అప్పుడు మనోజ్ తన జట్టు నుండి బైటకు వచ్చి తన దగ్గర ఉన్న నీరు ఆ పెద్దాయనకు ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఆ పెద్దాయన పడుకుని ఉన్న గుహ వద్దకు అతని కొడుకు మనోజ్‌ను తీసుకువెళతాడు. తరువాత ఆ పెద్దాయన అతని కొడుకు ఇద్దరు కూడా మనోజ్‌ని వదిలి పెట్టడానికి ఇష్టపడరు. అతనితో కలిసే ప్రయాణం చేయాలనుకుంటారు. మనోజ్ వారిని వదిలించుకుందామనుకున్న ప్రతిసారి ఏదో జరిగి వారి మధ్యకే చేరతాడు, చివరకు అతనికి ఆ పెద్దయన కొడుకు మగ వేషంలో ఉన్న స్త్రీ అని తెలుస్తుంది. ఆమె పేరు శాంతి. దారిలో దుండగులకు భయపడి ఆమె అబ్బాయిగా వేషం వేసుకుని వస్తుందని అర్థం అవుతుంది. ఆ ప్రయాణం ఇద్దరినీ దగ్గర చేస్తుంది. వారి నుండి వెళ్ళిపోదాం అనుకున్నా అతను వెళ్ళలేకపోతాడు. చివరకు ముగ్గురి ప్రయాణానికి బండిని సమకూర్చడానికి ఒంటరిగా మనోజ్ బైలుదేరుతాడు. దారిలో అతనికి ఒక బంజారీ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెతో అతను కలిసి మారువేషంతో ఊర్లోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న శాంతిని అక్కడి రాజకుమారుడు చూసి మోహిస్తాడు. ఆమె తండ్రి ఆరోగ్యం కారణంగా అతని ఆశ్రయంలో శాంతి ఉండిపోవలసి వస్తుంది. ఇక రాజకుమారుడు శాంతిని వివాహం చేసుకోవాలనుకోవడం, ఆమె మనోజ్ కోసం ఎదురు చూడడం, మనోజ్‌ని హత్య చేయించాలని రాజకుమారుడు ప్రయత్నించడం, అతను పన్నిన కుట్రకు శాంతి తండ్రి మరణించడం, చివరకు మనోజ్ చనిపోయాడని అందరూ అనుకోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటిగా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి, వీటితో శాంతి మతి చలించి గతం మర్చిపోతుంది. ఆమెకు రాజకుమారుడు షబ్నమ్ అనే పేరు పెట్టి ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు.

ఇక ఎన్నో ట్విస్టుల తరువాత శాంతి మనోజ్‌లు ఒకటవుతారు. ఆ రోజుల్లో సినిమాలతో చూస్తే ఇది భారీ తారాగణంతో తీసిన సినిమా, చాలా గ్రూప్ డాన్స్‌లు కనిపిస్తాయి. నృత్యాలపై చాలా శ్రద్ధ కనపరిచారు దర్శకులు. సంగీతం కూడా బావుంటుంది. కామినీ కౌషల్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. ఆవిడ దుస్తులు, శిరోజాలంకరణ అన్ని కూడా వినూత్నంగా ఉంటాయి. దిలీప్ కుమార్ ప్రథమ భాగంలో చాలా మంచి టైమింగ్‌తో కామెడీ పలికిస్తారు. “మెరా దిల్ తడ్పా కర్ కహా చలా” అనే గీతా దత్ పాట చాలా పాపులర్ అయింది. ముఖేష్‌తో శంషాద్ పాడిన పాటలు కూడా అలరిస్తాయి. అప్పట్లో వచ్చిన ఇంగ్లీష్ సినిమా “కారావాన్” కథ ఆధారంగా ఈ సినిమా తీసారని చెప్తారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు పాటల కోసం కథ అల్లినట్లు కనిపిస్తుంది. అప్పట్లో పాటలే సినిమాకు ప్రధానంగా ఉండేవి. అందుకే కొన్ని సినిమాలు పాటల చుట్టు నడిచేవి. షబ్నమ్ సినిమాలో అలాంటి పరిస్థితి చూస్తాం.

