కశ్మీర రాజతరంగిణి-45

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

సింహాసనం స్వవంశ్యానాం తేనాహితష్యతం తతః।
విక్రమాదిత్య వసతేరానీతం స్వపురం పునః॥
(కల్హణ రాజతరంగిణి III, 331)

[dropcap]క[/dropcap]శ్మీర రాజ్యం భారతదేశంలోని ఇతర భాగాలతో సంబంధం లేకుండా లేదనేందుకు మరో నిరూపణ ప్రవరసేనుడి జీవితం.

ప్రవరసేనుడు కశ్మీరుపై అధికారం సాధించిన తరువాత జైత్రయాత్రలపై దృష్టి పెట్టాడు. అగస్త్యుడు సముద్రపు నీటిని పుక్కిలి పట్టినట్టుగా ప్రవరసేనుడు ఇతర దేశాలను గెలుచుకున్నాడు. అతని సైన్యం సముద్రం వరకూ ప్రయాణించింది. కీశ దేశాన్ని, పంజాబ్ ప్రాంతాన్ని గెలిచాడు. కాళింది నది గంగానదిని కలిసేట్టు చేశాడు. సౌరాష్ట్ర, మాళ్య దేశాలను జయించాడు. విక్రమాదిత్యుడి కుమారుడు శిలాదిత్యుడిని ఓడించాడు.

విక్రమార్కుడి మరణం తరువాత అతడి కొడుకు ‘దేవభక్తుడు’ రాజయ్యాడు. శకులతో యుద్ధంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత వచ్చిన రాజులు బలహీనులు. ఈ సమయంలో ప్రవరసేనుడు ఉజ్జయినిపై దాడి చేశాడు. గెలిచాడు. గతంలో  కశ్మీరును ఓడించి కశ్మీరుకు చెందిన సింహాసనాన్ని ఉజ్జయినికి తరలించారు . ఇప్పుడు ప్రవరసేనుడు ఆ సింహాసనాన్ని తిరిగి కశ్మీరుకు చేర్చాడు.

ఈ సంఘటన తర్వాత ఉజ్జయిని మరీ బలహీనం అయ్యింది. శకులు ఉజ్జయినిని దోచారు. స్త్రీలను ఎత్తుకుపోయారు. ఆ తరువాత శాలివాహునుడు రాజ్యానికి వచ్చాడు. అతడు శకులను జయించాడు. చైనీయులు, తార్తారులపై దాడి చేసి రాజ్యాన్ని శక్తివంతం చేశాడు.    బాహ్లికులు, రోమజులు, కామరూప, ఖొరసాన్ దేశాలను పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇతడి పేరు మీదే శాలివాహన శకం ఏర్పడింది. ఈ శకం క్రీ.శ. 78వ సంవత్సరం నుండీ లెక్క లోకి వస్తుంది. ఇలా కశ్మీరు చరిత్ర భారతదేశ చరిత్రతో పెనవేసుకుని ఉంది. ఇదంతా ఒకే దేశ చరిత్ర. కానీ కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేదని, దేశంలోని ఇతర ప్రాంతలకు ప్రత్యేకంగా, వాటి ప్రభావం లేకుండా కశ్మీరు ఎదిగిందని ఇప్పటికీ చరిత్ర రచయితలు ప్రకటిస్తూనే ఉన్నారు.

