[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
మల్టీస్టారర్‌గా వచ్చిన ‘క్రాంతి’లో అందరి నటుల మెలోడ్రామా మధ్య కూడా తనదైన బాణీతో మురిపించిన దిలీప్ కుమార్
[dropcap]స్వా[/dropcap]తంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజు దిలీప్ కుమార్ నటించిన క్రాంతి సినిమా గురించి ….
1981లో మనోజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ సినిమా క్రాంతి. ఈ సినిమా అప్పట్లో చాలా ఖర్చుతో తీసారట. దీనికి సలీమ్ జావేద్‌లు కలిసి కథ సమకూర్చారు. ఈ సినిమాకు మనోజ్ కుమారే దర్శకులు, నిర్మాత కూడా. ఎడిటింగ్ కూడా వారే చేసారు. అప్పట్లో ఇది బ్లాక్‌బస్టర్ సినిమా. దిలీప్ కుమార్ ఐదు సంవత్సరాల విరామం తరువాత నటించిన సినిమా క్రాంతి. చాలా చోట్ల గోల్డెన్ జూబిలి జరుపుకున్న ఈ సినిమా మాత్రం ఇప్పుడు కష్టపడి చూడాలి. ఈ రోజుల్లో చూస్తుంటే చాలా ఎడిటింగ్, దర్శకత్వ లోపాలు కనిపిస్తాయి. మనోజ్ కుమార్‌కి దేశభక్తికి సంబంధించిన సినిమాలపై చాలా మక్కువ. చాలా ఇష్టపడి ఆ సబ్జెక్ట్ మీద అనేక సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. అలాగే మల్టీస్టారర్ సినిమాలు కూడా ఇష్టపడి నిర్మించిన వ్యక్తి. మనోజ్ కుమార్ సినిమాలో ప్రతిభ గల ఇతర తారలు చాలా మంది కనిపిస్తారు. క్రాంతిలో కూడా దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, శశి కపూర్, శత్రుఘన్ సిన్హా, ప్రదీప్ కుమార్, నిరుపా రాయ్, శశికళ, ప్రేమ్ చోప్రా, హేమామాలిని, పర్వీన్ బాబీ, సారిక, షమ్మి, మదన్ పురీ ఇలా చాలా మంది తారలు కనిపిస్తారు. మన భారతీయ సినిమాలలో ఒకో హీరోకి ఒకో పేరు నిలబడిపోతుంది. వారి పాత్రలకు ఎక్కువగా ఆ పేరు వాడుకుంటారు. రాజ్ కపూర్‌కి రాజు, మనోజ్ కుమార్‌కి భరత్, ఇప్పటి తారలలో సల్మాన్ ఖాన్‌కి ప్రేమ్, షారుఖ్ ఖాన్‌కి రాహుల్… ఇలా ఆ పాత్ర పేర్లతో వారిని ఐడెంటిఫై చేస్తారు ప్రేక్షకులు. క్రాంతిలో కూడా మనోజ్ కుమార్ పేరు భరత్.
కథకు వస్తే ఇది పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయం నాటి కథ. సాంగా అనే ఒక రైతుపై ఆ దేశ రాజుని చంపిన నేరం వేస్తారు రాజు తమ్ముడు, అతని బావమరిది. వీళ్ళు ఆంగ్లేయులకు సహాయం చేస్తూ ఉంటారు. దానికి బదులుగా రాజు హత్య తరువాత అతని తమ్ముడుకు రాజ్యాధికారం ఇస్తారు ఆంగ్లేయులు. సాంగాకు మరణ శిక్ష పడుతుంది. కాని అతను ఖైదు నుండి తప్పించుకుంటాడు. అతని కొడుకు, భార్య అతనికి దూరం అవుతారు. పెద్ద కొడుకుని అతని స్నేహితుడు, భరత్ అనే పేరు పెట్టి పెంచుతాడు. అతని కూతురు సురీలి. సాంగా భార్య, భర్త ఖైదు అవబోయే ముందు మరో బిడ్డను ప్రసవిస్తుంది. కాని ఆంగ్లేయులు పిల్లలను ముసలివారిని చంపేస్తున్నప్పుడు ఆ బిడ్డను నీటిలో వదిలి వేస్తుంది. ఆ బిడ్డను తన కుటుంబం పూజించే ఆమ్మవారి ముద్ర ఉన్న దుప్పటిలో చుట్టి నీటిలో వదిలేస్తుంది. ఆ బిడ్డ, రాజు చెల్లెలి దాయికి దొరుకుతాడు. రాజు చెల్లెలు వరుసగా మృత శిశువులను కంటుంది. అప్పుడు కూడా చనిపోయిన బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఆ సంగతి రాజుకు చెప్పాలని మథనపడుతున్న దాసి ఈ బిడ్డను చూసి అతను చుట్టబడి ఉన్న దుప్పటిని గుర్తుపట్టి అతను సాంగా కొడుకని అర్థం చేసుకుంటుంది. తన రాణికి ఈ విషయం చెప్పి ఆ బిడ్డను ఆమె ఒడిలో వేస్తుంది. అతనే శక్తిగా ఆ రాజ్యానికి సేనాపతి అవుతాడు.