ఈ సినిమాలో నటించిన దిలీప్ కుమార్ మానరిజమ్స్‌ను తరువాత చాలా సినిమాలలో తారలు కాపీ చేసారు. మనోజ్‌గా అతని హేర్ స్టైల్ కూడా అప్పట్లో చాలా పాపులర్ అయిందట. ఆ రోజుల్లో సినిమాలలో ప్రధాన తారల పేర్లు సీనియారిటి బట్టి వేసేవారు. అలా కామినీ కౌషల్ పేరు దిలీప్ కుమార్ పేరు కన్నా ముందు కనిపిస్తుంది.  కామినీ కౌషల్ వదనానికి లత పీల గొంతు సరిపోదని సుబోధ్ ముఖెర్జీ లతకు పాడే అవకాశం ఇవ్వలేదు. కానీ, 1950లో ఆర్జూ సినిమాకు లతా , కామినీ కి పాడింది. తరువాత లత స్వరంలేని సుబోధ్ ముఖెర్జీ సినిమాలేదు.  లతా మంగేష్కర్ హీరోయిన్‌కి పాడిన మొదటి పాట కామినీ కౌషల్ మీదనే చిత్రించారు “జిద్దీ” సినిమాలో. అప్పటి దాకా ఆమె సహాయ నటులకే పాడేవారు. కామెనీ కౌషల్‌తో హీరోయిన్లకు లత పాడడం ప్రారంభమయింది. కామినీ కౌషల్ వయసు ఇప్పుడు 94. 2019లో హిందీలో వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ నాన్నమ్మ పాత్ర వేసారామె. అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ కబీర్ సింగ్. తెలుగులో కాంచన గారు వేసిన పాత్రను హిందీలో కామినీ కౌషల్ చేసారు. హిందీ సినీ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువకాలం నటిస్తున్న కళాకారిణి కామినీ. అశోక్ కుమార్ 61 ఏళ్ళు, దేవ్ ఆనంద్ 65 ఏళ్ళు నటించారు. కామినీ 79 ఏళ్ళుగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు పాటలు మాటలు రాసిన కమర్ జాలాలాబాది జానపద, పాశ్చాత్య బాణీలకు పూర్తి న్యాయం చేసే కవి. వీరి పాటలు మెరా నామ్ చిన్ చిన్ చు,,, ఆయియే మెహరబాన్ ఈ రోజుకీ అందరూ ఇష్టపడే పాటలు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ నుండి పంక్తులను తన గళంలో కలిపి వినిపించిన వ్యక్తి ఈయన. సినీ ఆడంబరాలకు దూరంగా సాహిత్యం, సంగీతం ప్రాణంగా జీవించిన వీరికి సిని దిగ్గజాలలో గౌరవమైన స్థానం ఉంది. ఈ సినిమాకు కథ హెలెన్ దేవి అందించారు.

ఈ సినిమాలో ఒక ప్రత్యేక నృత్యంలో కుకూ కనిపిస్తారు. ఆంగ్లో ఇండియన్‌గా జన్మించిన కుకూ తన నృత్యాలతో అప్పట్లో సినీ ప్రేక్షకులను అలరించారు. వీరు లేని సినిమా ఆ రోజుల్లో ఉండేది కాదు. ఆవిడ కోసం నృత్యాలను కంపోజ్ చేసేవారు ఆ రోజుల్లోని దర్శకులు. దిలీప్ కుమార్ నర్గిస్ రాజ్ కపూర్ల సినిమా అందాజ్‌లో ప్రధాన పాత్ర పోషించారు ఆమె. ఆ రోజుల్లో ఒక్క నృత్యానికి ఆరు వేలు పైగా తీసుకునే వారు కుకూ. భారత దేశ సినిమాలో మొదటి ఆంగ్లో ఇండియన్ నటి కూడా ఆమె. హెలెన్‌ను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది కూడ కుకూనే. దిలీప్ కుమార్ సినిమాలన్నిటిలో దాదాపుగా కుకూ నాట్యం చేస్తూ కనిపిస్తారు. యహూది సినిమాలో ఆమె హెలెన్‌తో కలిసి చేసిన నృత్యం సినీ నృత్యాలలో ఒక గొప్ప నృత్యంగా చెబుతారు.

షబ్నం సినిమాలో రాజకుమారుడి పాత్రలో జీవన్ కనిపిస్తారు. చివర్లో ఊబిలో కూరుకుపోయి అతని చనిపోవడం, పులులతో కొన్ని యుద్దాలు, ఇవన్ని అప్పటి ప్రేక్షకులకు వింత అనుభవాలు. నారద ముని పాత్రలో 49 సార్లు నటించిన జీవన్, హిందీ సిని ప్రపంచంలో విలన్ పాత్రలకు పెట్టింది పేరు. షబ్నమ్ సినిమాను నిర్మించింది ఫిల్మిస్తాన్ సంస్థ. దేవికా రాణి భర్త హిమాన్షు రాయ్ చనిపోయిన తరువాత అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ, రాయ్ బహాదుర్ చున్నీలాల్లు బాంబే టాకీస్‌ను వదిలి కలిసి మొదలెట్టిన కంపెనీ ఫిల్మిస్తాన్. దేవికా రాణి దిలీప్ కుమార్‌ని సినీ రంగానికి పరిచయం చేసారు. బాంబే టాకీస్ కాలగర్భంలో కలిసిపోయాక ఫిల్మిస్తాన్ సంస్థ కొన్ని మంచి ప్రయోగాలు చేసి వినూత్నమైన సినిమాలు అండించింది. ఆ సంస్థ తీసిన ఎనిమిదో సినిమా షబ్నమ్. ఇలాంటి స్టూడియాలలో సినిమాలకు పని చేసిన దిలీప్ కుమార్ తన కెరియర్‌లో స్టూడియోలతో సంబంధం ఉన్న దర్శకులతోనే పని చేయడానికి ఇష్టపడే వారట.