రాజతరంగిణి ప్రకారం ఉజ్జయినిపై విక్రమాదిత్యుడి సంతానమైన ప్రతాపచ్ఛీల లేదా శిలాదిత్యుడిని నిలిపాడు ప్రవరసేనుడు. ఈ శిలాదిత్యుడి గురించి ‘ యువాన్ చాంగ్’ కూడా రాశాడు. ‘ఇతడు విక్రమాదిత్యుడి  కొడుకు’ అని కూడా ఆయన రాశాడు. అంటే, రాజతరంగిణిలో కల్హణుడు రాసిన దాన్ని విదేశీ యాత్రికులు రాసిన దానితో పోల్చినా సరిపోతుందన్నమాట. తేదీలలో తేడా వస్తుంది. దీనికి కారణం భారతదేశ చరిత్ర తేదీలను, భారతీయ లెక్కల ప్రకారం, మహా భారత యుద్ధ కాలం నుంచి కాక, గ్రీకుల చరిత్ర, క్రీస్తు జననానికి తగ్గట్టుగా నిర్ణయించటం. ఒక గూటి పక్షి పాటకు, మరో గూటి పక్షి పాటను ప్రామాణికంగా నిర్ణయించాలన్న తపన వల్ల తేడాలు వచ్చాయి. ఏ గూటి పక్షి పాట, లయ దానిదే. దేని శైలి దానిదే.

ప్రవరసేనుడు ‘ముమ్ముణి’ అనే రాజుని ఏడుమార్లు ఓడించాడు. ఏడుమార్లు అతడిని క్షమించి వదిలేశాడు. ఎనిమిదోసారి అతడిని బంధించమన్నాడు. అయితే, “జంతుబలి నిషిద్ధం. నేను జంతువును. కాబట్టి నన్ను చంపడం నిషేధం” అని నిండు సభలో నెమలిలా నాట్యం ఆడుతాడు ముమ్ముణి. ఈ ముమ్ముణి అన్న పేరు రాజతరంగిణిలో మూడు మార్లు కొన్ని శతాబ్దాల తేడాతో వస్తుంది. కాబట్టి ఇతడు ఎవరో అన్నది స్పష్టంగా తెలియకున్నా, ఉత్తర ప్రాంతాలకు చెందిన విదేశీ మ్లేచ్ఛ రాజు కావచ్చని ఊహిస్తున్నారు. కనీసం ముగ్గురు వేర్వేరు ముమ్మణ్నిలున్నారని భావిస్తున్నారు.

జైత్రయాత్రలు పూర్తయిన తర్వాత ప్రవరసేనుడు తన పేరు మీద ఓ పెద్ద నగరం నిర్మించాడు. వితస్త పై సేతువు (boat bridge) నిర్మించాడు. అప్పటి నుంచీ కశ్మీరులో ఇలాంటి వంతెనలు నిర్మించటం అలవాటయింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా అరవై ఏళ్ళ పాలన తరువాత ప్రవరసేనుడు ప్రవరదేవ  మందిరంలో శివైక్యం పొందాడు. అతడి తరువాత రెండవ యుధిష్టిరుడు నలభై ఏళ్ళు రాజ్యం చేశాడు. అతని తరువాత నరేంద్రాదిత్యుడు రాజయ్యాడు. పదమూడేళ్ళు రాజ్యం చేశాడు నరేంద్రాదిత్యుడు. అతని తరువాత అతని సోదరుడు రణాదిత్యుడు రాజయ్యాడు. రణాదిత్యుడి మరో పేరు తుంజీనుడు.