సాంగా సముద్రంపై ఒక సేనను నిర్మించుకుని ఆంగ్లేయుల వ్యాపారాలను దెబ్బతీస్తూ ఉంటాడు. అతనే క్రాంతిగా పేరు మార్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత భరత్ కూడా క్రాంతి పేరుతో బ్రిటీష్ సైన్యం చేసే ఆగడాలను కట్టడి చేస్తూ ఉంటాడు. ఇద్దరికి ఒకరికొకరు తెలియకపోయినా ఒకే పని చేస్తూ ఒకే ఆశయంతో ముందుకు పోతున్నందుకు ఒకరి పై మరొకరికి పరస్పర గౌరవం ఉంటుంది.
అపుడే మరో దేశ రాజకుమారి మీనాక్షి ఆ రాజ్యానికి వస్తుంది. దారిలో ఆమెను అపహరిస్తాడు భరత్. మీనాక్షికి తన పోరాట విషయం తెలిపి బ్రిటీష్ వారి అరాచకాలను చూపించినప్పుడు ఆమె క్రాంతి దళంతో కలిసి పని చేయడం మొదలెడుతుంది. ఆమె స్థానంలో సురీలి రాకుమారిగా రాజ్యానికి వెళూతుంది. కాని అక్కడ జరిగే పోరాటంలో ఆమె మరణిస్తుంది. ఇలా కథ నడుస్తూ ఉండగా క్రాంతి పేరుతో కొన్ని క్రూరమైన పనులు రాజు సైనికులతో చేయిస్తాడు. క్రాంతికి ఉన్న ప్రజా బలం తగ్గాలంటే అతను దుర్మార్గుడని రుజువు కావాలని వారా పని చేస్తారు. ఇద్దరు క్రాంతులు కూడా మరొకరు ఆ పని చేసారని అనుకుని, ఒకరిపై మరొకరు కోపంతో ఒక చోట కలుస్తారు. కాని సేనాధిపతి వారిద్దరిని పట్టుకుని ఖైదు చేయడంతో వారికి రాజు పన్నాగం అర్థం అవుతుంది. భరత్‌కు కరీమ్ ఖాన్ అనే ముస్లిం దేశభక్తుడు కూడా సహాయ పడతాడు. చివరకు అన్నదమ్ములు ఒకరి నొకరు గుర్తుంచడం, శక్తి అన్న భరత్‌తో కలవడం, మీనాక్షి భరత్‌ను ప్రేమ వివాహం చేసుకోవడం, వారి పోరు అధికారం మీద సాగుతూ చివరకు కుటుంబం కలిసి ఒకరినొకరు గుర్తించిన కొన్ని గంటలలోనే శక్తి, భరత్ ఇద్దరూ కూడా యుద్దంలో చనిపోవడం జరుగుతుంది. సాంగా కోడలు మీనాక్షిని శత్రువుల స్థావరం నుండి బైటకు తీసుకువస్తాడు. ఆమె బిడ్డను ప్రసవిస్తుంది. కొన్ని ఏళ్ళ తరువాత ఆ బిడ్డే తన తండ్రి హంతకుడిని చంపి క్రాంతి ఆశయాన్ని బ్రతికించి, ఉద్యమాన్ని ముందుకు నడిపించే నాయకుడి బాటలో ప్రయాణించడం సినిమా ముగింపు.