షబ్నమ్  సినిమాను సమీక్షిస్తూ, 1949లో ది మోషన్ పిక్చర్ పత్రిక, ఈ సినిమా చంద్రలేఖ సినిమా ప్రభావంతో తయారయిన ఒక దానితో ఒకటి సంబంధంలేని దృశ్యాల ఖిచ్డీ అని విమర్శించింది. అందాజ్ సినిమా తరువాత దిలీప్ కుమార్‌పై నటన పరంగా పెట్టుకున్న ఆశలనీ సినిమా వమ్ము చేసిందని విమర్శించింది. అంతేకాదు, ఫిల్మిస్తాన్ సంస్థ తన శక్తియుక్తుల్ని ఇలాంటి సినిమాలపై వ్యర్ధంచేసేబదులు అర్థవంతమైన, దేశభక్తి  సినిమాలు నిర్మిస్తే మంచిదని సలహా ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంలోనే దిలీప్ కుమార్, కామినీ కౌశల్ నడుమ ప్రేమ చిగురించిందంటారు.  అంతకుముందు షహీద్ సినిమా సందర్భంలో జరిగిన పరిచయం ఈ సినిమా సందర్భంగా తీవ్రమయింది. ఈ సినిమాపై వచ్చిన విమర్శలు  దిలీప్ కుమార్, ఇకపై కథలను జాగ్రత్తగా ఎన్నుకునేట్టు చేశాయి. కామెడీనుంచి అతని దృష్టి ట్రాజెడీ  వైపుకు మళ్ళింది.

దిలీప్ కుమార్- పీర్లెస్ ఐకోన్ ఫొర్ జెనెరేషన్స్ అన్న పుస్తకంలో దిలీప్ కుమార్ కామినీ కౌశల్ ఏ సినిమాలో నటిస్తున్నా ఆ షూటింగ్ జరిగే స్టూడియోలకు వెళ్ళేవాడనీ, బొంబాయి ఫస్ట్ క్లాస్ రైలు బోగీలు వాళ్ళ ప్రేమ అడ్డాలనీ త్రినేత్ర బాజ్పై, అన్షులా బాజ్పైలు రాశారు. కామినీ తో ప్రేమ వ్యవహారాన్ని వదిలేయమని ఇస్మత్ చుగ్తై దిలీప్‌ను హెచ్చరించింది. కామినీ సోదరుడు దిలీప్ ను కాల్చేందుకు తుపాకీ పట్టుకుని వెతికాడనీ, దిలీప్ ను కాల్చలేక తనని తాను కాల్చుకోవటంతో వీరిద్దరూ దూరమయ్యారనీ ఆ పుస్తకంలో రాశారు. దీన్లో నిజం ఎంత వుందో తెలియదు కానీ, వారిద్దరి గాఢమయిన ప్రేమను ఇది నిరూపిస్తుంది. ఆ తరువాత దిలీప్ కుమార్ భగ్న ప్రేమికుడిగా విషాదం చిలికించటంలో ఈ అనుభవం ఎంతో తోడ్పడింది. అంతేకాదు, ఈ అనుభవం తరువాత దిలీప్ కుమార్ అమ్మాయిలకు సన్నిహితంగా వెళ్ళాడు కానీ, ఎవరినీ నిజంగా ప్రేమించలేకపోయాడంటారు.

షబ్నమ్ సినిమా ఆనాటి పాత సినీ ప్రేక్షకుల ఇష్టానికి అనుగుణంగా, వారిని రంజింపజేయడానికి తీసిన సినిమా. ఈ సినిమాలో గ్రూప్ డాన్స్‌ల కొరియోగ్రఫీ బావుంటుంది. చాలా వరకు స్టేజి మీద చేసే నృత్యాలుగా వాటిని తీర్చిదిద్దారు నృత్య దర్శకులు.  ఈ సినిమా నృత్యాలలో కుక్కూ కన్నా, పారోకు ఎక్కువ పేరు వచ్చింది.  దిలీప్ కుమార్ నట జీవితంలోనూ, నిజ జీవితంలోనూ అత్యంత ప్రాధాన్యం వహించే సినిమా షబ్నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here