తుంజీనుడి భార్య రణరంభ. తుంజీనుడు రణరంభను భార్యగా పొందడం వెనుక రమ్యమైన పూర్వజన్మ గాథ ఉంటుంది. ఇది పాశ్చాత్యులకు నమ్మశక్యం కాని గాథ. పూర్వజన్మలో అతడు వింధ్య పర్వతంపై కొలువై ఉన్న భ్రమరవాసినిని దర్శించుకోవాలనుకుంటాడు. కానీ భ్రమరవాసిని దర్శనం దుర్లభం. ఆమెకి కాపలాగా భయంకరమైన తేనెటీగలుంటాయి. అవి మనిషి మాంసాన్ని సైతం పీకేస్తాయి. వాటి నుంచి రక్షణ కోసం పలు రకాల తొడుగులు వేసుకుని, అష్టకష్టాలు పడి కొన ప్రాణంతో దేవి మందిరం చేరుకుంటాడు. జాలి పడి దేవి ప్రాణం పోసి  “కోరికను కోరుకో” అంటే, ఆమెనే కోరుకుంటాడు. ఆమె మరుజన్మలో అది ‘సాధ్యం’ అంటుంది. మరుజన్మలో అతడు తుంజీనుడిగా జన్మిస్తాడు.  ఆమె రతిసేనుడనే చోళరాజుకు సముద్రంలో దొరుకుతుంది.  ఆమె కోరిక ప్రకారం చోళరాజు, కులూత దేశంలో ఆమెను పెంచుతాడు. రణరంభగా పెరుగుతుంది. ఆమెకు గతజన్మ జ్ఞాపకం ఉంటుంది.  దాంతో రణాదిత్యుడు ఆమె ఉన్న కులూత దేశానికి (కుల్లూ ప్రాంతం) వెళ్ళి  ఆమెను వివాహం చేసుకుని వస్తాడు [ఈ కథ ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ ‘భ్రమరవాసిని’ అన్న అత్యద్భుతమైన కశ్మీర చరిత్ర నవలను సృజించారు. రాజతరంగిణిలో ఉన్న కథకు భారతీయ తాత్వికతను, ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఆధారంగా చేసి పరమ రమణీయమైన రచనను సృజించారు. ఔచిత్యాన్ని పాటిస్తూ అద్భుతమైన గాథను రూపొందించారు. సృజనాత్మకత అన్న పదానికి అర్థం తెలియని కొందరు కుపండిత విమర్శకులు ఈ రచనలను తక్కువ స్థాయి (sub-standard) రచనలుగా విమర్శించి తమ తక్కువ స్థాయిని బయటపెట్టుకుంటున్నారు. రాజతరంగిణిని స్పృశించని వారు కూడా విశ్వనాథ రాజతరంగిణి రచనలను విమర్శించటం తెలుగు సాహిత్యం దౌర్భాగ్యం].

తన రాణి పార్వతి అంశ కాబట్టి, రణాదిత్యుడు రెండు శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటాడు. అయితే వాటిని ప్రతిష్ఠించాల్సిన పురోహితుడు ఆ రెండు శివలింగాలలో విరిగిన రాతి ముక్కలు, కప్పలు ఉన్నాయంటాడు. అప్పుడు రాణి నిజం చెప్తుంది.

శివపార్వతుల వివాహ సమయంలో ప్రజాపతి ఓ విగ్రహం తెస్తాడు. ఆ విగ్రహాన్ని పూజిస్తున్న శివుడు అది విష్ణువు విగ్రహం అని గ్రహిస్తాడు. విష్ణువు విగ్రహం అంటే శివుడు వెంట లేని శక్తి విగ్రహం అని గ్రహిస్తాడు. పూజిస్తాడు. ఆ తరువాత దేవతలు, అసురులు తెచ్చిన పెళ్ళి కానుకలతో మరో లింగం తయారు చేస్తాడు. శివుడు పూజించిన విష్ణువు విగ్రహం, శివలింగాలు కాలక్రమేణా రావణాసురుడికి దక్కుతాయి. రావణుడి మరణం  తరువాత ఈ రెండు విగ్రహాలను కోతులు ఎత్తుకుపోయాయి. అవి వాటిని ఉత్తర మానస సరస్సులో వదిలేశాయి. ఆ రెండు విగ్రహాలను రాణి సరస్సు నుంచి వెలికి తీయించింది. ఆ రెంటిని ప్రతిష్ఠించమంటుంది రాణి.  చాలా సుందరమైన గాథ ఇది. దేశంలో ఇతర ప్రాంతాలలో శైవ, వైష్ణవుల నడుమ ఉన్న ఉద్విగ్నతలు శివమయమైన కశ్మీరంలో ఎందుకు లేవో అతి సుందరంగా తెలుపుతుందీ కథ. పుట్టుకథనో, కట్టుకథనో కాని శివుడు – విష్ణువును శివుడు లేని శక్తిగా భావించి పూజించటం, రావణాసురుడు ఆ రెండు విగ్రహాలను పూజించటం, అవి భ్రమరవాసిని అంశ అయిన రాణి ద్వారా కశ్మీరు చేరటం… ఇంతకు మించి శివకేశవుల అభేదప్రతిపత్తిని ప్రజల మనస్సులో నాటేందుకు మరో మార్గం లేదు. ఇదీ భారతీయ ధర్మంలోని ఔన్నత్యం. హింస లేదు. బెదిరింపులు లేవు. లొంగదీయటాలు లేవు. ప్రజల మనస్సులలోని సంకుచిత భావనలు తొలగించి విశాల భావాలు నాటటం సాహిత్యం ద్వారా సాధ్యం చేసిన ఏకైక నాగరికత భారతీయ నాగరికత. ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే భారతీయ ధర్మంలో సాహిత్యం సరస్వతి ఆయింది. అతి పవిత్రం అయింది. అత్యంత ప్రాధాన్యాన్ని పొందుతుంది. సాహిత్యకారులన్నా అందుకే అంత గౌరవం  ఈ సంస్కృతిలో.