ఇంత మంది తారల మధ్యన సినిమా నడుస్తుంది. కాని ఆ యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా చాలా సాగతీతగా అనిపిస్తాయి. ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క నటుడిని గమనిస్తే అంతగా సాగతీతగా నడిచే సినిమాలో కూడా దిలీప్ కుమార్ తన పద్ధతిలో చాలా నిండుగా గంభీరంగా కనిపిస్తారు. ఎక్కడా కూడా అతన్ని మనం గేలి చేయలేం. కొన్ని సీన్లు ఎందుకు వస్తున్నాయో వెళుతున్నాయో అర్థం కాని సమయంలో కూడా దిలీప్ కుమార్ తన పాత్రకు ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని కల్పిస్తారు. ఇద్దరు క్రాంతులు ఒకరినొకరు విమర్శించుకునే ఒక సీన్‌ను గమనిస్తే, దిలీప్ కుమార్ చాలా కూల్‌గా ఎక్కడ గొంతు పెంచాలో ఎక్కడ తగ్గించాలో చూసుకుంటూ, అతను మాట్లాడే ప్రతి పదానికి ఒక బలాన్ని ఇస్తూ డైలాగ్ పలుకుతే, అతనితో పోటీగా నటించడానికి మనోజ్ కుమార్ గొంతు చించుకుని మాట్లాడడం చూస్తాం. అలాగే రాజు దగ్గరకు బంధించి ఇద్దరు క్రాంతులను తీసుకొచ్చిన దగ్గర దిలీప్ కుమార్ ప్రదీప్ కుమార్ ప్రేమ్ చోప్రాల మధ్య సంభాషణలలో దిలీప్ కుమార్‌ను గమనిస్తే ఎటు వెళ్తుందో తెలియని ఆ కథలో కూడా తన మార్కు ఆయన ఎంత బలంగా వేస్తారో చూడవచ్చు.
దిలీప్ కుమార్‌ని ఇంత మంది నటుల మధ్య ముఖ్యంగా హీరోయిజం, స్టైల్ ఉన్న శత్రుఘన్ సిన్హా లాంటి నటుల మధ్య చూస్తే ఆయనలోని క్లాస్ ప్రత్యేకంగా కనపడుతుంది. క్రాంతి సినిమాను ఆ దృష్టితో చూస్తే మనకు దిలీప్ కుమార్ లోని ఈ విశిష్టత అర్థం వుతుంది. మాస్ సినిమాలకు, డైలాగులకు అలవాటు పడిన ముందు బెంచి జనం కూడా ఒక్క క్షణం ఆగి ఆయన పలుకుతున్న మాటలను వింటారన్నది నిజం. చివర్లో హేమామాలినిని బండిపై పడుకోబెట్టుకుని ఆమె బిడ్డను ప్రసవించే దాకా క్షేమంగా చూసుకునే ఒక వృద్ధుడిగా, ఆయన నటన బావుంటుంది. చివర్లో అతని కళ్ళలో కన్నీరు చూస్తూ మీరు కన్నీరు కారుస్తున్నారా అని కోడలు అడుగుతున్నప్పుడు అతని రియాక్షన్, అప్పుడే పుట్టిన బిడ్డను చూపిస్తూ క్రాంతి బ్రతికే ఉంటాడు అనడం వెనుక ఉన్న అతని పెద్దతనం కనిపిస్తుంది.
క్రాంతి సినిమాను క్రిటికల్‌గా చూస్తే కొన్ని సన్నివేశాలు నచ్చవు. సతి అవబోతున్న స్త్రీని రక్షించి ఆంగ్లేయిలు మూకుమ్మడిగా అత్యాచారం జరిపారంటూ చెప్పడం వెనుక సతిని సమర్థిస్తున్నాడా భరత్ అన్న భావం కలుగుతుంది. మన దేశంలో ఉన్న దోపిడి వెనుక సాంప్రదాయాన్ని చూసే పద్ధతి ఈ సినిమాలో ఎందుకు ఉంచవలసి వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. అలాగే కుటుంబ సభ్యులు ఒకరినొకరు తెలుసుకునే సమయంలో కూడా కొంత మెలోడ్రామా ఎక్కువగా కనపడుతుంది. కాని దిలీప్ కుమార్ పాత్రలో ఆ మెలోడ్రామా కనిపించదు. ఇది అర్థం కావాలంటే ఈ తరం యువతను పెట్టుకుని ఈ సినిమాను చూడండి. ఒక్క దిలీప్ కుమార్ పాత్ర స్క్రీన్‌పై కనిపించినప్పుడే వారు కొంత సినిమాలోకి తొంగి చూస్తారు. శశి కపూర్, శత్రుఘన్ సిన్హా, మనోజ్ కుమార్ పాత్రలు కొన్ని సందర్భాలలో హాస్యాస్పదంగా కూడా అనిపిస్తాయి. దిలీప్ కుమార్ గురించి అర్థం కావలానుకుంటే ఈ సినిమాను నిశితంగా చూడండి.