ఉత్తర మానస సరస్సు హరముఖ పర్వత పాదాల వద్ద ఉన్న ‘గంగాబల’ సరస్సుగా గుర్తించారు. ఇక్కడ మరో ధర్మ సందేహాన్ని అత్యంత చమత్కారంగా తీర్చాడు కల్హణుడు. రణరంభ భ్రమరవాసిని అంశ. ఆమెను మోహించాడు రణాదిత్యుడు. రణాదిత్యుడు మనిషి. రణరంభ దేవకన్య. ఇద్దరూ భౌతికంగా కలవటం అనౌచిత్యం. అందుకని ఆమె ‘మాయ’ చేసింది. ఈ మాయను విశ్వనాథ పరమాద్భుతంగా కళ్ళకు కట్టినట్టు, ఆయన నిజంగా కళ్ళతో చూసి, మనసుతో వర్ణిస్తున్నట్టు ‘భ్రమరవాసిని’లో వర్ణిస్తాడు. సృజనాత్మకత అంటే అది!

‘మర్త్య సంస్పర్శ భీరుః’ అంటే మర్త్యులయిన మానవ స్పర్శ భీతితో మహాదేవి తన మాయతో ఆమె అతడు తన మోహావేశంలో ఉండేట్టు చేసింది కానీ అతడిని తాకలేదు, తాకనీయలేదు. తనలాంటి ఛాయాస్త్రీని సృష్టించి రాజు వద్దకు పంపి, తాను భ్రమరంలా గదిలో సంచరిస్తూండిపోయింది. ఇది కల్హణుడి వర్ణన. విశ్వనాథ దీన్ని తుచ తప్పకుండా అనుసరిస్తూ నవలను సృజించాడు.

ఆ తరువాత రాజు, రాణి దేవాలయాలు నిర్మించటం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సాగించటంపై దృష్టి పెట్టారు. వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం అందమైన ‘ఆరోగ్యశాల’ను నిర్మించారు. రాజు మరో భార్య అమృతప్రభ అద్భుతమైన బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.

ఇది గమనించాల్సిన విషయం. ఆధునిక కాలంలో భారతీయ ధర్మం అసహనానికి మారుపేరుగా ప్రచారం జరుగుతోంది. మేధావులుగా చలామణీ అయ్యేవాళ్ళు ఈ భావనకు ఊపు నివ్వటమే కాకుండా, అభ్యుదయంగా, ఈ భావనను నొక్కి చెప్పటమే అసలు జ్ఞాన లక్షణంగా ప్రచారం చేస్తున్నారు. కానీ చరిత్ర మరో రకంగా చెప్తుంది. భారతీయ ధర్మాన్ని అనుసరించే రాజులు తప్ప ఇతర ధర్మాన్ని అనుసరించే రాజులున్నప్పుడు భారతీయ ధర్మం అణచివేతకు గురయిన నిదర్శనాలు, స్థానిక ధర్మాలు, జీవన పద్ధతులు అతలాకుతలం అయిన గాథలు అధికంగా కనిపిస్తాయి. భారతీయ ధర్మాన్ని పాటించే రాజు  అధికారంలో ఉన్నప్పుడు ‘పరమత సహనం’ పాటించిన నిదర్శనాలు అత్యధికంగా లభిస్తాయి. నాగులు దేశం విడిచి పారిపోవటం, ఇతర దేశాల వారు కూడా జీవహింసను మానేట్టు చేయాలని దండయాత్రలు చేయటం వంటి గాథలు ‘జిన మతస్తుల’ అన్య మతాల పట్ల అసహానాన్ని చూపిస్తాయి. శివకేశవులతో పాటుగా బుద్ధ విగ్రహన్ని ప్రతిష్ఠించటం, రాజు భారతీయ ధర్మానుయాయి, రాణి బౌద్ధమత ప్రేమికురాలు అవటం, రాజు విహారాలను కట్టించి, బంగారు పూతలు పూయటం వంటి గాథలు భారతీయ ధర్మంలోని సహనం, అన్ని రకాల భావనలను ఆహ్వానించి, ఆదరించటాన్ని నిరూపిస్తాయి. ఇందుకు విరుద్ధమయిన ఆలోచన సమాజంలో ప్రచారమవటం స్వార్థ, విచ్ఛిన్నకర రాజకీయాలు, భారతీయ ధర్మానుయాయుల అజ్ఞానం వల్ల తప్ప మరొక కారణం  వల్ల  కాదు.

ఇలా ధర్మకార్యాలు చేస్తు, ప్రజల సంక్షేమాన్ని పాటిస్తూ రణాదిత్య తుంజీనుడు మూడు వందల ఏళ్ళు రాజ్యం చేసి నిర్వాణం పొందాడు. అతడు దైత్య మహిళల పట్ల ఆశపడిన మరుక్షణం రాణి అదృశ్యమయింది. ఆమె శ్వేత ద్వీపానికి వెళ్ళిందంటాడు కల్హణుడు. ద్వీపాలన్నీ మేరు పర్వతం చుట్టూ ఉంటాయి. వాటిల్లో జంబూ ద్వీపం కూడా ఒకటి.

తుంజీనుడు మూడు వందల ఏళ్ళు రాజ్యం చేయటం పాశ్చాత్యులకే కాదు, స్వదేశీయులకు కూడా కొరుకుడు పడదు. కాబట్టి కల్హణుడు చరిత్ర వ్రాయలేదు, ప్రచారంలో ఉన్న కథలను సంకలనం చేశాడంతే అని కొందరు విమర్శిస్తారు. కల్హణుడు రాసింది చరిత్రనే. ఎందుకంటే, కథలు ప్రచారంలోకి రావాలంటే కూడా ఆధారంగా ఏదో రూపంలో ‘నిజం’ ఉండి తీరాల్సిందే. నిప్పు లేందే పొగ రాదు. పొగ ఉంటే నిప్పు ఉన్నట్టే. కాబట్టి జానపద గాథ ఉంటే దానికి బీజంగా నిజం ఉంటుంది. కథను వదిలి నిజాన్ని గ్రహించటంలోనే అసలు విచక్షణ ఉంది.