హేమామాలిని అందంగా కనిపిస్తుంది కాని ఆవిడ బరువైన సంభాషణలు పలికించలేదు. పర్వీన్ బాబీ ఆరోగ్య కారణాల వలన సినిమా చేయలేని పరిస్థితులలో ఆమె పాత్రను మధ్యలోనే చంపేయవలసి వచ్చిందట. భరత్ కొడుకుగా ఈ సినిమా చివరి సీన్లో కునాల్ గోస్వామి కనిపిస్తాడు. అతను మనోజ్ కుమార్ కుమారుడు. ఇది అతని మొదటి సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా అతను సినీ రంగంలో నిలదొక్కుకోలేక పోయాడు. క్రాంతి సినిమాకు లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు. సంతోష్ ఆనంద్ పాటలు రాసారు. మనోజ్ కుమార్ కు అతి ఇష్టమయిన గేయ రచయిత సంతోష్ ఆనంద్. “షోర్” లో “ఎక్ ప్యార్ క నగ్మా హై”, “రోటీ కప్డా ఔర్ మకాన్” లో “మై న భూలూంగా” వంటి చక్కని పాటలు రాశాడు కవి సంతోష్ ఆనంద్. క్రాంతి సినిమాలో అన్ని పాటలూ ఆయనే రాశారు. పాటలను అతి చక్కని భావాలతో, గొప్ప ప్రతీకలతో నింపి విశ్వరూపం ప్రదర్శించాడు సంతోష్ ఆనంద్.
మనోజ్ కుమార్‌కు చాలా ఇష్టమైన గాయకుడు ముఖేష్. మనోజ్ కుమార్‌కు ఎన్నో సినిమాలలో గాత్రం అందించారాయన. 1976లో ముఖేష్ మరణించిన తరువాత అతని కుమారుడు నితిన్ ముఖేష్‌కి అవకాశం ఇచ్చారు మనోజ్. మనోజ్ కుమార్‌కు నితిన్ ముఖేష్ చేత పాడించారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఎంత అభిమానం ఉన్నా ఇంత రిస్క్ అప్పట్లో ఎవరూ తీసుకునేవారు కాదు. మనోజ్ కుమార్ తన కెరియర్ అంతా కూడా ఇలాంటి కొన్ని ప్రయోగాలు తన స్నేహాలు, అనుబంధాల ఆధారంగా చేయడానికి వెనుకాడలేదు. ఇందులోని “జిందగీ కీ న టూటే లడీ” పాట చాలా పాపులర్ అయింది. “ఉన్ ఆంఖోంక హస్నా భి క్యా, జిన్ ఆంఖోమె పానీ నహో” వంటి మృదువయిన భావాలుంటాయీ పాటలో. అలాగే కిషోర్, లతా, రఫీ, లతో కలిసి నితిన్ ముఖేష్ పాడిన “చనా జోర్ గరమ్” పాట కూడా చాలా పాపులర్. చనా జోర్ గరం పాట హిందీ సినిమాల్లో మూడు మార్లు వాడేరు. 1940లో బంధన్ సినిమాలో, అరూణ్ కుమార్ పాడేరు. ఈ పాటను రాసింది కవి ప్రదీప్. సంగీతం సరస్వతీ దేవి. ఈపాటలోని పల్లవి తో సహా, అనేక పదాలను క్రాంతి పాటలో విరివిగా వాడుకున్నారు. మేరా చనా బనా హై ఆలా, జిస్మే డాలా గరం మసాలా వరకూ వాడి అక్కడి నుంచీ మేర చనా ఖాగయా గోరా అంటూ చనాను ఉరి తీయబోయే దేశభక్తుడి కి ప్రతీకగా కవిత్వం గుప్పించాడు సంతోష్ ఆనంద్. ముఖ్యంగా దిలీప్ కుమార్ పాత్రకు రఫీ పాడిన చివరి పాట ఇది. మేరా చనా హై అప్నీ మర్జీ కా అంటూ గంభీరంగా రఫీ పాడుతూంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కానీ చిత్రీకరణ పాటను అభాసుపాలు చేస్తుంది. 