అతని తరువాత అతని కొడుకు విక్రమాదిత్యుడు 42 ఏళ్ళు పాలించాడు. అతని సోదరుడు బాలాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. బాలాదిత్యుడు ‘వంకల’ రాజ్యాన్ని గెలిచి అక్కడ కశ్మీరీయులు నివసించేందుకు ఒక ‘జనాశ్రయం’ నిర్మించాడు. అతని కూతురు ‘అనంగరేఖ’. ఆమె చాలా అందమైనది. ఆమె జాతకం చూసి జ్యోతిష్యుడు “ఈమె భర్త జగజ్జేత అవుతాడు” అని భవిష్యత్తు చెప్తాడు. ఇది బాలాదిత్యుడిలో అసూయ కలిగించింది. విధిని గెలవాలని అతను అనంగరేఖను రాకుమారుడికి కాకుండా, దుర్లభవర్ధనుడనే ‘అశ్వఘాస కాయస్థు’డికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ కాలంలో గుర్రాలకు సరిపడా ఆహారాన్ని తీసుకురావటం కోసం రాజులు కొందరిని నియమించేవారు. వారు దేశంలో పలు ప్రాంతాలు తిరిగి ‘ఆశ్వఘాసం’ తెచ్చేవారు. అలాంటి వాడన్న మాట దుర్లభవర్ధనుడు. అయితే రాజుకు తెలియని విషయం ఏమిటంటే ఈ దుర్లభవర్ధనుడు రాజవంశానికి చెందినవాడు. కర్కోటనాగు సంతానం ఇతడు. అంటే, మనిషి విధిరాతను ఎంతగా ఎదిరించాలని ప్రయత్నించినా, విధిరాత జరిగి తీరుతుందన్న మాట!

దుర్లభవర్ధనుడు తన దృష్టిని రాజ్య సింహాసనంపై పెట్టాడు. అతడి ప్రజ్ఞను గుర్తించిన రాజు అతడిని తన వారసుడిగా గుర్తించక తప్పలేదు. అయితే, దుర్లభవర్ధనుడి భార్య, బాలాదిత్యుడి కూతురు ‘అనంగరేఖ’కు మాత్రం దుర్లభవర్ధనుడు నచ్చలేదు. రాకుమారి ఒక సామాన్య ఉద్యోగిని వివాహమాడటం అన్న విషయం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆమెలోని అసంతృప్తిని కనిపెట్టిన ‘మంఖుడు’ అనే మంత్రి ఆమెకు చేరువయ్యాడు. వారిద్దరూ రహస్యంగా తమ వ్యవహారం కొనసాగించారు. అయితే తన భార్యలోని మార్పు, మార్పుకు కారణం దుర్లభవర్ధనుడు త్వరలోనే గ్రహించాడు.

ఇక్కడి నుండి మూడవ తరంగం అంతం వరకు కల్హణుడి లోని కవి విజృంభించాడు. మానవ మనస్తత్వాన్ని, మనస్తత్వంలోని వైచిత్రిని, పశువును మనిషిలా మార్చే భారతీయ ధర్మంలోని ఉన్నత లక్షణాన్ని కల్హణుడు పరమాద్భుతంగా వర్ణించాడు. భారతీయ ధర్మంలో స్త్రీని అణగొద్రొక్కటం తప్ప మరొకటి లేదని చెవినిల్లు కట్టుకుని పోరే గురవింద గింజల్లాంటి అన్యమతస్తుల అజ్ఞానం ప్రస్ఫుటమై చెవులు గింగురుమనేలా స్త్రీ ఔన్నత్యాన్ని, భారతీయ ధర్మంలోని అత్యంత తార్కికమైన ఆలోచనను, ధార్మికతను, తన శ్లోకాలలో గుప్పించి వదిలాడు. గ్రంథ విస్తరణ భీతి వేధిస్తున్నా, జోనరాజు రాజతరంగిణి అనువాదం లక్ష్యంగా ఆరంభించి కల్హణ రాజతరంగిణిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామన్న భయం ఉన్నా, ఇక్కడి నుంచి ఉన్న 25 శ్లోకాలను విపులంగా చర్చించక దాటేయటానికి మనసొప్పటం లేదు. వాటిని విపులంగా వివరించకుండా ముందుకు సాగలేము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here