1956లో నయా జమానా సినిమాలో చనా జోర్ గరం ను ప్రేమ/హాస్య గీతంగా వాడుకున్నారు. శంషాద్ బేగం, కిశోర్ కుమార్ పాడేరీపాటను. జాన్ నిసార్ అఖ్తర్ రాసిన ఈ పాటకు ఓపీ నయ్యర్ బాణీని అందించారు. తెరపై మీనా కుమారి కిశోర్ కుమార్ తో నటించారు. మిగతా పాటలలో మహేంద కపూర్ మన్నాడేలను కూడా వింటాం. క్రాంతి అన్న టైటిల్ సాంగ్‌లో వీరందరితో పాటు శైలేంద్ర సింగ్ గొంతు కూడా వినసొంపుగా ఉంటుంది. సినిమా ఆరంభంలో వచ్చే అబ్ కే బరస్ తుఝ ధర్తీ కి రాణీ కర్ దేంగే అత్యద్భుతమయిన దేశ భక్తి పాట. దుర్గా మాతను భారత మాతకు ప్రతీకచేసి రాసిన పాట ఇది. వందేమాతరం కు ప్రతిధ్వని లాంటిదీ పాట. ఒక వైపు నుంచి చూస్తే భక్తి గీతం. మరోవైపు దేశభక్తి గీతం. ఈ పాటలోని భావాలు అత్యంత ఆవేశం కలిగించేవి. పాట చివరలో ఒక్కో పదం పలుకుతూ, మహేంద్ర కపూర్ హై పిచ్ కి ఒకో అడుగూ వెళ్తూంటే ఆవేశం కూడా ఒకో డిగ్రీ పెరుగుతూంటుంది. పదాలు కూడా అత్యంత శక్తి వంతమయినవి. ఫిర్ భీ హం జిందా హై అప్నీ బలిదానోంకీ బల్ పర్ నుంచీ పాట ఆవేశపు మెట్లు ఎక్కుతూ, యారో టూట్ భలేహీ జానా లేకిన్ కభీ న రుక్నా నుంచి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ పాటలో సంతోష్ ఆనంద్ అద్భుతమయిన సత్యాలు చెప్పాడు. దునియా కే సారీ దౌలత్ సే ఇజ్జత్ హం కో ప్యారీ, మిట్టీ కి కీమత్ కా జగ్ మే కోయీ రతన్ నహీ హై, జిల్లత్ కే జీవన్ సే బద్ కర్ కోయీ కఫన్ నహీ హై.., జిల్లత్ అంటే అవమానం..అవమానాలు సహిస్తూ బ్రతకటం చావు లాంటిది. .అద్భుతమయిన గేయ రచన ఇది. అంతే చక్కని బాణీ, అంతే చక్కని గానం.
క్రాంతి సినిమా అప్పట్లో బాగానే డబ్బు వసూలు చేసింది. క్రాంతి సినిమా ఇప్పుడు చూస్తూంటే హాస్యంగా అనిపిస్తుంది. కృత్రిమ సన్నివేశాలు, తర్కానికందని సన్నివేశాలు, హాస్యాస్పదమయిన నటన, అరుపులు, కేకలే సంభాషణలనుకునే నటన.. వీటన్నిటి మధ్యా హిమాలయంలా దిలీప్ కుమార్!!!!! క్రాంతి సినిమా ప్రధానంగా అయిదేళ్ళ తరువాత దిలీప్ కుమార్ నటించాడన్న ఆకర్షణ, లక్ష్మీ ప్యారే సంగీత రచన, సంతోష్ ఆనంద్ గేయ రచనా బలం వల్ల విపరీతమయిన ప్రజాదరణ పొందింది. మనోజ్ కుమార్ తనకలవాటయిన రీతిలో దేశభక్తి నీడలో కెమేరాను మహిళా నటీమణుల అధోభాగాల చుట్టూ తచ్చాడించాడు. వారి దుస్తులూ అనౌచిత్యంగానే వుంటాయి. అయినా సినిమా హిట్ అయిందంటే దిలీప్ కుమార్, పాటలే ప్రధాన కారణాలు. ఈనాటికీ ఈ సినిమాను ఈ రెండు అంశాల ద్వారానే గుర్తుంచుకుంటారు. ఇంత మంది తారలను ఒక చోట చేర్చిన సినిమాగా భారీగా తీయడం వలన కూడా అది అప్పటి ప్రేక్షకులను అలరించి ఉండవచ్చు. కాని ఇప్పుడు దీన్ని పూర్తిగా చూడడం కొంచెం కష్టం. దిలీప్ కుమార్ నటనను పరిశీలించే దృష్టితో చూస్తే తెలిసేది ఇది దిలీప్ కుమార్ నటించిన గొప్ప పాత్ర కాదు. కాని ఎన్నో తప్పుల మధ్య ఒక టాలెంటేడ్ ఆర్టిస్ట్ ఎలా శిఖరాన నిలిచి తన చార్మ్‌ను తనలోని ఆ హుందాతనాన్ని మెయింటేన్ చేసుకోగలడో తెలుసుకోవాలంటే ఈ సినిమాకు మించిన మరో ఉదాహరణ లేదు.